నాటవెళ్లి శివారులోని రైస్‌మిల్లు వద్ద ఆగిన లారీ
సాక్షి, వనపర్తి: నిరుపేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంతో కొందరు అక్రమ వ్యాపారానికి తెర లేపారు. రైస్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై గ్రామాల్లో రూ.10 లకే బియ్యాన్ని సేకరించి దానిని రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా మార్చి అధిక రేట్లకు అమ్ముకుని లక్షలు గడిస్తున్నారు. ఈ విషయం గురించి అధికారులకు అందరికి తెలిసినా.. కొందరు నేరుగా ఫిర్యాదులు చేసినా ఇన్నాళ్లూ అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. అయితే ఇటీవల పాన్‌గల్ మండలం సీఎంఆర్ అనుమతి పొందిన పరమేశ్వరీ రైస్ మిల్లులో పెద్దఎత్తున అక్రమ రేషన్ బియ్యం నిల్వలను స్వయంగా కలెక్టర్ గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ విషయం మరువకముందే మరో ఘరానా దళారుల బాగోతం వెలుగు చూస్తోంది.
కొత్తకోట కేంద్రంగా..
ఈ రేషన్ దందా శ్రీరంగాపూర్ మండలానికి చెందిన ఇద్దరు, గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి చేస్తున్నారు. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ వినియోగదారుల నుంచి బియ్యం సేకరించడానికి కొందరిని నియమించుకున్నారు. వారంతా రాత్రి సమయాల్లో వాహనాల్లో గ్రామాలకు వెళ్లి బియ్యాన్ని సేకరించి కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ శివారులోని ఓ రైస్ మిల్లులోకి తరలిస్తారు. ఇదివరకే ఆ రైస్ మిల్లుకు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మరో ట్రేడర్ పేరుతో సీఎంఆర్ అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యంను ఆ రైస్ మిల్లుకు పంపించారు. సదరు మిల్లుకు కెటాయించిన సీఎంఆర్ కెటాయింపులకు అనుగుణంగా వారు రైస్ ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంది. సరఫరా చేసే రైస్ స్థానంలో గ్రామాల్లో చోటా దళారులు సేకరించిన రేషన్ బియ్యం పంపించి రీసైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సీఎంఆర్ అనుమతి కూడా..
కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ శివారులోని సప్తగిరి రైస్ మిల్లును మరో వ్యక్తి లీజుకు తీసుకుని వేరే పేరు సాయిచరణ్ ట్రేడర్స్ పేరుతో సీఎంఆర్ అనుమతి పొందారు. అనుమతి తీసుకున్న వ్యక్తికి బదులు ఇతరులు మిల్లు వద్ద కార్యకలాపాలు చేస్తూ అక్రమ దందాకు తెరలేపినట్లు సమాచారం. ఈ రైస్ మిల్లుకు సివిల్ సప్లయ్ అధికారులు 2114.660 మెట్రిక్ టన్నుల వరిధాన్యం సీఎంఆర్ కోసం అలాట్‌మెంట్ చేశారు. ఫలితంగా 1416.822 మెట్రిక్ టన్నుల రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1266.340 రైస్ ప్రభుత్వానికి సరఫరా చేశారు. ఇంకా 150.482 మెట్రిక్ టన్నుల రైస్ ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉన్నట్లు ఎన్‌పోర్స్‌మెంటు టీడీ వేణు తెలిపారు.
కార్యకలాపాలన్నీ రాత్రివేళే..
రీసైక్లింగ్ రేషన్ దందా కార్యకలాపాలను పూర్తిగా రాత్రి సమయంలోనే చేస్తారని తెలుస్తోంది. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట మండలాల్లోని గ్రామాల నుంచి ఆటోల్లో రాత్రి సమయాల్లో రేషన్ బియ్యం ఈ మిల్లులోకి చేర్చి ప్రభుత్వ ముద్ర ఉండే బ్యాగుల్లోకి రేషన్ బియ్యంగా మార్చి ప్రభుత్వానికి సరఫరా చేస్తారనే విమర్శలు ఉన్నాయి. నేషనల్ హైవే 44కు ఆనుకుని ఉన్న కారణంగా అక్రమార్కులకు రీసైక్లింగ్ రేషన్ దందా చేయటం చాలా సులభమైందని చెప్పవచ్చు.
నామమాత్రంగా తనిఖీలు
ఈ మిల్లులో అక్రమ రేషన్ దందా యదేచ్ఛగా కొనసాగుతుందని ఫిర్యాదులు రావటంతో సివిల్ సప్లయ్ అధికారులు నామమాత్రంగా దాడులు చేశారు. దీంతో జిల్లాస్థాయి అధికారి ఒకరు కొత్తకోట తహసీల్దార్‌ను మిల్లును తనిఖీ చేయాలని ఆదేశించటంతో మిల్లు వద్దకు వెళ్లిన తహసీల్దార్ లోపల కొన్ని బ్యాగులు ఉండటాన్ని గమనించి మిల్లును సీజ్ చేశారు. లోపల ఉన్న బియ్యం రేషన్ బియ్యమా.. కాదా అని తెలుసుకునేందుకు తహసీల్దార్ టెక్నికల్ విభాగం అధికారులకు సిఫారస్ చేశారు.
మా దృష్టికి రాలేదు
రేషన్ బియ్యం రిసైక్లింగ్ చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఇదివరకే కలెక్టర్‌కు ఫిర్యాదులు వస్తే కొత్తకోట తహసీల్దార్ మిల్లును తనిఖీ చేశారు. అక్కడ ఉన్న బస్తాలతో సహా మిల్లుకు సీల్ వేశారు. టెక్నికల్ అధికారులతో విచారణ చేయించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. మిల్లులో ఉన్న బియ్యం బస్తాలు ఇదివరకే ప్రభుత్వానికి పంపించాం. రిటర్న్ చేసినవని డీటీ ఎన్‌ఫోర్స్‌మెంటు వేణు తెలిపారు.
– రేవతి, డీఎస్‌ఓ
ఇలాచేస్తే.. నిజాలు తెలుస్తాయి
సప్తగిరి రైస్ మిల్లుకు ఆరు నెలలుగా వచ్చిన కరెంటు బిల్లులను పరిశీలిస్తే ఎంతమేరకు మిల్లులోని మిషన్లు నడింపించారో తెలుస్తోంది. ప్రతి మిల్లుకు సాధారణంగా మిషన్లు నడిస్తే తక్కువలో తక్కువ రూ.లక్షలోపు బిల్లు వస్తుంది. కానీ ఈ మిల్లుకు గడిచిన నెల విద్యుత్ మిల్లు కేవలం రూ.12,197 మాత్రమే వచ్చింది. ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంటుంది. అలాగే అమరచింత మండలానికి చెందిన దాసరి రాజశేఖర్ అనే వ్యక్తి అక్రమ రేషన్ దందా చేస్తూ ఏడుసార్లు పట్టుబడ్డాడు. అతనిపై కేసు కూడా నమోదు అయ్యింది. కౌన్సిలింగ్ ఇచ్చినా మారకపోవటంతో ఎస్పీ స్వయంగా అతనిపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. ఇలాంటివారు జిల్లా వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. లోతుగా విచారణ చేస్తే అక్ర మార్కుల లిస్టు బయటపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment