నిజామాబాద్‌లో పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వ్యానును పట్టుకున్న అధికారులు (ఫైల్)
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): సివిల్ సప్లయి శాఖలో ఎన్ని సంస్కరణలు తెచ్చినా జిల్లాలో పీడీఎస్ దందా యథేచ్ఛగా సాగుతోంది. వాహనాల్లో తరలిస్తున్న, ఇంట్లో దాచి ఉంచిన బియ్యం బస్తాలను అధికారులు పట్టుకుంటున్నా.. ఈ అక్రమ వ్యాపారం మాత్రం పెరుగుతూనే వస్తోంది. ఇందుకు ఈ ఏడాదిలో పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం, నమోదైన కేసులే నిదర్శనం. గడిచిన రెండేళ్లలో 100 కేసులు నమోదైతే ,ఈ ఏడాదిలోనే 96 పైగా కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన 4,869.38 క్వింటాళ్ల బియ్యం పట్టుకోవడం గమనార్హం. కేసుల పరంగా, పట్టుబడిన బియ్యం పరంగా చూసినా రెండేళ్లలో కంటే ఎక్కువగానే ఉన్నాయి. గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ–పాస్, బయోమెట్రిక్ విధానం రాకముందు తక్కువ కేసులు నమోదు కాగా, అమల్లోకి వచ్చిన తరువాత కేసులు ఎక్కువైయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ బియ్యం అక్రమ దందాను అరికట్టడానికి రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానాన్ని 2017 నవంబర్‌లో అమలులోకి తెచ్చింది. దీంతో రేషన్ డీలర్ల చేతి వాటానికి దాదాపు అడ్డుకట్ట పడింది. అయితే కొన్ని చోట్ల రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ మెషిన్‌లు పని చేయడం లేదని, లబ్ధిదారుల బయోమెట్రిక్ వేలిముద్రలు రావడం లేదని సాకు చూపి అందిన కాడికి బియ్యాన్ని దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. లబ్ధిదారులు కూడా పీడీఎస్ బియ్యం పొంది వ్యాపారులకు రూ.10 నుంచి రూ.14 వరకు విక్రయిస్తున్నారు.
దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులు ఎక్కువైయ్యారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన బియ్యంను రెండవ వ్యాపారికి, రెండవ వ్యాపారి నుంచి ప్రధాన వ్యాపారికి విక్రయిస్తున్నారు. ప్రధాన వ్యాపారి తన వద్దకు చేరిన పెద్ద మొత్తం పీడీఎస్ బియ్యంను ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నారు. ఇలా క్షేత్ర స్థాయి నుంచి పెద్ద వ్యాపారమే కొనసాగుతోంది. ఈ వ్యాపారంపై పూర్తిస్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అవగాహన ఉన్నప్పటికీ కొన్ని కేసులపైనే దృష్టిసారించి పట్టుకుంటున్నారని, వారికి అనుకూలంగా ఉన్న వారి జోలికి పోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
నామమాత్రపు చర్యలు.. పైగా మంతనాలు
జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా పెరుగుతుందడానికి చాలా కారణాలున్నాయి. 2016 సంవత్సరంలో పట్టుబడిన 58 కేసుల్లో 3171.09 క్వింటాళ్ల బియ్యం పట్టుకోగా, 2017లో 42 కేసులకు గాను 2002.76 క్వింటాళ్లు, అదే విధంగా 2018లో ఇప్పటి వరకు 96 కేసులకు గాను 4869.38 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఈ మూడేళ్లలో 196 కేసులకు గాను 10,004 క్వింటాళ్ల బియ్యంను పట్టుకుని 258 మందిపై (6ఏ) కేసు నమోదు చేయగా, రూ.7,55,000 జరిమానా విధించారు. అయితే పీడీఎస్ బియ్యం పట్టుబడిన వారికి తక్కువ శిక్ష, జరిమాన పడే విధంగా కేసును పట్టుకున్న వారే మంతనాలు జరుపుతున్నారే ఆరోపణలున్నాయి. అందుకే ఇది వరకే రెండు, మూడ్లు సార్లు పట్టుడిన కొంతమంది సులువుగా కేసు నుంచి తప్పించుకోవడం సాధ్యమైందని తెలుస్తోంది. పీడీఎస్ బియ్యం ప్రకారంగా అక్రమ వ్యాపారం చేసే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, జైలు శిక్షతో పాటు, భారీ మొత్తంలో జరిమానా విధించాల్సి ఉంటుంది. కానీ చిన్నపాటి చర్యలు, తక్కువ జరిమానాలు విధించడంతో పట్టుబడిన వారే మళ్లీ పీడీఎస్ బియ్యంతో వ్యాపారం చేస్తున్నారు.
మచ్చుకు కొన్ని ఘటనలు..
గతేడాది మాక్లూర్‌లో పెద్ద ఎత్తున పట్టుడిన పీడీఎస్ బియ్యం కేసులో కేవలం రూ.50వేలు జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేశారు. అదే విధంగా గత ఏడాదితో పాటు ఈ ఏడాదిలో కూడా నిజామాబాద్ నగరంలో పీడీఎస్ బియ్యంతో పట్టుబడిన రెండు వాహనాలను సీజ్ చేసిన అధికారులు ఒకరికి రూ.45వేలు, మరొకరికి రూ.40వేలు జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment