PDS rice
-
పోర్టులో స్టెల్లా నౌక డెమరేజ్ ‘పంచాయితీ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అంటూ కాకినాడ పోర్టులో నిలిపివేసిన స్టెల్లా ఎల్ పనామా నౌక ‘డెమరేజ్’ చార్జీలు ఎగుమతిదారులకు గుదిబండగా మారాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్దేశించిన తేదీలోపు ఓడలో సరుకు లోడింగ్ పూర్తి చేసి ఎగుమతికి క్లియరెన్స్ ఇవ్వాలి. అలాకాకుంటే నౌక పోర్టులో ఎన్ని రోజులు నిలిచిపోతే అన్ని రోజులకు షిప్ యాజమాన్యం డెమరేజ్ చార్జీలు వసూలు చేస్తుంది. నవంబర్ 28న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నౌకలో పీడీఎస్ బియ్యం తనిఖీకి వచ్చి సినిమాటిక్‌గా ‘సీజ్ ద షిప్’ అంటూ అధికారులను ఆదేశించారు. అయితే, ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం షిప్‌ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. షిప్‌ను సీజ్ చేయడానికి అవకాశం లేదని, బియ్యం ఉన్న కంటైనర్‌ను మాత్రమే సీజ్ చేయగలమని విశాఖ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఇటీవల స్పష్టంగా చెప్పారు.సాగని అన్లోడ్ ప్రక్రియస్టెల్లా నౌకలో అధికారులు గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అన్లోడ్ (కిందకు దింపే) ప్రక్రియ సాగడంలేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రతిబంధకమైందని చెబుతున్నారు. దీంతో నౌక పోర్టులోనే నిలిచిపోయింది. ఇలా నిలిచిపోయిన ప్రతి రోజుకు డెమరేజ్ చార్జీలను షిప్ యాజమాన్యానికి చెల్లించాలి. ఈ నౌక సామర్థ్యం 52 వేల మెట్రిక్ టన్నులు. నౌకలో 28 ఎగుమతి కంపెనీలకు చెందిన 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది. ఇదంతా నవంబర్ 28కి ముందే లోడింగ్ జరిగింది. మరో 14 వేల మెట్రిక్ టన్నులు లోడింగ్ చేయాల్సిన తరుణంలో నిలిపివేశారు. పవన్ హంగామా చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు నౌక పోర్టులో నిలిచిపోయి 38 రోజులు దాటింది. ముందుగా నిర్దేశించిన నౌక క్లియరెన్స్ తేదీ దాటిన ప్రతి రోజుకు యాజమాన్యం డెమరేజ్ వసూలు చేస్తుంది. దీనిని డెమరేజ్ ఎవరు చెల్లించాలనే దానిపైనా పోర్టులో ఎగుమతిదారుల మధ్య పంచాయితీ నడుస్తోంది. డెమరేజ్ రోజుకు ఎంత చెల్లించాలనే దానిపైనా స్పష్టత లేదు. ముందస్తు ఒప్పందం ప్రకారం నవంబర్ 29 నుంచి డెమరేజ్ లెక్కవేయాలి. కానీ అప్పటికే తుపాను కారణంగా పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ కావడం, డిసెంబర్ 4 వరకు వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణాలు చూపుతూ అప్పటివరకు డెమరేజ్ వేయడానికి వీల్లేదని ఎగుమతిదారులు గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో డిసెంబర్ 5 నుంచి డెమరేజ్ వేయడానికి స్టెల్లా యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం. నౌకకు రోజుకు అయ్యే అన్ని ఖర్చులు కలిపి 22,000 యూఎస్ డాలర్లు.. అంటే రూ.18.73 లక్షలు చెల్లించాలని లెక్కకట్టారు. ఒక్కసారి డెమరేజ్ తేదీని నిర్థారిస్తే తుపానులు, వాయుగుండాలు వచ్చినా చెల్లించాల్సిందే. ఈ లెక్కన డిసెంబర్ 5 నుంచి ఇంతవరకు డెమరేజ్ రూపంలో రూ.7.11 కోట్లు చెల్లించాలి. నౌక నిలిచిపోవడానికి కారణమైన పీడీఎస్ బియ్యం మొత్తం బాలాజీ ఎక్స్‌పోర్టర్స్ కంపెనీదే కావడం వల్ల ఆ సంస్తే డెమరేజ్ మొత్తం చెల్లించాలని మిగతా వారి వాదన. కాకినాడ పోర్టులో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని ఎగుమతిదారులు కోరినా షిప్పర్ అంగీకరించలేదు. పవన్ చేసిన హడావుడి వల్ల తాము నష్టపోతున్నామని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బియ్యం బుక్కేది వారే..
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం పేరు గొప్ప తీరు దిబ్బలా ఉంది. సీఎం చంద్రబాబు మొదలు ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వరకు అందరివీ తాటాకు చప్పుళ్లేనని తేలిపోతోంది. ఎందుకంటే.. ‘ముఖ్య’ నేత సామాజికవర్గానికి చెందిన ఓ వ్యాపారి తన అధికార బలంతో కంటైనర్ల కొద్దీ రేషన్ బియ్యాన్ని దేశాలు దాటించేస్తున్నారు. విశాఖ పోర్టు వేదికగా సాగుతున్న ఈ దందాకు ప్రభుత్వ పెద్దలు రక్షణ కవచంలా ఉంటూ అక్రమ రవాణాకు పచ్చజెండా ఊపుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో ఆరితేరిన కూటమి సర్కారు ఈ విషయంలోనూ అందరి దృష్టి కాకినాడ వైపు మళ్లించి విశాఖ నుంచి తమ అస్మదీయుల పని సులభం చేస్తోంది.సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) అనుబంధంగా.. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీటీపీఎల్) నడుస్తోంది. ఇక్కడి నుంచే వివిధ దేశాలకు ఎగుమతి దిగుమతులు జరుగుతుంటాయి. కంటైనర్ కార్గోకు సంబంధించి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు (సీఎఫ్ఎస్) ఉన్నాయి. వీసీటీపీఎల్ ఆధ్వర్యంలో ఒక సీఎఫ్ఎస్ నడుస్తోంది. దీనిపక్కనే మరో మూడు సీఎఫ్ఎస్లు పనిచేస్తున్నాయి. వివిధ దేశాలకు పంపించాల్సిన కార్గోని కస్టమ్స్ హౌస్ బ్రోకర్ సంస్థలు అన్ని అనుమతుల్ని తీసుకుని కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత.. సీఎఫ్‌ఎస్‌కు తీసుకొస్తాయి. సీఎఫ్ఎస్ వాటిని గోదాముల్లో నిల్వ ఉంచి.. కంటైనర్లలో లోడ్‌చేసి ఆయా దేశాలకు చెందిన కార్గో షిప్‌లలో కంటైనర్ టెర్మినల్ ఆధ్వర్యంలో లోడ్ చేస్తారు. ఈ నేపథ్యంలో.. ఈనెల 9న మంత్రి నాదెండ్ల సీఎఫ్ఎస్లను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. తొలుత వీసీటీపీఎల్కు సంబంధించిన కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్ఎస్)ని, ఆ పక్కనే ఉన్న గేట్‌వే సీఎఫ్ఎస్ని హడావిడిగా తనిఖీచేసి.. అక్కడున్న బియ్యం పీడీఎస్ అని నిర్థారించి వాటిని సీజ్ చెయ్యాలని ఆదేశించారు. ఇకపై పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతి కాకుండా డిప్యూటీ తహశీల్దార్, డీఎస్ఓ, మరో ఇద్దరు అధికారులతో కూడిన నిఘా బృందాన్ని ఏర్పాటుచేశారు. పీడీఎస్ అని తెలిసినా సీజ్ చెయ్యకుండా..ఇక ఇక్కడికొస్తున్న ప్రతి కార్గోని ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించి.. ఎగుమతికి అనుమతిస్తోంది. అయితే.. ఆయా కార్గోల్లో పీడీఎస్ బియ్యం ఉంటే వాటిని కచ్చితంగా సీజ్‌చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. కానీ, సదరు టీంలో ఉన్న కొందరు అధికారులు సదరు కార్గో బ్రోకర్ సంస్థలతో కుమ్మక్నై బియ్యాన్ని సీజ్ చేయకుండా పక్కనే ఉన్న ఇతర ఫ్రైట్ స్టేషన్లకు పంపించేస్తున్నారు. అక్కడ ఎలాంటి నిఘా లేకపోవడంతో అక్కడ నుంచి రేషన్ బియ్యం సునాయాసంగా విదేశాలకు తరలిపోతోంది.ఆ వ్యాపారి సీఎఫ్ఎస్ ద్వారానే ఎగుమతి..నిజానికి.. ముఖ్య నేత సామాజికవర్గానికి చెందిన ఆ వ్యాపారి ఇక్కడ సీఎఫ్ఎస్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచే అడ్డగోలుగా బియ్యం వ్యాపారం జరుగుతోంది. సీజ్ చెయ్యకుండా స్పెషల్ టీం పంపించేస్తున్న బియ్యం మొత్తం సదరు వ్యాపారికి చెందిన సీఎఫ్‌ఎస్‌కు వెళుతూ ఎల్లలు దాటిపోతోంది. మంత్రి దాడులు నిర్వహించిన తర్వాత.. దాదాపు రూ.2 కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని ఈ స్పెషల్ టీం సీజ్ చెయ్యకుండా సదరు వ్యాపారికి చెందిన సీఎఫ్‌ఎస్‌కు పంపించింది. అక్కడ మొత్తం 60 కంటైనర్లలో వ్యాన్హై–367 షిప్లో ఈనెల 12వ తేదీ అర్థరాత్రి చైనాకు బయల్దేరింది. అలాగే, మంత్రి తనిఖీల సమయంలో సీజ్చేసిన బిబో ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన బియ్యాన్ని కూడా పారసోరై లాజిస్టిక్స్ పేరుతో చైనాకు ఎగుమతి చేసేశారు.మరో 110 కంటైనర్లలో లోడింగ్‌కు సిద్ధంగా..ఇక టీడీపీ సానుభూతిపరుడిగా.. షిప్పింగ్ వ్యవస్థని శాసించే స్థాయిలో ఉన్న ఆ వ్యాపారి ఇప్పటికే 60 కంటైనర్లలో బియ్యం తరలించగా ఇప్పుడు మళ్లీ మరో 10,600కి పైగా టన్నుల రేషన్ బియ్యాన్ని పంపించేందుకు 20 కంటైనర్లను సిద్ధంచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు.. ఈ వారంలో మరో 90 కంటైనర్లలో రేషన్ బియ్యం ఎగుమతికి షెడ్యూల్ కూడా సిద్ధంచేసినట్లు సమాచారం.మంత్రి ఆ వేర్‌హౌస్‌కు ఎందుకెళ్లలేదు?మంత్రి నాదెండ్ల ఇటీవల వీసీటీపీఎల్ సీఎఫ్ఎస్తో పాటు పక్కనే ఉన్న గేట్‌వే సీఎఫ్ఎస్లోనూ తనిఖీలు నిర్వహించారు. కానీ.. అక్కడున్న మరో రెండు వేర్‌హౌస్‌ల వైపు మంత్రిగానీ, అధికారులుగానీ కన్నెత్తి చూడలేదు. వాస్తవానికి.. అక్కడే రూ.కోట్లు విలువచేసే వేల టన్నుల రేషన్ బియ్యం నిల్వలున్నాయి. ఈ విషయం తెలిసే మంత్రి, అధికారులు అక్కడికి వెళ్లలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా.. ప్రభుత్వానికి నిజంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే.. అన్ని సీఎఫ్ఎస్లనూ తనిఖీ చేసేందుకు టీంలు ఏర్పాటుచేయాలి. కానీ, ఒక్కచోట మాత్రమే ఏర్పాటుచేసి మిగిలిన చోట్ల నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం పరోక్షంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విమర్శలొస్తున్నాయి. ఇక మంత్రి సీజ్చేసిన బియ్యాన్ని తీసుకొచ్చిన బిబో సంస్థ నవంబరులోనే వేల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కార్గోకి కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దాడులు జరగడంతో.. వాటిని ఎక్స్పోర్ట్ చెయ్యకుండా ఆపేశారు. ఇప్పుడు టీడీపీ సామాజికవర్గానికి చెందిన వ్యాపారి సీఎఫ్ఎస్ నుంచి పాత బిల్లులతో ఉన్న కార్గోని కస్టమ్స్ కళ్లుగప్పి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.48 గంటలు గడిచాయి.. ఏం చర్యలు తీసుకున్నారు.?ఈనెల 9న మంత్రి మొత్తం 483 టన్నుల వరకూ బియ్యాన్ని సీజ్ చెయ్యాలని ఆదేశించారు. అనంతరం బియ్యానికి సంబం«ధించిన అన్ని డాక్యుమెంట్లు, ఇతర బిల్లుల్ని 48 గంటల్లో పంపించాలని గడువు ఇచ్చారు. కానీ, ఇప్పటికి ఐదురోజులు గడిచినా ఎవరూ ఆ ఊసెత్తడంలేదు. త్వరలోనే ఈ బియ్యానికి కూడా క్లియరెన్స్ ఇచ్చేసి.. సదరు వ్యాపారి సీఎఫ్ఎస్ ఆధ్వర్యంలో చైనాకు పంపించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. -
పీడీఎస్ బియ్యం ఉన్నా షిప్‌ను సీజ్ చెయ్యలేం
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణా చేసే కార్గో షిప్లో అక్రమంగా తరలించిన పీడీఎస్ బియ్యం ఉంటే.. షిప్ మొత్తం సీజ్ చెయ్యలేమనీ, బియ్యం ఉన్న కంటైనర్‌ని మాత్రమే సీజ్ చెయ్యగలమని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. అదేవిధంగా.. పీడీఎస్ బియ్యం రవాణా చేసిన వారిపైనే చర్యలు తీసుకోగలం తప్ప.. షిప్‌పై చర్యలు తీసుకోలేమని చెప్పారు. విశాఖలోని కస్టమ్స్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ పోర్టులో ఇటీవల పీడీఎస్ బియ్యం ఎగుమతి అవుతోందని, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోందంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సివిల్ సప్లైస్ ఎన్వోసీ తప్పనిసరిపోర్టులోకి వచ్చిన ఏ సరుకైనా నేరుగా షిప్‌లోకి లోడ్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రతి సరుకుకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే షిప్‌లోకి ఎక్కించేందుకు కస్టమ్స్ అనుమతిస్తుందని స్పష్టం చేశారు. బియ్యం విషయంలోనూ పక్కాగా పరిశీలన ఉంటుందన్నారు. కస్టమ్స్ విభాగం ఎలాంటి అనధికార బియ్యం ఎగుమతి, దిగుమతుల్ని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఎన్ని చెక్‌పోస్టులు దాటి వచ్చినా, అన్ని డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాతే కస్టమ్స్ నుంచి లోడింగ్‌కు అనుమతి ఉంటుందని తెలిపారు. ఏ బియ్యమైనా సరే.. పీడీఎస్ బియ్యం కాదు అని పౌర సరఫరాల శాఖ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) చెకింగ్ డాక్యుమెంట్స్‌లో తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే లోడింగ్‌కు అనుమతిస్తామని తెలిపారు. బియ్యం డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే వాటిని నిలిపేస్తామని చెప్పారు. ఒకవేళ అనుమానం వచ్చి అవి పీడీఎస్ బియ్యమా కాదా అనేది తెలుసుకోవాలంటే పరీక్షకు పంపాలని, దాని ఫలితాలు 15 రోజులకు వస్తాయని తెలిపారు. అప్పుడే దానిపై చర్యలు తీసుకోగలమని అన్నారు. స్టేక్ హోల్డర్లతో అవగాహన సదస్సుఇటీవల కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతి జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో విశాఖపట్నం జోన్ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో కస్టమ్స్ కార్యాలయంలో శుక్రవారం ఏపీలోని వివిధ పోర్టుల స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఎంకరేజ్ పోర్ట్, స్టివడోర్స్ అసోసియేషన్, పౌర సరఫరాల శాఖ అధికారులు హాజరయ్యారు. పోర్టుల ద్వారా ఎలాంటి అక్రమ ఎగుమతి, దిగుమతులకు తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని, ఇకపై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని సంజయ్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో స్టేక్‌హోల్డర్స్ సహకారాన్ని అందించాలని కోరారు. అక్రమ ఎగుమతులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కస్టమ్స్ శాఖ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. బియ్యం ఎగుమతి విధి విధానాలు, నిబంధనలను ఎన్.శ్రీధర్ వివరించారు. బియ్యం ఎగుమతుల పత్రాలను పరిశీలనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నౌక మొత్తం సీజ్ చెయ్యడం కుదరదుషిప్లో పొరపాటున పీడీఎస్ బియ్యం ఉన్నా.. నౌకని మొత్తం సీజ్ చెయ్యలేమని తెలిపారు. ఒక రవాణా నౌకలో ఎన్నో కంటైనర్లు ఉంటాయని, వాటిలో ఇతర కంపెనీలు, వ్యాపారులకు సంబంధించిన విభిన్న రకాల ఉత్పత్తులు కూడా ఉంటాయని తెలిపారు.అందువల్ల ఏవైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే.. సంబంధిత కంటైనర్‌ని మాత్రమే సీజ్ చెయ్యగలమని, షిప్ మొత్తాన్ని కాదని స్పష్టంచేశారు. చర్యలు కూడా అక్రమ రవాణాదారులపైనే ఉంటాయని, షిప్‌పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. -
‘కలెక్టర్ వెళ్లిన షిప్‌లోకి పవన్‌ను ఎందుకు వెళ్లనివ్వలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: దొంగ సొత్తు దొరికినప్పుడు ఎందుకు ఆపలేదు?.. సీజ్ చేసిన బియ్యాన్నే మళ్లీ ఎందుకు రిలీజ్ చేశారంటూ కూటమి సర్కార్‌ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘పవన్ ఆవేదన గమనించాను. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతోంది. పోర్టుకు వస్తానంటే ఆరు నెలలు నుంచి ఆపేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం ఎగుమతులపై దృష్టి పెట్టారు. సివిల్ సప్లయి శాఖ మంత్రి తనిఖీలు చేసి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు...సివిల్ సప్లయి శాఖ నుండి పోర్డు వద్ద రెండు చెక్ పోస్టులు పెట్టారు. సివిల్ సప్లయి ఛైర్మన్ తోట సుధీర్ కూడా రేషన్ బియ్యం లారీలను పట్టుకున్నట్లు చూశాను. గతంలో మంత్రి మనోహర్ పట్టుకున్న బియ్యమే.. మళ్లీ బిజీ ఇచ్చి బియ్యాన్ని విడుదల చేశారు. బియ్యాన్ని విడుదల చేసినప్పుడు సివిల్ సప్లయి శాఖ షరతులు ఏంటి అని అడుగుతున్నాను. సివిల్ సప్లయి చెక్ పోస్టులు దాటి ఈ బియ్యం పోర్టులోకి ఎలా వెళ్లాయి’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘బియ్యం ఉన్న షిప్‌లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనీయడం లేదని పవన్ అంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ను ఎవరూ ఆపి ఉంటారని సామాన్యులలో ప్రశ్నలు తలెత్తున్నాయి. డిప్యూటీ సీఎం పై స్ధాయిలో వ్యక్తే పవన్‌ను షిప్పులోకి ఎక్కకుండా ఆపారా?. అక్రమాలు జరుగుతున్న పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనిదే?. కాకినాడ పోర్టు దేశ భద్రతకు ముప్పు ఉందని పవన్ ఆందోళన చెందారు. ఒకవేళ కసాబ్ లాంటి వాళ్లు వస్తే తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదే కదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘కలెక్టర్ వెళ్లిన షిప్పులోకి డిప్యూటీ సీఎంను ఎందుకు ఆపారు? ఎవరూ ఆదేశాల మేరకు ఆపి ఉంటారు. ఇప్పటీకి రేషన్ బియ్యం దందా జరుగుతుందని ఎల్లో మీడియాలోనే వస్తుంది? దానిని అడ్డుకోవాలి. సిస్టమ్‌లో ఉన్న లోపాలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పవన్ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పవన్ దేశ భద్రత కోసం మాట్లాడారు.. దానికి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. సివిల్ సప్లయి శాఖ చాలా పటిష్టం అవ్వాల్సిన అవసరం ఉంది. ..ఇవాళ పేపర్ చూస్తే షాక్ కొట్టింది.. బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ. విద్యుత్ ఛార్జీలతో చంద్రబాబు ప్రజలను బాదేశారు. యూనిట్ మీద రూ.2.19 పైసలు అదనపు భారాన్ని వేశారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రజల మీద భారం వేసి జగన్ సంపద సృష్టించలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికలకు మందు అనేక సభల్లో చంద్రబాబు చెప్పారు. ఇది చంద్రబాబు పర్మినెట్ స్టేట్మెంట్. ఐదు నెలల్లో మాట మార్చేశారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
'ఏక్ రూపాయ్వాలా, నీ యవ్వ తగ్గేదేలే...'
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అడవిలో చెట్లు కొట్టుకునే కూలోడు అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన కథ ‘పుష్ప’ సినిమా. వాస్తవానికి అలాంటి ఘటనలు నిజ జీవితంలో జరగవు. కానీ.. ఉమ్మడి కరీంనగర్లో పీ డీఎస్ బియ్యం కొనుగోలు చేసి.. అధిక ధరలకు ఇ తర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారిని చూస్తే ని జమే అనిపిస్తోంది. ‘ఏక్ రూపాయ్వాలా’ కోడ్ నే మ్తో అధికారులు ముద్దుగా పిలుచుకునే ఈ స్మగ్లర్ నెట్వర్క్ ఒకప్పుడు పాత కరీంనగర్ జిల్లాకే పరిమి తం. నేడు ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి జిల్లా దాటి మహారాష్ట్రలో ఎంటర్ అ య్యాడు. ఆ సమయంలో అతడి దందా.. పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న తీరును ‘సాక్షి’ దినపత్రిక ‘ఏక్ రూపాయ్వాలా’ శీర్షికన వ రుస కథనాలు ప్రచురించింది. వీటిపై డీజీపీ కార్యాలయం స్పందించి దాడులకు ఆదేశించింది. అప్పటి కరీంనగర్ సీపీ సత్యనారాయణ నేతృత్వంలో టా స్క్‌ఫోర్స్ బృందాలు వరుస దాడులతో విరుచుకుపడ్డాయి. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని బైండోవర్ కూడా చేశాయి. దీంతో కొంతకా లం సదరు వ్యాపారి, అతని అనుచరులు కార్యకలాపాలు నిలిపివేశారు. సైకిళ్లతో మొదలై.. గూడ్స్ రైళ్లలో తరలించే స్థాయికి.. ఒకప్పుడు గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ.. పీడీఎస్ బియ్యాన్ని సేకరించి వాహనాల్లో తరలించడంలో ఏక్ రూపాయ్వాలాది అందెవేసిన చేయి. అప్పట్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు వ రుసగా రావడం.. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో అతడి వ్యాపారం సుప్తావస్థలోకి వెళ్లింది. ఆ తర్వాత కొత్త పద్ధతిలో వ్యాపారంలోకి దిగాడు. అధి కారులకు లంచాలిస్తూ.. మహారాష్ట్రకు బియ్యం తరలించడం కంటే అధికారికంగానే ఎగుమతి చేయాల ని నిర్ణయించాడు. అదునుకోసం చూస్తున్న అతడికి తమిళనాడు తెలంగాణ ప్రభుత్వానికి బియ్యం కో సం చేసిన వినతి ఆసరాగా దొరికింది. రూ.37.50కు కిలో చొప్పున కావాలని తమిళనాడు కోరడం.. ఆ డీల్ రద్దు కావడంతో ‘ఏక్ రూపాయ్వాలా’ రంగంలోకి దిగాడు. కిలో రూ.31.50కే ఇస్తామని డీల్ కుది ర్చినట్లు సమాచారం. ఎగుమతికి కావాల్సిన బి య్యంలో తనవంతుగా పీడీఎస్ రైస్ ఇచ్చేందుకు సి ద్ధమయ్యాడు. అతడికి కావాల్సినంత బియ్యం ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలువురు రైస్‌మిల్లర్లు కూడా సమ్మతించారని తెలిసింది. ఇందులో కస్ట మ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ఉన్నట్లు తెలిసింది. వా రం వ్యవధిలో దాదాపు ఐదు వేల టన్నుల బియ్యాన్ని కరీంనగర్ నుంచి గూడ్స్ ద్వారా ఎగుమతి చేసినట్లు సమాచారం. వీటివిలువ దాదాపు రూ.160 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. డిమాండ్ నేపథ్యంలో మరోరూ.60 కోట్ల విలువైన 2వేల ట న్నుల బియ్యాన్ని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు మరో గూడ్స్రేక్ (కొన్ని బోగీలతో కూ డిన రైలు)ను ఇప్పటికే బుక్చేశారని సమాచారం. ఇంత జరుగుతున్నా.. సివిల్ సప్లయి అధికారులు, పోలీసులకు సమాచారం లేకపోవడం గమనార్హం. అటెన్షన్ డైవర్షన్‌లో అందెవేసిన చేయి.. తెలంగాణ, మహారాష్ట్రలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో ‘ఏక్ రూపాయ్వాలా’ది అందె వేసిన చే యి. అచ్చం వీరప్పన్ తరహాలో.. పోలీసులు బందో బస్తుల్లో నిమగ్నమయ్యే సందర్భాల్లోనే భారీ వాహనాల్లో టన్నుల కొద్దీ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దా టిస్తాడు. ఇపుడు బహిరంగ దందా చేస్తున్న నేపథ్యంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ పై సివిల్ సప్లయీస్, పోలీసుల కన్ను పడకుండా.. గణేశ్ ఉత్సవాల్లో అధికారులు తలమునకలైన సందర్భాన్ని వాడుకుని రైలు ద్వారా తెలివిగా.. పకడ్బందీగా తమిళనాడుకు బియ్యం ఎగుమతి చేశా డు. త్వరలో ఎన్నికలకోడ్ రాబోతోంది. కోడ్ వస్తే వాహన తనిఖీలు పెరుగుతాయి. దానికి ముందే రెండోవిడత సరుకు పంపేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కిలో రూపాయి బియ్యాన్ని రూ. 4 లేదా రూ.5 కమీషన్ చొప్పున విక్రయించే ‘ఏక్ రూపాయ్ వాలా’ నేడు రూ.వందల కోట్ల వ్యాపారా నికి పడగలెత్తిన తీరు సినిమా కథను తలపిస్తోంది. ఫిర్యాదు వచ్చింది చర్యలు తీసుకుంటాం కరీంనగర్ నుంచి తమిళనాడుకు సీఎంఆర్ బియ్యం అక్రమంగా వెళ్తున్నాయని మాకు అధికారికంగా ఫిర్యాదు వచ్చింది. వెంటనే అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారులకు చేరవేశాను. వారు స్పందించి రంగంలోకి దిగారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – రవీందర్ సింగ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ -
అప్పుడే నల్ల బజారుకి
సాక్షి, హైదరాబాద్: ‘జిల్లా ఆఫీసర్లకే ఒక్కొక్కలకి లక్ష దాకా ఇస్తం. బియ్యం పట్టుకోకుండ, రాష్ట్రం దాటిచ్చెటందుకు గీ ఆఖరి పోలీస్టేషన్‌కే నెలకు లక్ష ఇస్తం. తాసీల్దార్లు, డీటీలు అందరికి ఎవలయి వాళ్లకు పోతయి. బియ్యం బయటకు పోకుండ ఆపితే మాకంటే వాళ్లకే ఎక్కువ లాస్. గందుకె మా దందా ఆగది’ సిరోంచలో బియ్యం దందా చేసే ఓ వ్యక్తి బాహాటంగా చెపుతున్న మాటలివి. రాష్ట్రంలో పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం లబ్ధిదారులు, రేషన్ డీలర్ల ద్వారా ఈ నెల కూడా యధేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. పీడీఎస్ బియ్యం పంపిణీ ఈ నెల 4వ తేదీ నుంచి మొదలు కాగా , ఎప్పటి మాదిరిగానే గత మూడు రోజుల నుంచి బియ్యం నల్లబజారుకు తరలిపోవడం మొదలైందని విశ్వసనీయ సమాచారం. చిన్న చిన్న సరకు రవాణా వాహనాలను పోలీసులు పట్టుకున్నట్లు షో చేస్తుండగా, టన్నుల కొద్దీ బియ్యాన్ని గోడౌన్లకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుంచి రాత్రి వేళల్లో లారీలు, ట్రక్కుల్లో దాచి ఉంచిన బియ్యాన్ని మహారాష్ట్ర, కర్నాటకకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. బియ్యం రవాణా విషయంలో పౌరసరఫరాల శాఖ డీఎస్వోలు, డీఎంలు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఈ శాఖల అధికారులకు అక్రమ రవాణా దారుల నుంచి వచ్చే మామూళ్లే అందుకు కారణమని అంటున్నారు. సర్కారు ఆదేశించినా అదే తీరు...: రాష్ట్రంలో పేదల బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై ‘సాక్షి’లో గతనెల 30, ఈనెల 1వ తేదీల్లో ప్రచురితమైన వార్త కథనాలపై పౌరసరఫరాల శాఖ స్పందించింది. ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు కమిషనర్ వి.అనిల్‌కుమార్ జిల్లాల డీఎస్ఓలు, డీఎంలతో పాటు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. 4వ తేదీ నుంచి మొదలయ్యే బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలని, రేషన్ షాపులపై నిఘా పెట్టాలని ఆదేశించారు. అయితే కొన్ని చోట్ల మినహా ఏ జిల్లాలో కూడా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ సిబ్బంది పూర్తిస్థాయిలో బియ్యం పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి పెట్టలేదు. రేషన్ దుకాణాలను సందర్శించి, స్టాక్‌ను తనిఖీ చేసిన, చేస్తున్న దాఖలాలు లేవు. దీంతో రేషన్ దుకాణాల నుంచి యధేచ్ఛగా బియ్యం గోడౌన్లకు తరలిపోతున్నట్లు సమాచారం. సోమవారం నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల మీదుగా పక్క రాష్ట్రాలకు బియ్యాన్ని పంపించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. కాగా దుకాణాలకు రేషన్ చేరిన వారం రోజుల్లోగా ..రేషన్ దందా చేసే వాళ్ళు ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రెండుసార్లు బియ్యం అక్రమ రవాణాకు స్కెచ్ వేస్తున్నట్లు మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ‘సాక్షి’కి తెలిపారు. తూతూ మంత్రంగా దాడులు... తాజాగా మరికల్ మక్తల్ మీదుగా కర్ణాటకకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే అమరచింతకు చెందిన ఓ వ్యక్తికి చెందిన బియ్యం లారీ, బొలెరో వాహనాన్ని మహబూబ్‌నగర్, నారాయణపేటల్లో స్థానికులు పోలీసులకు పట్టించి ఇచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్‌లో అక్రమ రవాణా అవుతున్న రూ. 86వేల విలువైన 43 క్వింటాళ్ల బియ్యాన్ని అదుపులోకి తీసుకొని పౌరసరఫరాల శాఖ డీటీకి అప్పగించారు. అయితే ఈ ఘటనల్లో అసలు దందా చేసే వ్యక్తులను మాత్రం పోలీసులు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్!
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఇంధనంతో పాటు కూరగాయల ధరలు మండుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పథకాన్ని మరో 6 నెలల పాటు పొడిగించే యోచనలో ఉంది. ఇందులో చాలా మంది అనర్హులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పారదర్శకంగా అమలయ్యేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. రద్దు దిశగా రేషన్ కార్డులు రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు కూడా రద్దవుతుంది వీటతో పాటు ప్రభుత్వం మరో విజ్ఞప్తి కూడా చేస్తోంది. అనర్హులు ఎవరైనా, వారి రేషన్ కార్డును వారి స్వంతంగా రద్దు చేయాలని లేదంటే ప్రభుత్వం గుర్తించి రేషన్ రద్దుతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలిపింది. రూల్స్ ఏంటో చూద్దాం.. మీ సొంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్/ఫ్లాట్ లేదా ఇల్లు, ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం రెండు లక్షల కంటే ఎక్కువ (గ్రామంలో), అదే నగరంలో సంవత్సరానికి మూడు లక్షలు ఉంటే, అలాంటి వారు వారి రేషన్ కార్డును ప్రభుత్వ సంబంధిత కార్యాలయంలో సరెండర్ చేయాలి. మరిన్ని నెలలు ఉచిత రేషన్ మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని మరో 3 నుంచి 6 నెలల వరకు పెంచనున్నట్లు సమాచారం. అయితే, దీనివల్ల ప్రభుత్వానికి 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. -
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈనెలలో 15 కిలోలు ఉచితం
సాక్షి, నల్లగొండ: ఆగస్టు నెలకు సంబంధించి ఆహారభద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఉచితంగా 15 కేజీల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. అయితే జిల్లాలో మొత్తం 4,67,814 కార్డుదారులు ఉండగా ఇందుకు గాను ప్రభుత్వం 21,825.100 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించింది. వీటిని ఆగస్టు 4 నుంచి పంపిణీ చేయించేలా జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్, మేలో రూపాయికి కిలో చొప్పున.. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, మే మాసాల్లో కార్డుదారులందరికీ ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పంపిణీ చేయలేదు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మరో 5 కిలోలను కూడా ఉచితంగా ఇవ్వకండా రూపాయికి కిలో చొప్పున యూనిట్‌కు 6 కిలోలు పంపిణీ చేసింది. జూన్ మాసంలో కూడా మొదట రూపాయికి కిలో చొప్పున ఇచ్చింది. మరలా అదేనెల 23 నుంచి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఉచితంగా ఇవ్వనందున జూలైలో ఒకేసారి ఒక్కో యూనిట్‌కు పది కిలోల బియ్యం పంపిణీ చేయించింది. కాగా ఆగస్టు మాసానికి సంబంధించి కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కిలో బియ్యాన్ని ఉచితంగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 19 వరకు పంపిణీ చేయిస్తాం.. జిల్లావ్యాప్తంగా ఉన్న 991 రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు ఆగస్టు 4 నుంచి 19 వరకు పంపిణీ చేయిస్తాం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీలర్ల వారీగా గోదామలు నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా చర్యలు తీసుకుంటున్నాం. కార్డుదారులంతా సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ చదవండి: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా?.. ఆలస్యం వద్దు.. మంచి ముహూర్తాలు ఇవే -
Srungavarapu Kota: పీడీఎస్ బియ్యం మాయం..!
శృంగవరపుకోట (విజయనగరం జిల్లా): రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెలా వేల క్వింటాళ్ల బియ్యం, కందిపప్పును సరఫరా చేస్తుంది.. మూడు నాలుగు నెలలకు సరిపడా సరుకును గొడౌన్లలో నిల్వ ఉంచి... డిపోల వారీగా నెలనెలా పంపిణీ చేస్తుంది. వేలబస్తాల బియ్యం, కందిపప్పు కళ్లముందు కనిపించే సరికి గౌడౌన్ సిబ్బందిలోని అక్రమబుద్ధి బయటకొచ్చింది. ఏకంగా 1500 బియ్యం బస్తాలు, 50 బస్తాల కందిపప్పును మాయం చేశారు. బయట మార్కెట్లో విక్రయించి సొమ్ముచేసుకున్నారు. మూడు నెలలుగా సాగుతున్న ఈ తంతు బహిరంగం కావడంతో సరుకును సర్దుబాటుచేసే పనిలో ఎల్.కోటలోని ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది నిమగ్నమయ్యారు. కొందరు అధికారుల సలహా మేరకు పొరుగు మండలాల్లో డీలర్లను పట్టుకుని బియ్యం కొనుగోలు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట 750 బస్తాలు, ఆదివారం రాత్రి 190 బస్తాల బియ్యం గొడౌన్‌కు చేర్చారు. ఈ సరుకు అంతా డీలర్ల నుంచి పాత గోనెలు తెచ్చి సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. వేల క్వింటాళ్ల సరుకు నిల్వచేసే గొడౌన్లో సరుకు కనిపిస్తే చాలని సిబ్బంది ఆలోచిస్తున్నారు. ప్రతి బస్తాకు ఉన్న ట్యాగ్, లాట్ నంబర్, అలాట్మెంట్ వంటి వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప నిజం తేలదు. బస్తాలను లెక్కించి ‘అంతా బాగుంది’ అని సర్టిఫై చేస్తే దొంగలు జారిపోయినట్టేనన్న వాదన వినిపిస్తోంది. గతంలోనూ ఇదే తీరుగా పెద్ద ఎత్తున్న ఎం.ఎల్.ఎస్ పాయింట్ నుంచి సరుకు మాయం అయిన సంగతి తెలిసిందే. బియ్యం సర్దుబాటు చేస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులకు కందిపప్పు సర్దుబాటు చేయడం తలకుమించిన భారంగా మారినట్టు తెలిసింది. ప్రభుత్వం సరఫరా చేసే సరుకును అమ్మేసి.. డబ్బులు పంచుకున్నంత సులభం కాదంటూ ఉద్యోగుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే ఇక్కడి ఉద్యోగుల అక్రమాల బాగోతం బయటపడుతుందన్నది రేషన్ లబ్ధిదారుల వాదన. గతంలోనూ ఎస్.కోట ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది అక్రమాలకు పాల్పడిన ఘటనలను గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం పేదల కడుపునింపేందుకు నాణ్యమైన రేషన్ సరుకులను పంపిణీ చేస్తుంటే.. కొందరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడడం తగదని బహిరంగంగా విమర్శిస్తున్నారు. డీఈఓ రాజేష్, అటెండర్ జోగుల వద్ద ప్రస్తావిస్తే నీళ్లు నములుతూ తప్పు జరగడం నిజమేనన్నారు. అధికారులు ఏమన్నారంటే.. ఎస్.కోట ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన గోల్మాల్ వ్యవహారంపై తహసీల్దార్ శ్రీనివాసరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా నాకు తెలియదు.. సీఎస్‌డీని సంప్రదించాలని సెలవిచ్చారు. సీఎస్‌డీటీ ఎన్వీవీఎస్ మూర్తిని ఫోన్లో వివరణ కోరగా ఎంఎల్ఎస్ పాయింట్లు తనిఖీ చేయడం జిల్లా అధికారుల పని అంటూ సమాధానం దాటవేశారు. (క్లిక్: రామకోనేరుకు మహర్దశ) గొడౌన్ సీజ్ ఎస్.కోట ఎంఎల్ఎస్ పాయింట్లో బియ్యం, కందిపప్పు నిల్వల్లో తేడాలున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్ మీనా కుమారి గొడౌన్‌ను సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులు పరిశీలించారు. గొడౌన్లో నిల్వలను మూడు గంటల పాటు తనిఖీ చేశారు. స్టాక్‌లో తేడాలు ఉన్నట్టు నిర్ధారించారు. గొడౌన్ రికార్డులను స్వాధీనం చేసుకుని, గంట్యాడ సీఎస్‌డీటీ కె.ఇందిర, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి టి.నరసింహమూర్తి తదితరుల సమక్షంలో గొడౌన్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు. మరింత లోతుగా విచారణ జరిపి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని మీనాకుమారి చెప్పారు. -
ఉచిత బియ్యం ఉఫ్! సాక్షాత్తు లబ్ధి దారులే అమ్ముకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. కరోనా నేపథ్యంలో నిరుపేదలు అకలితో అలమటించవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ యోజన పథకం లక్ష్యం నీరుగారుతోంది. సాక్షాత్తూ లబ్ధిదారుల కుటుంబాలు ఉచితం బియ్యాన్ని కారుచౌకగా చిరు వ్యాపారులకు అమ్ముకోవడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఆహార భద్రత (రేషన్) కార్డులోని సభ్యుడి (యూనిట్)కి 10 కిలోల చొప్పున సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబానికి కనీసం 30 కిలోల నుంచి 60 కిలోల బియ్యం వరకు ఉచితంగా పంపిణీ జరుగుతోంది. ఉచిత బియ్యంపై అనాసక్తి ఉన్నప్పటికీ డ్రా చేయకుంటే కార్డు ఇన్ యాక్టివ్‌లో పడిపోయి రద్దవుతుందన్న అపోహతో అవసరం లేని లబ్ధి కుటుంబాలు సైతం బియ్యం డ్రా చేసి చిరు, వీధి వ్యాపారులకు కారుచౌకగా అప్పజేప్పేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో బస్తీల్లో కొనుగోలు కేంద్రాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం పీడీఎస్ బియ్యం నిల్వలు అధికమై డిమాండ్ తగ్గడంతో కిలో రూ.5 నుంచి 8 వరకు ధర మించి పలకడం లేదు. పౌరసరఫరాల, పోలీసు అధికారుల మొక్కుబడిగా తనిఖీలు, దాడులు చేస్తుండటంతో క్వింటాళ్లకొద్దీ అక్రమ నిల్వలు పట్టుబడుతున్నాయి. గత రెండేళ్ల నుంచి.. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఉచిత రేషన్ కోటా కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి అయిదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది. ఉచిత బియ్యం పథకం కాలపరిమితి ముగుస్తున్నా.. కేంద్రం పథకాన్ని పొడిగిస్తూ వస్తోంది. అవసరం ఉన్నవారు సగమే.. హైదరాబాద్ మహా నగరంలోని ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబాల్లో పీడీఎస్ బియ్యం వండుకొని తినేవారు సగమే. మిగిలిన సగం కుటుంబాలు కేవలం అల్పాహారం ఇడ్లీ, దోసెలు, పిండి వంటలకు మాత్రమే రేషన్ బియ్యం వినియోగిస్తుంటారు. వాస్తవంగా వారి అవసరాలకు నెలకు నాలుగు కిలోల కంటే మించవు. రేషన్ బియ్యం అవసం లేకున్నా.. క్రమం తప్పకుండా డ్రా చేసి కారు చౌకగా దళారులకు ముట్టజెప్పడం సర్వసాధారణంగా మారింది. ప్రతి నెలా.. కోటా ఇలా గ్రేటర్‌లోని హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు 16 లక్షల ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబాలు ఉండగా, అందులో 55.63 లక్షల లబ్థిదారులు ఉన్నారు. ప్రతి నెలా ఉచిత బియ్యం కోటా కింద 111 మెట్రిక్ టన్నులు విడుదలవుతున్నాయి. (చదవండి: ఆర్టీసీలో కనిష్టంగా రూ. వెయ్యి పెన్షన్) -
వరదల్లో కొట్టుకుపోయిన లారీ.. రేషన్ బియ్యం నీటిపాలు
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముసురు కారణంగా పలు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు సైతం రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ విధించారు. రాష్ట్రంలో విద్యా సంస్థలకు సైతం మూడు రోజులు పాటు సెలవులు ఇస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో ఓ లారీ వర్షపు నీటి వరదలో కొట్టుకుపోయింది. కాగా, రేషన్ బియ్యం తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో టన్నుల సంఖ్యలో రేషన్ బియ్యం నీటిపాలైంది. అయితే, లారీ డ్రైవర్.. వరద పరిస్థితిని సరిగా అంచనా వేయకుండా లారీని ముందుకు పోనిచ్చాడు. వరద ఉద్ధృతికి ఆ లారీ నీటిలో కొట్టుకుపోయింది. అయితే, మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. छत्तीसगढ़ के बीजापुर में पीडीएस का चावल ले जा रहा ट्रक उफनती नदी में बहा, देखें वीडियो#Bijapur #TruckFallInRiver #ViralVideo #Rainfall #weather #Chhattisgarh pic.twitter.com/8TSSynSmsV — Neo News Mathura (@Neo_NeoNews) July 10, 2022 ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. మూడు రోజులు స్కూల్స్ బంద్ -
‘రేషన్’కు ట్రాక్.. పరేషాన్‌కు చెక్
సాక్షి, సిద్దిపేట: ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) బియ్యం పక్కదారి పట్టకుండా గన్నీ బ్యాగుకు క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టి ‘ట్రాక్’లోకి తీసుకువచ్చేందుకు పౌర సరఫరాల అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో గన్నీ బ్యాగుల కొరత, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. రేషన్ బియ్యం సరఫరా కోసం ఏటా గన్నీ బ్యాగులను సమకూర్చడం సమస్యగా మారింది. ఈ క్యూఆర్ కోడ్‌తో బియ్యం బస్తా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే దానిని ట్రాక్ చేయనున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 90.4 లక్షలమంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 10.5 కోట్ల బ్యాగులను వినియోగిస్తోంది. ఇందులో సుమారు 35 శాతం సంచులు ఏటా మాయమవుతున్నాయి. దీంతో ప్రతియేడు గన్నీ బ్యాగుల కోసం టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తున్నారు. రేషన్ షాప్‌లకు గన్నీ బ్యాగులను ప్రభుత్వం తిరిగి ఒక్కోదాన్ని రూ.21లకు కొనుగోలు చేస్తుంది. బహిరంగ మార్కెట్లో దీని ధర ఎక్కువే ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉన్న బియ్యం బస్తా అక్రమమార్గంలో పట్టుబడితే ఆ బస్తా ఏ షాప్‌నకు చెందినది.. ఏ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చిందని తెలుసుకోవడం సులభతరం. పైలెట్ ప్రాజెక్ట్‌గా సిద్దిపేట, జనగామ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సిద్దిపేట, జనగామ జిల్లాలను ఎంపిక చేసి క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టనున్నారు. తొలిదశలో 10 వేల బస్తాలకు కోడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి క్యూఆర్ కోడ్ ఉన్న గన్నీ బ్యాగుల ద్వారానే రేషన్ షాప్‌లకు బియ్యం సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ షాప్‌నకు ఎంత స్టాక్ పంపించారు.. నిర్దిష్ట దుకాణంలో ఎన్ని సంచులు అందుబాటులో ఉన్నాయి.. బఫర్ గోదాంలో ఇంకా ఎంత స్టాక్ ఉంది.. ఇలాంటి చాలా ప్రశ్నలకు క్షణాల్లో సమాధానం తెలుసుకోవచ్చు. ట్యాగ్లు తారుమారు చేసినా ప్రూఫ్, డ్యామేజ్ చేయబడవు. ఏదైనా ప్రయత్నాలు జరిగితే, సెంట్రల్ సర్వర్‌లో హెచ్చరికను జారీచేస్తుంది. దీని ద్వారా అధికారులు ఆ ప్రదేశాన్ని గుర్తించి చర్యలను తీసుకోనున్నారు. క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నాం బియ్యం గన్నీ సంచికి క్యూ ఆర్ కోడ్ తొలివిడతలో ఒక్క రైస్ మిల్లో కుట్టిస్తున్నాం. ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద సిద్దిపేటను ఎంపిక చేసింది. ఫిబ్రవరి నుంచి సరఫరాను ప్రారంభించే అవకాశాలున్నాయి. గన్నీ బ్యాగులు కొరత రాకుండా క్యూ ఆర్ కోడ్ ఉపయోగపడనుంది. –హరీశ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
ఆంధ్రా టు ఆఫ్రికా
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు చేరాల్సిన ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం (పీడీఎస్ బియ్యం) కృష్ణపట్నం పోర్టు ద్వారా ఆఫ్రికాకు భారీ ఎత్తున తరలిస్తున్న గుట్టు రట్టయింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. 1,645 టన్నుల బియ్యం కృష్ణపట్నం పోర్టులో అనధికారికంగా నిల్వ ఉంచారంటే.. ఈ స్కామ్‌లో ఎంత పెద్ద నెట్వర్క్ నడిచిందో ఇట్టే అర్థమవుతోంది. ప్రభుత్వ శాఖలు, పోర్టు సిబ్బంది సైతం కుమ్మక్కు అయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎక్స్‌పోర్టర్లకు సంబంధించిన నలుగురు వ్యక్తులను విజిలెన్స్ అధికారులు విచారిస్తే ఆఫ్రికా దేశానికి రవాణా చేసేందుకు తరలిస్తున్నట్లు బయటపడింది. నెల్లూరు (క్రైమ్): కృష్ణపట్నం పోర్టులో సీబార్డ్ గోదాముల్లో భారీ ఎత్తున ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో పట్టుబడిన నేపథ్యంలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. 1,645 టన్నుల బియ్యం అక్రమ నిల్వలు బయట పడిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో బియ్యం నిల్వ చేయడం వెనుక ప్రభుత్వ శాఖల హస్తం ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఈ స్థాయిలో నిల్వ చేయాలంటే సుమారు ఆరు నెలలకు పైగానే సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు బియ్యాన్ని సరఫరా చేసే సప్లయిర్లు నేరుగా ఎక్స్‌పోర్టర్స్‌తో సంబంధాలు పెట్టుకుని ఈ దందా కొనసాగిస్తున్నారని ప్రాథమిక సమాచారం. రేషన్ షాపులకు పంపే బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే నేరుగా లారీల్లో రైస్ మిల్లలకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యం గోతాలను మార్చి అనువైన బ్రాండ్స్‌తో కొత్తగా ప్యాకింగ్ చేసి లారీల్లో పోర్టులోని గోదాములకు తరలిస్తున్నారు. అయితే ఇక్కడకు చేరిన లారీలకు వే బిల్లులు, అధికార పూర్వకంగా ఉండాల్సిన పత్రంలో ఏ వివరాలు లేవని తేలింది. ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వ సంబంధిత శాఖల కనుసన్నల్లోనే జరుగుతోందని సమాచారం. పోర్టుకు చేరిన అనంతరం అక్కడ జరగాల్సిన తంతు పోర్టు సిబ్బంది చూసుకుంటారు. షిప్మెంట్ జరిగే సమయంలో మాత్రమే సంబంధిత వే బిల్లులు, క్వాలిటీ, ఎన్ని రోజులు నిల్వ ఉంచారన్న అంశాలపై కస్టమ్స్ అధికారులు పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో అక్రమ నిల్వలు బయట పడ్డాయని అధికారులు వెల్లడించారు. అయితే పోర్టు, సంబంధిత ప్రభు త్వ అధికారుల నడుమ ఒప్పందాలు బహిర్గతం కావడంతో అసలు విషయం బయటకు పొక్కిందని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ అనుమతులు తీసుకుని పోర్టులో విజిలెన్స్ అధికారులు దాడులు చేయాల్సి వచ్చింది. బియ్యం సేకరణ ఇలా.. దాడుల్లో ప్రధానంగా బియ్యం తరలించే నలుగురు సప్లయిర్స్, నలుగురు ఎక్స్‌పోర్టర్లను గుర్తించారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉండటం గమనార్హం. సప్లయిర్స్‌లో కర్ణాటకకు చెందిన శ్రీవీరభద్రేశ్వర ఇండస్ట్రీ నుంచి రాధిక బ్రాండ్ పేరుతో 30 టన్నుల బియ్యాన్ని రాజస్థాన్‌కు చెందిన రాధికా ఎంటర్ ప్రైజస్ ఎక్స్పోర్టర్కు సీషల్ లాజిస్టిక్ ద్వారా సరఫరా చేశారు. రైస్ మిల్లర్ల దగ్గర నుంచి పోర్టు సిబ్బంది వరకు భారీ స్థాయిలో సొమ్ము చేతులు మారకపోతే ఇంత పెద్ద రాకెట్ దందాకు ఆస్కారం లేదని తెలుస్తోంది. ►గుంటూరు జిల్లాకు చెందిన సీతారామాంజనేయ రైస్ అండ్ ఫ్లోర్ మిల్ నుంచి ఓషన్ బ్రాండ్ పేరుతో 1263.50 క్వింటాళ్ల బియ్యాన్ని ఢిల్లీ నవభారత్ ట్రేడింగ్ కంపెనీ ఎక్స్‌పోర్టర్స్ చాకియాత్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేశారు. ఈ నలుగురు సప్లయిర్స్ ఈ–వేబిల్లులు లేకుండా, ఏఎంసీ సెస్‌లు చెల్లించకుండా చేర్చినట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన సీతారామాంజనేయ రైస్ అండ్ఫ్లోర్ మిల్ నుంచి ఈగల్ బ్రాండ్ పేరుతో రెండు దఫాలుగా 63 క్వింటాళ్ల బియ్యాన్ని ఢిల్లీ నవభారత్ ట్రేడింగ్ కంపెనీ ఎక్స్‌పోర్టర్స్ చాకియాత్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేశారు. ►చెన్నైకు చెందిన శివకేశవ ట్రేడర్స్ నుంచి సలోని బ్రాండ్ పేరుతో 3,900 క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడకు చెందిన సిస్టర్ కన్సైన్మెంట్ కాకినాడ అండ్ సరలా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్టర్స్ నుంచి ఏవీకే లాజిస్టిక్స్‌కు సరఫరా చేశారు. ►విజయవాడకు చెందిన ఎస్ఎంఆర్ ట్రేడింగ్ కంపెనీ నుంచి సూపర్ టైగర్ బ్రాండ్ పేరుతో 11,225 క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడకు చెందిన ఎంఓఐ కమోడిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్టర్స్ సీవేస్ షిపింగ్ అండ్ లాజిస్టిక్ లిమిటెడ్ ద్వారా సరఫరా చేసినట్లు దాడుల్లో అధికారులు గుర్తించారు. సప్లయిర్స్, ఎక్స్‌పోర్టర్స్ వివరాల సేకరణ అసలు ఇలాంటి వ్యవహారాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో అనే వివరాలు సేకరించేందుకు విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందుకు కస్టమ్స్ అధికారుల నుంచి 2016–17 నుంచి 2019–20 వరకు సప్లయిర్స్, ఎక్స్‌పోర్టర్స్, ట్రాన్స్పోర్టర్స్ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. బయటపడిందిలా.. బియ్యం బ్యాగ్‌లు మార్చి, పేర్లు మార్చి, బిల్లులు లేకుండా పోర్టు గోదాముకు చేరిన బియ్యం అమ్మిన ధరను తెలిపే బిల్లులు అక్రమాల పుట్టను బయట పెట్టాయి. బియ్యం రూ.25, రూ.20 ఇలా తక్కువ ధరలకు కొని విదేశాలకు ఎగుమతి చేయడం ఎలా సాధ్యమవుతుందని తొలుత కస్టమ్స్ అధికారుల్లో రేగిన ఆలోచనలు అసలు విషయాన్ని బయట పెట్టాయి. శ్రీవీరభద్రా ఇండస్ట్రీస్ కేజీ బియ్యం రూ.25కు కొనుగోలు చేసినట్లు, సీతారామాంజనేయ రైస్ అండ్ ఫ్లోర్‌మిల్లు కేజీ రూ 21.40లకు కొనుగోలు చేసినట్లు, శివకేశవ ట్రేడర్స్ రూ.25, ఎస్ఎంఆర్ ట్రేడింగ్ కంపెనీ రూ.20.60 కేజీకి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నలుగురు సప్లయిర్స్ ఈ వే బిల్లులు లేకుండా, ఏఎంసీ సెస్ చెల్లించనట్లు అధికారులు గుర్తించారు. ఈ బియ్యం విజయవాడ, కాకినాడ, గుంటూరు, చెన్నై, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 లారీల ద్వారా పోర్టులోని సీబోర్డ్ గోదాముకు తరలినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత కస్టమ్స్ హౌస్ ఏజెంట్లను విజిలెన్స్ అధికారులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు బియ్యాన్ని సీజ్ చేసి 6ఏ కింద కేసు నమోదు చేశారు. అదే క్రమంలో కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. -
పగలంతా మూత.. రాత్రివేళ రీసైక్లింగ్
సాక్షి, వనపర్తి: నిరుపేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంతో కొందరు అక్రమ వ్యాపారానికి తెర లేపారు. రైస్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై గ్రామాల్లో రూ.10 లకే బియ్యాన్ని సేకరించి దానిని రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా మార్చి అధిక రేట్లకు అమ్ముకుని లక్షలు గడిస్తున్నారు. ఈ విషయం గురించి అధికారులకు అందరికి తెలిసినా.. కొందరు నేరుగా ఫిర్యాదులు చేసినా ఇన్నాళ్లూ అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. అయితే ఇటీవల పాన్‌గల్ మండలం సీఎంఆర్ అనుమతి పొందిన పరమేశ్వరీ రైస్ మిల్లులో పెద్దఎత్తున అక్రమ రేషన్ బియ్యం నిల్వలను స్వయంగా కలెక్టర్ గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ విషయం మరువకముందే మరో ఘరానా దళారుల బాగోతం వెలుగు చూస్తోంది. కొత్తకోట కేంద్రంగా.. ఈ రేషన్ దందా శ్రీరంగాపూర్ మండలానికి చెందిన ఇద్దరు, గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి చేస్తున్నారు. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ వినియోగదారుల నుంచి బియ్యం సేకరించడానికి కొందరిని నియమించుకున్నారు. వారంతా రాత్రి సమయాల్లో వాహనాల్లో గ్రామాలకు వెళ్లి బియ్యాన్ని సేకరించి కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ శివారులోని ఓ రైస్ మిల్లులోకి తరలిస్తారు. ఇదివరకే ఆ రైస్ మిల్లుకు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మరో ట్రేడర్ పేరుతో సీఎంఆర్ అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యంను ఆ రైస్ మిల్లుకు పంపించారు. సదరు మిల్లుకు కెటాయించిన సీఎంఆర్ కెటాయింపులకు అనుగుణంగా వారు రైస్ ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంది. సరఫరా చేసే రైస్ స్థానంలో గ్రామాల్లో చోటా దళారులు సేకరించిన రేషన్ బియ్యం పంపించి రీసైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్ అనుమతి కూడా.. కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ శివారులోని సప్తగిరి రైస్ మిల్లును మరో వ్యక్తి లీజుకు తీసుకుని వేరే పేరు సాయిచరణ్ ట్రేడర్స్ పేరుతో సీఎంఆర్ అనుమతి పొందారు. అనుమతి తీసుకున్న వ్యక్తికి బదులు ఇతరులు మిల్లు వద్ద కార్యకలాపాలు చేస్తూ అక్రమ దందాకు తెరలేపినట్లు సమాచారం. ఈ రైస్ మిల్లుకు సివిల్ సప్లయ్ అధికారులు 2114.660 మెట్రిక్ టన్నుల వరిధాన్యం సీఎంఆర్ కోసం అలాట్మెంట్ చేశారు. ఫలితంగా 1416.822 మెట్రిక్ టన్నుల రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1266.340 రైస్ ప్రభుత్వానికి సరఫరా చేశారు. ఇంకా 150.482 మెట్రిక్ టన్నుల రైస్ ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉన్నట్లు ఎన్‌పోర్స్‌మెంటు టీడీ వేణు తెలిపారు. కార్యకలాపాలన్నీ రాత్రివేళే.. రీసైక్లింగ్ రేషన్ దందా కార్యకలాపాలను పూర్తిగా రాత్రి సమయంలోనే చేస్తారని తెలుస్తోంది. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట మండలాల్లోని గ్రామాల నుంచి ఆటోల్లో రాత్రి సమయాల్లో రేషన్ బియ్యం ఈ మిల్లులోకి చేర్చి ప్రభుత్వ ముద్ర ఉండే బ్యాగుల్లోకి రేషన్ బియ్యంగా మార్చి ప్రభుత్వానికి సరఫరా చేస్తారనే విమర్శలు ఉన్నాయి. నేషనల్ హైవే 44కు ఆనుకుని ఉన్న కారణంగా అక్రమార్కులకు రీసైక్లింగ్ రేషన్ దందా చేయటం చాలా సులభమైందని చెప్పవచ్చు. నామమాత్రంగా తనిఖీలు ఈ మిల్లులో అక్రమ రేషన్ దందా యదేచ్ఛగా కొనసాగుతుందని ఫిర్యాదులు రావటంతో సివిల్ సప్లయ్ అధికారులు నామమాత్రంగా దాడులు చేశారు. దీంతో జిల్లాస్థాయి అధికారి ఒకరు కొత్తకోట తహసీల్దార్‌ను మిల్లును తనిఖీ చేయాలని ఆదేశించటంతో మిల్లు వద్దకు వెళ్లిన తహసీల్దార్ లోపల కొన్ని బ్యాగులు ఉండటాన్ని గమనించి మిల్లును సీజ్ చేశారు. లోపల ఉన్న బియ్యం రేషన్ బియ్యమా.. కాదా అని తెలుసుకునేందుకు తహసీల్దార్ టెక్నికల్ విభాగం అధికారులకు సిఫారస్ చేశారు. మా దృష్టికి రాలేదు రేషన్ బియ్యం రిసైక్లింగ్ చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఇదివరకే కలెక్టర్‌కు ఫిర్యాదులు వస్తే కొత్తకోట తహసీల్దార్ మిల్లును తనిఖీ చేశారు. అక్కడ ఉన్న బస్తాలతో సహా మిల్లుకు సీల్ వేశారు. టెక్నికల్ అధికారులతో విచారణ చేయించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. మిల్లులో ఉన్న బియ్యం బస్తాలు ఇదివరకే ప్రభుత్వానికి పంపించాం. రిటర్న్ చేసినవని డీటీ ఎన్‌ఫోర్స్‌మెంటు వేణు తెలిపారు. – రేవతి, డీఎస్ఓ ఇలాచేస్తే.. నిజాలు తెలుస్తాయి సప్తగిరి రైస్ మిల్లుకు ఆరు నెలలుగా వచ్చిన కరెంటు బిల్లులను పరిశీలిస్తే ఎంతమేరకు మిల్లులోని మిషన్లు నడింపించారో తెలుస్తోంది. ప్రతి మిల్లుకు సాధారణంగా మిషన్లు నడిస్తే తక్కువలో తక్కువ రూ.లక్షలోపు బిల్లు వస్తుంది. కానీ ఈ మిల్లుకు గడిచిన నెల విద్యుత్ మిల్లు కేవలం రూ.12,197 మాత్రమే వచ్చింది. ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంటుంది. అలాగే అమరచింత మండలానికి చెందిన దాసరి రాజశేఖర్ అనే వ్యక్తి అక్రమ రేషన్ దందా చేస్తూ ఏడుసార్లు పట్టుబడ్డాడు. అతనిపై కేసు కూడా నమోదు అయ్యింది. కౌన్సిలింగ్ ఇచ్చినా మారకపోవటంతో ఎస్పీ స్వయంగా అతనిపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. ఇలాంటివారు జిల్లా వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. లోతుగా విచారణ చేస్తే అక్ర మార్కుల లిస్టు బయటపడుతుంది. -
పీడీఎస్ బియ్యం వ్యాపారానికి అడ్డాగా పుట్టగూడెం
సాక్షి, రాజాపేట (ఆలేరు) : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పుట్టగూడెం తండా పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారింది. గ్రామస్తులు నిత్యం ఆదే పనిగా వ్యాపారం కొనసాగిస్తూ టన్నుల కొద్దీ పీడీఎస్ బియ్యం సేకరించి నిల్వ చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా వ్యాపారం మాత్రం ఆపడంలేదు. బియ్యం కొనుగోలులో బడా నాయకుల హస్తం ఉందని, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని రైస్‌మిల్లర్లు ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారని సమాచారం. 9 మే 2017న సిద్దిపేట జిల్లాకు తరలిస్తుండగా 25 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని ఓ వ్యాపారిపై కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. కింది స్థాయి పోలీసుల కనుసన్నల్లో ఈ పీడీఎస్ బియ్యం వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజాపేట మండలంలోని పుట్టగూడెం గ్రామంలో సుమారు వెయ్యి మంది గిరిజనులు ఉంటారు. కాగా వీరికి ప్రధాన కులవృత్తి లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి భూమిలో జొన్న, మొక్కజొన్న, వరి, పత్తి, కంది వంటి పంటలు సేద్యం చేస్తారు. మిగతా కాలంలో ఖమ్మం, విజయవాడ వంటి జిల్లాలకు చెరుకు నరి కేందుకు ఎడ్లబండ్లపై వలస వెళ్తుంటారు. తిరిగి వచ్చే సమయంలో ఉప్పు కొనుగోలు చేసి ఇక్కడి ప్రజలకు విక్రయిస్తారు. కాగా మారుతున్న కాలనుగుణంగా వర్షాలు లేకపోవడంతో ఈ గ్రామంలో జీవనోపాధి కరువై కొందరు సారాయి విక్రయిస్తూ ఉపాధి పొందారు. ప్రభుత్వం సారా తయారీదారులు, విక్రయదారులపై కఠినచర్యలు తీసుకుంటూ పీడీ యాక్టు నమోదు చేయడంతో దానిని మానేశారు. దీంతో కొందరు గ్రామస్తులు ఇళ్ల నిర్మాణాలకు ఇటుక, కంకర, ఇసుక వంటి ముడిసరుకులు అందిస్తూ వ్యాపారులుగా మారారు. కాగా కొంతమంది మాత్రం పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. పీడీఎస్ బియ్యం సేకరిస్తూ గ్రామంలోని రహస్య ప్రాంతాల్లో నిల్వచేస్తూ గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రి ఇతర జిల్లాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. పోలీసులు కొన్ని సందర్భాల్లో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో దాడులుచేసి కేసులు నమోదు చేయగా భయపడిన కొందరు ఈ వ్యాపారాన్ని మానేయగా మరి కొందరు కొనసాగిస్తున్నారు. ఈ గ్రామంలో మూడేళ్లుగా పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం సాగుతూనే ఉంది. కాగా గ్రామంలోని గిరిజనులకు ఉపాధి కరువైందని, ప్రభుత్వాలు పని కల్పిం చాలని, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు అందివ్వాలని కోరుతున్నారు. వ్యాపారం ఇలా... గ్రామంలోని కొందరు తమ కుటుంబంతో కలిసి తెల్లవారుజామున నిత్యం ఆలేరు, జనగాం పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో కేజీకి రూ.10 ఇస్తూ పీడీఎస్ బియ్యం, నూకలను సేకరిస్తారు. ఇలా సేకరించిన బియ్యాన్ని తిరిగి మధ్యాహ్నం సమయంలో స్వగ్రామానికి చేరుకుని గ్రామంలోని మరో రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసిన బియ్యాన్ని మూడు రోజులకు ఒకసారి రాత్రివేళలో గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో మెదక్, సిద్దిపేట జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేసులు నమోదు పుట్టగూడెం గ్రామంలో గత ఏడాది కాలంగా పోలీసులు ఐదు సార్లు దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ 400 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఈ సందర్భంగా మూడు వాహనాలను పట్టుకొని 16 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్న వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని సీఐ ఆంజనేయులు పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారంపై విచారణ రాజాపేట : మండలంలోని పుట్టగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం డంపులపై ఎస్ఓటీ పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించిన సంగతి విధితమే. కాగా పీడీఎస్ డంపులు పట్టుకున్న సమయంలో ఎస్ఓటీ పోలీసులపై వ్యాపారులు దాడికి పాల్పడి పోలీసులను గాయపరిచిన సంఘటనపై భువనగిరి ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐలు ఆంజనేయులు, నర్సింహారావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎస్ఓటీ పోలీసులు ఎస్ఐ లక్ష్మీనారాయణ, హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాజు, కానిస్టేబుల్ సురేందర్‌రెడ్డి సివిల్ డ్రెస్సుల్లో వెళ్లగా అక్రమ వ్యాపారులు రాళ్లతో దాడిచేయగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వ్యాపారులు అక్కడున్న పల్సర్ ద్విచక్రవాహనాన్ని, కొంత పీడీఎస్ డంపు నిల్వను దహనం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 35 టన్నులు (350) క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారులు మాడోతు చంటి, శ్రీకాంత్‌తోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ సీతారామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి, ఆలేరు ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా పీడీఎస్ దందా!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): సివిల్ సప్లయి శాఖలో ఎన్ని సంస్కరణలు తెచ్చినా జిల్లాలో పీడీఎస్ దందా యథేచ్ఛగా సాగుతోంది. వాహనాల్లో తరలిస్తున్న, ఇంట్లో దాచి ఉంచిన బియ్యం బస్తాలను అధికారులు పట్టుకుంటున్నా.. ఈ అక్రమ వ్యాపారం మాత్రం పెరుగుతూనే వస్తోంది. ఇందుకు ఈ ఏడాదిలో పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం, నమోదైన కేసులే నిదర్శనం. గడిచిన రెండేళ్లలో 100 కేసులు నమోదైతే ,ఈ ఏడాదిలోనే 96 పైగా కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన 4,869.38 క్వింటాళ్ల బియ్యం పట్టుకోవడం గమనార్హం. కేసుల పరంగా, పట్టుబడిన బియ్యం పరంగా చూసినా రెండేళ్లలో కంటే ఎక్కువగానే ఉన్నాయి. గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ–పాస్, బయోమెట్రిక్ విధానం రాకముందు తక్కువ కేసులు నమోదు కాగా, అమల్లోకి వచ్చిన తరువాత కేసులు ఎక్కువైయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ బియ్యం అక్రమ దందాను అరికట్టడానికి రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానాన్ని 2017 నవంబర్‌లో అమలులోకి తెచ్చింది. దీంతో రేషన్ డీలర్ల చేతి వాటానికి దాదాపు అడ్డుకట్ట పడింది. అయితే కొన్ని చోట్ల రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ మెషిన్లు పని చేయడం లేదని, లబ్ధిదారుల బయోమెట్రిక్ వేలిముద్రలు రావడం లేదని సాకు చూపి అందిన కాడికి బియ్యాన్ని దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. లబ్ధిదారులు కూడా పీడీఎస్ బియ్యం పొంది వ్యాపారులకు రూ.10 నుంచి రూ.14 వరకు విక్రయిస్తున్నారు. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులు ఎక్కువైయ్యారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన బియ్యంను రెండవ వ్యాపారికి, రెండవ వ్యాపారి నుంచి ప్రధాన వ్యాపారికి విక్రయిస్తున్నారు. ప్రధాన వ్యాపారి తన వద్దకు చేరిన పెద్ద మొత్తం పీడీఎస్ బియ్యంను ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నారు. ఇలా క్షేత్ర స్థాయి నుంచి పెద్ద వ్యాపారమే కొనసాగుతోంది. ఈ వ్యాపారంపై పూర్తిస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అవగాహన ఉన్నప్పటికీ కొన్ని కేసులపైనే దృష్టిసారించి పట్టుకుంటున్నారని, వారికి అనుకూలంగా ఉన్న వారి జోలికి పోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. నామమాత్రపు చర్యలు.. పైగా మంతనాలు జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా పెరుగుతుందడానికి చాలా కారణాలున్నాయి. 2016 సంవత్సరంలో పట్టుబడిన 58 కేసుల్లో 3171.09 క్వింటాళ్ల బియ్యం పట్టుకోగా, 2017లో 42 కేసులకు గాను 2002.76 క్వింటాళ్లు, అదే విధంగా 2018లో ఇప్పటి వరకు 96 కేసులకు గాను 4869.38 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఈ మూడేళ్లలో 196 కేసులకు గాను 10,004 క్వింటాళ్ల బియ్యంను పట్టుకుని 258 మందిపై (6ఏ) కేసు నమోదు చేయగా, రూ.7,55,000 జరిమానా విధించారు. అయితే పీడీఎస్ బియ్యం పట్టుబడిన వారికి తక్కువ శిక్ష, జరిమాన పడే విధంగా కేసును పట్టుకున్న వారే మంతనాలు జరుపుతున్నారే ఆరోపణలున్నాయి. అందుకే ఇది వరకే రెండు, మూడ్లు సార్లు పట్టుడిన కొంతమంది సులువుగా కేసు నుంచి తప్పించుకోవడం సాధ్యమైందని తెలుస్తోంది. పీడీఎస్ బియ్యం ప్రకారంగా అక్రమ వ్యాపారం చేసే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, జైలు శిక్షతో పాటు, భారీ మొత్తంలో జరిమానా విధించాల్సి ఉంటుంది. కానీ చిన్నపాటి చర్యలు, తక్కువ జరిమానాలు విధించడంతో పట్టుబడిన వారే మళ్లీ పీడీఎస్ బియ్యంతో వ్యాపారం చేస్తున్నారు. మచ్చుకు కొన్ని ఘటనలు.. గతేడాది మాక్లూర్‌లో పెద్ద ఎత్తున పట్టుడిన పీడీఎస్ బియ్యం కేసులో కేవలం రూ.50వేలు జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేశారు. అదే విధంగా గత ఏడాదితో పాటు ఈ ఏడాదిలో కూడా నిజామాబాద్ నగరంలో పీడీఎస్ బియ్యంతో పట్టుబడిన రెండు వాహనాలను సీజ్ చేసిన అధికారులు ఒకరికి రూ.45వేలు, మరొకరికి రూ.40వేలు జరిమానా విధించారు. -
‘సన్నాల’ పేరిట దగా..!
సూర్యాపేట : సన్న రకాలు.. ఈ బియ్యం కొనుగోలు చేశారంటే.. మరోమారు మా వద్దనే కొనుగోలు చేస్తారంటూ మాయమాటలు చెబుతూ కొందరు వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా కాలనీలు, వీధుల్లో కేకలు వేస్తూ సంచరిస్తున్నారు. సన్న రకం బియ్యం బహిరంగ మార్కెట్లో రూ.4400 కాగా.. తమ వద్ద రూ.3400 మాత్రమే అంటూ అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ అంటగడుతున్నారు. సన్న బియ్యాన్ని ఎలా గుర్తించాలని ప్రజలు అడగడమే ఆలస్యం.. వెంటనే సంచులు విప్పి సన్నబియ్యాన్ని చేతిలో పోసి అంటగడుతున్నారు. వారు వెళ్లిన క్షణాల్లోనే సంచులు విప్పి కొంచెం లోతుగా బస్తాలోకి చెయ్యి పెట్టి బియ్యం తీస్తే దొడ్డు బియ్యం దర్శనమిస్తున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకుని.. సన్న బియ్యం పేరుతో దొడ్డు బియ్యం విక్రయిస్తున్న వ్యాపారులు ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్, దేవరకొండ పట్టణాల్లోకి దిగడమే ఆలస్యం.. అక్కడి అక్రమ వ్యాపారులను పరిచయం చేసుకుంటున్నారని సమాచారం. మాస్ కాలనీల పేర్లు తెలుసుకుని అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. సన్న బియ్యం రూ.3400 విక్రయించడం ఏంటని ప్రశ్నిస్తే.. తాము పెద్ద రైతులమని.. మార్కెట్లో నేరుగా విక్రయించే కంటే ఇలా విక్రయిస్తే తమకుకొద్దోగొప్పో లాభమంటూ బుకాయిస్తూ అమాయయకుల నుంచి దోచుకుంటున్నారు.తమపై నమ్మకం లేకపోతే మా ఫోన్ నంబర్లు కూడా తీసుకోండంటూ నంబర్లను కూడా ఇచ్చి వెళ్తున్నారు. కానీ ఆ నంబర్లు పనిచేయకపోవడంతో కంగుతింటున్నారు. ఒక్కరిద్దరు వ్యాపారులు కలిసి.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులే ఇలాంటి అక్రమ వ్యాపారాలకు తెర తీశారని తెలుస్తోంది. గతంలో మాదిరిగానే పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసే పరిస్థితులు లేకపోవడంతో వ్యాపారులు ఇక సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి మర ఆడిస్తున్నారు. అట్టిబియ్యాన్ని ఆటోలు, టాటా ఏసీల్లో వేసుకుని ముగ్గురు నలుగురు వ్యాపారులు కలిసి సన్న బియ్యం అంటూ విక్రయిస్తున్నారు. అయితే ఈ అక్రమ వ్యాపారంలో బడా వ్యాపారులు హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా పోలీసు, పౌరసరఫరాల శాఖ అధికారులు పీడీఎస్ బియ్యం కొనుగోలు చేయకుండా ఎలా కట్టడి చేసేలా చర్యలు చేపడుతున్నారో.. అదే రీతిలో సన్న బియ్యం పేరుతో దొడ్డుబియ్యం అంటగడుతూ మోసగిస్తున్న వారిపై కన్నేసి కటకటాలకు పంపించాలని ప్రజలు వేడుకుంటున్నారు. సూర్యాపేట పట్టణంలోని 10వ వార్డు చర్చికంపౌండ్‌లో బాణోతు సునిత అనే మహిళ నివాసముంటోంది. అయితే వీరునివాసముంటున్న ప్రాంతానికి ముగ్గురు గుర్తుతెలియని వ్యాపారులు ఆటోలో బియ్యం బస్తాలు వేసుకుని సన్న రకం బియ్యం అంటూ కేకలు వేసుకుంటూ వచ్చారు. కాగా, సునిత సన్న బియ్యం కావడంతో క్వింటా బియ్యం రూ. 3400 వెచ్చించి కొనుగోలు చేశారు. ఇంట్లోకి తీసుకెళ్లినబియ్యం సంచులను విప్పి చూడగా.. పై భాగంలో సన్నగా.. కింది భాగంలో మొత్తం దొడ్డు బియ్యం ఉండడంతో ఒక్కసారిగా అవాక్కైపోయింది. చేసేదేమి లేక వెంటనే తేరుకున్న ఆమె మోసం చేసిన బియ్యం వ్యాపారులను వెతుక్కుంటూ చర్చికంపౌండ్ నుంచి సీతారాంపురం కాలనీకి చేరుకుంది. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో లబోదిబోమంది. ఇలా సునిత ఒక్కరే కాదు..జిల్లా వ్యాప్తంగా అమాయకులు మోసపోతున్నారు. ఉదయం ఓ చోట.. సాయంత్రం మరో చోట పీడీఎస్ బియ్యాన్ని మర ఆడించిన కొందరు అక్రమ వ్యాపారులు సన్న బియ్యం పేరుతో అమాయకులకు అంటగట్టేందుకు రోజుకో చోట ప్రత్యక్షమవుతున్నారు. కాగా ఇటీవల కాలంలో నల్లగొండ, దేవరకొండ పట్టణాల్లో వందలాది క్వింటాళ్ల విక్రయించామని ఎక్కడా కూడా తమ బియ్యం బాగోలేదని చెప్పిన వారు లేరంటూ తెలుపుతున్నారు. ఉదయం నల్లగొండలో ఉంటే సాయంత్రానికి భువనగిరి లేదా దేవరకొండ పట్టణాల్లోకి ప్రవేశిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం. కానీ ఆ ఫిర్యాదులను పోలీసులు స్వీకరించినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు లేకపోలేదు. -
150 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
మిర్యాలగూడ రూరల్: లారీలో అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మిర్యాలగూడ రూరల్ సీఐ రమేశ్‌బాబు, ఎస్ఐ కుంట శ్రీకాంత్ ఆదివారం పట్టణ పరిధిలో పట్టుకున్నారు. వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ శ్రీని వాస్ విలేకరులకు వెల్లడించారు. తుంగపహాడ్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో తెల్లవారుజామున 4:30 గంటలకు రూరల్ సీఐ, ఎస్ఐ నాగార్జునసాగర్ రోడ్డుపై తుంగపహాడ్ వద్ద కాపుకాచి పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం లారీడ్రైవర్ చెన్నపల్లి వెంకన్నను విచారించగా బియ్యానికి సంబంధించిన వ్యక్తులు వివరాలు వెల్లడిం చినట్లు తెలిపారు. బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన నిందితులు బి.అన్నారం గ్రామానికి చెందిన చేదెళ్ల రాజు, అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన బాల్స కృష్ణమూర్తి, దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన జానకి రెడ్డి, అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన డీలర్ గందె నాగేశ్వర్రావు, మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస్ (లారీ ఓనర్)లు గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి వాస శ్రీనివాస్‌కు అమ్మినట్టు వెల్లడించారు. నిందితుల్లో నలుగురు రాజు, వెంకన్న, కృష్ణమూర్తి, నాగేశ్వర్‌రావులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు వాస శ్రీనివాస్, జానకిరెడ్డిలు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. పట్టుబడిన లారీని సీజ్ చేశామని, పంచనామా నిర్వహించి నిబంధనల ప్రకారం నిందితులను, బియ్యాన్ని కోర్డుకు అప్పగించనున్నట్టు వివరించారు. పకడ్బందీగా ప్రజాభద్రత చట్టం అమలు అక్రమాలను అరికట్టేందుకు డీఐజీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ప్రజల భద్రతకు విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణంలో 150, లారీ అసోసియేషన్ వద్ద 20, శ్రీనివాస్‌నగర్‌లో 14, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30, వేములపల్లిలో 20, హాలియా, నాగార్జునసాగర్‌లో 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ ఎ.రమేష్ బాబు, ఎస్ఐ కుంట శ్రీకాంత్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గౌస్, రవి కుమార్, సాముల్ పాల్గొన్నారు. -
రైస్‌మిల్స్‌పై విజిలెన్స్ పంజా
బోధన్‌రూరల్(బోధన్): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో విజిలె న్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారు లు పంజా విసిరారు. కొద్ది రోజులుగా మాటు పెట్టిన వారు సోమ వారం అర్థరాత్రి నుంచి నిఘా పెట్టి దాడులు చేశారు. పట్టణ శివారులోని సూర్య ఆగ్రో, చం ద్ర ఇండస్ట్రీస్‌లో రూ.36 లక్షలు విలువ చేసే 1500 క్వింటాళ్ల బియ్యాన్ని, ఓ లారీని, ఆటోను సీజ్ చేశారు. రెండు మిల్లుల యజమానిపై కేసు నమోదు చేశారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ ఎస్పీ కేఆర్ నాగరాజు మా ట్లాడారు. బోధన్‌లో కొద్ది రోజులుగా పీడీఎస్ రైస్‌ను తక్కువ ధరకు కొని రీసైకిలింగ్ చేసి తిరిగి ఎక్కు వ ధరకు అమ్మడం, దొడ్డు బియ్యాన్ని సన్నగా మార్చి అమ్మడం వంటి అక్రమాలు సాగుతున్నాయని తమ దృష్టికి వచ్చిం దన్నారు. దీంతో అనుమానం వచ్చి రైస్ మిల్లులపై నిఘా పెట్టామన్నారు. మంగళవారం తెల్లవారుజామున ప్రభాకర్ అనే వ్యక్తి చెందిన సూర్య, చంద్ర రైస్‌మిల్లులకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండడంతో పట్టుకున్నా మన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని ప్రభాకర్ రెడ్డి రైస్‌మిల్లులో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీటి ని విచారణకు ఉన్నతాధికారులకు పం పించామన్నారు. సూర్య ఆగ్రో, చం ద్ర ఇండస్ట్రీస్ యాజమాని ప్రభాకర్‌రెడ్డిపైక్రిమి న ల్ కేసు నమోదు చేశామన్నా రు. పట్టుబడిన బియ్యాన్ని పరీక్షల కో సం పంపించామని చెప్పారు. నివేదిక లు వచ్చాకమరిన్ని చర్యలు తీసుకుంటా మనివెల్లడించారు. అధికారుల నిఘా, మెరుపు దాడులు.. మంగళవారం తెల్లవారుజామున ఆటో (టీఎస్16 యూబీ 3859)లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రైస్ మిల్లుకు తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు వెంబడించారు. పట్టణానికి చెందిన ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన చంద్ర ఇండస్ట్రీస్‌లోకి ఆటో వెళ్లగా, అధికారులు పట్టుకున్నారు. తనిఖీలు చేసి భారీగా బియ్యం నిల్వలను గుర్తించారు. అనంతరం పక్కనే ఉన్న మరో రైస్‌మిల్ సూర్య ఆగ్రో ఇండస్ట్రీస్‌లో తనిఖీలు చేయగా నిబంధనలకు విరుద్ధంగా బియ్యం నిల్వలను గుర్తించారు. వీటి పత్రాలు, వివరాలు సక్రమంగా లేక అధికారులు సీజ్ చేశారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు.. పీడీఎస్ బియ్యంతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నాగరాజు హెచ్చరించారు. బోధన్‌లో చేసిన దాడుల అనంతరం ఆయన మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి, మెద క్, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల్లో నిరంతరం దాడులు చేస్తున్నామన్నారు. ఐదు జిల్లాలో ఎక్కడైనా పీడీఎస్ బియ్యంపై అక్రమాలకు పాల్పడితే 80082 03377కు సమాచారం అందించాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాస్, డీసీటీవో ఉపేందర్, సీఐలు వినాయక్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ఎస్ఐ సంగమేశ్వర్ గౌడ్, హెచ్‌సీ లక్ష్మారెడ్డి, కానిస్టేబుళ్లు శివానంద్, శివకుమార్, సుదర్శన్, డీఈ రమణ, ఏఆర్ రమేశ్, బోధన్ తహసీల్దార్ గంగాధర్, డీటీ వసంత, శశి భూషన్, అధికారులు పాల్గొన్నారు. -
18 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
దామరచర్ల (మిర్యాలగూడ): మండలంలోని వాడపల్లి చెక్ పోస్టు వద్ద 18క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్ఐ రామన్ గౌడ్ తెలిపారు. బుధవారం మండంలోని కొండ్రపోల్ నుంచి ఏపీలోని దాచేపల్లికి బియ్యాన్ని తరలిసుతండగా విశ్వసనీయ సమచారం మేరకు మాటు వేసి బియ్యాన్ని పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. సంఘటతో సంబంధం ఉన్న దాచేపల్లికి చెందిన డ్రైవర్ కొప్పుల అప్పారావు, బొమ్మిరెడ్డి అంకారావు, బొమ్మిరెడ్డి నాగరాజు, కొండ్రపోల్‌కు చెందిన అచ్చిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
మిర్యాలగూడ రూరల్: మండలం పరిధిలోని రాయినిపాలెం గ్రామంలో భారీగా నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మిర్యాలగూడరూరల్ పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో పట్టుకున్నారు. ఎస్ఐ కుంట శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో మూతబడిన పీఏసీఎస్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని లారీలోకి డంపు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి బియ్యం పట్టుకున్నారు. బియ్యం భారీగా ఉండడంతో మిర్యాలగూడ డీఎస్పీ రాంగోపాల్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ వెంటనే అక్కడకు చేరుకుని నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం బియ్యం ఎవరు నిల్వ చేశారన్న విషయంపై విచారించారు. బియ్యం నిల్వ చేసిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన రమణ, సహకరించిన రాయినిపాలెం గ్రామానికి చెందిన జయమ్మ, బియాన్ని తరలించేందుకు వచ్చిన లారీ యజమాని శ్రీనివాస్, డ్రైవర్ సకృపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. -
330 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
అనంతపురం: డి.హీరాహాల్ మండలం ఆర్ఎంసీ చెక్ పోస్టు వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన లారీలో అక్రమంగా తరలిస్తున్న 330 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీలో పాటు బియ్యపు బస్తాలను పోలీసులు సీజ్ చేసి... పౌర సరఫరాల శాఖకు చెందిన ఉన్నతాధికారులకు అందజేశారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరు : గుంటూరు జిల్లా దుర్గి మండలం నరమాలపాడు వద్ద ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 420 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీని కూడా స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
సుల్తానాబాద్: మండల కేంద్రంలోని శ్రీరాంపూర్ కూడలి వద్ద ఆటోలో తరలిస్తున్న రేషన్‌బియ్యాన్ని శనివారం వాహనాల తనీఖీలో పట్టుకున్నట్లు ఎస్సై జీవన్ తెలిపారు. సుల్తానాబాద్ మార్కండేయ కాలనీకి చెందిన బండారి వంశి అనే వ్యక్తి ఏడు క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని ఆటోను సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి బియ్యాన్ని పంచనామా కోసం డీటీసీఎస్ అధికారులకు సిఫార్సు చేశామన్నారు. ఇసుక ఆటో పట్టివేత సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ నుంచి పెద్దపల్లికి సన్నపు (జీరో) ఇసుకను ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా శివాలయం వద్ద శనివారం పట్టుకున్నట్లు ఎస్సై జీవన్‌తెలిపారు. మైనింగ్ అధికారులకు జరిమానా కోసం సిఫార్సు చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన బియ్యం జ్యోతినగర్: ప్రభుత్వం పేదలకు పంపిణీచేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్న వైనంపై రామగుండం రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన 126 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం సీజ్ చేశారు. రామగుండం గౌతమినగర్‌కు చెందిన వ్యాపారి గోలి రమణారెడ్డికి చెందిన శ్రీ సీతారామాంజనేయ స్వామి రైస్‌మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేశారనే సమాచారంతో ఆర్ఐ ఖాజామొహినొద్దిన్, వీఆర్ఓలు అజీం, అజయ్, రవీందర్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. మిల్లులో నిల్వచేసిన 252 (50 కిలోల) సంచులను గుర్తించి సీజ్ చేశారు. అక్రమ నిల్వలతో పాటు రైస్‌మిల్లుకు కనీసం పేరు లేకుండా నిర్వహిస్తున్న వైనంపై ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తామని అధికారులు తెలిపారు. -
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేసినిరోడ్డు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. రేసిని రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఖమ్మం : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం, బనిగండ్లపాడు గ్రామాల్లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం దాదాపు 200 క్వింటాళ్లు ఉంటుందని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. -
వంద క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత
జనగామ : జనగామ మీదుగా నిజామాబాద్‌కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. పట్టణ రెండో ఎస్సై శ్రీనివాస్ పెట్రోలింగ్ చేస్తుండగా డీసీఎంలో తరలుతున్న పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాహన డ్రైవర్ షేక్ రజాక్‌ను అదుపులోకి తీసుకుని, సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారమిచ్చారు. సివిల్ సప్లయ్ విజిలెన్స్ సీఐ రమణారెడ్డి చేరుకుని డీసీఎం యజమాని గఫార్‌ను ఫోన్లో విచారించగా ఈ బియ్యం దేవరుప్పుల మండలం పెద్దమడూరుకు చెందిన డీలర్ బుక్క వెంకన్నకు చెందినవిగా తేలింది. దీంతో వాహనాన్ని సీజ్ చేసి, వ్యాపారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయనతో ఎస్సై సంతోషం రవీందర్, ఏఎస్ఓ రోజారాణి, డీటీ రమేష్, ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ ఉన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీ 16.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ పెద్దమడూరు(దేవరుప్పుల) : మండలంలోని పెద్దమడూరులో రేషన్‌షాపుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి ఓ వాహనంలో 100 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని తరలిస్తుండగా జనగామలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులకు పట్టుకొని విచారించగా బ్లాక్‌దందా వెలుగులోకి వచ్చింది. దీంతో గురువారం సాయంత్రం పెద్దమడూరులో అధికారులు తనిఖీలు చేయగా ఓ ఇంట్లో 16.50 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్థానిక డీలరు బుక్కా వెంకన్న డంప్ చేసినట్లు తేలింది. ఈ విషయమై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ రమణారెడ్డి మాట్లాడుతూ జనగామలో తాము పట్టుకున్న వంద క్వింటాళ్లతోపాటు ఇక్కడ దొరికిన 16.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం డీలరు బుక్కా వెంకన్నవిగా గుర్తించామని, శాఖాపరంగా చర్యలు తీసుకునేందుకు 6ఏతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్టు వివరించారు. దాడుల్లో సివిల్ సప్లయ్ డీటీ గాదెం రమేష్, ఎఎస్‌ఓ రోజారాణి, హరిప్రసాద్, సురేష్, ఏఆర్ఐ భద్రయ్య, వీఆర్ఓ రెహమాన్ తదితరులు ఉన్నారు. -
440 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
చిల్లకూరు : పేదలకు అందజేయాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రా, తమిళనాడుకు చెందిన రేషన్ బియ్యంను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాలతో డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి, తన సిబ్బందితో శనివారం జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. నాయుడుపేట వైపు నుంచి నెల్లూరు వైపు బియ్యం రవాణా చేస్తున్న లారీని నాయుడుపేట–ఓజిలి మధ్యలో గుర్తించి తనిఖీ చేయగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ లారీని చిల్లకూరు పోలీస్‌స్టేçÙన్కు అప్పగించారు. బియ్యంను గోదాముల డీటీలకు అప్పగించారు. 440 బస్తాల విలువ సుమారు రూ.5.80 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలి పారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలుమార్లు తడ ప్రాంతం నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం రవాణాను అడ్డుకున్నామన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు, ప్రజలు కూడా దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట సీఐ సత్యనారాయణ, ఏఓ ధనుంజయరెడ్డి, డీసీటీఓ విష్ణురావు, సిబ్బంది ఉన్నారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమాన్ వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోతోపాటు ఎస్కార్ట్‌గా బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2250 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆటోతోపాటు బైకును సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. -
భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టివత
గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడిలో గ్రామ శివారులో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న 170 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రేపల్లె సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు రహదారిపై కాపు కాసిన పోలీసులు రేషన్ బియ్యం లోడుతో భీమవరం వైపు వెళ్తున్న లారీని పట్టుకున్నారు. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నల్గొండ : నల్గొండ జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో అక్రమంగా నిల్వ ఉంచిన 70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. బేతవోలు గ్రామంలోని ఓ ఇంట్లో భారీగా రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆగంతకులు సమాచారం అందించారు. దీంతో ఆ శాఖ అధికారులు శనివారం ఉదయం సదరు ఇంటిపై దాడి చేసి... బియ్యాన్ని స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. -
కనిగిరిలో రేషన్ బియ్యం పట్టివేత
ఒంగోలు : ప్రకాశం జిల్లా కనిగిరిలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మినీ లారీని సీజ్ చేసి... డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత : ఇద్దరు అరెస్ట్
విజయవాడ : కృష్ణాజిల్లా వీర్లపాడు మండలం పెద్దాపురంలో అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరా శాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే బియ్యాన్ని తరలిస్తున్న లారీతోపాటు ఆటోను పోలీసులు సీజ్ చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందు బైపాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న మూడు లారీల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యంతోపాటు లారీలను సీజ్ చేశారు. లారీడ్రైవర్లలను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డోర్నకల్లు నుంచి రెండు లారీలు, నల్గొండ నుంచి ఓ లారీలో సుమారు 550 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మొత్తం బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు తమకు ముందుస్తు సమాచారం అందిందని...ఈ మేరకు తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని.... పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. -
25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
పెంటపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం బి.కొండెపాడు వద్ద రెవెన్యూ శాఖ అధికారులు 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని బుధవారం ఉదయం పట్టుకున్నారు. విజయవాడ వైపు నుంచి ఓ లారీలో పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నట్టు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని పోలీసులకు స్వాధీనం చేశారు. -
20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
వరంగల్ : వరంగల్ జిల్లా పాలకుర్తిలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు. అందుకు సంబంధించి.. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నల్గొండ జిల్లాలో పీడీఎస్ బియ్యం పట్టివేత
నల్గొండ : నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం జెగ్గుతండాలోని ఓ ఇంటిపై శుక్రవారం పౌరసరఫరాల శాఖ అధికారులు దాడి చేసి.. 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. వాటిని సీజ్ చేశారు. అందుకు సంబంధించి ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని.. ప్రశ్నిస్తున్నారు. సదరు ఇంట్లో పీడీఎస్ బియ్యం దాచి ఉంచారని పౌర సరఫరాల అధికారులకు ఆగంతకులు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు చేశారు. -
కొరడా
♦ రైసు మిల్లులపై దాడులు ♦ రేషన్ బియ్యం కొనుగోళ్లపై తనిఖీలు ♦ మూడు బృందాల విచారణ పెద్దశంకరంపేట: పీడీఎస్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నారనే సమాచారంతో జిల్లా అధికారులు పేటలోని మూడు రైసుమిల్లులపై గత రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల అధికారులు రేషన్ బియ్యం సరఫరాపై విచారణ చేపడుతున్నారు. ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో గత కొన్ని రోజులుగా అనుమానం వచ్చిన మిల్లులపై జిల్లా స్థాయి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ రూ.కోట్లు గడిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న పేట మండలంలోని మూడు రైసుమిల్లులపై ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం నుంచి మూడు రైసుమిల్లుల్లో బస్తాలను అధికారులు లెక్కించారు. ఇతర రాష్ట్రాలనుంచి బియ్యం ఎగుమతిదిగుమతులవుతున్నాయని పలువురు పిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో జేసీ ఆదేశాల మేరకు రైసుమిల్లుల్లో అధికారులు సోదా నిర్వహించారు. సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్లకు చెందిన తహశీల్దార్లు, సిద్దిపేట, సంగారెడ్డికి చెందిన ఏఎస్ఓల బృందం తనిఖీలు చేపట్టింది. గత అరు నెలల విద్యుత్ వాడకంపై కూడా అధికారులు విద్యుత్ శాఖ ఏఈ ద్వారా సమాచారం సేకరించారు. మిల్లర్లు వాడిన విద్యుత్, మర పట్టిన ధాన్యానికి గల తేడాలను అధికారులు గుర్తించారు. అధికారులు దాడులు చేయవచ్చనే సమాచారంతో ముందుగానే పీడీఎస్ బియ్యం లేకుండా మిల్లర్లు జాగ్రత్త పడినట్లు సమాచారం. -
3 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం విక్రమపురం రైస్‌మిల్లుపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రైస్ మిల్లు యజమానిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైస్ మిల్లును సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం 3 క్వింటాళ్ల వరకు ఉంటాయని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. -
25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించిన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. -
19 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
విజయవాడ : కృష్ణాజిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లె వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 19 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నల్గొండ: నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం కమ్మారంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 65 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యం బస్తాలను సీజ్ చేశారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేశారు. కమ్మారం గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు ఉన్నతాధికారులు ఆగంతకుడు ఫోన్ చేసి చెప్పాడు. ఈ నేపథ్యంలో అధికారులు సదరు ఇంటిపై దాడి చేశారు. -
'సంక్షేమ పథకాలు శుద్ధ దండగ'
అనంతపురం : అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రూ. 5 పెట్టి టీ కొంటున్నప్పుడు రూపాయికే చౌకధర బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పరిమిత స్థాయిలోనే ఉండాలన్నారు. ప్రభుత్వం కిలో బియ్యం రూ.1కే దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్న నిరుపేదలకు అందిస్తోంది గానీ, ప్రతి ఒక్కరూ రూ. 5 పెట్టి టీ తాగుతున్నప్పుడు ... కేజీ బియ్యం మాత్రం రూపాయికే ఇవ్వడం ఎంతవరకు సబబని జేసీ ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు శుద్ధ దండగ అని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలన్నీ కేవలం ఓట్ల కోసమే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయని వ్యాఖ్యానించారు. రూపాయికి కిలో బియ్యం వల్ల ప్రజలు మరింత సోమరిపోతులుగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. బియ్యం పథకాన్ని ఎత్తేయాలని, మరింత ధర పెంచి.. ఆ అధిక ధరకే పేదలకు ఇవ్వాలని అనా్నరు. ఉచిత విద్యుత్ పథకం వల్ల రైతులకు విద్యుత్ విలువ తెలియడం లేదన్నారు. దీనికి కూడా మంగళం పాడి, రైతుల నుంచి సాధారణ ఫీజులు వసూలు చేయాలన్నారు. -
360 బియ్యం బస్తాలు స్వాధీనం : ఐదుగురు అరెస్ట్
గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లి శివారు ప్రాంతంలోని దుర్గమ్మ వారధి వద్ద విజిలెన్స్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు లారీలను అధికారులు సీజ్ చేశారు. అనంతరం లారీలోని 360 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు లారీల పీడీఎస్ బియ్యం పట్టివేత
మద్దిపాడు : ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ముళ్లపల్లి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్ వద్ద రెండు లారీల (600 బ్యాగులు) ప్రజా పంపిణీ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. బియ్యాన్ని ప్రియాంక రా బాయిల్డ్ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. కాగా స్వాధీనం చేసుకున్న రెండు లారీల బియ్యాన్ని సహాయ పౌరసరఫరాల అధికారి ఖాదర్ మస్తాన్‌కు అప్పగించారు. -
ఆగని దందా
‘రూపాయి’పై రాబందులు పక్కదారి పడుతున్న పేదోళ్ల బియ్యం యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రవాణా సంచులు మార్చి, రీసైక్లింగ్ చేసి లెవీకి పక్క రాష్ట్రాలకూ లారీల్లో తరలింపు పర్యవేక్షణ లోపంతో అక్రమాలు నిజామాబాద్: బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.38 నుం చి రూ.52కు లభిస్తున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం సరఫరా చేస్తోంది. బజారులో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.30కి పైనే పలుకుతోంది. అక్రమాలను అడ్డుకునే వ్యవస్థ లేకపోవడంతో రేషన్‌బియ్యం పథకం కొందరు అవినీతిపరులకు వరంగా మారింది. బియ్యం అక్రమ రవాణాకు దళారులు తహతహలాడుతుండగా, అధికారులు మాత్రం చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఫలితంగా ఉత్తర తెలంగాణ లో ‘రేషన్ దందా’ జోరుగా సాగుతుం డగా, నామమాత్రం గా రోజుకో కేసు నమోదు అవుతోంది. కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి నిజామాబాద్‌కు రెండు డీసీఎం వ్యాన్ల లో తరలిస్తున్న 204 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జిల్లాకు చెందిన టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ‘దొరికితే దొంగలు లేదంటే దొరలు’ అన్నట్టుగా సాగుతున్న ఈ దందాలో కొందరు రేషన్ డీలర్లు, మండల స్థాయి స్టాక్ పాయింట్ (ఎంఎల్ఎస్) నిర్వాహకులే భాగస్వాములు కావడంపై విమర్శలు వస్తున్నాయి. నిత్యకృత్యంగా మారిన దందా రేషన్ బియ్యం దందా నిత్యకృత్యంగా మారింది. చూడడానికి చిన్న విషయంగానే కనిపిస్తున్నా, అక్రమార్కులు దీనితో ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. బో గస్ రేషన్ కార్డులు డీల్లర్లు, మండల లెవెల్ స్టాక్ పాయింట్ అధికారులకు ‘కాసులు’ కురిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం బియ్యాన్ని నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్సపల్లి రామకష్ట ఆగ్రో ఇండస్ట్రీస్‌కి తరలించి రీ-సైక్లింగ్ చేస్తుండగా పౌరసరఫరాలశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యం విలువ సుమారుగా రూ. 28 లక్షలని వెల్లడించారు. అదే నెలలో గాంధారికి చెందిన డీలర్ 13.85 క్వింటాళ్ల బియ్యాన్ని ముందస్తుగా ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకుడికి అప్పగించగా, డీఎస్ఓ కొండల్రావు తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. తాజాగా కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి ఎపీ15-టీబీ 8966 , ఏపీ 15-టీఏ 9128 నంబర్లు గల రెండు డీసీఎం వ్యాన్లలో తరలిస్తున్న 204 క్వింటాళ్ల బియ్యాన్ని రెవెన్యూ టాస్క్‌ఫోర్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఆ బియ్యాన్ని త్రివేణి రైసుమిల్లుకు తరలించిన అధికారులు నిజామాబాద్ నాల్గవ టౌన్లో కేసు నమో దు చేసి, వాహనాలను అక్కడికి తరలించారు. దయామా కార్పొరేషన్ పేరిట సరఫరా అవుతున్న ఈ బియ్యం మొత్తం కూడ పీడీఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ)కు చెందినవి కావడమే విశేషం.అక్కడక్కడా కొందరు నిజాయితీ గల అధికారుల దాడులతో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. దందా సాగుతుందిలా రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న వైనంలో అందరికీ వాటాలేనన్న ప్రచా రం ఉంది. పౌరసరఫరాల శాఖలోని ‘నిఘా’ అధికారులు కొందరికీ ఇది ‘మామూలే’నన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. నిత్యావసర సరుకులు నల్ల బజారుకు తరలుతున్నాయని బహిరంగంగా చర్చ జరుగుతున్నా, సదరు అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుండగా కిలో బియ్యం రెండు రూపాయలున్న తరుణం లో నాలుగో వంతు నల్లబజారుకు తరలించిన వ్యాపారులకు ఇప్పుడు కిలో పై ఇంకో రూపాయి అదనంగా లభించనుంది. సాధారణంగా ప్రభుత్వం లబ్ధిదారుడికి రూపాయికి కిలో బియ్యం ఇస్తుండగా,వారి నుంచి స్థానికంగా ఉండే వ్యాపారులు తొమ్మిది రూపాయలకు కిలో చొప్పున ఖరీదు చేస్తున్నా రు. వారు టోకు వ్యాపారికి పది రూపాయలకు విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి సిండి కేట్కు రూ.13కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇక్కడే మిల్లర్లు, దళారులు ప్రవేశించి రీమిల్లింగ్, రీ సైక్లింగ్‌లాంటి ప్రక్రియ ద్వారా ఎఫ్‌సీఐకి పంపిస్తున్నారు. భూమి గుండ్రంగా ఉందన్న రీతిలో సాగుతున్న ఈ అక్రమ దందా ద్వారా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో, వివిధ మార్గాల ద్వారా మళ్లీ అక్కడికే వెళ్తున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. 190 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత ప్రగతినగర్ : కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి మహారాష్ట్ర వైపునకు రెండు డీసీఎం వ్యాన్లలో రవాణా అవుతున్న 190 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం ఉదయం నగరంలోని కంఠేశ్వర్‌లో పట్టుకొన్నారు. పక్కా సమాచారం రావడంతో డీఎస్ఓ కొండల్రావు దాడులకు ఆదేశించారు. దీంతో డీటీలు బాల్‌రాజ్, సుభాష్, సురేష్, పుడ్ ఇన్స్పెక్టర్ విజయ్‌కాంత్‌రావు బైపాస్ రహదారిపై మాటువేసి వ్యాన్లను పట్టున్నారు. వాహనాలను ఠాణాకు తరలించి, నిందితులపై కేసు నమోదు చేశారు. బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరులుతున్నాయనేది తెలియాల్సి ఉంది. -
బియ్యం, పంచదార పక్కదారి
-
రాబందులు చిక్కేనా?
కలెక్టరేట్ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుం బాల కోసం ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తోంది. ఇటు పౌరసరఫరాల శాఖ అధికారులతోపాటు అటు ఎఫ్‌సీఐ అధికారులు కుమ్మక్కవడం వల్ల ఈ పథకం పేదోడికన్నా పెద్దోళ్లకే ప్రయోజనం చేకూరుస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అర్సపల్లిలో పీ డీఎస్ బియ్యం పట్టుబడడంతో ఈ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈనెల 14వ తేదీన నగరంలోని అర్సపల్లి ప్రాంతం లో గల ఓ రైస్‌మిల్లుపై పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలి సిందే. లారీలో ఉన్న 202 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం కనిపించడంతో మిల్లును సీజ్ చేశా రు. ఆ మిల్లులో 1,381 క్వింటాళ్ల ధాన్యం, 273 క్వింటాళ్ల బియ్యం, 4 క్వింటాళ్ల నూకలు ఉన్నాయి. వీటి విలువ రూ. 29.35 లక్షలని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఇన్చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వరరావుకు నివేదిక సమర్పించారు. ఇదీ వరుస? పీడీఎస్ బియ్యం ఎఫ్‌సీఐ గోదాం నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అవుతోంది. తిరిగి ఆ దుకాణాలనుంచి రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసి జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, సంచులు మార్చి ఎఫ్‌సీఐకి లెవీ రూపంలో తరలిస్తున్నారు. ఇలా నెలనెలా టన్నుల కొద్దీ బియ్యం ఎఫ్‌సీఐనుంచి రేషన్ దుకాణాలు, రైస్ మిల్లుల మీదుగా ప్రయాణించి ఎఫ్‌సీఐని చేరుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని భారత్ ఇండస్ట్రీస్, రామకృష్ణ అగ్రో ఇండస్ట్రీస్, మురళీ కృష్ణ ఇండస్ట్రీస్, సముద్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌లు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే అధికారులు మాత్రం ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. పక్క రాష్ట్రాలకూ రూపాయి కిలో బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేసి, నగరంలోని మారుమూల ప్రాంతం లో ఉన్న రైస్‌మిల్లులలో రీసైక్లింగ్ చేసి ఎఫ్‌సీఐతోపాటు పక్కనున్న మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందేడ్, జాల్నా, కర్ణాటకలోని బీదర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడం వల్ల అక్రమా ర్కులు తమ దందాకు జిల్లాను అడ్డాగా మార్చుకున్నారని తెలుస్తోంది. వీరు జిల్లాలోని రేషన్ షాప్లనుంచే కాకుండా ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలనుంచీ రేషన్ బి య్యాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ దందాలో రైస్‌మిల్లర్లతోపాటు జిల్లా పౌరసరఫరాల శాఖ, ఎల్ఎంఎస్ పాయింట్లు, ఎఫ్‌సీఐ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలున్నాయి. చర్యలు కరువు నగరంలో ఇంత పెద్ద ఎత్తున రూపాయి బియ్యం పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది. ఒకే రైసుమిల్లులో సుమారు రూ. 30 లక్షల వరకు అక్రమ సరుకును గుర్తించినా తీసుకున్న చర్యలు శూన్యమే. వారం క్రితం అర్సపల్లిలోని ఓ రైస్‌మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నా.. ఇప్పటికీ సరైన వివరాలు సేకరించలేకపోయారు. కనీసం రికార్డులు సైతం తనిఖీ చేయలేదని తెలుస్తోంది. బియ్యం లెక్కలు వేయడం తప్ప అధికారులు ఈ కేసులో పురోగతి సాధించలేకపోయారు. నిందితుడిని తప్పించారా? కలెక్టర్ ప్రద్యుమ్న బదిలీ కాగానే అక్రమార్కులను కాపాడే యత్నాలు మొదలయ్యాయి. తన మిల్లుపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయం తెలుసుకొని రామకృష్ణ అగ్రో ఇండస్ట్రీస్ యజమాని మహమూద్ పారిపోయిన విషయం తెలిసిందే. గురువారం ఆయన మిల్లుకు వచ్చారని, విచారణ జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. కాగా అసలు నిందితుడు మహమూద్‌ను ఈ కేసు నుంచి తప్పించి, ఆయన స్థానంలో మరొకరిని చూపేందుకు అధికారులు యత్నిస్తున్నారని తెలుస్తోంది