షిప్‌లో ఎన్నో సరుకులతో కూడిన కంటైనర్లు ఉంటాయి
అందులో అక్రమ రవాణా గుర్తిస్తే ఆ కంటైనర్‌ని మాత్రమే సీజ్ చేస్తాం
పీడీఎస్ బియ్యమా? కాదా? అనేది టెస్టుకు పంపిస్తే 15 రోజుల తర్వాత తెలుస్తుంది
అక్రమ రవాణాదారులపైనే చర్యలుంటాయి.. నౌకపై చర్యలు తీసుకోలేం
కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీధర్
వివిధ వర్గాలతో అవగాహన సదస్సులు
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణా చేసే కార్గో షిప్‌లో అక్రమంగా తరలించిన పీడీఎస్ బియ్యం ఉంటే.. షిప్ మొత్తం సీజ్ చెయ్యలేమనీ, బియ్యం ఉన్న కంటైనర్‌ని మాత్రమే సీజ్ చెయ్యగలమని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు.
అదేవిధంగా.. పీడీఎస్ బియ్యం రవాణా చేసిన వారిపైనే చర్యలు తీసుకోగలం తప్ప.. షిప్‌పై చర్యలు తీసుకోలేమని చెప్పారు. విశాఖలోని కస్టమ్స్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ పోర్టులో ఇటీవల పీడీఎస్ బియ్యం ఎగుమతి అవుతోందని, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తోందంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
సివిల్ సప్లైస్ ఎన్‌వోసీ తప్పనిసరి
పోర్టులోకి వచ్చిన ఏ సరుకైనా నేరుగా షిప్‌లోకి లోడ్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రతి సరుకుకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే షిప్‌లోకి ఎక్కించేందుకు కస్టమ్స్ అనుమతిస్తుందని స్పష్టం చేశారు. బియ్యం విషయంలోనూ పక్కాగా పరిశీలన ఉంటుందన్నారు. కస్టమ్స్ విభాగం ఎలాంటి అనధికార బియ్యం ఎగుమతి, దిగుమతుల్ని ప్రోత్సహించదని స్పష్టం చేశారు.
ఎన్ని చెక్‌పోస్టులు దాటి వచ్చినా, అన్ని డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాతే కస్టమ్స్ నుంచి లోడింగ్‌కు అనుమతి ఉంటుందని తెలిపారు. ఏ బియ్యమైనా సరే.. పీడీఎస్ బియ్యం కాదు అని పౌర సరఫరాల శాఖ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) చెకింగ్ డాక్యుమెంట్స్‌లో తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే లోడింగ్‌కు అనుమతిస్తామని తెలిపారు.
బియ్యం డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే వాటిని నిలిపేస్తామని చెప్పారు. ఒకవేళ అనుమానం వచ్చి అవి పీడీఎస్ బియ్యమా కాదా అనేది తెలుసుకోవాలంటే పరీక్షకు పంపాలని, దాని ఫలితాలు 15 రోజులకు వస్తాయని తెలిపారు. అప్పుడే దానిపై చర్యలు తీసుకోగలమని అన్నారు.
స్టేక్ హోల్డర్లతో అవగాహన సదస్సు
ఇటీవల కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతి జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో విశాఖపట్నం జోన్ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో కస్టమ్స్ కార్యాలయంలో శుక్రవారం ఏపీలోని వివిధ పోర్టుల స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఎంకరేజ్ పోర్ట్, స్టివడోర్స్ అసోసియేషన్, పౌర సరఫరాల శాఖ అధికారులు హాజరయ్యారు. పోర్టుల ద్వారా ఎలాంటి అక్రమ ఎగుమతి, దిగుమతులకు తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని, ఇకపై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని సంజయ్‌రెడ్డి తెలిపారు.
ఈ విషయంలో స్టేక్‌హోల్డర్స్ సహకారాన్ని అందించాలని కోరారు. అక్రమ ఎగుమతులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కస్టమ్స్ శాఖ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. బియ్యం ఎగుమతి విధి విధానాలు, నిబంధనలను ఎన్.శ్రీధర్ వివరించారు. బియ్యం ఎగుమతుల పత్రాలను పరిశీలనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నౌక మొత్తం సీజ్ చెయ్యడం కుదరదు
షిప్‌లో పొరపాటున పీడీఎస్ బియ్యం ఉన్నా.. నౌకని మొత్తం సీజ్ చెయ్యలేమని తెలిపారు. ఒక రవాణా నౌకలో ఎన్నో కంటైనర్లు ఉంటాయని, వాటిలో ఇతర కంపెనీలు, వ్యాపారులకు సంబంధించిన విభిన్న రకాల ఉత్పత్తులు కూడా ఉంటాయని తెలిపారు.
అందువల్ల ఏవైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే.. సంబంధిత కంటైనర్‌ని మాత్రమే సీజ్ చెయ్యగలమని, షిప్ మొత్తాన్ని కాదని స్పష్టంచేశారు. చర్యలు కూడా అక్రమ రవాణాదారులపైనే ఉంటాయని, షిప్‌పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment