
చిన్నంబావి (వనపర్తి జిల్లా): కుటుంబ కలహాలు వారి జీవితాలను బలితీసుకున్నాయి. జీవితాంతం తోడుండాల్సినవాడే కర్కశంగా మారి నిప్పంటించాడు. వివరాలిలా ఉన్నాయి.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలోని బడికల జయన్న (44)కు సింగోటానికి చెందిన వరలక్ష్మితో 22 ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి కూతురు గాయత్రి (17)తో పాటు కుమారుడు సృజన్ ఉన్నారు. భార్య స్థానికంగా అంగన్‌వాడీ టీచర్‌గా, భర్త వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూతురు కొల్లాపూర్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే జయన్న కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకుని తరచూ ఇంట్లో గొడవపడేవాడు. రెండు నెలల క్రితం అతను తీవ్రంగా కొట్టడంతో భార్య వరలక్ష్మి కూతురుతో కలసి పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టింది.
అనంతరం పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిర్చినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తాగొచ్చి మరోసారి గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్య, కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో చెలరేగిన మంటల నుంచి జయన్న తప్పించుకునేందుకు యత్నించగా తలుపులు తెరుచుకోలేదు. అంతలోనే భార్య, కూతురు కలసి అతడిని పట్టుకోవడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వారంతా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కూతురు, తండ్రి గురువారం ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం భార్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.