పవన్ చేసిన హడావుడితో కాకినాడలో నిలిచిపోయిన స్టెల్లా నౌక
సమయానికి వెళ్లనందున నౌక యాజమాన్యానికి డెమరేజి చార్జీలు చెల్లించాలి
ఈ భారం ఎగుమతిదారులదే
డెమరేజ్ భారం రూ.7.11 కోట్లకు పైమాటే
పీడీఎస్ బియ్యం సత్యం బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌దే
ఆ సంస్థే కట్టాలంటున్న మిగతా ఎగుమతిదారులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అంటూ కాకినాడ పోర్టులో నిలిపివేసిన స్టెల్లా ఎల్ పనామా నౌక ‘డెమరేజ్’ చార్జీలు ఎగుమతిదారులకు గుదిబండగా మారాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్దేశించిన తేదీలోపు ఓడలో సరుకు లోడింగ్ పూర్తి చేసి ఎగుమతికి క్లియరెన్స్ ఇవ్వాలి.
అలాకాకుంటే నౌక పోర్టులో ఎన్ని రోజులు నిలిచిపోతే అన్ని రోజులకు షిప్ యాజమాన్యం డెమరేజ్ చార్జీలు వసూలు చేస్తుంది. నవంబర్ 28న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నౌకలో పీడీఎస్ బియ్యం తనిఖీకి వచ్చి సినిమాటిక్‌గా ‘సీజ్ ద షిప్’ అంటూ అధికారులను ఆదేశించారు.
అయితే, ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం షిప్‌ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. షిప్‌ను సీజ్ చేయడానికి అవకాశం లేదని, బియ్యం ఉన్న కంటైనర్‌ను మాత్రమే సీజ్ చేయగలమని విశాఖ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఇటీవల స్పష్టంగా చెప్పారు.
సాగని అన్‌లోడ్ ప్రక్రియ
స్టెల్లా నౌకలో అధికారులు గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అన్‌లోడ్ (కిందకు దింపే) ప్రక్రియ సాగడంలేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రతిబంధకమైందని చెబుతున్నారు. దీంతో నౌక పోర్టులోనే నిలిచిపోయింది. ఇలా నిలిచిపోయిన ప్రతి రోజుకు డెమరేజ్ చార్జీలను షిప్ యాజమాన్యానికి చెల్లించాలి. ఈ నౌక సామర్థ్యం 52 వేల మెట్రిక్ టన్నులు.
నౌకలో 28 ఎగుమతి కంపెనీలకు చెందిన 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది. ఇదంతా నవంబర్ 28కి ముందే లోడింగ్ జరిగింది. మరో 14 వేల మెట్రిక్ టన్నులు లోడింగ్ చేయాల్సిన తరుణంలో నిలిపివేశారు. పవన్ హంగామా చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు నౌక పోర్టులో నిలిచిపోయి 38 రోజులు దాటింది. ముందుగా నిర్దేశించిన నౌక క్లియరెన్స్ తేదీ దాటిన ప్రతి రోజుకు యాజమాన్యం డెమరేజ్ వసూలు చేస్తుంది. దీనిని డెమరేజ్ ఎవరు చెల్లించాలనే దానిపైనా పోర్టులో ఎగుమతిదారుల మధ్య పంచాయితీ నడుస్తోంది.
డెమరేజ్ రోజుకు ఎంత చెల్లించాలనే దానిపైనా స్పష్టత లేదు. ముందస్తు ఒప్పందం ప్రకారం నవంబర్ 29 నుంచి డెమరేజ్ లెక్కవేయాలి. కానీ అప్పటికే తుపాను కారణంగా పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ కావడం, డిసెంబర్ 4 వరకు వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణాలు చూపుతూ అప్పటివరకు డెమరేజ్ వేయడానికి వీల్లేదని ఎగుమతిదారులు గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో డిసెంబర్ 5 నుంచి డెమరేజ్ వేయడానికి స్టెల్లా యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం.
నౌకకు రోజుకు అయ్యే అన్ని ఖర్చులు కలిపి 22,000 యూఎస్ డాలర్లు.. అంటే రూ.18.73 లక్షలు చెల్లించాలని లెక్కకట్టారు. ఒక్కసారి డెమరేజ్ తేదీని నిర్థారిస్తే తుపానులు, వాయుగుండాలు వచ్చినా చెల్లించాల్సిందే. ఈ లెక్కన డిసెంబర్ 5 నుంచి ఇంతవరకు డెమరేజ్ రూపంలో రూ.7.11 కోట్లు చెల్లించాలి. నౌక నిలిచిపోవడానికి కారణమైన పీడీఎస్ బియ్యం మొత్తం బాలాజీ ఎక్స్‌పోర్టర్స్ కంపెనీదే కావడం వల్ల ఆ సంస్తే డెమరేజ్ మొత్తం చెల్లించాలని మిగతా వారి వాదన.
కాకినాడ పోర్టులో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని ఎగుమతిదారులు కోరినా షిప్పర్ అంగీకరించలేదు. పవన్ చేసిన హడావుడి వల్ల తాము నష్టపోతున్నామని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment