అక్రమ రవాణా కూటమి కనుసన్నల్లోనే..
విశాఖ పోర్టు నుంచి యథేచ్ఛగా పీడీఎస్ బియ్యం తరలింపు
ఈనెల 12 అర్థరాత్రి వ్యాన్‌హై షిప్‌లో చైనాకి వెళ్లిపోయిన 60 కంటైనర్ల లోడ్
110 కంటైనర్లతో లోడింగ్‌కు సిద్ధంగా మరో రూ.5 కోట్ల్ల విలువైన బియ్యం
కంటైనర్ టెర్మినల్ ఫ్రైట్ స్టేషన్ దగ్గరే ప్రభుత్వ బృందం తనిఖీలు
పీడీఎస్ బియ్యం వస్తుంటే సీజ్ చెయ్యకుండా వ్యూహాత్మకంగా పక్క స్టేషన్‌కు మళ్లింపు
టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి స్టేషన్ నుంచే ఎగుమతులు
అయినా పట్టించుకోకుండా సహకరిస్తున్న ప్రభుత్వ నిఘా బృందాలు
‘కాకినాడ’ వైపు అందరి దృష్టి మళ్లించి వైజాగ్ నుంచి స్వకార్యం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం పేరు గొప్ప తీరు దిబ్బలా ఉంది. సీఎం చంద్రబాబు మొదలు ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వరకు అందరివీ తాటాకు చప్పుళ్లేనని తేలిపోతోంది. ఎందుకంటే.. ‘ముఖ్య’ నేత సామాజికవర్గానికి చెందిన ఓ వ్యాపారి తన అధికార బలంతో కంటైనర్ల కొద్దీ రేషన్ బియ్యాన్ని దేశాలు దాటించేస్తున్నారు.
విశాఖ పోర్టు వేదికగా సాగుతున్న ఈ దందాకు ప్రభుత్వ పెద్దలు రక్షణ కవచంలా ఉంటూ అక్రమ రవాణాకు పచ్చజెండా ఊపుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో ఆరితేరిన కూటమి సర్కారు ఈ విషయంలోనూ అందరి దృష్టి కాకినాడ వైపు మళ్లించి విశాఖ నుంచి తమ అస్మదీయుల పని సులభం చేస్తోంది.
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) అనుబంధంగా.. విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీటీపీఎల్) నడుస్తోంది. ఇక్కడి నుంచే వివిధ దేశాలకు ఎగుమతి దిగుమతులు జరుగుతుంటాయి. కంటైనర్ కార్గోకు సంబంధించి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు (సీఎఫ్‌ఎస్) ఉన్నాయి. వీసీటీపీఎల్ ఆధ్వర్యంలో ఒక సీఎఫ్‌ఎస్ నడుస్తోంది. దీనిపక్కనే మరో మూడు సీఎఫ్‌ఎస్‌లు పనిచేస్తున్నాయి.
వివిధ దేశాలకు పంపించాల్సిన కార్గోని కస్టమ్స్ హౌస్ బ్రోకర్ సంస్థలు అన్ని అనుమతుల్ని తీసుకుని కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత.. సీఎఫ్‌ఎస్‌కు తీసుకొస్తాయి. సీఎఫ్‌ఎస్ వాటిని గోదాముల్లో నిల్వ ఉంచి.. కంటైనర్లలో లోడ్‌చేసి ఆయా దేశాలకు చెందిన కార్గో షిప్‌లలో కంటైనర్ టెర్మినల్ ఆధ్వర్యంలో లోడ్ చేస్తారు. ఈ నేపథ్యంలో.. ఈనెల 9న మంత్రి నాదెండ్ల సీఎఫ్‌ఎస్‌లను అకస్మాత్తుగా తనిఖీ చేశారు.
తొలుత వీసీటీపీఎల్‌కు సంబంధించిన కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్‌ఎస్)ని, ఆ పక్కనే ఉన్న గేట్‌వే సీఎఫ్‌ఎస్‌ని హడావిడిగా తనిఖీచేసి.. అక్కడున్న బియ్యం పీడీఎస్ అని నిర్థారించి వాటిని సీజ్ చెయ్యాలని ఆదేశించారు. ఇకపై పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతి కాకుండా డిప్యూటీ తహశీల్దార్, డీఎస్‌ఓ, మరో ఇద్దరు అధికారులతో కూడిన నిఘా బృందాన్ని ఏర్పాటుచేశారు.
పీడీఎస్ అని తెలిసినా సీజ్ చెయ్యకుండా..
ఇక ఇక్కడికొస్తున్న ప్రతి కార్గోని ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించి.. ఎగుమతికి అనుమతిస్తోంది. అయితే.. ఆయా కార్గోల్లో పీడీఎస్ బియ్యం ఉంటే వాటిని కచ్చితంగా సీజ్‌చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.
కానీ, సదరు టీంలో ఉన్న కొందరు అధికారులు సదరు కార్గో బ్రోకర్ సంస్థలతో కుమ్మక్నై బియ్యాన్ని సీజ్ చేయకుండా పక్కనే ఉన్న ఇతర ఫ్రైట్ స్టేషన్లకు పంపించేస్తున్నారు. అక్కడ ఎలాంటి నిఘా లేకపోవడంతో అక్కడ నుంచి రేషన్ బియ్యం సునాయాసంగా విదేశాలకు తరలిపోతోంది.
ఆ వ్యాపారి సీఎఫ్‌ఎస్ ద్వారానే ఎగుమతి..
నిజానికి.. ముఖ్య నేత సామాజికవర్గానికి చెందిన ఆ వ్యాపారి ఇక్కడ సీఎఫ్‌ఎస్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచే అడ్డగోలుగా బియ్యం వ్యాపారం జరుగుతోంది.
సీజ్ చెయ్యకుండా స్పెషల్ టీం పంపించేస్తున్న బియ్యం మొత్తం సదరు వ్యాపారికి చెందిన సీఎఫ్‌ఎస్‌కు వెళుతూ ఎల్లలు దాటిపోతోంది. మంత్రి దాడులు నిర్వహించిన తర్వాత.. దాదాపు రూ.2 కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని ఈ స్పెషల్ టీం సీజ్ చెయ్యకుండా సదరు వ్యాపారికి చెందిన సీఎఫ్‌ఎస్‌కు పంపించింది.
అక్కడ మొత్తం 60 కంటైనర్లలో వ్యాన్‌హై–367 షిప్‌లో ఈనెల 12వ తేదీ అర్థరాత్రి చైనాకు బయల్దేరింది. అలాగే, మంత్రి తనిఖీల సమయంలో సీజ్‌చేసిన బిబో ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన బియ్యాన్ని కూడా పారసోరై లాజిస్టిక్స్ పేరుతో చైనాకు ఎగుమతి చేసేశారు.
మరో 110 కంటైనర్లలో లోడింగ్‌కు సిద్ధంగా..
ఇక టీడీపీ సానుభూతిపరుడిగా.. షిప్పింగ్ వ్యవస్థని శాసించే స్థాయిలో ఉన్న ఆ వ్యాపారి ఇప్పటికే 60 కంటైనర్లలో బియ్యం తరలించగా ఇప్పుడు మళ్లీ మరో 10,600కి పైగా టన్నుల రేషన్ బియ్యాన్ని పంపించేందుకు 20 కంటైనర్లను సిద్ధంచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు.. ఈ వారంలో మరో 90 కంటైనర్లలో రేషన్ బియ్యం ఎగుమతికి షెడ్యూల్ కూడా సిద్ధంచేసినట్లు సమాచారం.
మంత్రి ఆ వేర్‌హౌస్‌కు ఎందుకెళ్లలేదు?
మంత్రి నాదెండ్ల ఇటీవల వీసీటీపీఎల్ సీఎఫ్‌ఎస్‌తో పాటు పక్కనే ఉన్న గేట్‌వే సీఎఫ్‌ఎస్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. కానీ.. అక్కడున్న మరో రెండు వేర్‌హౌస్‌ల వైపు మంత్రిగానీ, అధికారులుగానీ కన్నెత్తి చూడలేదు. వాస్తవానికి.. అక్కడే రూ.కోట్లు విలువచేసే వేల టన్నుల రేషన్ బియ్యం నిల్వలున్నాయి. ఈ విషయం తెలిసే మంత్రి, అధికారులు అక్కడికి వెళ్లలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పైగా.. ప్రభుత్వానికి నిజంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే.. అన్ని సీఎఫ్‌ఎస్‌లనూ తనిఖీ చేసేందుకు టీంలు ఏర్పాటుచేయాలి. కానీ, ఒక్కచోట మాత్రమే ఏర్పాటుచేసి మిగిలిన చోట్ల నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం పరోక్షంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విమర్శలొస్తున్నాయి.
ఇక మంత్రి సీజ్‌చేసిన బియ్యాన్ని తీసుకొచ్చిన బిబో సంస్థ నవంబరులోనే వేల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కార్గోకి కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దాడులు జరగడంతో.. వాటిని ఎక్స్‌పోర్ట్ చెయ్యకుండా ఆపేశారు. ఇప్పుడు టీడీపీ సామాజికవర్గానికి చెందిన వ్యాపారి సీఎఫ్‌ఎస్ నుంచి పాత బిల్లులతో ఉన్న కార్గోని కస్టమ్స్ కళ్లుగప్పి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
48 గంటలు గడిచాయి.. ఏం చర్యలు తీసుకున్నారు.?
ఈనెల 9న మంత్రి మొత్తం 483 టన్నుల వరకూ బియ్యాన్ని సీజ్ చెయ్యాలని ఆదేశించారు. అనంతరం బియ్యానికి సంబం«ధించిన అన్ని డాక్యుమెంట్లు, ఇతర బిల్లుల్ని 48 గంటల్లో పంపించాలని గడువు ఇచ్చారు. కానీ, ఇప్పటికి ఐదురోజులు గడిచినా ఎవరూ ఆ ఊసెత్తడంలేదు. త్వరలోనే ఈ బియ్యానికి కూడా క్లియరెన్స్ ఇచ్చేసి.. సదరు వ్యాపారి సీఎఫ్‌ఎస్ ఆధ్వర్యంలో చైనాకు పంపించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment