Nizamabad Crime News
-
గంజాయి సేవించనందుకు విద్యార్థిపై దాడి
నిజామాబాద్: గంజాయి సేవించాలని ఒత్తిడి చేయగా.. అంగీకరించకపోవడంతో ఓ విద్యార్థిపై మరో ఐదుగురు విద్యార్థులు దాడి చేసిన ఘటన మాక్లూర్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తల్లి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఐదుగురు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన విరామంలో స్కూల్‌కు కొద్దిదూరం వెళ్లి గంజాయి సేవిస్తున్నారు. గత శనివారం వారి తరగతిలోని మరో విద్యార్థిని సైతం గంజాయి సేవించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ, సదరు విద్యార్థి అంగీకరించకపోవడంతో అతనిపై దాడి చేశారు. ఆ విద్యార్థి తనపై తోటి విద్యార్థులు దాడి చేసినట్లు తల్లికి చెప్పాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులతో బాధిత విద్యార్థి తల్లి మాట్లాడగా గొడవ సద్దుమణిగింది. సోమవారం తిరిగి బాధిత విద్యార్థి పాఠశాలకు వెళ్లగా తల్లిదండ్రులకు చెబు తావా అంటూ ఐదుగురు విద్యార్థులు పాఠశాల సమీపంలోకి తీసుకెళ్లి చితకబాదారు. దీంతో సదరు విద్యార్థికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి బుధవారం మాక్లూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఎస్సై సుధీర్‌రావును సంప్రదించగా విచారణ చేపట్టి చర్య లు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే కేసు నమోదు చేస్తామన్నారు. -
మేనమామ వేధింపులే కారణం..!
నిజామాబాద్ : మేనమామ వేధింపుల కారణంగానే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అభిజ్ఞగౌడ్(23) ఆత్మహత్య చేసుకుంది. తనకు వరుసకు మేనమామ అయిన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం డొంకేశ్వర్‌కు చెందిన సందీప్‌గౌడ్ మానసికంగా వేధించడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృతురాలు సూసైడ్ నోట్లో పేర్కొంది. తాటిపాముల కిరణ్ కుమార్‌గౌడ్, స్వప్నల కుమార్తె అభిజ్ఞగౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తు తం ఆమె కామారెడ్డిలో స్థిరపడిన తల్లిదండ్రుల వద్ద ఉంటూ వర్క్‌ఫ్రం హోమ్‌గా విధులు నిర్వహించేది. అభిజ్ఞ కామారెడ్డి లోని ఇంట్లో గురువారం ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. మేనమామ మానసిక వేధింపులు ఎవ్వరికీ చెప్పుకోలేక పోయానని సూసైడ్ నోట్లో పేర్కొంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కామారెడ్డి నుంచి భిక్కనూరుకు శుక్రవారం తీసుకొచ్చారు. మధ్యాహ్నం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్యామిలీ సూసైడ్.. పాపం మానసిక క్షోభ ఏపాటిదో చావులోనే!
కుటుంబంతో సహా బలవన్మరణానికి ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంతో మానసిక క్షోభకు గురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌కు చెందిన సూర్యప్రకాష్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ గదిలో భార్య, ఇద్దరు పిల్లలకు కేక్‌లో విషం పెట్టి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మరణించారని నిర్ధారణ చేసుకున్న తర్వాతే.. మృతదేహాలను బెడ్‌పై పడుకోబెట్టాడు. పిల్లల ముక్కులో నుంచి రక్తం కారకుండా దూది పెట్టాడు. భార్య మృతదేహంపై దుప్పటి కప్పాడు. ఈ స్థితిలో సూర్యప్రకాష్ ఎంతటి మానసిక వేదనకు గురయ్యాడో అంటూ అక్కడి వారు కంటనీరు తెచ్చుకున్నారు. నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ గదిలో నలుగురు కుటుంబ సభ్యుల బలవన్మరణం స్థానికంగా కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పార్ట్నర్ల మధ్య గొడవతో తీవ్ర వేధింపులు, దాడులకు గురైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సూర్యప్రకాష్ (37), భార్య అక్షయ (36), కూతురు ప్రత్యూష (13) కొడుకు అద్వైత్ (10) లకు విషమిచ్చి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యప్రకాష్ కుటుంబం బతుకుదెరువు కోసం 40 ఏళ్ల క్రితం నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఐరన్హార్డ్వేర్ షాపు, పెట్రోల్ బంక్ నిర్వహించారు. ఆరేళ్ల క్రితం పెట్రోల్ బంక్‌ను అమ్మేసి హైదరాబాద్‌కు మకాం మార్చారు. హైదరాబాద్‌లో నలుగురు పార్ట్‌నర్స్‌తో కలిసి సూర్యప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో పార్ట్‌నర్స్‌తో విభేదాలు వచ్చి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి ప్రత్యర్థులు దాడులు చేశారు. దీంతో పదిహేడు రోజుల క్రితం సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులతో నిజామాబాద్ వచ్చి ప్రముఖ హోటల్ లో ఉంటున్నారు. హోటల్ సిబ్బంది శనివారం మధ్యాహ్నం తలుపులు తట్టగా స్పందించకపోవడంతో నిద్రపోయారని భావించారు. రాత్రి వేళ సిబ్బంది రూమ్‌కు వెళ్లగా గడియ వేసుకుని ఉండటంతో అటువైపు వెళ్లలేదు. ఆదివారం ఉదయం కూడా రూం క్లీనింగ్ కోసం డోర్ తట్టడంతో ఎంతకూ లోపలున్నవారు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిపించారు. గదిలో లోపల సూర్యప్రకాష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అయన భార్య, ఇద్దరు పిల్లలు బెడ్‌పై విగత జీవులుగా కనిపించారు. సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులకు ముందుగా కేక్‌లో విషం కలిపి తినిపించి, వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఉరివేసుకున్నట్లు గదిలో దొరికిన ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాల నుంచి రక్తం కారడంతో పిల్లల ముక్కుల్లో దూది పెట్టాడు. భార్య మృత దేహంపై దుప్పటి కప్పాడు. కుటుంబ సభ్యుల మృతదేహాలను సక్రమంగా బెడ్‌పైన పడుకోబెట్టిన సూర్యప్రకాష్ భార్య చున్నితో ఉరివేసుకున్నాడు. గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వా«దీ నం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో ఏముంది..? బాధిత కుటుంబం రాసిన మరణ వాంగ్మూలంలోని వివరాలు తెలియాల్సి ఉంది. రియల్ ఎస్టేట్ పార్ట్ట్‌నర్స్ బాధితుల ఇంటిపైకి వెళ్లి దాడి చేసినట్లు లేఖలో ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. అందులో కిరణ్ కుమార్, వెంకట్ అనే ఇద్దరు మోసం చేశారని, తన చావుకు వారే కారణమని రాసినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు కనాయం చక్రవర్తి, జెనం చక్రవర్తి పేర్లు కూడా çసూసైడ్ నోట్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన ఆర్థిక నష్టంతో పాటు, భాగస్వాములుగా ఉన్నవారు మోసం చేయడంతోనే సూర్యప్రకాష్ కుటుంబం బలవన్మరణం చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు క్లూస్ టీంతో ఆనవాళ్లు సేకరించారు. నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ వేధించారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సూర్యప్రకాష్ కు టుంబం ఆత్మహత్య చేసుకుంది. వారి వద్ద నుంచి సూసైడ్ నోట్ స్వా«దీనం చేసుకున్నాం. పార్ట్నర్స్ వే ధింపులకు పాల్పడడంతో ఆత్మహత్య చేసుకున్నా రు. కేసు నమోదు చేశాం. దీనిపై విచారణ చేస్తాం. – వెంకటేశ్వర్లు, నిజామాబాద్ ఏసీపీ -
ఎస్సై కల నెరవేరకుండానే..
నిజామాబాద్: ఎస్సై కొలువు సాధించాలని ఆ యువకుడు కన్న కలలను విధి కబలించింది. పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలి తీసుకుంది. నిజాంసాగర్ మండలం అచ్చంపేటకు చెందిన మార ఆంజనేయులు(30) ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష రాసి వస్తుండగా లారీ ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్ శివారులోని దుండిగల్ వద్ద చోటు చేసుకుంది. అచ్చంపేటకు చెందిన మార అంజవ్వ కుమారుడు ఆంజనేయులు ఎస్సై కావాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం దుండిగల్ లక్ష్మారెడ్డి కళాశాలలో ఎస్సై ప్రిలిమినరి పరీక్ష రాశాడు. అనంతరం షాపుర్‌లోని రూమ్‌కు బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొంది. లారీ టైర్లు ఆంజనేయులు మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి అంజవ్వతో పాటు భార్య సారిక, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఇటు పరీక్ష.. అటు సోదరుడి వివాహం ఆంజనేయులు చిన్నాన్న కుమారుడి చింటూ పెళ్లి ఆదివారం నిజామాబాద్‌లో జరిగింది. ఎస్సై పరీక్ష రాసిన తర్వాత వివాహానికి హాజరు కావాలని ఆంజనేయులు అనుకున్నాడు. అంతలోనే రూమ్‌కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
కూల్ డ్రింక్‌లో నిద్ర మాత్రలు కలిపి.. ఆమె పడుకోగానే..
సాక్షి,మాచారెడ్డి(నిజామాబాద్): ఓ వృద్ధురాలికి కూల్ డ్రింక్‌లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి చుక్కాపూర్లో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిలుక లక్ష్మి కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఆమె ఇంటి పక్కన ఉండే రాములు ఆమెకు నిద్రమాత్రలు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తాగించాడు. ఆమె నిద్రపోగానే మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించాడు. ఉదయం లేచిన లక్ష్మి మెడలో గొలుసు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి! -
దారుణం: ఏడేళ్ల బాలుడి కాళ్ళు, చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఆటోనగర్ కు చెందిన ఫయాజ్ అనే ఏడేళ్ల బాలుడిని కాళ్ళు, చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. దుండగులు దారుణహత్య చేశారు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని నిజాంసాగర్ కెనాల్లో పడేశారు. వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం నుంచి ఫయాజ్ కనించకుండా పోవడంతో సోషల్ మీడియాలో ఫయాజ్‌కు సంబంధించిన వార్త వైరలైంది. అయితే శనివారం నిజాంసాగర్ కెనాల్ లో ఫయాజ్ విగతజీవిగా ప్రత్యక్షమయ్యాడు.అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు నిర్జీవంగా కెనాల్లో చూసేసరికి బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమకు ఎవరితో పాత కక్షలు కూడా ఏమీ లేవని బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దారుణం వెనుక కారణమేమిటి.. అభం శుభం ఎరుగని బాలుడిని హత్య చేసిందెవరనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: ఇన్‌స్టాలో పరిచయం.. ప్రేమ.. చెల్లి పెళ్లిలో ఇంట్లో వాళ్లకు పరిచయం.. చివరికి! -
బైక్‌పై తీసుకెళ్తానని నమ్మించి.. పొదల్లోకి లాక్కెళ్లి..
బీబీపేట: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అత్యాచారం, హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజారాం తెలిపిన వివరాలు.. బాధిత మహిళ జనగామ గ్రామానికి చెందిన గణేశ్‌కు గతంలో అప్పు ఇచ్చింది. దానిని తిరిగి ఇవ్వమన్నందుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సదరు మహిళ సిద్దిపేట జిల్లా భూంపల్లి దగ్గర నుంచి బీబీపేటకు రావడానికి బస్టాండ్‌లో ఎదురుచూస్తుండగా గణేశ్ తన బైక్‌పై తీసుకు వెళ్తానని నమ్మించాడు. దారిలో బైక్ ఆపి పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను కొట్టి బంగారు నగలు తీసుకొని పారిపోయాడు. బాధితురాలు బంధువుల సాయంతో ఇంటికి చేరుకొని ఆస్పత్రికి వెళ్లింది. గురువారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బాబాయ్‌లను నమ్మించి.. చెరువులో తోసేసి.. ఆపై
బోధన్ టౌన్ (బోధన్): ఇరవై ఏళ్ల పగ ఇద్దరిని బలిగొంది. తన తండ్రిని హత్య చేశారనే అనుమానంతో ఓ యువకుడు ఇద్దరు చిన్నాన్నలను అంతమొందించాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు వివరాలను ఏసీపీ రామారావు, సీఐ రమణ్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. బోధన్‌లోని రాకాసిపేట్కు చెందిన కాంబత్తి శంకర్, నర్సింహులు (32), శివ (27) అన్నదమ్ములు. ముగ్గురూ భవన నిర్మాణరంగ మేస్త్రీలే. ఇరవై ఏళ్ల క్రితం శంకర్ మృతి చెందగా, అతని కుమారుడు చిన్న వెంకటి అలియాస్ వెంకట్ చిన్నాన్నలతోనే ఉంటున్నాడు. తన తండ్రి మృతికి చిన్నాన్నలే కారణమని వెంకట్ కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా చిన్నాన్నలు చులకనగా చూస్తున్నారని కుమిలిపోయేవాడు. 15 రోజుల క్రితం బైక్ విషయమై జరిగిన గొడవలో వెంకట్‌ను నర్సింహులు, శివ కొట్టగా వారిపై కక్ష పెంచుకున్నాడు. కల్లు, మద్యం తాగించి... వెంకట్ పథకం ప్రకారం సోమవారం చిన్నాన్నలిద్దరినీ కల్లు బట్టీకి తీసుకువెళ్లి కల్లు తాగించాడు. ఆపై మద్యం తాగుదామని చెప్పి వారిని బైక్‌పై బెల్లాల్ చెరువు అలుగు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ వారికి అతిగా మద్యం తాగించాడు. అనంతరం శివను చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలోనికి నెట్టేశాడు. తర్వాత నర్సింహులు వద్దకు వచ్చి శివ బాబాయ్ చెరువునీటిలో పడిపోయాడని, వెళ్లి కాపాడదామని చెప్పి అతడిని కూడా నీటి వద్దకు తీసుకెళ్లాడు. తనకు ఈత రాదని నర్సింహులు అంటుండగానే, వెనుక నుంచి చెరువునీటిలోకి తోసేసి ఇంటికెళ్లిపోయాడు. చిన్నాన్నలు ఎక్కడని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా తెలియదని బదులిచ్చాడు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకట్‌పై అనుమానంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. చదవండి: తిట్టారో... చచ్చారే... -
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లితో గొడవపడిన ఓ కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన చెవిబోయిన భాగ్యకు ఇద్దరు సంతానం.. కూతురు స్వప్న, కొడుకు ప్రసాద్(20). కాగా, ఆమె భర్త గతంలోనే చనిపోవడంతో జీవనోపాధి నిమిత్తం హైదరబాద్‌కు వెళ్లారు. అక్కడ ప్రసాద్ గత కొంతకాలంగా మద్యంతాగుతూ ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోతే తాను ఆత్మహాత్య చేసుకుంటానని తరుచూ తన తల్లిని బెదిరించేవాడు. ఈక్రమంలో 21న మద్యం కోసం తల్లితో గోడవపడి తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నాగిరెడ్డిపేటకు చేరుకున్నాడు. మరుసటిరోజు రాత్రి వరకు ప్రసాద్ తన ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై ఆంజనేయులు ఘటన స్థలానికి చేరుకొని తలుపులను పాక్షికంగా ధ్వంసంచేసి చూడగా ప్రసాద్ ఇంట్లో దులానికి ఉరేసుకొని ఉన్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
‘కామారెడ్డిలో కాలిన శవం మిస్టరీ’ వీడింది
సాక్షి, బోధన్‌రూరల్(బోధన్): మండలంలోని కొప్పర్గ గ్రామంలో ఈ నెల 11న లభించిన కాలిన శవం మిస్టరీని బోధన్ పోలీసులు ఛేదించారు. ఈమేరకు పట్టణంలోని బోధన్ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బోధన్ ఏసీపీ రామారావు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని బిలోలి తాలుక లాడ్క గ్రామానికి చెందిన అమృత్వార్ అశోక్‌ను, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మల్లపూర్ గ్రామానికి చెందిన బాగవ్వ కూతురు అంజమ్మకు ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. ఇల్లరికంగా వచ్చిన అశోక్‌కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్లు అందజేశారు. కానీ అశోక్ పెళ్లి తర్వాత వ్యాసనాలు, జల్సాలకు అలవాటు పడి భూమిని అమ్ముకుని భార్య, కూతురును ఇబ్బందులను గురిచేశాడు. దీంతో వారి కుటుంబ కలహాల గురించి పలుమార్లు పెద్దలు అశోక్‌ను మందలించారు. అయినా అశోక్ తన పద్దతి మార్చుకోలేదు. ఈక్రమంలో అంజమ్మకు అన్న వరుసైన మహారాష్ట్రలోని బిలోలి తాలుక కార్లా గ్రామానికి చెందిన తొకల్‌వార్ పోచయ్య అశోక్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన చెల్లెలు కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అశోక్‌ను హతమార్చాలని పోచయ్య పథకం వేశాడు. ఈక్రమంలో నిందితుడు పోచయ్య పథకం ప్రకారం అశోక్‌ను మద్యం తాగుదామని పిలిపించి బోధన్ మండలంలోని కొప్పర్గ శివారులోకి తీసుకువచ్చాడు. మద్యం తాగిచ్చి మద్యం మత్తులో ఉన్న అశోక్‌పై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్ కాల్స్ డాటా ఆధారంగా ఈ హత్య కేసును చేధించినట్లు ఏసీపీ రామారావు తెలిపారు. చాకచక్యం వ్యవహరించి కేసు చేధించిన బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్సై సందీప్, కానిస్టేబుల్స్‌లు అనంద్ గౌడ్, సురేష్, జీవన్, హోంగార్డు సర్దార్లను ఏసీపీ రామారావు అభినందించి నగదు పురస్కారాన్ని అందజేశారు. సమావేశంలో బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ సందిప్, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రియుడి వేధింపులు: వీడియో కాల్ చేసి ప్రియురాలి ఆత్మహత్య
సాక్షి, గాంధారి(నిజామాబాద్): మండల పరిధిలోని మాధవపల్లి గ్రామానికి చెందిన యువతి రాయల సౌందర్య(21) నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మాధవపల్లి గ్రామానికి చెందిన రాయల సౌందర్య బంధువైన లింగంపేట్ మండలం కొర్పోల్ గ్రామానికి చెందిర కర్రెల్లో స్వామి ఇరువురు గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన పెద్దలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. పెళ్లి నిశ్చయించిన కొన్ని రోజుల తర్వాత ప్రియుడు స్వామి అదనంగా రూ. 2 లక్షలతో పాటు బైక్ ఇప్పించాలని సౌందర్యను వేధించసాగాడు. పెద్దలు నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. అదనపు కట్నం తెస్తేనే పెళ్లి చేసుకుంటానని లేదంటే వేరే అమ్మాయిని చూసుకుంటానని స్వామి తేగిసి చెప్పాడు. ఈ క్రమంలో గత నెల 18న సౌందర్య ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ప్రియుడు స్వామితో వీడియో కాల్లో మాట్లాడింది. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి కోరింది. ప్రియుడు నిరాకరించడంతో వీడియో కాల్లో మాట్లాడుతూనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. గాంధారిలోనే ఉన్న స్వామి వెంటనే సౌందర్య ఇంటికి చేరుకొని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వెళ్లి పోయాడు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఈ నెల2న నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి రాయల సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సెల్ఫీ సూసైడ్: ప్రాణాలు తీసిన లక్కీ డ్రా మోసం
సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్): సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ నిండు ప్రాణం పోయింది. అప్పుల పాలైన ఓ వ్యక్తి.. పిల్లల కళ్లెదుటే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి ఉరేసుకున్నాడు. పిల్లలు వద్దు నాన్న అంటూ వేడుకుంటున్నా, వారిని అనాధలను చేసి వెళ్లి పోయాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే.. రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన మంగళపల్లి లక్ష్మణ్ (42), లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఉపాధి కోసం గతంలో కామారెడ్డికి వలస వెళ్లి, అక్కడే పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, భార్య లక్ష్మికి నాలుగు నెలల క్రితం సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీరు లక్కీ డ్రాలో కోటి గెలుచుకున్నారంటూ నమ్మబలికారు. ఈ నగదు మీరు అందుకోవాలంటే సర్వీస్ చార్జీలు చెల్లించాలని డబ్బు డిమాండ్ చేశారు. దీంతో దంపతులు విడతల వారీగా రూ.2.65 లక్షలు వారికి చెల్లించారు. ఎంతకీ డబ్బులు రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు అప్పట్లోనే పోలీసులను ఆశ్రయించారు. అయితే, అప్పులు పెరిగి పోవడం, మోసపోయామని లక్ష్మణ్ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న పోసానిపేటకు వెళ్లిన లక్ష్మణ్.. కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానంటూ చెప్పాడు. ‘వద్దు నాన్న.. ఇంటికి రా నాన్న’ అంటూ కూతురు వేడుకుంటున్నా అతడు చలించలేదు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఉరేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, జక్రాన్‌పల్లి(నిజామాబాద్): జక్రాన్‌పల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న భారతి శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు.. భారతిని సిరికొండకు డిప్యూటేషన్‌పై పంపారు. అక్కడ ఎంపీడీవోగా ఉన్న లక్ష్మణ్‌ను జక్రాన్‌పల్లి ఎంపీడీవోగా డిప్యూటేషన్ వేశారు. అయితే భారతి తండ్రి అనారోగ్య కారణాలతో ఆమె సెలవులో ఉన్నారు. ఈ సమయంలో డిప్యూటేషన్‌పై పంపడంతో ఆమె తీవ్ర మానసిక ఓత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. పరిపాలన సౌలభ్యం కోసమే.. జక్రాన్‌పల్లి ఎంపీడీవో భారతిని పరిపాలన సౌలభ్యం కోసమే సిరికొండకు, సిరికొండలో ఉన్న ఎంపీడీవోను జక్రాన్‌పల్లికి డిప్యూటేషన్ వేశామని జెడ్పీ సీఈవో గోవింద్ తెలిపారు. డిప్యూటేషన్ ఇచ్చే సమయంలో భారతి తండ్రి అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నారని తెలిపారు. భారతి ఆత్మహత్యాయత్నం చేశారని తెలియడంతో ఆమెతో మాట్లాడానని చెప్పారు. ఎలాంటి ప్రమాదం లేదని సోమవారం విధులకు హాజరు కానున్నట్లు జెడ్పీ సీఈవో పేర్కొన్నారు. మహిళలపై దాడి చేసిన ఉపసర్పంచ్‌పై కేసు ఇందల్వాయి: ఎల్లారెడ్డిపల్లె గ్రామ ఉప సర్పంచ్ గొల్ల శ్రీనివాస్‌తో పాటు అతడి అనుచరులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఉపసర్పంచ్ తన అనుచరులతో కలిసి గురువారం రాత్రి గ్రామానికి చెందిన గొట్టిముక్కుల ఒడ్డెన్న ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్న మహిళలను గాయపరిచారు. వ్యక్తిగత కక్ష్యలతో తమపై దాడి చేసినట్లు బాధిత మహిళలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. -
నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య
సాక్షి, నిజామాబాద్: బాల్కొండ శివారులో జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంకులో పనిచేసే కార్మికుడు నిద్రిస్తుండగా ఇనుప రాడ్లతో కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆర్మూర్ రూరల్ సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంకులో బాల్కొండకు చెందిన కోటగిరి రాంకిషన్(49) కార్మికుడిగా పని చేస్తాడు. ఆదివారం విధులు నిర్వహించిన రాంకిషన్, తోటి కార్మికులు విధులకు రాక పోవడంతో సోమవారం కూడా డ్యూటీ చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా ఒక్కడే విధుల్లో ఉన్నాడు. అక్కడే ఉన్న కేబిన్‌లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వచ్చి తలపై ఇనుప రాడ్లతో కొట్టారు. దీంతో తలకు తీవ్ర గాయాలై పడి ఉన్నాడు. మంగళవారం ఉదయం బంకుకు వచ్చిన మేనేజర్ రాజారెడ్డి గాయాలతో పడి ఉన్న రాంకిషన్‌ను చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కొనఊపిరితో ఉన్న ఆయనను ముందుగా అంబులెన్స్‌లో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్మూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతు డి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పో లీసులు పేర్కొన్నారు. రాంకిషన్‌కు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు ఆర్మూర్ రూరల్ సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో రాంకిషన్ హత్యకు గురైన ప్రదేశంలో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ వైపు వెళ్లి ఆగిపోయింది. క్లూస్ టీంతో తనిఖీలు చేశారు. బాల్కొండ, ముప్కాల్ ఎస్సైలు శ్రీహరి, రాజ్‌భరత్‌రెడ్డి ఉన్నారు. -
కరెంట్ షాక్‌తో గర్భిణి మృతి
నిజాంసాగర్(జుక్కల్): కరెంట్ షాక్‌తో నునావత్ అనిత(26) అనే గర్భిణి మృతి చెందిన సంఘటన నిజాంసాగర్ మండలం మల్లూరు తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. తండాకు చెందిన అనిత రోజూ మాదిరిగా మంగళవారం రాత్రి ఇంట్లో పిల్లలు, భర్తతో నిద్ర పోయారు. రాత్రి సమయంలో ఉబ్బరంగా ఉండటంతో ఫ్యాన్ వేసేందుకు అనిత లేచింది. స్వీచ్ బోర్డుపై వైర్లు తేలి ఉండటంతో ఆమెకు షాక్ తగిలింది. షాక్‌తో ఆమె చేతివేళ్లు కాలిపోయి, కుప్పకూలింది. ఆ అలికిడికి భర్త పిల్లలు లేచి చూసే సరికే అనిత మృతి చెందింది. ఆమె ప్రస్తుతం పంచాయతీ వార్డుసభ్యురాలు. సర్పంచ్ దరావత్ శాంతిబాయి బాబర్సింగ్ అక్కడికి చేరుకొని పోలీసులు, ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం ట్రాన్స్‌కో అధికారులు, పోలీసులు మల్లూర్ తండాకు వెళ్లి సంఘటన తీరును తెలుసుకున్నారు. మీటర్ నుంచి స్విచ్ బోర్డుకు కరెంట్ సరఫరా అయ్యే వైర్లు తేలి ఉండటంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు నిర్దారించారు. ఈ మేరకు పోలీసులు కేను నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అనితకు భర్త బల్రాం, కూతుర్లు మీనాక్షి, వర్షిత ఉన్నారు. -
గుప్పుమంటున్న గంజాయి!
నిజామాబాద్, మోర్తాడ్(బాల్కొండ): గంజాయి దందా జోరుగా సాగుతోంది. గంజాయి గ‘మ్మత్తు’కు అలవాటు పడిన యువత చిత్తవుతోంది. ఎక్కడో హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కనిపించే హుక్కా సంస్కృతి పల్లెలకూ పాకింది. కొంత మంది యువకులు, విద్యార్థులు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హాసాకొత్తూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, తాళ్లరాంపూర్, వడ్యాట్, రామన్నపేట్, శెట్పల్లి, తిమ్మాపూర్, ఉప్లూర్ తదితర గ్రామాలలో కొన్ని నెలల నుంచి గంజాయి విక్రయాలు ఊపందుకున్నాయి. అయినా అటు ఎక్సైజ్ అధికారులు కానీ, ఇటు పోలీసులు గానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు. యువతను టార్గెట్‌గా చేసుకుని కొందరు అక్రమార్కులు గంజాయి దందాను కొనసాగిస్తున్నారు. సిగరేట్లలో తంబాకును తొలగించి గంజాయి మిశ్రమాన్ని కలిపి విక్రయిస్తున్నారు. పోచంపాడ్, కోరుట్ల తదితర ప్రాంతాల నుంచి గంజాయి మిశ్రమం గల సిగరేట్లు దిగుమతి అవుతున్నాయని తెలుస్తుంది. ఒక్కో సిగరేట్‌ను రూ.150 నుంచి రూ.200లకు విక్రయిస్తున్నారు. ఇవే కాకుండా విడిగా గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలిసింది. గంజాయికి అలవాటు పడుతున్న వారిలో యువకులతో పాటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతంఉంటున్నారు. ఒకరిని చూసి ఒకరు అలవాటు చేసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఠాలు కడుతున్న యువకులు, విద్యార్థులు.. గంజాయి మత్తులో ఇతరులతో ఘర్షణలకు దిగుతున్నారు. ఇలాంటి ఘర్షణలు ఇటీవల రెండు, మూడు చోట్ల జరిగాయి. గంజాయికి బానిసలైన యువకులు దొరికితే పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేస్తున్నారు. అయితే, గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం వారు గుర్తించలేక పోతున్నారు. గంజాయి స్మగ్లర్లకు రాజకీయ నేతల అండదండలు ఉండటం వల్లనే దందా యథేచ్ఛగా సాగుతోందని సమాచారం. సమాచారమివ్వాలి.. గంజాయిని విక్రయించే స్మగ్లర్ల కోసం ఆరా తీస్తున్నాం. స్మగ్లర్ల గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలను రహస్యంగా ఉంచుతాం. పోలీసులకు సహకరించి గంజాయి విక్రయాల వివరాలను అందించాలి.– సంపత్‌కుమార్, ఎస్ఐ, మోర్తాడ్ -
స్నానానికి వెళ్లి శవమై తేలాడు!
నిజామాబాద్, డిచ్పల్లి: విందుకు వెళ్లిన మిత్రులు సరదాగా స్నానం చేసేందుకు వెళ్లగా, ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. డిచ్పల్లి తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్సై సురేశ్‌కుమార్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం బోర్గం (పీ) గ్రామానికి చెందిన గౌర వుల రమేశ్ (24), తన స్నేహితుడు శ్రీనాథ్‌తో కలిసి సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇద్దరు కలిసి బైక్‌పై డిచ్పల్లి మండలం యానంపల్లి శివారులో గల రామడుగు ప్రాజెక్టు ఎడమ కాలువ వద్దకు చేరుకుని సాయంత్రం వరకూ విందు చేసుకున్నారు. అనంతరం కాలువలో స్నానం చేయడానికి దిగిన రమేశ్ నీటిలో మునిగి చనిపోయాడు. రాత్రి పది దాటినా రమేశ్ ఇంటికి రాక పోవడంతో ఆయన భార్య సంధ్య కంగారు పడింది. అతడి ఫోన్ చేయగా స్నేహితుడు శ్రీనాథ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. రమేశ్ గురించి అడుగగా సరైన సమాధానం చెప్పకుండానే పెట్టేశాడు. అయితే, మరో స్నేహితుడు మంగళవారం ఉదయం సంధ్యకు ఫోన్ చేసి, రమేశ్ కాలువలో స్నానం చేస్తుండగా నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిపాడు. వెంటనే మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చి, ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు తహసీల్దార్ వేణుగో పాల్ సైతం కాలువ వద్దకు చేరుకున్నారు. కాలువ లోతుగా ఉండటంతో ఎస్సై సురేశ్‌కుమార్ జాలర్లను రంగంలోకి దించారు. చేపల వల సహాయంతో సుమారు 3 గంటల పాటు గాలించి చివరకు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మనోవేదనకు గురైన ఆ ఇల్లాలు.. పెళ్లీడుకొచ్చిన తన కూతురుతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన ఎర్రాపహాడ్ గ్రామంలో విషాదాన్ని నింపింది. సాక్షి, తాడ్వాయి: ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన బద్దం లక్ష్మారెడ్డి, బద్దం లింగమణి(42) దంపతులకు కుమారుడు రణదీప్‌రెడ్డి,కూతురు శిరీష(18) ఉన్నారు. వీరికి రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో వ్యవసా యం చేసుకుంటూ జీవిస్తున్నారు. రణదీప్‌రెడ్డి హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తుండగా కూతురు కామారెడ్డిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరు ఏడాది క్రితం ఇంటిని నిర్మించుకున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షలకుపైగా అప్పులు చేశారు. చేసిన అప్పులు పెరిగిపోతుండడం, కూతురు పెళ్లీడుకు రావడం, కుమారుడి చదువుకు డబ్బులు అవసరం కావడంతో లింగమణి మానసికంగా నలిగిపోయింది. అప్పుల విషయమై ఆదివారం రాత్రి భర్తతో గొడవ జరిగింది. రాత్రి ఇద్దరూ భోజనం చేయలేదు. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు ) సోమవారం ఉదయమే లక్ష్మారెడ్డి పొలానికి వెళ్లిపోయాడు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మనస్తాపానికి గురైన లింగమణి, శిరీష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. లక్ష్మారెడ్డి తాగునీటికోసం సమీపంలోని మరో బావి వద్దకు వెళ్లగానే తల్లి తన చీర కొంగును కూతురు నడుముకు కట్టింది. ఇద్దరూ ఒకేసారి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నీళ్లు తాగి తిరిగి వచ్చిన లక్ష్మారెడ్డికి భార్యాకూతుళ్లు కనిపించకపోవడంతో చుట్టూ చూశాడు. బావిలోకి తొంగిచూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ వెంకట్, ఎస్ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. (కరోనా.. 24 గంటల్లో 146 మంది మృతి) -
జానకంపేట్ పెట్రోల్‌బంక్‌లో చోరీ
నిజామాబాద్,ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలంలోని జానకంపేట్ శివారులో ప్రవీన్ ఫిల్లింగ్ స్టేషన్లో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 3గంటలకు కారులో పెట్రోలు బంక్‌లోకి ప్రవేశించిన దుండగుడు పంపులో పనిచేసే వ్యక్తులు నిద్రిస్తున్న సమయంలో రూంలోకి ప్రవేశించి బీరువా తాళాలను పగులగొట్టే ప్రయత్నం చేయగా బీరువా తాళాలు పగలకపోవడంతో అక్కడే ఉన్న స్వైపింగ్ మిషిన్ ఇన్వెర్టర్, బంకులో పనిచేస్తున్న వ్యక్తి సెల్‌ఫోన్‌ను దొంగలించాడు. ఇది తెలిసిన పెట్రోల్ పంపులో పనిచేసే వ్యక్తులు యజమాని ప్రవీన్కు సమాచారం ఇవ్వడంతో సీసీ పుటేజీలు పరిశీలించిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తి కారులో వచ్చి ఉదయం 3గంటలకు రూంలోకి ప్రవేశించి దొంగతనం చేశాడని గుర్తించారు. ఈ విషయమై ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్లాగౌడ్ తెలిపారు. -
భర్త శవంతో మూడు రోజులు..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మతిస్థిమితం లేని మహిళ.. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన తన భర్త శవంతో మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ఉద్యోగి లింబారెడ్డి(64), శకుంతల దంపతులు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో, కుమార్తె లండన్‌లో ఉంటున్నారు. బుధవారం ఇంటికి పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తికి దుర్వాసన రావడంతో ఇంట్లోకి వెళ్లలి చూడటంతో రక్తపు మడుగులో లింబారెడ్డి శవం కనిపించింది. (మిర్యాలగూడలో దంత వైద్యురాలి ఆత్మహత్య) దీంతో స్థానికులకు, పక్కన ఉన్న నిజామాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. లింబారెడ్డి మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతుని భార్య శకుంతకు మతిస్థిమితం లేదని స్థానికులు తెలిపారు. ఈ దంపతులు స్థానికులతో సరిగ్గా మాట్లాడేవారు కాదన్నారు. అయితే లింబారెడ్డి శవం రక్తపు మడుగులో ఉండటంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఘటనా విషయాన్ని అతని కుమారుడు, కుమార్తెకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (కౌలు డబ్బుల కోసం కన్నతల్లికి నిప్పు) -
దారుణం: కర్రతో కొట్టి వియ్యంకుడి హత్య
సాక్షి, కమ్మర్పల్లి(నిజామాబాద్) : కూతురిని పుట్టింటికి పంపించనందుకు వియ్యంకుడిని కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ మహ్మద్ ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూంపేటకు చెందిన బోదాసు రాజెం కమ్మర్పల్లి హాసాకొత్తూర్‌లోని మారుతినగర్లో నివాసముండే తన కూతురు ఇరుగదిండ్ల నీలా ఇంటికి శనివారం వెళ్లాడు. తన కూతురిని పుట్టింటికి తీసుకెళ్తానని వియ్యంకుడు ఇరగదిండ్ల రాములు(45), వియ్యంకురాలు రేణుకను కోరాడు. కొడుకు ఇంట్లో లేడని, వచ్చిన తర్వాత తీసుకెళ్లాలని చెప్పారు. (ఆ గ్రీన్జోన్లో 21 మందికి కరోనా పాజిటివ్! ) దీంతో కోపోద్రిక్తుడైన బోదాడు రాజెం వారిని బెదిరిస్తూ కూతురుని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. రాములు అతని భార్య అడ్డు చెప్పగా గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో రాజెం అక్కడే ఉన్న కర్రతో రాములును మోచాడు. తలకు బలమైన గాయం కావడంతో కింద పడిపోయాడు. కొడుకు మిరేష్ ఘటనా స్థలానికి చేరుకొని తండడ్రిని నిజామాబాద్ ఆస్పతత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాములు మరణించాడు. మిరేష్ ఫిర్యాదు మేరకు బోదాసు రాజెంపై హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. (కరోనా వ్యాక్సిన్.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు ) -
యూట్యూబ్‌లో చూసి కిరాతకం!
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఆర్యనగర్‌లో రెండ్రోజుల క్రితం జరిగిన వివాహిత హత్య కేసు మిస్టరీ వీడింది. తెలిసిన వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు కక్ష పెంచుకు ని, ఎలాగైనా అంతమొందించాలని నిందితులు నిర్ణయించుకున్నారు. ఏ విధంగా హత్య చేయాలి, పోలీసులకు ఆధారాలు దొరకకుండా ఏం చేయాలో ఆరా తీశారు. ఇందుకోసం యూట్యూబ్‌లో పలు క్రైం సీన్స్ చూశారు. పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసి, పరారయ్యారు. కానీ పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో రెండ్రోజుల క్రితం జరిగిన వివాహిత హత్య కేసును 48 గంటల వ్యవధిలోనే ఛేదించారు. కేసు వివరాలను సీపీ కార్తికేయ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆర్యనగర్‌లో నివాసముండే రాజవరపు శ్రీనివాస్ భార్య లక్ష్మి (43) సోమవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు నాగరాజు, నగేశ్కుమార్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డబ్బు ఇవ్వమని అడిగినందుకు.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముంబోజీపేటకు చెందిన పసులాడి నాగరాజు, డిచ్పల్లి మండం ధర్మారం గ్రామానికి చెందిన దుమాల నగేశ్‌కుమార్ అలియాస్ నాగరాజు.. ఆర్యనగర్‌కు చెందిన శ్రీనివాస్ వద్ద గతంలో పని చేసేవారు. పసులాడి నాగరాజుతో పాటు అతడి తండ్రి గతంలో శ్రీనివాస్ వద్ద అప్పు తీసుకున్నారు. ఈ అప్పు తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరగా ఇవ్వని నాగరాజు అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం ధర్మారం గ్రామానికి వచ్చిన నాగరాజు నగేశ్కుమార్ను కలిశాడు. శ్రీనివాస్ డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఎలాగైనా చంపాలని చెప్పాడు. దీంతో ఇద్దరు కలిసి కంఠేశ్వర్‌లోని ఓ వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి, మాధవనగర్ వద్ద బైపాస్ రోడ్డుకు వెళ్లారు. యూట్యూబ్‌లో చూసి.. ఇద్దరు మద్యం సేవిస్తూ మర్డర్ ఎలా చేయాలని చర్చించుకున్నారు. హత్య ఎలా చేయాలి.. పోలీసులకు ఆధారాలు దొరకకుండా ఏం చేయాలనే దానిపై యూట్యూబ్‌లో అనేక క్రైం సీన్లను చూశారు. అనంతరం నగేశ్‌కుమార్ హత్యకు ప్రణాళిక రూపొందించాడు. ధర్మారంలోని తన ఇంటి నుంచి పసుపు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఓ షాపులో కారంపొడి కొనుగోలు చేశారు. ఇద్దరు కలిసి ఆర్యనగర్‌కు చేరుకున్నారు. నగేశ్‌కుమార్ కొద్ది దూరంలోనే ఆగిపోగా, నాగరాజు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నాడు. తెలిసిన వ్యక్తే కావడంతో శ్రీనివాస్ భార్య ఇంట్లోకి ఆహ్వానించింది. అయితే, ఆమె సోఫాలో కూర్చోగానే నాగరాజు రాడుతో ఆమె తలపై బలంగా మోదాడు. అనంతరం కత్తితో మెడ, ఛాతిలో పొడిశాడు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు నాగరాజు మృతదేహంతో పాటు ఘటనా స్థలంలో పసుపు, కారంపొడి చల్లాడు. లక్ష్మి కాలి వేళ్లను నరికి, కాళ్లకు ఉన్న పట్టీలు, మెడలోని నగలు, ఫోన్ తీసుకున్నాడు. అనంతరం మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె చుట్టూ దీపాలు వెలిగించాడు. సుమారు 45 నిమిషాల పాటు ఇంట్లోనే ఉన్న అతడు తీరిగ్గా బయటకు వెళ్లాడు. అయితే, ఆ రోజు హోలీ కావడం, అప్పటికే నాగరాజు దుస్తులపై రంగు పడడంతో ఆయనపై పడిన రక్తపు మరకలను స్థానికులు గుర్తించలేదు. హత్యకు ఉపయోగించిన కత్తి, రాడ్‌ను బోర్గాం వద్ద దాచి పెట్టి, వెళ్లి పోయారు. పట్టిచ్చిన కుక్క.. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రొఫెషనల్ గ్యాంగ్ పనేనని తొలుత భావించిన పోలీసులు ఆ కోణంలో విచారించారు. మరోవైపు, శ్రీనివాస్‌కు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా..? అన్న వివరాలు సేకరించారు. అయితే, శ్రీనివాస్ ఇంట్లో ఉండే కుక్క హత్య జరిగిన రోజు మొరగక పోవడాన్ని గుర్తించిన పోలీసులు.. ఆ కోణంలో దృష్టి సారించారు. సాధారణంగా ఎవరెవరు వస్తే కుక్క అరవదని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో నాగరాజు పేరు చెప్పడం, హత్య జరిగిన రోజు కాలనీలో అతడు స్థానికులకు కనిపించడంతో పోలీసులు దాదాపు అతడేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో లింగంపేటకు వెళ్లి నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో రెండో నిందితుడు నగేశ్కుమార్ను కూడా అరెస్టు చేశారు. అయితే, హత్య జరిగిన తర్వాత రోజు ఆర్యనగర్‌కు వచ్చిన నగేశ్‌కుమార్.. ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫోన్లో నాగరాజుకు సమాచారమివ్వడం గమనార్హం. 48 గంటల్లోపు కేసును ఛేదించిన అడిషనల్ డీసీపీ రఘువీర్, ఏసీపీ ప్రభాకర్, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు లక్ష్మయ్య, నరేందర్, రమణ తదితరులను సీపీ అభినందించారు. -
మొబైల్ కొనివ్వలేదని.. మనస్తాపంతో
సాక్షి, దోమకొండ(నిజామాబాద్) : తల్లితండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమకొండ మండలకేంద్రంలో చొటుచేసుకుంది. ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ గ్రామానికి చెందిన కుకుట్ల మౌనిక(16) కామారెడ్డిలోని సాందీపని జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈక్రమంలో గత వారంరోజుల నుంచి తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లితండ్రులను కోరింది. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత కొనిస్తామని కూతురుకు వారు తెలిపారు. ఈ విషయంలో తీవ్ర మనస్థాపం చెందిన మౌనిక రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆమెను కామారెడ్డిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుప్రతికి తీసుకువెళ్లారు. ఈక్రమంలో మౌనిక మంగళవారం చికిత్స పొందుతూ వేకువజామున మృతిచెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. నిజామాబాద్ నగరంలో.. నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఆరోటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోగల డైరీఫాంలో మంగళవారం ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గౌరేందర్గౌడు తెలిపారు. నగరానికి చెందిన అబ్దుల్‌జావీద్ ఆర్థిక ఇబ్బందుల వల్లే తన ఇంటిలో మంగళవారం ఎవరు లేని సమయంల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య యాస్మిన్‌బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుక్నుట్లు ఎస్సై తెలిపారు. సిరికొండలో యువకుడి ఆత్మహత్యాయత్నం సిరికొండ: మండలకేంద్రంలోని ఎల్లం చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన స్థానిక వీఆర్ఏ చిన్న సాయిలు చెరువులో దూకి అతడిని కాపాడాడు. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం బండరామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్(25) తన అత్తగారి ఊరైన రావుట్లకు వచ్చాడు. కుటుంబ కలహలతో తిరుగు ప్రయాణంలో మంగళవారం మధ్యాహ్నం సిరికొండలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. అది చూసిన వీఆర్ఎ చెరువులో దూకి అతడిని ఒడ్డుకు తీసుకువచ్చాడు. సమాచారం తెలిసిన కానిస్టేబుల్ రాకేష్ చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు కానిస్టేబుల్ తెలిపారు. -
అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భార్యను..
సాక్షి, సదాశివనగర్(ఎల్లారెడ్డి): మరో మహిళతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు అని అడిగిన భార్యను ఓ భర్త కిరాతకంగా కొట్టి చంపిన సంఘటన సదాశివనగర్ మండలంలోని సాజ్యనాయక్ తండాలో శుక్రవారం తెల్లవాజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తండాకు చెందిన శివరాం మొదటి భార్యను ఒప్పించి 20 ఏళ్ల క్రితం రెండో నాందేడ్ జిల్లా ఉమ్రిలోని ఉండతండాకు మేనక(40)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. మొదటి భార్య లింమ్డిబాయికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరి భార్యలు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే రెండో భార్య మేనకకు శివరాంకు తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి మేనక, శివరాంను మరో మహిళతో అక్రమ సంబంధం విషయమై ప్రశ్నించింది. దీంతో ఆమెను శివరాం తీవ్రంగా కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మేనకను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు శివరాంపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్, ఎస్సై నరేశ్ తెలిపారు. మృతదేహంతో నిరసన మేనకను చంపిన శివరాంను కఠినంగా శిక్షించా లని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగా రు. నాందేడ్ నుంచి మృతురాలి కుటుంబీకులు వచ్చే వరకు మృతదేహాన్ని తరలించలేదు. -
టీఆర్ఎస్ నాయకుడి హత్య.. భార్య కుట్రేనా?
నిజామాబాద్, నవీపేట(బోధన్): నవీపేటలో శుక్రవారం టీఆర్ఎస్ నాయకుడు కొంచ రమణారెడ్డి(54) దారుణ హత్య సంచలనం సృష్టించింది. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో ఆయనను నరికి చంపారు. నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ట్రెయినీ ఐపీఎస్(నవీపేట ఎస్‌హెచ్‌వో) కిరణ్ ప్రభాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వారు తెలిపిన వివరాల మేరకు.. రమణారెడ్డి ఇంటి గేటులోపలికి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఆవరణలో ఫోన్ మాట్లాడుతున్న రమణారెడ్డి మెడ, తలపై గొడ్డలితో విచక్షణ రహితంగా నరికి పారిపోయారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రమణారెడ్డిని ఆలయానికి వెళ్లి వచ్చిన ఆయన రెండో కూతురు చూసి, బోరున విలపించింది. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ట్రెయినీ ఐపీఎస్ కిరణ్ ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకుని కొన ఊపిరితో రక్తపు మడుగులో ఉన్న రమణారెడ్డిని పోలీస్ వాహనంలోనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులు హత్యకు వాడిన గొడ్డలిని ఆవరణలో పడేసి పారిపోయారు. నిందితులు ప్రహరీ దూకి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ పేర్కొన్నారు. నిందితుల కోసం పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. కుక్క హతుడి ఇంటి నుంచి నిందితులు పారిపోయిన రహదారిని వెంట పరుగులు తీసింది. అర కిలో మీటర్ పరుగు తీసిన డాగ్ స్క్వాడ్ మళ్లీ తిరిగి వచ్చింది. భార్య కుట్రేనా? నవీపేట పక్కన గల కమలాపూర్‌లో ఉండే రమణారెడ్డి పదేళ్ల కిందట నవీపేటలో ఇళ్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నాడు. ఆయన తల్లిదండ్రులు కమలాపూర్‌లోనే ఉంటున్నారు. ఆయనకు భార్య నాగసులోచన, ముగ్గురు కూతుళ్లు హరిణి, రక్షిత, హిమబిందు ఉన్నారు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఎనిమిదేళ్ల కిందట ఆమె పెద్ద కూతురు హరిణి, చిన్న కూతురు హిమబిందుతో కలిసి నిజామాబాద్‌లో ఉంటుంది. ఈ నే పథ్యంలో భార్యభర్తల గొడవలు విడాకుల వర కు వెళ్లి కోర్టును ఆశ్రయించారు. ఆస్తి పంపకాల విషయంలో ఇరువురి మధ్య గొడవలు మరింత ముదిరిపోయాయి. ఈ నేపథ్యంలోనే రమణా రెడ్డి హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య వివాహేతర సంబంధం, ఆస్తి పంపకాల గొడవలు హత్యకు కారణమవ్వచ్చనే కోణంలో ప్రాథమికంగా విచారణ చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. -
సెల్ఫీ సోకు.. ప్రాణం మీదకు తెచ్చుకోకు..
ఎక్కడ చూసినా, ఎవర్ని చూసినా సెల్ఫీ సెల్ఫీ. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు తిన్నా, పడుకున్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏడ్చినా సందర్భం ఉన్నా లేకున్నా సరే సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు నేటి జనం. ఎక్కడ ఉండి సెల్ఫీ దిగుతున్నామన్న ఆలోచన లేకుండా ఎక్కడ బడితే అక్కడ దిగేస్తున్నారు. లైకుల కోసం ఆరాట పడుతూ ప్రమాదకరమైన చోట్ల సెల్ఫీలు దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇలా ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్) : యువతలో ఇటీవల కాలంలో సెల్ఫీల మోజు విపరీతంగా పెరిగింది. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కొత్తగా కనిపించేందుకు, లైకుల కోసం సాహసాలు చేస్తూ ఫొటోలు దిగుతున్నారు. చెరువులు, వాగులు, నదులు, కొండ లు, గుట్టలు, రైళ్లు తదితర చోట్ల ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ప్రాణాపాయం కొనితెచ్చుకుంటున్నారు. విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటూ తమ కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న మోజు యువత రోజురోజుకీ సెల్ఫీల మోజులో పడి కొట్టుకుపోతోంది. కూర్చుంటే సెల్ఫీ. నిలబడితే సెల్ఫీ, హోటల్‌కు వెళ్లినా, ప్రయాణంలో ఉన్నా.. ఇలా ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇలా సెల్ఫీలు దిగి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల సమయం వృధా తప్ప భారీ నష్టంలేదు. కానీ కొందరయితే కొండలు, గుట్టలు, నదులు, నడుస్తున్న రైళ్లు, సాహస కృత్యాలు చేస్తూ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సెల్ఫీలు దిగుతున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు. ప్రాణం అంటే లెక్కలేనితనం వెనక్కి తగ్గితే పక్కన ఉన్నవారు వెక్కిరిస్తారేమోనన్న చిన్నతనంతో యువత ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. యువతలో సాహసం చేయాలనే తపన ఉండడం సహజం. అది అవసరమే అయినప్పటికీ, పది మందికి ఉపయోగపడేలా ఉండాలి. చావు బతుకుల్లో ఉన్న వారిని అపాయంలో ఉన్న వారిని రక్షించడానికి ప్రాణాలకు తెగించి సాహసాలు చెయవచ్చు. కానీ కేవలం ఒక ఫొటో కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవివేకం. సందర్భం ఏదైనా సెల్ఫీ గోలే.. నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ల రాకతో ఫొటోల గోల ఎక్కుపోతుంది. సందర్భంగా ఏదైనా సరే ఫొటో దిగాల్సిందే. వాట్సప్‌లో స్టేటస్ పెట్టాల్సిందే. ఇది ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అధికారుల వరకు నేడు సాగే ట్రెండ్. ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఎంత మంది అధికారులు, ఎంత మంది నాయకులు ఉంటారో అంతమంది ఒక ఫొటో దిగాల్సిందే. ఈ సెల్ఫీల గోల యువత నుంచి వయస్సు మళ్లిన వారికి పాకింది. దీంతో వారు కూడా సందర్భం ఏదైనా సెల్ఫీ మోజులో పడిపోతున్నారు. గతంలో జిల్లాలో ఓ యువకుడి మృతి భీమ్‌గల్ మండలం గోన్‌గొప్పులకు చెందిన ఇందపురపు దినేశ్(22) గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన కప్పల వాగు చెక్‌డ్యాం వద్ద సెల్ఫీ దిగుతూ నీటి పడిపోయాడు. నీటి ఉధృతిలో కొట్టుకుపోయాడు. గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించారు. వారు వచ్చి గాలింపు చర్యలు చేపట్టగా రెండు రోజుల అనంతరం మృతదేహం లభ్యమైంది. సెల్ఫీల మోజు బాగా పెరిగింది సాంకేతికతను పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. అతిగా సెల్‌ఫోన్ వినియోగంచడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక యువతకు సెల్ఫీ మోజు బాగా పెరిగింది. సెల్ఫీ మోజులో ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. – నిజాం, ప్రిన్సిపాల్, రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల తల్లిదండ్రులు నియంత్రించాలి అనవసరమైన వయస్సులో పిల్లలకు సెల్‌ఫోను ఇవ్వకూడదు. యువత ఫోన్లను విపరీతంగా వాడుతోంది. సరదా కోసం తీస్తున్న సెల్ఫీలు చివరకు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. –గోవర్ధన్‌రెడ్డి, హెచ్ఎం ఉప్పల్వాయి -
రోడ్డు ప్రమాదం: ఇంజిన్‌లో ఇరుక్కున్న విద్యార్థి కాళ్లు
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని డిచ్పల్లి మండలం నల్లవెల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లవెల్లి నుంచి డిచ్పల్లికి వెళ్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చెట్టును ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగంలోని ఇంజన్లో మున్నా అనే నాలుగో తరగతి విద్యార్థి రెండు కాళ్లు ఇరుక్కుపోయాయి. కొంత సమయం తర్వాత స్థానికులు గ్యాస్ కట్టర్ సాయంతో విద్యార్థి కాళ్లు బయటకు తీశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలవ్వగా.. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. కాగా బస్ డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
సినీ ఫక్కీలో బ్యాగు చోరీ
సాక్షి, డిచ్పల్లి: నిజామాబాద్‌లోని డిచ్పల్లి మండల కేంద్రంలో చోరీ జరిగింది. డిచ్పల్లికి చెందిన శివసాయి అనే వ్యాపారి ఎప్పటిలానే గురువారం తన బంగారు ఆభరణాల దుకాణాన్ని తెరిచేందుకు వెళ్లాడు. ఈ సమయంలో బ్యాగును తన బైక్‌పై పెట్టి దుకాణం తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే అదనుగా భావించిన దొంగలు సినీ ఫక్కీలో మరో బైక్‌పై వచ్చి బ్యాగును ఎత్తుకెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగు తిన్న షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో రూ.15 లక్షల విలువ చేసే నగలు, నగదు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
టీఆర్ఎస్ నేత హత్య: ఆ తర్వాతే అంత్యక్రియలు
సాక్షి, భీమ్‌గల్(నిజామాబాద్): భీమ్‌గల్ మండల కేంద్రంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూ తగాదాల నేపథ్యంలో టీఆర్ఎస్ నేత, మాజీ వార్డు సభ్యుడు కలీం హత్యకు నిరసనగా బంద్‌కు పిలుపునివ్వడం, మృతదేహంతో ఆందోళన చేపట్టడంతో రోజంతా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అయితే, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. భూ తగాదాలతో హత్యకు గురైన భీమ్‌గల్‌కు చెందిన కలీం సోమవారం మండలంలోని బాబాపూర్‌లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు నిరసనగా మంగళవారం రోజంతా భీమ్‌గల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కలీం మృతదేహానికి సోమవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఇంటికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అతని వర్గం వారు హంతకులను కఠినంగా శిక్షించే వరకు అంత్యక్రియలు నిర్వహించొద్దని నిర్ణయించారు. మంగళవారం భీమ్‌గల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి పట్టణంలో యువకులు పెద్ద సంఖ్యలో బైకులపై ర్యాలీ చేపట్టారు. మృతదేహంతో ఆందోళన.. ఉదయం 10 గంటల సమయంలో కలీం మృతదేహాన్ని తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే వందలాది మంది అక్కడకు తరలివచ్చారు. మృతదేహాన్ని కార్యాలయంలోకి తీసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. కొందరు యువకులు గేట్లు తోసుకుని లోపలికి వెళ్లగా, పోలీసులు అతి కష్టం మీద వారిని బయటకు పంపించారు. హంతకులను శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కలెక్టర్, మంత్రి రావాలని, అప్పటిదాకా అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. చివరకు మైనారిటీ నాయకులతో అధికారులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు ఐదెకరాల భూమి ఇప్పించాలని కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో సాయంత్రం 4 గంటలకు ఆందోళన విరమించి అంతిమ యాత్ర నిర్వహించారు. తహసీల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ముస్లిం మహిళలు ప్రశాంతంగా బంద్ కలీం హత్యకు నిరసనగా చేపట్టిన భీమ్‌గల్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసి ఉంచారు. బస్సులు, ఆటోలు నడువలేదు. భారీ బందోబస్తు.. సోమవారం నాటి ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అడిషనల్ ఎస్పీ భాస్కర్, ఆర్మూర్, నిజామాబాద్ ఏసీపీలు రఘు, శ్రీనివాస్‌కుమార్, ఎస్బీ ఏసీపీ శ్రీనివాస్‌రావ్, స్థానిక సీఐ సైదయ్య, ఎస్సై శ్రీధర్‌రెడ్డిలతో పాటు జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్సైలు బందోబస్తుకు తరలి వచ్చారు. ప్రత్యేక బలగాలను దింపి పరిస్థితి అదుపు తప్పకుండా పర్యవేక్షించారు. పరామర్శించిన మాజీ మంత్రి కలీం హత్య వార్త తెలిసి మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి భీమ్‌గల్‌కు వచ్చారు. కలీం మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అతనితో తనకున్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రితో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు తాహెర్, మాజీ జెడ్పీటీసీ ప్రకాష్‌గౌడ్ తదితరులు కలీం కుటుంబ సభ్యులను ఓదార్చారు. పరామర్శకు వచ్చిన మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి -
నలుగురి ఆత్మహత్యాయత్నం
సాక్షి, నిజామాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించిన ఘటన సోమవారం బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట చోటుచేసుకొంది. పెట్రోల్ బాటిళ్ళతో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తమ పంట పొలానికి వెళ్లే దారిని కబ్జా చేసి గేటు పెట్టారని ఆర్డీవోకు ఆందోళనకారులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆర్డీవో గోపిరామ్... పొలానికి వెళ్లే దారిని చూపాలని ఈ మేరకు తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. -
చదవాలని మందలిస్తే..
సాక్షి, ఎడపల్లి (బోధన్): చదువులో వెనుకబడిందని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బోర్గం శంకర్, అన్నపూర్ణ దంపతులు వ్యవసాయ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కూతురు స్నేహలత (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె కొంతకాలంగా ఫిట్స్ వ్యాధితో బాధ పడుతోంది. అయితే, ఆమె చదువులో వెనుకబడి ఉందని గమనించిన తల్లిదండ్రులు బాగా చదవమని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన స్నేహలత.. ఇంట్లోని బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. తాగొచ్చి వేధిస్తున్నాడని.. భర్తను నరికి చంపిన భార్య కరీమాబాద్ : నిత్యం మద్యం తాగొచ్చి హింసిస్తున్న భర్తను భార్య దారుణంగా నరికి చంపింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం శంభునిపేట బుడిగజంగాల కాలనీలో గురువారం చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ సీఐ నరే‹Ùకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న చిల్ల రాజ్‌కుమార్ (27), యాకలక్ష్మి దంపతులు. కూలి పనులు చేసే రాజ్‌కుమార్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేయడమే కాకుండా హింసిస్తున్నాడు. ఈ క్రమంలో విసిగిపోయిన యాకలక్ష్మి గురువారం ఉదయం భర్త రాజ్‌కుమార్‌ను గొడ్డలితో నరికి చంపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిద్రమత్తులో.. మృత్యు ఒడికి..
చిన్నపాటి నిర్లక్ష్యం.. వెలకట్టలేని విషాదాన్ని మిగులుస్తోంది. ఎన్నో కుటుంబాలను వీధిపాలు చేస్తోంది. నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రమాదాలకు అతివేగానికి తోడు మద్యం, నిద్రమత్తులే కారణమవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనకూ డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా వాహనాన్ని నడపడమే కారణం.. ఈ ఘటనలో దురదృష్టం వెంటాడి బెలూన్లు తెరచుకోలేదు. లేకుంటే వారు బతికేవారేమో?. – సాక్షి, కామారెడ్డి సాక్షి, భిక్కనూరు: నిజామాబాద్ పట్టణంలోని పద్మనగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న అరుణ్ ఉపాధి కోసం ఇరాక్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఇంటి యజమాని మంతెన లావణ్య(35)ను కారు అడిగాడు. హైదరాబాద్‌లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కుమారుడిని చూసేందుకు తామూ వస్తామని లావణ్య ఆమె కూతురు రోషిణి(15) అతడితో తెలిపారు. లావణ్య, రోషిణితోపాటు అరుణ్ బంధువు ఆర్మూర్ మండలం హుస్నాబాద్ గ్రామానికి చెందిన డ్రైవర్ సుశీల్(22), స్నేహితుడు నవీపేటకు చెందిన ప్రశాంత్(30) కారులో హైదరాబాద్ వెళ్లారు. ఎయిర్‌పోర్టులో అరుణ్‌కు సెండాఫ్ ఇచ్చి, కుమారుడితో మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం దాటాక కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న మైలు రాయికి కారు ఢీకొట్టి, అదుపుతప్పి సమీపంలోని మర్రిచెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. పెద్ద శబ్దం కావడంతో చెట్టుపక్కనే ఉన్న గుడిసె హోటల్లో నిద్రిస్తున్న హోటల్ యజమాని నర్సాగౌడ్ మేల్కొని బయటకు వచ్చి చూశాడు. కారు చెట్టును ఢీకొన్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భిక్కనూరు సీఐ యాలాద్రి, ఎస్సై నవీన్‌కుమార్, ఏఎస్సై హైమద్‌లు పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయలేని పరిస్థితి ఉండడంతో వెంటనే గ్యాస్ వెల్డింగ్ చేసే వారిని రప్పించారు. గ్యాస్ కట్టర్ సహాయంతో కారు భాగాలను కత్తిరించి, అందులో ఉన్న నలుగురి మృతదేహాలను బయటికి తీశారు. ఎస్పీ శ్వేత, డీఎస్పీ లక్ష్మీనారాయణలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ సుశీల్ నిద్ర మత్తులో అతివేగంగా వాహనాన్ని నడపడమే అని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో నుజ్జునుజ్జయిన కారు నేడు పుట్టిన రోజు.. అంతలోనే.. నిజామాబాద్ అర్బన్: మంతెన లావణ్య డిసెంబర్ 10న జని్మంచారు. కానీ ఆమె మరో పుట్టిన రోజును చూడకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. వేగం,నిద్రమత్తే కారణం.. వేగం వారి ప్రాణం తీసింది.. నిద్రమత్తులో కారును నియంత్రించలేకపోయి అదే స్పీడ్‌తో చెట్టుకు ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జాగ్రత్తలు పాటించకుండా తెల్లవారుజాము ప్రయాణాలు ప్రాణాలు తీస్తాయని మరోసారి రుజువైంది. కొడుకును చూసేందుకు వెళ్లి.. నిజామాబాద్ అర్బన్: భర్త గల్ఫ్‌లో ఉంటే తానే ఇద్దరి పిల్లల బాధ్యత తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంది. హైదరాబాద్‌లో ఉంటున్న కొడుకును చూసేందుకు వెళ్లి అసువులు బాసింది. కామారెడ్డి జిల్లా జంగంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదం మృతిచెందిన లావణ్య దీనగాథ ఇది.. కారు రూపంలో ప్రమాదం.. లావణ్యకుటుంబం నిజామాబాద్‌లో పద్మనగర్‌లో నివసిస్తోంది. తన భర్త జనర్ధన్ మూడు నెలల క్రితమే గల్ఫ్‌కు వెళ్లగా కూ తురు రోషిణి(15)తో కలిసి నిజామాబాద్‌లో ఉంటున్నారు. కొడుకును హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ చదివిస్తోంది. లావణ్య ఇంటివద్దే ఉండేది. తన ఇంట్లో రెండు పోర్షన్లు అద్దెకు ఇచ్చారు. పక్కంటి వారు హైదరాబాద్ వెళ్తుంటే.. లావణ్య ఇంట్లో అద్దెకు ఉండే నాగమణి కొడుకు ఆదివారం గ ల్ఫ్ వెళ్తున్నాడు. దీంతో లావణ్య కారును అడిగారు. లావణ్య తాను కూడా హైదారబాద్‌లో తన కొడుకు హాస్టల్లో ఉన్నా డని అతడిని చూసి వస్తానంటూ తన కూతురు రోషిణిని తీసుకుని అదే కారులో ఆదివారం రాత్రి 7.30కు పద్మనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఇక్కడే విధి వక్రీకరించింది. ఆదివారం రాత్రి అరుణ్‌కు సెండాఫ్ ఇచ్చారు. అ లాగే లావణ్య తన కొడుకును కలిసి మాట్లాడి తి రిగి అదే కారులో తెల్లవారుజామున నిజామాబాద్ బయలుదేరారు. తెల్లవారుజామున భిక్కనూర్ మండలం జంగంపల్లి వద్ద కారు చెట్టుకు ఢీకొన్న ప్రమాదంలో లావణ్య, రోషిణితో సహా నలుగురు మృతిచెందారు. మిగిలింది తండ్రీకొడుకులే.. ఇప్పుడు జనార్ధన్ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఇప్పుడు తండ్రీకొడుకులే మిగిలారు. కొన్నేళ్ల క్రితం జనార్ధన్ కుటుంబం నిజామాబాద్‌కు తరలివచ్చింది. బతుకుదెరువు కోసం జనార్ధన్ కొన్నేళ్లుగా గల్ఫ్‌లోనే ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం గల్ఫ్ నుంచి తిరిగి వచ్చేశాడు. మళ్లీ అవకాశం రాడంతో మూడు నెలల క్రితమే గల్ఫ్ వెళ్లాడు. కాని విధి తల్లీకూతుళ్లను తీసుకెళ్లిపోవడంతో తండ్రీకొడుకులే మిగిలారు. లావణ్య చుట్టుపక్కల వారితో కలిసిమెలిసి ఉండేదని పేర్కొన్నారు. కారు ఢీకొన్న మైలు రాయి దురదృష్టం వెంటాడింది నవీపేట(బోధన్): ఆదినుంచి వెంటాడిన దురదృష్టం కన్నకొడు కుని బలితీసుకునేంత వరకు పగబట్టింది.. ప్రశాంత్ తండ్రి సుదర్శన్ పొట్టకూటికోసం ముంబయ్ పోయినప్పటికీ అదృష్టం కలిసిరాక తిరిగి సొంతూరుకు వచ్చి చిన్నాచితకా పనిచేసుకుంనాడు. ఆశలన్నీ కొడుకుపైనే పెట్టుకుని బతికితే.. చివరకు ఆ కొడుకుకే తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. భిక్కనూరు సమీపంలోని జన్నెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు మ్యాతరి ప్రశాంత్ తండ్రి దీనగాథ ఇది. ఆదినుంచీ కష్టాలే.. నవీపేట మండల కేంద్రంలోని ధర్యాపూర్ కాలనీకి చెందిన మ్యాతరి దశరథ్ అన్నదమ్ముల్లో మూడోవాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముంబయ్ వెళ్లాడు. కాని పనికష్టంగా మారగా ఇల్లు అమ్మేసి కొడుకు ప్రశాంత్‌ను బీబీఏ చేయించాడు. ముంబయ్‌లో పని కుదరకపోవడంతో నాలుగేళ్ల క్రితం స్వగ్రామమైన నవీపేట్‌కు వ చ్చేశాడు. అక్కడ కూడా పనిసరిగ్గా కుదరక కొన్నిరోజుల క్రితం నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆయన స్టీల్ వెల్డింగ్ షాప్‌లో పనిచేస్తుండగా భార్య రేఖ బీడీలు చుడుతుండేది. బీబీఏ చేసిన కుమారుడు ప్రశాంత్ అక్కడికక్కడ పనుల కోసం వెతికి ముణ్నెళ్ల క్రితం ఓ హోటల్లో క్యాషియర్‌గా కుదిరాడు. ఆర్నెళ్ల క్రితం దశరథ్ కూతురి పెళ్లి చేశాడు. కష్టాల నుంచి గట్టెక్కేలోపే.. ఆదినుంచి కష్టాలను చవిచూసిన దశరథ్ తన ఏకైక కుమారుడు ప్రశాంత్‌పై ఆశలు పెట్టుకున్నాడు. మహారాష్ట్రలో బీబీఏ చదివిన ప్రశాంత్‌కు అతికష్టం మీద నిజామాబాద్ నగరంలో ఉద్యోగం దొరికింది. ఇక నేనే అన్నీ చూసుకుంటానని కొడుకు మాటివ్వడంతో తల్లిదండ్రుల్లో పుత్రోత్సాహం రెట్టింపయ్యింది. కాని ఆ ఆనందం కొన్ని రోజులే ఆ ఇంట్లో ఉంది. రోడ్డు ప్రమాదం రూపంలో ప్రశాంత్ సోమవారం ఉదయం మృతిచెందాడు. కల లను సాకారం చేసుకుంటాడనుకుంటే కాటికెళ్లిపోయాడు. సోదరుడికి వీడ్కోలు చెప్పి.. పెర్కిట్(ఆర్మూర్): ఇరాక్‌కు వెళ్తున్న పెద్దమ్మ కుమారునికి వీడ్కోలు చెప్పి తిరుగు ప్రయాణమైన యువకున్ని రోడ్డు ప్రమాదం అనంత లోకాలకు తీసుకెళ్లింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన అంగూర్ సుశీల్(24) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పట్టణంలోని హుస్నాబాద్ కాలనీలో నివాసముండే అంగూర్ దేవేందర్, గీత దంపతుల కుమారుడు సుశీల్ ఆరు నెలల క్రితం జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ వద్ద గల మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఉద్యోగంలో చేరాడు. తండ్రి దేవేందర్ ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. కాగా నిజామాబాద్‌లో ఉంటున్న సుశీల్ పెద్దమ్మ కుమారుడు అరుణ్ ఆదివారం ఉపాధి కోసం ఇరాక్ దేశం వెళ్తున్నాడు. దీంతో సుశీల్ సోదరునికి వీడ్కోలు పలకడానికి నిజామాబాద్ వెళ్లాడు. నిజామాబాద్ నుంచి అరుణ్‌తో పాటు అతని స్నేహితుడు ప్రశాంత్, ఇంటి యజమాని కుటుంబానికి చెందిన తల్లీకూతురు, సుశీల్ అందరు కలిసి కారులో ఏయిర్‌పోర్టుకు బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో కామారెడ్డి జిల్లా బీర్కూర్ వద్ద కారు చెట్టును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నిజామాబాద్‌కు చెందిన తల్లి కూతురు, ఆర్మూర్‌కు చెందిన సుశీల్, నవిపేటకు చెందిన ప్రశాంత్ దుర్మరణం పాలయ్యారు. కాగా ఏకైక కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంలో కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. కుమారుని మరణ వార్త తెలుసుకున్న తండ్రి దేవేందర్ దుబాయ్ నుంచి ప్రయాణమయ్యాడు. మంగళవారం ఆర్మూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఫ్లైట్ ఆలస్యం కావడంతో.. కాగా శంషాబాద్ విమానశ్రయంలో సోదరుడు అరుణ్‌కు వీడ్కోలు పలికిన సుశీల్‌కు మండలంలోని ఆలూర్ గ్రామానికి చెందిన పరిచయస్తులు ఎదురయ్యారు. దీంతో వారితో నేరుగా ఆర్మూర్ వరకు కలిసి రావచ్చని అనుకున్నట్లు సమాచారం. కాగా వారు ఎదురుచూస్తున్న ఫ్లైట్ అరగంట ఆలస్యంగా వస్తున్నట్లు తెలియడంతో సుశీల్ గత్యంతరం లేక వచ్చిన కారులోనే బయలు దేరాడు. ఒక వేళ అరగంట నిరీక్షించి ఉంటే ప్రాణాలు దక్కేవంటూ తల్లి గీత విలపించడం అందరిని కలిచివేసింది. -
హత్యకు గురైన మహిళ తల లభ్యం
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు మత్తడి వాగు వద్ద గత నెల 25న జరిగిన మహిళ దారుణ హత్య సంఘటన తెలిసిందే. వారం రోజుల క్రితం ఈ సంఘటన వెలుగు చూసింది. అయితే మృతదేహానికి తల లేకుండా పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అదే ప్రాంతంలోని కొద్దిదూరంలో ఉన్న ఓ చెట్టు కింద పడి ఉన్న తల భాగాలను ఆదివారం గుర్తించారు. పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. పట్టణ ఎస్హెచ్ఓ జగదీశ్ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. హత్యకు గురైన మహిళదే ఈ తల కావచ్చని భావిస్తున్నారు. తల భాగాలను ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించారు. తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హంతకులు మహిళను మరో ప్రదేశంలో హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడవేసి ఉండవచ్చని భావిస్తున్నారు. -
దెయ్యం పట్టిందని కొట్టిన తల్లి..బాలుడి మృతి
సాక్షి, డిచ్పల్లి(నిజామాబాద్) : అనారోగ్యంతో ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందనే మూఢ నమ్మకంతో కన్నతల్లి జుట్టు పట్టుకుని చెప్పుతో బాగా కొట్టడంతో మృతి చెందిన ఘటన డిచ్పల్లి మండలం ఘన్పూర్ శివారులో చోటుచేసుకుంది. వివరాలు.. నిజామాబాద్ నగరానికి చెందిన జ్యోతికి ఐదుగురు పిల్లలు. ఆమె ఊరూరు తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువులు, చిత్తు కాగితాలు ఏరుకుని వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో పిల్లలను పోషిస్తోంది. ఏడాదిగా పిల్లలను వెంటేసుకుని డిచ్పల్లి మండలం ఘన్పూర్ శివారులోని మహాలక్ష్మీ ఆలయం సమీపంలో నివసిస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి కొడుకు కడమంచి కిశోర్ (7) కు వాంతులు, విరోచనాలు అయ్యాయి. గురువారం ఉదయం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలుడికి వైద్యం చేయించిన జ్యోతి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చింది. రాత్రికి కల్లు తాగిన మత్తులో అనారోగ్యంతో పడి ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందని పేర్కొంటూ జుట్టు పట్టుకుని చెప్పుతో బాగా కొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఎస్సై సురేశ్‌కుమార్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది బాలుడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కిశోర్ అనారోగ్యంతో మృతి చెందాడా లేక తల్లి కొట్టిన దెబ్బలకు చనిపోయాడా అనే విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. ఇటీవలే ధర్మారం(బి) గ్రామంలో తల్లి చేతిలో కొడుకు మృతి చెందిన ఘటన మరువక ముందే మరో చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బాలుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి -
మహిళ దారుణ హత్య
సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు మత్తడి కాలువ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన సంఘటన సోమవారం వెలుగు చూసింది. సంఘటన స్థలంలో తలలేని మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి పడి ఉంది. వారం రోజుల క్రితం హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద చెరువు మత్తడి వాగు దగ్గర గుర్తుతెలియని ఓ శవం పడి ఉందని సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. తల లేని మృతదేహాన్ని గుర్తించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో వారం క్రితం హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతురాలి వయసు 34 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించి ఆధారాలను సేకరించారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్హెచ్ఓ జగదీష్, ఎస్సైలు రవికుమార్, గోవింద్ ఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఇటీవల అదృశ్యమైన వారి వివరాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
యువకుడి హత్య: తండ్రే హంతకుడు
సాక్షి, కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన తౌఫిక్ అనే యువకుని హత్య కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడిని హత్య చేసింది కన్నతండ్రేనని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్లా రోడ్డులోని గంజ్‌గేట్ వద్ద ఓ దుకాణం ముందు నిద్రిస్తున్న తౌఫిక్ (28) అనే యువకుడిని తలపై బండరాళ్లతో మోది హత్య చేసిన విషయం తెల్సిందే. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వృత్తిరీత్యా తౌఫిక్ హమాలీ పనిచేసేవాడు. తల్లిదండ్రులతో విబేధాల కారణంగా చాలాకాలంగా బతుకమ్మకుంట కాలనీలోని వారి ఇంటికి వెళ్లడం లేదు. మద్యం తాగడం, గొడవలు పడడం లాంటి అనేక వ్యసనాలకు బానిసయ్యాడు. అతని తండ్రి మునీర్ లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తౌఫిక్ తరచుగా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి డబ్బుల కోసం వేధించి, పలుమార్లు దాడి చేశాడు. అతని ప్రవర్తనతో విసుగు చెందిన తండ్రి మునీర్ కొడుకును హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. మద్యం తాగి గంజ్‌గేట్ వద్ద దుకాణం ముందర పడుకున్న తౌఫిక్ తలపై బండరాళ్లతో మోది అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసుల విచారణలో మునీర్ నేరం అంగీకరించినట్లు ఎస్సై గోవింద్ తెలిపారు. బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య బీబీపేట: అలాగే మరొ యువకుడు తండ్రి బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బూరెంకి స్వామి (24) విద్యుత్ శాఖలో సీఎల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆయన తండ్రిని బైక్ కొనివ్వమని అడిగాడు. వరి కోతలు అయిన తర్వాత కొనిస్తా అని మందలించడంతో మనస్తాపం చెందిన స్వామి తన సొంత వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పశువుల కొట్టంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చీకటి పడినా స్వామి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలం వద్ద విగతజీవిగా కనిపించాడు. తండ్రి కాశయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘హనీట్రాప్’ కేసులో అన్నదమ్ముల అరెస్టు
ఆశ భావి జీవితానికి శ్వాసనిస్తుంది. కానీ అత్యాశ మాత్రం చేటు తెస్తుంది. ఈ విష యం తెలిసినా కొందరు ఈజీ మనీ కోసం చట్ట విరుద్ధమార్గంలో పయనిస్తుంటారు. పోలీసుల కు చిక్కి కటకటాలపాలవుతున్నారు. అధిక డబ్బులకు ఆశపడి వేరే వ్యక్తుల పేరుతో సిమ్‌కార్డులను యాక్టివేట్ చేసి ఇతరులకు ఇచ్చిన పోల్కంపేటకు చెందిన అన్నదమ్ములిద్దరు పోలీసులకు చిక్కిన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. సాక్షి, కామారెడ్డి: పోల్కంపేటలో మొబైల్ సిమ్‌కార్డుల అమ్మకాలతో పాటు బ్యాలెన్స్ రీచార్జీ చేసే మహ్మద్ వాహెద్ పాషా, మహ్మద్ అహ్మద్ పాషా సోదరులు అత్యాశకు పోయారు. మెదక్‌కు చెందిన నవీద్ పాషా వీరిని కలిసి, యాక్టివేట్ చేసిన సిమ్‌కార్డులు ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పడంతో వారు అక్రమంగా ఇతరుల పేర్లతో సిమ్‌కార్డులను యాక్టివేట్ చేసి అతడికి అందించారు. ఇలా తీసుకున్న సిమ్‌కార్డులను నవీద్ పాషా.. హైదరాబాద్ చంద్రాయన్‌గుట్టలోని ఇస్మాయిల్‌నగర్‌లో నివసించే ఇమ్రాన్‌కు అందించేవాడు. అతడు వాటి ద్వారా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మారుస్తూ అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో ఇటీవల వెలుగు చూసి హనీట్రాప్ కేసులో విచారణ చేసిన పోలీసులు.. సిమ్‌కార్డుల గుట్టు రట్టు చేశారు. పొల్కంపేట నుంచి సిమ్‌కార్డులు సరఫరా అయినట్లు గుర్తించిన పోలీసులు బుధవారమే మహ్మద్ వాహెద్ పాషా, మహ్మద్ అహ్మద్ పాషాలతోపాటు మెదక్‌కు చెందిన నవీద్ పాషాను అరెస్టు చేశారు. అధిక డబ్బులపై ఆశతో.. పోల్కంపేటలో సిమ్‌కార్డులు విక్రయిస్తూ, రీచార్జులు చేస్తూ జీవించే పాషా సోదరులు అత్యాశకు పోయి పోలీసులకు చిక్కారు. మహ్మద్ వాహెద్ పాషా, మహ్మద్ అహ్మద్ పాషా సోదరులు.. సిమ్‌కార్డులు విక్రయిస్తూ, మొబైల్ రీచార్జీలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే సిమ్‌కార్డుల అమ్మకాలు, రీచార్జీలతో పెద్దగా ఆదాయం రావడం లేదు. ఇదే సమయంలో వారికి మెదక్‌కు చెందిన నవీద్ పాషా పరిచయం అయ్యాడు. అతడు యాక్టివేట్ చేసిన ఒక్కో సిమ్ కార్డుకు వీరికి రూ. 300 వరకు ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పాషా సోదరులు వేరే వ్యక్తుల పేర్లతో సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసి ఇచ్చారు. తాము చేస్తున్నది తప్పని తెలిసినా డబ్బుల కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న పాషా సోదరులు చివరికి కటకటాలపాలయ్యారు. అంతర్జాతీయ కాల్స్‌కు సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు సీరియస్ కేసుగా పరిగణిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన హనీట్రాప్ కేసుకు ఈ సిమ్‌కార్డులకు ముడిపడి ఉండడం మూలంగా పాషా సోదరులు ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు స్పష్టమవుతోంది. సిమ్‌కార్డు దందాలపై ఆరా.... పోల్కంపేటలో పాషా సోదరులు కొంత కాలం గా విక్రయించిన సిమ్‌కార్డుల గురించి హైదరాబాద్ పోలీసులు ఆరా తీశారు. ఏ నెట్‌వర్క్‌కు సంబంధించి ఎన్ని సిమ్ కార్డులు విక్రయించారు? స్థానికంగా ఎందరికి అమ్మారు? స్థానికుల పేర్లతో హైదరాబాద్‌కు ఎన్ని సిమ్‌కార్డులు పంపించారు? అన్న విషయాలపై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అత్యాశకు పోయి పోలీసులకు చిక్కిన పాషా సోదరుల గురించి గ్రామంంలో చర్చించుకుంటున్నారు. ఇంతకాలం వారు గ్రామంలో సిమ్‌కార్డులు విక్రయిస్తూ బతుకుతున్నారనే అనుకున్నామని, కానీ వారు ఇంత పెద్ద కేసులో ఇరుక్కుంటారనుకోలేదని పేర్కొంటున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, దోమకొండ: దోమకొండ మండలం గొట్టిముక్కుల గ్రామానికి చెందిన రైతు ధర్పల్లి రాజిరెడ్డి(46) మంగళవారం సాయంత్రం అప్పుల బాధతో వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. రాజిరెడ్డికి గ్రామ శివారులో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో మొక్కజొన్న సాగు చేశాడు. అకాల వర్షాలతో పంట దెబ్బతింది. వచ్చిన పంటను తక్కువ ధరకు అమ్ముకున్నాడు. దీనికి తోడు ఇటీవల నెల క్రితం రాజిరెడ్డి కుమారుడు సాగర్‌కు యాక్సిడెంట్ కాగా ఆస్పత్రిలో దాదాపు రూ.మూడు లక్షల వరకు ఖర్చయింది. దీంతో మానసికంగా కృంగిపోయిన రాజిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కుమారులు సాగర్, సంపత్ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు. -
బాలుడికి ఉరి.. తల్లిపైనే అనుమానాలు!
సాక్షి, డిచ్పల్లి(నిజామాబాద్) : చెల్లెలితో సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడు అంతలోనే విగత జీవిగా మారాడు. తల్లి పొంతన లేని మాటలు.. బాలుడి మెడపై తాడుతో ఉరి వేసినట్లు గాయాలు ఉండటంతో తల్లియే ఉరేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో జన్నెపల్లి అశోక్, సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు నాగరాజు, రాజేశ్, కూతురు ధనలక్ష్మి సంతానం. పెద్ద కుమారుడు నాగరాజు పిట్లంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకోగా.. రెండో కుమారుడు, కూతురు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఇంటి ఎదుట చెల్లెలితో కలసి రాజేశ్ ఆడుకున్నాడు. కొద్ది సేపటికే విగత జీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పరిశీలించిన స్థానికులు.. మెడపై గాయాలు ఉండటంతో ఉరి వేసి చంపి ఉంటారని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పొంతనలేని మాటలు తనతో గొడవ పడే ఇద్దరు మహిళలు రాజేశ్‌కు చాక్లెట్లు ఇచ్చి గొంతు నులిమి హత్య చేశారని తల్లి సునీత పోలీసులకు చెప్పింది. అయితే రాజేశ్‌ను పాము కాటు వేసిందని, తొందరగా రావాలని భార్య సునీత ఫోన్ చేస్తే ఇంటికి వచ్చానని భర్త అశోక్ తెలిపాడు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లనిచ్చేది లేదని సునీత పట్టు బట్టడం, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో రాజేశ్ మృతిపై మరిన్ని సందేహాలను రేకిత్తిస్తున్నాయి. ఆమె వివాహేతర సంబంధాలకు కుమారుడు అడ్డుగా ఉన్నాడని ఉరి వేసి చంపి ఉం టుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో పగిలిన గాజులు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. మృతుడి మెడపై ఉన్న గాయాలను నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి నిజాలను రాబడతామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఆటోను ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి
శుభకార్యంలో పాల్గొనడానికి దర్గాకు వెళ్లిన ఆ ఐదుగురు.. ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చనిపోయిన వారందరూ జానకంపేట వాసులే.. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సాక్షి, ఎడపల్లి(నిజామాబాద్) : జానకంపేట సర్పంచ్ తన కూతురు కేశఖండనం కార్యక్రమాన్ని కుర్నాపల్లిలోని అబయ్యదర్గా వద్ద నిర్వహించారు. ఈ శుభకార్యంలో పాల్గొనడానికి గ్రామానికి చెందిన జక్కం బాలమణి(68), గంగామణి(60), కళ్లపురం సాయిలు(68), చిక్కల సాయిలు(60) ఆటోలో వెళ్లారు. భోజనంచేసి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అలీసాగర్ –జానకంపేట గ్రామాల మధ్యనున్న మూలమలుపు వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. అ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బాలమణి, గంగామణి, కళ్లపురం సాయిలు, చిక్కల సాయిలుతోపాటు ఆటో డ్రైవర్ నయీం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ నయీంను నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొద్ది సేపటికే ఐదుగురూ మృతి చెందారు. కారులోని వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
కర్కశం : కన్న కొడుకును ఉరేసి..
సాక్షి, నిజామాబాద్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే ఆ బాలుడి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. కంటిపాపలా చూసుకోవాల్సిన కన్నకుమారుడినే కడతేర్చి కర్కశంగా ప్రవర్తించింది. ఈ హృదయవిదారక సంఘటన ఆదివారం డిచ్పల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డిచ్పల్లి మండలం ధర్మారానికి చెందిన పద్మ అనే మహిళకు ఎనిమిది సంవత్సరాల బాబు రాజేష్(8) ఉన్నాడు. గత కొంతకాలంగా వారి కుటుంబంలో గొడవలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలతో కలత చెందిన పద్మ అన్నెం పున్నెం ఎరుగని కొడుకును ఉరివేసి చంపింది. ఈ ఘటన పలువురి మనసులను కలిచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బైక్ కొనివ్వలేదని బలవన్మరణం
సాక్షి, భిక్కనూరు: ఎన్నిసార్లు అడిగినా తండ్రి బైక్ కొనివ్వడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భిక్కనూరు మండలం జంగంపల్లిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. జంగంపల్లి గ్రామానికి చెందిన లింగం, నర్సవ్వ దంపతులు కుమారుడు అనిల్ (23). తనకు పల్సర్ బైక్ కొనివ్వమని అనిల్ కొన్ని నెలలుగా తన తండ్రిని కోరుతున్నాడు. అయితే, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెబుతూ తండ్రి వాయిదా వేస్తు వచ్చాడు. ఈ విషయమై సోమవారం అనిల్ తన తండ్రితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం సోమవారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్నానని చెప్పిన అనిల్ అక్కడికి వెళ్లి పశువుల కొట్టంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చుట్టు పక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
న్యాల్కల్ రోడ్డులో భారీ చోరీ
నిజామాబాద్‌అర్బన్: న్యాల్కల్ రోడ్డులోని లలితానగర్‌లో సోమవారం ఓ ఇంట్లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఇంటి యాజమని తిమ్మయ్య, లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి వేళ ఆరుగురు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఇద్దరు దొంగలు లక్ష్మి వద్ద, నలుగురు దొంగలు తిమ్మయ్య వద్దకు వచ్చి కత్తులతో బెదిరించారు. ఇంట్లో బీరువా తాళాలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని భయపెట్టారు. గత్యంతరం లేక వారు దొంగలకు తాళాలు ఇచ్చారు. దీంతో దొంగలు ఇంట్లోని 16 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 50 వేల నగదు దోచుకెళ్లారు. పిల్లల వద్ద ఉన్న బంగారం చైన్ ఇవ్వకపోతే తిమ్మయ్యపై దుప్పటి వేసి కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో వారు కూడా బంగారు చైన్లు ఇచ్చేశారు. దొంగలు పారిపోతూ ఇంట్లోని వారిని గదిలో బంధించి వెళ్లిపోయారు. అనంతరం కిటిలో నుంచి చుట్టుపక్కల వారిని పిలిచి గది తలుపులు తీయించుకున్నట్లు వారు తెలిపారు. వారు వెంటనే 5 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని ఇంటిని పరిశీలించారు. అనంతరం సీపీ కార్తికేయ, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఎస్సై జానరెడ్డిలు కూడా ఇంటిని పరిశీలించారు. దొంగలు డ్రాయర్లు, బనియన్లు ధరించి ఉన్నారని ఇంటివారు పోలీసులకు వివరించారు. ఇది మహారాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చేపడుతున్నారు. -
ఇందూరు దొంగ ఓరుగల్లులో చిక్కాడు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాకు చెందిన గంజాయి స్మగ్లర్ వరంగల్ జిల్లా పోలీసులకు పట్టుపడ్డాడు. నిజామాబాద్ నుంచి నేరుగా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు వరంగల్ పోలీసులు వెల్లడించారు. గతంలో గంజాయి అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ కొందరి కేసులు, పీడీయాక్టు నమోదు చేశారు. అయినా జిల్లా నుంచి గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. వరంగల్ పోలీసులకు శుక్రవారం జిల్లాకు చెందిన గంజయివాలా రూ.30 లక్షల గంజాయిని మహారాష్ట్రకు సరఫరా చేస్తూ హసన్‌పర్తి పోలీసులకు చిక్కాడు. దీంతో అక్కడి పోలీసులు గంజాయి వాలాపై గతంలో నిజామాబాద్‌లో ఇంకా ఏవైనా కేసులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. మరో వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఇద్దరు గంజాయివాలాలు జిల్లా కేంద్రం నుంచి నాందేడ్‌కు వాహనాలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సోహైల్ కారులో గంజాయి రవాణా చేస్తున్నట్లు అక్కడి పోలీసుల విచారణలో తేలింది. -
నిజామాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
-
భవనంపై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: పట్టణంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాధవనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో వర్ష అనే అమ్మాయి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల భవనంపై నుంచి దూకి సోమవారం ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన వర్షను కళాశాల యాజమాన్యం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
గుట్టల్లో గుట్టుగా గంజాయి సాగు
నిజాంసాగర్ (జుక్కల్): జుక్కల్ మండలం కౌలాస్ ఖిల్లా అటవీ ప్రాంతంలోని పాండవుల గుట్టల్లో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయి గుట్టును అధికారులు రట్టు చేశారు. రూ.5 లక్షల విలువైన గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్, బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం మెరుపుదాడి చేశారు. పోచారం తండాకు చెందిన బార్దల్ నారాయణ కౌలాస్ అటవీ ప్రాంతంలో సాగు చేసిన 1.5 ఎకరాల్లో పత్తి పంటలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నాడు. సమాచారమందుకున్న ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి, 1,050 గంజాయి మొక్కలను తొలగించి వాటిని కాల్చేశారు. నిందితుడు నారాయణపై కేసు నమోదు చేశామని, గంజాయి మొక్కల విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ సీఐ సుధాకర్ తెలిపారు. -
ఆందోళన : ఇంటికి నిప్పు పెట్టిన బంధువులు
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని సిరికొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది. గోప్యనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న తండాలో సుజాత అనే మహిళ ఉరివేసుకుని ఆదివారం బలన్మరణానికి పాల్పడింది. అత్తింటివారు వేధింపులకు పాల్పడటంతోనే సుజాత ఆత్మహత్య చేసుకుందని ఆమె తరపు బంధువులు ఆరోపించారు. సుజాత అత్తింటివారి ఎదుట ఆందోళనకు దిగారు. వారి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అయితే, విషయాన్ని గ్రహించిన మృతురాలి భర్త, అత్తామామలు అక్కడ నుంచి పరారీ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ఆందోళన : ఇంటికి నిప్పు పెట్టిన బంధువులు
-
దిగివచ్చిన మద్యం సిండికేట్..
మోర్తాడ్(బాల్కొండ): అక్టోబర్ నెల కోసం ప్రత్యేక ధరను అమలు చేసిన మద్యం సిండికేట్ దిగివచ్చింది. ఒక్కో సీసాపై రూ.10 ధర పెంచగా ఆ ధరను ఎత్తివేసి పాత పద్దతిలోనే ఎంఆర్పీ ధరకు మద్యంను విక్రయిస్తున్నారు. గడచిన సెప్టెంబర్ 30తోనే మద్యం దుకాణాల లైసెన్స్‌కు గడువు ముగిసిపోయింది. అయితే కొత్త మద్యం పాలసీ అమలు కావడానికి కొంత సమయం పట్టడంతో అక్టోబర్ నెల కోసం లైసెన్స్‌లను రెన్యూవల్ చేశారు. లైసెన్స్ ఫీజు ఎక్కువ చెల్లించడం, తమకు లాభం తగ్గిపోవడంతో రూ.10 ధర అదనంగా విక్రయించడానికి మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఎక్కువ ధరలకు మద్యం విక్రయించడంపై ఫిర్యాదులు అందినా స్థానిక ఎక్సైజ్ అధికారులు పట్టించుకోక పోవడంతో కొందరు హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించి ఆ అధికారులు మద్యం అమ్మకాలపై నిఘా ఉంచి రెండు దుకాణాల నిర్వాహకులకు రూ.2లక్షల వరకు జరిమానా విధించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో మద్యం సిండికేట్ దిగివచ్చింది. మొదట్లో ప్రత్యేక ధరను అమలు చేసినా కేసులకు జడిసి పాత పద్దతిలోనే మద్యం విక్రయాలకు ఓకే చెప్పారు. మద్యం సిండికేట్ దిగివచ్చి ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయిస్తుండటంతో మందు బాబుల జేబులకు చిల్లు పడటం ఆగిపోయింది. -
నిశా'చోరులు': ఆలయాలే టార్గెట్
వారి వృత్తి చోరీలు.. ఆలయాలే టార్గెట్.. రాత్రి వేళల్లో జన సంచారం ఉండదు కాబట్టి ఆ సమయంలోనే దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇలా కామారెడ్డితోపాటు నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలలో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. సాక్షి, కామారెడ్డి: రాత్రి వేళల్లో నిర్మానుష్యంగా ఉన్న ఆలయాలను టార్గెట్ చేస్తూ మూడు జిల్లాల పరిధిలో 18 చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ శ్వేత శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. మాచారెడ్డి మండలం నడిమి తండాకు చెందిన భూక్యా దరి, భూక్యా గణేశ్ ఆలయాల్లో చోరీలు చేయడా న్ని వృత్తిగా ఎంచుకున్నారు. ఆలయాల్లో రాత్రి సమయంలో ఎవరూ ఉండరు కాబట్టి సులువుగా దొంగతనాలు చేయవచ్చన్నది వీరి ఉద్దేశం. ఆలయాల తాళాలు పగులగొట్టి, హుండీలు, వస్తువులు ఎత్తుకెళ్లేవారు. ఆభరణాలను అమ్ముకుని అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. వీరు నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల పరిధిలో 18 ఆలయాల్లో చోరీలు చేశారు. గురువారం రామారెడ్డి ఎస్సై రాజు పోలీసులతో కలిసి గొల్లపల్లి వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన వీరిద్దరు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు పట్టుకుని విచారించగా.. చోరీల డొంక కదిలింది. నేరాల చిట్టా.. గణేశ్, దరిలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో 4, దేవునిపల్లి పీఎస్ పరిధిలో 3, మాచారెడ్డి, దోమకొండ, రాజంపేట పీఎస్‌ల పరిధిలో ఒక్కో చోరీ కేసు నమోదై ఉంది. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి, సిరికొండ పీఎస్‌ల పరిధిలో ఒక్కొక్కటి, సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట పరిధిలో 3, ఎల్లారెడ్డిపేట పరిధిలో 2, వీర్నపల్లి ఠాణా పరిధిలో ఒకటి చొప్పున కేసులున్నాయి. ఆయా ఆలయాల్లో హుండీలోని నగదు, ఆభరణాలతోపాటు యాంప్లిఫయర్ పరికరాలను ఎత్తుకెళ్లారు. మొత్తం 18 కేసుల్లో రూ. లక్షా 63 వేల సొత్తును అపహరించారు. నిందితులను పట్టుకుని లక్షా 2 వేల విలువైన 11 యాంప్లిఫయర్లు, ఇతర వస్తువులను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాలుంటాయని తెలిసినా... ఆలయాల్లో సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసినా నిందితులు దొంగతనాలకు పాల్పడేవారని ఎస్పీ తెలిపారు. చాలా చోట్ల సీసీ కెమెరాల ఆధారంగానే నిందితులను గుర్తించామన్నారు. కొన్ని సందర్భాల్లో ఆలయాల్లోని సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసేందుకు సైతం ప్రయత్నించారన్నారు. చివరికి సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగానే నేరాల చిట్టా బయటపడిందన్నారు. కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి పోలీస్స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలను అత్యధికంగా ఏర్పాటు చేసే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులను అభినందించారు. 18 ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన రామారెడ్డి పోలీస్ కానిస్టేబుళ్లు బాబయ్య, కృష్ణలకు నగదు పురస్కారాలను అందజేశారు. కేసు ఛేదనలో కృషి చేసిన డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, రామారెడ్డి ఎస్సై కే.రాజు, కానిస్టేబుళ్లు నరేష్, భూమయ్య, రంజిత్, హోంగార్డు నర్సింలులను అభినందించారు. -
యువతిని మోసగించినందుకు ఏడేళ్ల జైలు
సాక్షి, నిజామాబాద్: ప్రేమించి గర్భవతిని చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ఒకరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం ఫ్యామిలీ కోర్టు జడ్జి సి. రత్నప్రభావతి తీర్పు చెప్పారు. దీని వివరాలను పీపీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని మిర్చి కంపౌడ్‌కు చెందిన గైక్వాడి యశోద బార్దాన్ లెబర్‌గా పని చేస్తుండగా, అదే కాలనీకి చెందిన నవబందే సునీల్ లారీ క్లీనర్‌గా పని చేసేవాడు. ఒకే కాలనీకి చెందిన వీరిద్దరూ పరిచయటం కావటంతో అది ప్రేమగా మారింది. దాంతో సునీల్ యశోదతో శారీరక సంబంధం పెట్టుకుని ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం సునీల్ యశోద వద్దకు రాకపోవడంతో ఆమె అతడికి ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. దీంతో సునీల్ నిరాకరిస్తూ ఫోన్ స్వీచ్ఛాఫ్ చేశాడు. దీంతో యశోద ఒకటి ఏప్రిల్ 2014న నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సునీల్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు సునీల్‌పై ఐపీసీ 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్హెచ్ఓ నర్సింగ్‌యాదవ్ ఈ కేసును దర్యాప్తు చేశారు. పోలీసులు యశోదకు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా ఆమె గర్భవతని తేలటంతో సునీల్‌పై ఐపీసీ 376 సెక్షన్‌ను జత పరిచి కేసు నమోదు చేశారు. కాగా యశోద 7వ నెలలోనే ప్రసవించడంతో పుట్టిన మగబిడ్డ మృతి చెందాడు. బాబు ఎముకలను సేకరించిన పోలీసులు డీఎన్ఏ పరీక్షలకు పంపగా, బాబు సునీల్ యశోదలకే జన్మించినట్లు అక్కడి నుంచి రిపోర్టు వచ్చింది. దాంతో కేసు విచారణలో సునీల్ చేసిన నేరం రుజువు కావడంతో ముద్దాయికి మూడు సెక్షన్ల కింద ఏడేళ్ల జైలు, రూ. 600 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ శిక్షలన్ని ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. -
ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్తున్నారా..
సాక్షి, నిజామాబాద్: దసరా సెలవులు వచ్చాయి.. ఇంటికి తాళం వేసి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు తస్మాత్ జాగ్రత్త అంటు పోలీసు శాఖ హెచ్చరిస్తుంది. ప్రతి ఏటా వేసవి సెలవులతో పాటు దసరా సెలవుల సమయాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇటీవల దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతన్నారు. అంతరాష్ట్ర ముఠా జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతుంది. ఇదీ పరిస్థితి జిల్లాలో గతంలో జరిగిన దొంగతనాలను పరిశీలిస్తే 2017లో రాత్రిపూట 192, పగటిపూట 34, 2018లో రాత్రిపూట 206, పగలు 42, 2019లో రాత్రిపూట 120 , పగలు 14 దొంగతనాలు జరిగాయి. ఇలా దొంగతనాల సంఖ్య పెరుగుపోతుంది. జిల్లా కేంద్రంలో ముబారక్‌నగర్ ప్రాంతంలో ఓ ఇంటిపై దొంగతనానికి ప్రయత్నించారు. ఏకకాలంలో వినాయక్‌నగర్, శ్రీనగర్ కాలనీలో బంగారు దుకాణాల్లో మహారాష్ట్ర కు చెందిన ముఠా దొంగతనాలకు పాల్పడింది. ఇటీవల సీతారాంనగర్‌కాలనీలో ఓ కారును ఎత్తుకెళ్లారు. ఇదే ప్రాంతంలో మరో మూడు ఇళ్లలో వారం రోజుల్లోనే చోరీలు జరిగాయి. తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేశారు. సీసీ కెమెరాలు ఎంతో మేలు ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగనాలు నివారించవచ్చు. ఇటీవల జరిగిన పలు ఘటనల్లో సీసీ కెమెరాలను గమనించి దొంగలు వెనకడుగు వేశారు. సీసీ కెమెరాలు ఉంటే చోరీ జరిగిన దొంగలను త్వరగా పట్టుకోవచ్చు. సెలవుల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయడం ద్వారా కూడా చోరీలను అదుపు చేయవచ్చని పలువురు పేర్కొంటున్నారు. నగరంలో ఇదివరకే ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాల ద్వారా రాత్రి వేళలో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇళ్లకు తాళం వేసి, ఊర్లకు వెళ్లే వారు పలు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హర్ ఏక్‌మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని పలుకరించండి విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్లకూడదు ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకొండి పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిది. కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి తాళం వేసి ఊరు వెళ్లే ముందు సమీప పోలీసుస్టేషన్లో సమాచారం అందించాలి జాగ్రత్తలు తీసుకోండి ఇంటికి తాళం వేసే వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విలువైన వస్తువులు ఇంటిలో పెట్టుకోవద్దు. అలాగే రాత్రి వేళలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ కొనసాగుతుంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అనుమానస్పదంగా ఉన్న వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం అందించాలి. – ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ -
మహిళా దొంగల ముఠా హల్చల్
సాక్షి, బోధన్: నవీపేట బస్టాండ్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం మహిళా దొంగల ముఠా హల్చల్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పది మంది మహిళల ముఠా వీధుల్లో పూసలు అమ్ముతున్నట్లు నమ్మించి, బస్టాండ్‌లో తోటి ప్రయాణికులతో మాట కలిపారు. బస్టాండ్‌లోకి వచ్చి పోమే ప్రయాణికులను గమనిస్తూనే చుట్టు పక్కల ప్రయాణికులతో మాటామంతి చేశారు. నవీపేటకు చెందిన ఓ మహిళ రూ.3 లక్షల చీటీ డబ్బులను బ్యాగులో వేసుకుని నిజామాబాద్ బస్సు ఎక్కింది. గమనించిన ముఠా సభ్యులు బస్సులో ఎక్కే ప్రయత్నం చేస్తూనే బ్యాగును పట్టుకున్నారు. గమనించిన సదురు మహిళ అప్రమత్తం కావడంతో తోటి ప్రయాణికులు ముఠాను మందలించారు. బస్సులోంచి దింపేశారు. సంతృప్తి చెందని ముఠా సభ్యులు ఎలాగైన పని కానించాలని మళ్లీ బస్టాండ్‌కు వచ్చారు. అంతలోనే హోల్‌సేల్ బట్టల దుకాణంలో మునీమ్‌గా పని చేసే నారాయణ నవీపేటలో రూ.48 వేల కలెక్షన్ చేసుకుని తిరుగు ప్రయాణానికి బస్టాండ్‌కు వెళ్లాడు. ఇతనిని గమనించిన ముఠా సభ్యులు చాకచాక్యంగా రూ.48 వేల బ్యాగును కొట్టేశారు. ఆ బ్యాగుతో ఇద్దరు మహిళలు ఆటోలో నిజామాబాద్ వైపు వెళ్లిపోయారు. గమనించిన బాధితుడు కేకలు వేస్తూ పరుగులు తీయగా రూ.10 వేలను కొద్ది దూరంలో పారేసి ఆటోలో వెళ్లిపోయారు. దీంతో స్థానికులు అనుమానాస్పదంగా ఉన్న మరో ఎనిమిది మంది మహిళలను నిలదీశారు. వారిని పోలీసులకు అప్పగించారు. బాధితుడు నారాయణ ఫిర్యాదు మేరకు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. -
పోలీసుల అదుపులో ఆ ముగ్గురు?
సాక్షి, నిజామాబాద్: ఎట్టకేలకు నిషేధిత క్లోరోహైడ్రేట్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని హైదరాబాద్‌లో మూడు ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి. నేడో, రేపో విచారించి రిమాండ్‌కు పంపనున్నట్లు సమాచారం. నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ వద్ద గత కొన్ని రోజులుగా గుజరాత్ నుంచి వస్తున్న క్లోరోహైడ్రేట్‌ను పక్కా సమాచారంతో ప్రత్యేక పోలీసులు పట్టుకున్నారు. అనంతరం టాటా ఏసీలో క్లోరోహైడ్రేట్ సంచులను ఎక్కించే క్రమంలో పోలీసులు రావడంతో దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. దీంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందినవారే.. నగర శివారులోని మాధవనగర్ వద్ద పట్టుకున్న క్లోరోహైడ్రేట్ వెనుక పెద్ద అక్రమ దందా కొనసాగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు పట్టుపడిన నిషేధిత పదార్ధాల సరఫరా నిజామాబా ద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తు లు కొనసాగిస్తున్న పోలీసులు అనుమానిస్తున్నా రు. స్పెషల్ పోలీసులు రహస్యంగా విచా రణ చేస్తున్నారు. కల్లులో కలిపే ఈ పదార్థం నిజామాబాబాద్ నుంచే ఉత్తర తెలంగాణకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. గుజరాత్ నుంచి జిల్లా కేంద్రానికి తీసుకువస్తుండగా స్పెషల్ పోలీసు లు, స్థానిక పోలీసులతో కలసి వల పన్ని పట్టుకున్నారు. రూ.లక్షలాదిగా విలువ చేసే ఈ నిషేధిత పదార్థాన్ని లారీలో తెస్తూ పోలీసులకు దొ రికిపోయారు. ప్రస్తుతం లారీ డ్రైవర్‌తో పాటు టాటా ఏసీ డ్రైవర్, మరో ఇద్దరిని పోలీసు లు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. రహస్య ప్రాంతంలో విచారణ.. నిషేధిత పదార్థాల అక్రమ సరఫరా చేస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. వారు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొడ నియోజకవర్గానికి చెందినవారు ఇద్దరు, కామారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు ఉన్నట్లు తెలిసింది. వీరు కొంత కాలంగా గుజరాత్ నుంచి నిషేధిత పదార్థం తెచ్చి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. కొనేళ్లుగా రూ.కోట్లాదిగా వెనుకేసుకుంటున్నారు. ప్రస్తు తం వీరు ఎక్కడ ఉన్నారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరంలోని ముబారక్‌నగర్‌లో ఓ రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. టాటా ఏసీ డ్రైవర్ వద్ద సమాచారం, ఫోన్ నెంబర్‌తో విచారణ చేపట్టారు. కామారెడ్డికి చెందిన నిందితుడి కుమారుడిని విచారించగా మరికొంత సమాచారం రా బట్టారు. దీంతో పోలీసులు ముగ్గురిని వల పన్ని పట్టుకున్నారు. అనంతరం వీరితో గుజరాత్ నుంచి నిజామాబాద్‌కు క్లోరోహైడ్రేట్ ఎప్పటి నుంచి తెస్తున్నారు, ఏ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి వ్యక్తులందరిని విచారించి అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రత్యేక పోలీసు బృందం గుజరాత్ వెళ్లి విచారించనుంది. -
దుబ్బాకలో కిడ్నాప్.. నిజామాబాద్‌లో ప్రత్యక్షం
సాక్షి, నిజామాబాద్: ధర్పల్లి మండలం దుబ్బాక రోడ్డులో డీబీతండాకు చెందిన యువతి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. శనివారం మధ్యాహ్నం కిడ్నాప్‌నకు గురి కాగా అదే రోజు రాత్రి నిజామాబాద్ బస్టాండ్ వద్ద యువతి తప్పించుకొని ఇంటికి చేరింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దుబ్బాకలో వరి కోత మిషిన్ పని చేసే వ్యక్తితో యువతికి గతంలోనే పరిచయం ఉంది. దీంతో యువతిని శనివారం మధ్యాహ్నం బయటకు వెళుతామని కారులో తీసుకెళ్లారు. ఇంతలోనే యువతి తల్లి చూసి కూతురుని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. సదరు వ్యక్తిని నిజామాబాద్‌కు తెచ్చారు. బస్టాండ్ వద్ద కారు డోరు లాక్ పడకపోవడంతో యువతి కారు నుంచి తప్పించుకొని వెళ్లింది. సదరు యువకుడు కారులో పారిపోయాడు. ఇందల్వాయి బస్టాండ్ వద్ద కారు మొరాయించడంతో చేసేది ఏమిలేక యువకుడు పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ తన కార్యాలయానికి యువకుడిని తెచ్చి విచారించి కేసు నమోదు చేశారు. యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు ఏమంటున్నారంటే.. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం యువతిని కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు మధ్యాహ్నం నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు శ్రమించగా తెల్లవారుజామున 5.45 గంటలకు నిజామాబాద్ బస్టాండ్‌లో బాలిక పోలీసులకు లభించింది. యువతిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని సఖీ సెంటర్‌కు తరలించారు. అక్కడే నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ధర్పల్లి సీఐ ప్రసాద్, ఎస్ఐ పాండేరావు విచా రించారు. అనంతరం ఏసీపీ కార్యాలయంలో శ్రీనివాస్‌కుమార్ మాట్లాడారు. యువతి శనివారం మధ్యాహ్నం కిడ్నాప్‌నకు గురైందని ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి టోల్గేట్, జక్రాన్‌పల్లి, భీంగల్‌తోపాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తం గా పోలీసులను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అన్ని పోలీసు స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లు, రైల్వేస్టేషన్, బస్టాండ్లల్లో సైతం తనిఖీ చేయగా తెల్లవారుజామున నిజామాబాద్ బస్టాండ్‌లో యువతిని పట్టుకున్నట్లు చెప్పా రు. ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ యువతిని విచా రించగా పలు విషయలు బయటకు వచ్చాయన్నారు. దుబ్బాకకు చెందిన నగేష్ యువతిని కిడ్నాప్ చేశాడని, ముఖ పరిచయం ఉందని బాధిత యువతి తెలిపినట్లు ఏసీపీ తెలియజేశారు. ప్రస్తుతం నిందితుడు నగేష్ తమ అదుపులో ఉన్నాడని, విచారిస్తున్నామని, అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తా మన్నారు. ధర్పల్లి పోలీసుస్టేషన్లో కేసు ధర్పల్లి పోలీసు స్టేషన్లో యువతిని కిడ్నాప్ చేసిన నిందితుడు నగేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లైంగికదాడి, కిడ్నాప్ చట్టం కింద రెండు కేసులు నమోదు చేశామని వారు పేర్కొన్నారు. ధర్పల్లి సీఐ, ఎస్ఐలు ఇప్పటికే విచారణ చేపట్టారు. -
సినిమా అని తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్!
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని నిజామాబాద్ మండలం సారంగాపూర్ శివారులో దారుణం చోటుచేసుకొంది. సినిమా అని చెప్పి ఓ యువతిని బయటకు తీసుకెళ్ళి ఆరుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారం చేస్తుండగా మరో యువకుడు వీడియో చిత్రీకరించాడు. శనివారం బాధితురాలు నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ అమానవీయ ఘటనకు వ్యతిరేకంగా జిల్లాలోని మహిళా సంఘాలు, ఐద్వా నాయకురాలు సబ్బని లత ఆసుపత్రికి వచ్చి సంఘీభావం తెలిపారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ప్రియుడు సురేష్, తన కూతురిని సినిమా అని చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వాపోయారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు అధికారులు తెలిపారు. -
ఎస్సారెస్పీలోకి రసాయనాలు!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీరు పూర్తిగా రంగు మారుతోంది. స్థానిక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన 20 రోజులు క్రితం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల్లో ఫ్యాక్టరీల నుంచి రసాయనాలను ప్రాజెక్ట్‌లోకి మళ్లించడంతోనే నీరు కలుషితమవుతోందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలు కలిసిన నీటిని పంటలకు అందిస్తే తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ నుంచి వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుంది. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు తాగు నీటిని కూడ ఈ ప్రాజెక్ట్ నుంచే సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ నీటి కలుషితంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రాజెక్ట్ కాలనీ వాసులకు ఇక్కడి నుంచే తాగు నీటిని అందిస్తారు. కాలనీలో వాటర్ ట్యాంకు వరకు నీటి సరఫరా చేసి అక్కడ శుద్ధి చేసి సరఫరా చేస్తారు. ఉన్నతాధికారులు ప్రాజెక్ట్‌లో నీటి కలుíషితంపై విచారణ చేపట్టాలని, ఆయకట్టు పంటలను రక్షించాలని రైతులు కోరుతున్నారు. అయితే, ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలో వ్యర్థాలు కలవడం వలనే ప్రాజెక్ట్ నీరు రంగు మారుతుందని, ప్రతి ఏటా ఇలానే జరుగుతుందని ఎస్సారెస్పీ డ్యాం డిప్యూటీఈఈ జగదీష్ తెలిపారు. -
గుంతలవుతున్న గుట్టలు!
బాన్సువాడ టౌన్: పుడమి తల్లి గుండెలపై ఆధునిక యంత్రాలు చిల్లులు వేస్తున్నాయి. తద్వారా ప్రకృతి వనరులు అక్రమార్కుల చేతుల్లో కరిగిపోతున్నాయి. విలువైన గుట్టలు, మట్టి కుప్ప లు మాయమవుతున్నాయి. ఏకంగా ప్రభుత్వ స్థలంలోనే మొరం తవ్వేస్తున్నారు. బాన్సువాడ పట్టణానికి కూత వేటు దూరంలో వాసుదేవ్పల్లి శివారు, బోర్లం, బుడ్మి తదితర గ్రామాల్లో ఈ దందా కొనసాగుతోన్న పట్టించుకునేనాథుడే కరువయ్యారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తుంటే రెవెన్యూ అధికారులు మామూలుగా వ్యవరిస్తున్నారు. గ్రానైట్, కంకర క్వారీలకు మాదిరిగానే మొరం తవ్వకాలకు కూడా గనులశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మంజూరు చేస్తారు. ప్రభుత్వ భూములైనా పట్టా భూములోనైనా నిబంధనలకు అనుగుణంగా అనుమతులుంటాయి. అభివృద్ధి పనుల పేరిట... రహదారులు, ఇళ్ల నిర్మాణాలు, చెరువుల కట్టలకు, మట్టి పనులు చేపట్టడానికి మొరం అవసరం. వీటి పేరు మీద ఇష్టారీతిన తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను తవ్వేస్తున్నారు. ఇలా తవ్విన గుంతో ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారాయి. ప్రమాదకరంగా గుంతలు... మొరం తవ్వడంతో ఏర్పడిన గుంతలు లోతుగా ఉన్నాయి. ప్రమాదవశత్తు అందులో పడితే ప్రాణాలు పోయే ప్రమాదముంది. నిత్యం 150 ట్రిప్పుల మొరం తరలిస్తున్నారు. ఒక్క టిప్పర్ మొరం రూ. 1200 ఉంది. ఈ లెక్కన రోజుకు రూ. లక్షా 80 వేల వ్యాపారం జరుగుతోంది. అధికారుల కనుసన్నల్లోనే... మొరం విక్రయాలకు అలవాటు పడిన పలువురు చోటామోటా కాంట్రాక్టర్లే కాకుండా నాయకులు ఇదే పనిలో కొనసాగుతున్నారు. వాస్తవానికి ఆయా గ్రామాల పరిధిలో ఉన్న ఖనిజ సంపద కాపాడాల్సిన వీరి కనుసన్నల్లోనే మొరం అక్రమార్కుల పరమవుతోంది. డిమాండ్ పెరగడంతో... బాన్సువాడ పట్టణం నుంచి వెళ్లే జాతీయ రహదారి విస్తరణతోపాటు ఇతర పనులు కూడా ఇటీవలే ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయి. వాటి నిర్మాణాలకు తగ్గట్టు కాంట్రాక్టర్లు అనుమతులు తీసుకోకుండానే ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి... ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఎక్కడ తవ్వకాలు జరిపినా హెక్టారుకు(2.20ఎకరాలు) రూ. 50 వేలు, గనుల శాఖకు మరో రూ.50 వేలు తపాలశాఖలో రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాలి. విక్రయాలపై అదనంగా 2.25 శాతం పన్ను చెల్లించాలి. ఇలా చెల్లించకపోవడంతో రూ. లక్షల్లో ప్రజాధనం అక్రమార్కుల పరమవుతోంది. బహిరంగా మార్కెట్లో టిప్పర్‌కు రూ. 1200 నుంచి రూ. 1500 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అనుమతులు తీసుకోవాలిలా.. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మొరం తవ్వకాలు చేపట్టినా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. తవ్వకాలు చేపట్టేందుకు ముందుగా గనులు, భూగర్భశాఖ జిల్లా ఆఫీస్‌లో అను మతిపొందాలి.ఇవిరెండురకాలుగాఉన్నాయి. స్థానికంగా ఇళ్ల నిర్మాణాలకు తక్కువ మొత్తంలో అవరమున్న తవ్వకాలను తహసీల్దార్ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) తీసుకోవాలి. అనంతరం మీ సేవా కేంద్రాల ద్వారా గనులు, భూగర్భశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో లేదా నెల రోజులకంటే ఎక్కువగా కానీ మొరం తవ్వకాలు జరపాలంటే జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి పొందాలి. అంతకు ముందు భూగర్భశాఖ, కాలుష్య, నియంత్రణ, డీఎఫ్‌వో, సంబంధిత ఆర్డీవో, తహసీల్దార్ అనుమతులు కూడా కోరాలి. వారు స్థలానికి వెళ్లి పరిశీలించిన అనంతరం వారి ఆమోదంతోనే కలెక్టర్‌కు నివేదిక అందజేస్తారు. ప్రైవేటు భూముల్లో అయితే సంబంధిత పట్టాదారు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. ఏ అనుమతులు ఇవ్వలేదు బాన్సువాడ శివారులో బోర్లం శివారు రోడ్డులో కొనసాగుతున్న తవ్వకాలకు ఎలాంటి ఇనుమతులు ఇవ్వలేదు. మొరం తవ్వకాలకు తప్పనిసరిగా అనుమతుల తీసుకోవాలి. తవ్వకాలపై నిఘా పెడతాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. – సుదర్శన్, తహసీల్దార్, బాన్సువాడ. -
గుట్కా కేసుల దర్యాప్తు అటక పైకే!
సాక్షి, నిజామాబాద్ అర్బన్: గుట్కా కేసుల దర్యాప్తులో పోలీసులు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారా..? కావాలనే ఆయా కేసులను తొక్కి పెడుతున్నారా..? అసలు సూత్రధారులను వదిలి అమాయకులను పట్టుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గుట్కా కేసుల దర్యాప్తులో పోలీసులు పెద్దగా పురోగతి సాధించక పోవడం వల్లే ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. అక్రమంగా గుట్కా తరలిస్తుండగా పట్టుకుని కేసులు పెట్టిన పోలీసులు.. అసలు సూత్రధారులెవరో తేల్చలేకపోయారు. రూ. కోట్లల్లో జరుగుతోన్న ఈ చీకటి దందా వెనుక ఉన్న కీలక వ్యక్తులెవరో గుర్తించలేకపోయారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు పేరిట పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నగరంలోని ముజాయిద్‌నగర్‌లో రూ.15 లక్షల విలువైన గుట్కా పట్టుబడిన కేసులో ఇంత వరకు పెద్దగా పురోగతి సాధించలేక పోయారు. అటకెక్కినట్లే..? జిల్లాలో ప్రతి నెలా కోట్ల రూపాయల అక్రమ గుట్కా దందా కొనసాగుతోంది.. ప్రభుత్వం గుట్కాలను నిషేధించడంతో అక్రమార్కులు హైదరాబాద్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. రాత్రి వేళ వాహనాల ద్వారా జిల్లా కేంద్రానికి గుట్కా తరలిస్తున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా సరుకు పంపిణీ చేస్తున్నారు. అయితే, ఈ దందా వెనుక ఉన్న వారి గురించి పట్టించుకోని పోలీసులు.. కిరాణషాపులు, చిరు వ్యాపారులపై దాడులు చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అంతే కాని బడా వ్యాపారుల సంగతి చూడడం లేదు. ప్రస్తుతం ముజాయిద్నగర్కు సంబంధించి గుట్కా కేసులో 20 రోజులు గడుస్తున్నా అసలు నిందితులను ఇంత వరకూ గుర్తించలేక పోయారు. గుట్కా పట్టుకునే సమయంలో బడా వ్యాపారులు అక్కడే ఉన్నా పట్టుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే కాలయాపన..! ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కనుసన్నల్లోనే ఈ దందా సాగుతోందన్నది బహిరంగ రహస్య మే! తన పలుకుబడితో పోలీసులను ‘మేనేజ్’ చేసుకుంటూ కేసులు ముందుకు సాగకుండా చేస్తున్నట్లు సమాచారం. అందుకే, గత కొన్నేళ్లుగా గుట్కా పట్టుబడిన కేసుల్లో సంబంధిత వాహన డ్రైవర్లపైనే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. అసలు సూత్రధారి ఎవరో తేల్చలేక పోతున్నారని ప్రచారం సాగుతోంది. కేసుల విషయంలో పోలీసులు ‘మామూలు’గానే వ్యవహరిస్తూ దర్యాప్తు పేరిట కావాలనే కాలయాపన చేయడం పరిపాటిగా మారింది. ♦ రెండేళ్ల క్రితం ధర్మపురి హిల్స్‌లో రూ.30 లక్షల విలువ చేసే గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న కొందరు కూలీలను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారు. అయితే, ఇంతవరకూ దీని వెనుక ఉన్న వారిని మాత్రం బయటకు తేలేక పోయారు. ♦ కంటెయినర్లో గుట్కా తరలిస్తుండగా, పోలీసులు వెంట పడడంతో నిందితులు జానకంపేట వద్ద కంటెయినర్‌ను వదిలేసి పారి పోయారు. ఈ కేసు అడుగు ముందుకు కదలడం లేదు. ♦ ఇక, పక్కా సమాచారంతో కాలూరు వద్ద గుట్కా కంటెయినర్‌ను పట్టుకున్న పోలీసులు... ఆ తర్వాత వదిలేసినట్లు అప్పట్లో బహిరంగంగానే చర్చ జరిగింది. ♦ గత నెలలో నగరంలోని ముజాయిద్‌నగర్‌లో రూ.15 లక్షల విలువైన గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. వాహన డ్రైవర్లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కానీ గుట్కాను ఎక్కడకు తరలిస్తున్నారు, ఎక్కడ విక్రయిస్తున్నారు.. ఈ దందా వెనుక ఎవరున్నది తేల్చలేక పోయారు. ♦ ఇలా చెప్పుకుంటే బోలెడు ఉదాహరణలు. గుట్కా పట్టుబడితే వాహన డ్రైవర్లపై కేసులు పెట్టడం, ఆ తర్వాత అటకెక్కించడం. ఇదే పరిపాటిగా మారింది తప్పితే అసలు సూత్రధారులను పట్టుకోవడం లేదు. విచారణ కొనసాగుతోంది.. ముజాయిద్‌నగర్‌లో పట్టుబడిన అక్రమ గుట్కా వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. దీని వెనుక ఎవరు ఉన్నా పట్టుకుంటాం. త్వరలోనే అసలు నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – ఆంజనేయులు, ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో -
అక్రమ కట్టడం కూల్చిందెవరు..?
భిక్కనూరు: మండల కేంద్రంలోని జీపీ ఎదురుగా నిర్మిస్తున్న అక్రమ కట్టడం పిల్లర్లను ఎవరు కూల్చారన్న విషయం భిక్కనూరులో చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయం ప్రొక్లెయిన్‌తో ప్రజలందరు చూస్తుండగానే రెండు పిల్లర్లను కూల్చివేశారు. ఈ విషయమై గ్రామసర్పంచ్ తున్కి వేణు, పాలకవర్గం సభ్యులు, ఈఓ రజనీకాంత్‌రెడ్డి తమకేమీ సంబంధం లేదని సమాధానమిస్తున్నారు. దీంతో ఎవరు ఈ అక్రమ కట్టడం పిల్లర్లను కూల్చారని ప్రశ్నించుకున్నారు. జీపీ వారే పిల్లర్లను కూలగొట్టించి మిన్నకుంటున్నారని కొందరు భావిస్తున్నారు. అక్రమ కట్టడం పిల్లర్లను కూలగొట్టించి జీపీ పాలకవర్గం తమకు తెలియదనడం ఎంత వరకు సమంజసమని మరికొందరు అంటున్నారు. ప్రొక్లెయినర్ యజమానిని, డ్రైవర్‌ను రప్పించి ఎవరు కూలగొట్టారన్న విషయమై ఆరా తీస్తామని గ్రామపెద్దలు అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఈఓ కిషన్‌రావును కలెక్టర్ సత్యనారాయణ గతంలో సస్పెండ్ చేసి, సర్పంచ్ తున్కి వేణుకు షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం విధితమే. పాలకవర్గ సభ్యులు మొదట అనుమతిచ్చి కలెక్టర్ ఈ విషయంలో సీరియస్‌గా ఉండడంతో అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఈ విషయం మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో చర్చనీయాంశంమైంది. తిరిగి ఆదివారం పిల్లర్లు కూల్చిన విషయం తమకు తెలియదని జీపీ పాలకవర్గం అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ కట్టడమైతే పూర్తిగా తొలగించాల్సింది పోయి, రెండు పిల్లర్లు మాత్రం ఎందుకు తొలగించారన్న విషయంపై గుసగుసలు వినిపించాయి. -
పక్కదారి పడుతున్న గృహావసర సిలిండర్లు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ‘డెమెస్టిక్’ గ్యాస్ సిలిండర్ల దందా కమర్షియల్‌గా సాగుతోంది. గృహావసరాలకు వినియోగించే(డొమెస్టిక్) సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు యథేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. ఈ వ్యాపారం ప్రధానంగా నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ లాంటి పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా జోరుగా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో ఇంటి సిలిండర్లను దొంగచాటున వినియోగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుండడంతో పాటు కొంత మంది ఏజెన్సీదారులకు తెరచాటున ఇదొక వ్యాపారంగా మారిపోయింది. అయితే డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా నిరంతరంగా తనిఖీలు చేయాల్సిన సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల కాలంలో తనిఖీలు చేయడం మానేశారు. ఎప్పుడో ఒకసారి తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపారాలకు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలున్నాయి. అయితే చాలామట్టుకు ఆ నిబంధనలను పాటించడం లేదు. ఎందుకంటే 19 కిలోలు గల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రసుతం రూ.1400 వరకు ఉంది. అదే గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 14.6 కిలోలు ఉండి దాని విలువ రూ.670 వరకు ఉంది. ఈ లెక్కన కమర్షియల్ సిలిండర్‌కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేయవచ్చు. గ్యాస్ కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల నిర్వాహకులు ఇది తప్పని తెలిసినా డొమెస్టిక్ గ్యాస్‌ను వినియోగించడానికి వక్ర మార్గాన్ని ఆచరిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలను మచ్చిక చేసుకుని డొమెస్టిక్ సిలిండర్లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్ ఏజెన్సీలకు కూడా ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు లాభం రావడంతో ‘డొమెస్టిక్’ దందా ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’గా మారింది. ఇటు సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏజెన్సీలతో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలున్నాయి. అందుకే వీరి డొమెస్టిక్ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు అంతంతే... హోటల్లో డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(ఫైల్) జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సింగిల్ కనెక్షన్లు సుమారు 2లక్షల 7వేల వరకున్నాయి. డబుల్ కనెక్షన్లు లక్షా 19వేల వరకు, దీపం కనెక్షన్లు 79వేల వరకు, సీఎస్ఆర్ కనెక్షన్లు 28,500 వరకు ఉన్నాయి. సిలిండర్లను సరఫరా చేసేందుకు ఇండియన్, హెచ్‌పీ, భారత్ కలిపి గ్యాస్ ఏజెన్సీలు 35 వరకు ఉన్నాయి. అయితే కమర్షియల్ సిలిండర్లు మాత్రం 3,400 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా అంతటా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, టిఫిన్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు హోటళ్ల సామర్థ్యం ఆధారంగా వారం ఒకటి నుంచి రెండు, మరి కొన్నింటిలో నెలకు ఐదు వరకు వినియోగం అవుతున్నాయి. ఒక కమర్షియల్ సిలిండర్‌పై వెళ్లదీయడం సాధ్యం కాని పని. ఈ సందర్భంగా డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్నారు. కార్లు, ఇతర వాహనాల్లో కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఎక్కిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా గృహావసరాలకు వినియోగించే సిలిండర్లు పక్కదారి పడుతున్నా అధికారులు మాత్రం ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
గల్ఫ్‌లో శ్రమ దోపిడీ
సాక్షి, కామారెడ్డి: నాలుగురాళ్లు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆశతో గల్ఫ్‌బాట పట్టారు. కంపెనీ వీసా పేరుమీద పని దొరుకుతుందని తెలియడంతో రూ.లక్షలు పోసి దేశం కాని దేశానికి వెళ్లారు. మొదట్లో అక్కడ అంతా బాగానే గడిచింది. కంపెనీల మోసాలు ఒక్కొక్కటిగా పెరిగిపోయి జీతాలు పెరిగిపోయాయి. ఏడాదికిపైగా జీతాలు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిలువునా దోపిడీకి గురైన తర్వాత చేసేదేమి లేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుప్పెడు దుఃఖాన్ని గుండెల్లో నింపుకుని ఇళ్లకు తిరిగివచ్చారు. ఒమన్ దేశం నుంచి మొత్తం 13 మంది గల్ఫ్ కార్మికులు గురువారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో దిగారు. వీరిలో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాగా ఒకరు ఆంధ్రప్రదేశ్, మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కార్మికులు. వీరిలో ఐదుగురు కామారెడ్డి జిల్లాకు చెందినవారు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన బుర్రస్వామిగౌడ్, గంగావత్ చందర్, మాచారెడ్డి మండలం ఫరీదుపేటకు చెందిన అబ్దూల్ మాజీద్, కామారెడ్డి మండలం క్యాసంపల్లికి చెందిన రవి, చిన్నమల్లారెడ్డికి చెందిన పంపరి గోపాల్ ఉన్నారు. రూ.లక్షల్లో నష్టపోయారు.. జిల్లాకు చెందిన కార్మికులు కంపెనీ వీసాపై ఓమన్ దేశంలోని మస్కట్‌లో హసన్ జుమాబాకర్ అనే భవన నిర్మాణ కంపెనీలో పని చేసేందుకు ఏడాదిన్నర క్రితం వెళ్లారు. ఆ సమయంలో ఒక్కొక్కరు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు వీసాలు, టిక్కెట్ల పేరిట చెల్లించుకున్నారు. మొదట కొంతకాలం జీతాలు సక్రమంగానే ఇచ్చిన కంపెనీ ఏడాది కాలంగా జీతాలు సక్రమంగా ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ.లక్ష 50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు రావాల్సి ఉంది. జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లాయర్‌ను సంప్రదించి కంపెనీ మీద కేసు వేశారు. ఇండియన్ ఎంబసిని కూడా ఆశ్రయించారు. ఎవరూ సరిగ్గా పట్టించుకోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కంపెనీ ప్రతినిధులను గట్టిగా నిలదీస్తే బెదిరింపులు, జైల్లో పెట్టిస్తామని భయపెట్టేవారని తెలిపారు. గత ఫిబ్రవరి నుంచి పనులకు హాజరుకాలేదు. చేతిలో చిల్లి గవ్వ లేక తిండికి కూడా కష్టంగా మారింది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వారు నివాసం ఉండే క్యాంపుల వద్దకు భోజనం తీసుకువచ్చి పెట్టేవారని బాధితులు చెబుతున్నారు. దాతల సహకారంతో స్వదేశానికి.. కంపెనీ మోసంతో స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించారు. వారు సహకారం అందించి అక్కడి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి స్వస్థలాలు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఓమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అనే సామాజిక సంస్థ కన్వీనర్ నరేంద్ర పన్నీరు వీరిని అక్కడి క్యాంపులో కలుసుకుని జేబు ఖర్చులకు ఒక్కొక్కరికి రూ.500 అందజేసినట్లు స్వస్థలాలకు చేరిన కార్మికులు తెలిపారు. మస్కట్ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 13 మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ విభాగం పక్షాన ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున ఎయిర్‌పోర్టు ప్రొటోకాల్ సిబ్బంది సహాయం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయుల సంఘం ప్రతినిధులు కోటపాటి నర్సింహానాయుడు, సురేందర్సింగ్ ఠాకూర్ బాధితులను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అష్టకష్టాలు పడ్డాం... మొత్తం 45 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు మా కంపెనీలో పనిచేసేశారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి 2.50 లక్షల వరకు సదరు కంపెనీ నుంచి జీతాలు రావాల్సి ఉంది. ఏడాదిగా ఇవ్వలేదు. అడిగితే జైల్లో పెడుతా మన్నారు. పని మానేశాక ఎన్నో కష్టాలు పడ్డాం. ఎంబసి వారు కూడా పట్టించుకోలేదు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరిగి వచ్చాం. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. –అబ్దుల్ మాజిద్, ఫరీదుపేట, మాచారెడ్డి మండలం. -
ప్రజలకు చేరువగా పోలీస్ ఠాణాలు
సాక్షి, నిజామాబాద్: ఒకప్పుడు పోలీస్ స్టేషన్లు అంటే అల్లంత దూరం ఉండేవారు జనాలు. అయితే ఇప్పుడు తీరు మారింది. పోలీసులు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్, 5ఎస్ విధానం అందులో భాగమే. ప్రధానంగా 5ఎస్ విధానం ద్వారా పోలీస్ స్టేషన్లను ఆదర్శంగా మారుస్తున్నారు. స్టేషన్‌కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు పోలీసులు యాక్షన్ మార్చారు. ప్రజలతో పోలీసులు మర్యాదగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదుదారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వారికి కేసుల పూర్వాపరాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. రిసెప్షన్ సెంటర్, రికార్డు రూం, కేసుల ఆన్లైన్, ఫిర్యాదుదారులకు సమాచారం, విచారణ గది, సిటిజన్ చార్ట్.. ఇలా ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నారు! వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. పోలీసుస్టేషన్లను ఆధునీకంగా తీర్చిదిద్దాలని, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మెరుగైన సేవలు అందించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే పోలీస్స్టేషన్లలో 5ఎస్ విధానంతో పాటు మరికొన్ని కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కాలంలో ఈ పద్ధతులు ఆయా పోలీస్స్టేషన్లలో అమలు చేసేందుకు సీపీ కార్తికేయ అధికారులకు సూచించారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో 4వ టౌన్ పోలీసు స్టేషన్ మాత్రమే పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. స్టేషన్‌కు నూతన హంగులు.. జిల్లా కేంద్రంలోని 4వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్నతాధికారులు ఆదేశాలు పక్కా అమలవుతున్నాయి. సిటిజన్ ఫ్రెండ్లీ టాస్క్‌గా సీపీ కార్తికేయ వివరించారు. ఈ పోలీసు స్టేషన్లో ప్రత్యేకంగా ఫిర్యాదులు తీసుకునేందుకు రిసిప్షన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఓ మహిళా కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారు. ఫిర్యాదుల సేకరణ త్వరగా తీసుకోవడం, బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ సిటిజన్ ఏర్పాటు చేశారు. దీనిలో అన్ని వివరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసిన వారి కేసు వివరాలు, కేసు పురోగతి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. పోలీసుస్టేషన్‌ను నూతన హంగులతో తీర్చిదిద్దారు. ఫిర్యాదుదారుడికి సౌకర్యం... ప్రత్యేక ఆన్లైన్ కేంద్రం, స్టేషన్‌కు వచ్చేవారికి సౌకర్యాలు, విచారణ గది, రిసెప్షన్ కౌంటర్, సిటిజన్ చార్ట్‌ను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేకంగా చెట్ల పెంపకం, పార్కింగ్ స్థలంతో పాటు చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ప్రతి ఫిర్యాదుదారుడికి సౌకర్యాలు కల్పించారు. మంచినీటి సదుపాయంతోపాటు బాధలను సమస్యలను చెప్పుకునేవారికి ప్రత్యేక రిసెప్షన్ అందుబాటులో ఉంది. 5ఎస్ విధానంలో ఉండే అంశాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. డయల్ 100 కాల్స్ వస్తే 5 నిమిషాల్లో స్పందించి వారికి ఫీడ్ బ్యాక్‌ను అందించే సదుపాయం ఉంది. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయడం, ఆ సమాచారాన్ని ఫిర్యాదుదారుడికి ఎప్పటికప్పుడు అందించనున్నారు. ప్రతి శనివారం కోర్టు డ్యూటీ ఆఫీసర్ ద్వారా మీటింగ్ పెట్టించి మిగితా సిబ్బంది వర్టికల్ విధానం ద్వారా పకడ్బందీగా అమలయ్యేలా చేస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా ఎవరి పని వారికి విభజించారు. పోలీసుస్టేషన్లో జోన్లను విభజించి నోడల్ ఆఫీసర్, డివిజన్ అసిస్టెంట్ ప్రతి జోన్‌కు సిబ్బందిని కేటాయిస్తున్నారు. ప్రతి నెల 5ఎస్ విధానంపై సమీక్ష నిర్వహించి జిల్లాలోనే 4వ టౌన్ మిగితా పోలీసుస్టేషన్‌కు ఆదర్శంగా నిలుస్తుందని సీపీ ప్రశంసిస్తున్నారు. మిగితా స్టేషన్ల సిబ్బందికి ఆదేశిస్తున్నారు. మెరుగైన సేవలు అందిస్తాం.. స్టేషన్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఆధునీకరించి 5ఎస్ విధానం అమలు చేస్తున్నాం. ప్రతి ఫిర్యాదుదారుడికి తక్షణమే న్యాయం చేకూర్చడం, ఫిర్యాదు తీసుకోవడంలో స్పందన, ప్రత్యేక రిసిప్షన్, సౌకర్యాలు ఏర్పటు చేశాం. మరింత మెరుగైన సేవలు తీసుకువస్తాం. ప్రజలకు సేవలు కొనసాగిస్తాం. –లక్ష్మయ్య, 4వ టౌన్ ఎస్ఐ -
గంజాయి సిగరెట్ @ రూ.100
సాక్షి, నిజామాబాద్: ఇప్పటి వరకు జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ మాత్రమే జరిగేది. తాజాగా వినియోగం కూడా పెరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా గంజాయి సిగరెట్లనే విక్రయిస్తున్నారు. ఒక్కో గంజాయి సిగరెట్‌ను రూ.వంద చొప్పున విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారుల విచారణలో తేలింది. గంజాయి సిగరెట్లకు యువత, విద్యార్థులు కూడా బానిసలుగా మారడం ఆందోళనకు గురిచేస్తోంది. వీటికి అలవాటు పడుతున్న వారు.. వాటి విక్రయాలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్ కేంద్రంగా పేరున్న నిజామాబాద్ ఇప్పుడు దాని వినియోగానికి కూడా అడ్డాగా మారింది. ముంబయి, పుణె, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీల్లో వినియోగమయ్యే ఈ గంజాయి ఇప్పుడు జిల్లాలోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోనే కాదు., గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ గంజాయి ఘాటు పాకింది. జిల్లాలో ఏకంగా గంజాయి సిగరెట్లనే విక్రయిస్తున్నారంటే దీని వినియోగం ఏ స్థాయికి పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి సిగరెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఒక్కో గంజాయి సిగరెట్‌ను రూ. వంద చొప్పున విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఘాటు మరింత ఎక్కువ ఉండాలంటే గంజాయిని మరింత దట్టించిన సిగరెట్‌ను తయారు చేసి ఇస్తున్నారు. సాధారణ సిగరెట్లో పొగాకును తొలగించి, ఈ ఎండు గంజాయిని నింపుతున్నారు. సాధారణ సిగరెట్ మాదిరిగా కనిపించే వీటిని పీల్చుతూ మత్తులో తేలియాడుతున్నారు. ప్రత్యేక వేఫర్లు.. ఎండు గంజాయిని నింపుకుని పీల్చుకునేందుకు ప్రత్యేకంగా వేఫర్లు కూడా విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్‌పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ వేఫర్లలో తమకు కావాల్సినంత ఎండు గంజాయిని నింపుకుని తాగవచ్చు. విద్యార్థులు, యువత బానిస.. గంజాయి సిగరెట్లకు ఇప్పుడు యువత, విద్యార్థులు కూడా బానిసలుగా మారడం ఆందోళనకు గురిచేస్తోంది. వీటికి అలవాటు పడుతున్న వారు.. వాటి విక్రయాలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. పేద వర్గాలకు చెందిన వారు కూడా ఈ గంజాయి ఘాటుకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ముఖ్యంగా కూలీలు ఈ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. గతంలో గంజాయి చాక్లెట్లు.. నిజామాబాద్ నగరంలో గతంలో గంజాయి చాక్లెట్లు కూడా వెలుగుచూసిన విషయం విధితమే. సుమారు రెండేళ్ల క్రితం ఎక్సైజ్ అధికారులు నగరంలో జరిపిన దాడుల్లో ఈ గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. నగరంలో పెద్ద ఎత్తున వీటి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. చిన్నారులు తినే చాక్లెట్ల మాదిరిగానే ఉండే వీటిని నోట్లో వేసుకుంటే మత్తులో తేలిపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్ ఇస్తున్నాం గంజాయి సిగరెట్లు తాగుతూ పట్టుబడిన యువత, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాము. తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే కొంత మంది విద్యార్థులు, యువత ఇలాంటి మత్తు పదార్థాల వినియోగానికి అలవాటు పడుతున్నారు. విక్రయదారులపై పలుమార్లు కేసులు నమోదు చేస్తున్నాము. ద్వారకానగర్‌లో వీటిని విక్రయిస్తున్న మహిళపై పలు కేసులు కూడా పెట్టాము. - దీపికా, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ -
అభాసుపాలైన టాస్క్‌ఫార్స్..!
సాక్షి, నిజామాబాద్: టాస్క్‌ఫోర్స్.. ఈ పేరు వింటేనే అసాంఘిక శక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టాలి. పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా నియమించే ఈ విభాగానికి సీపీకి ఉండే అధికారాలన్నీ ఉంటాయి. సీపీ పరిధి ఏ మేరకు ఉంటుందో ఆంత పరిధిలో టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించవచ్చు. స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు నియమించిన విభాగం ఇది. మరి ఇలాంటి విభాగమే జిల్లాలో అభాసు పాలుకావడం ఇప్పుడు పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్మూర్ డివిజన్లో భారీ స్థాయిలో కొనసాగుతున్న ఓ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ విభాగం దాడి చేసింది. ఈ ఘటనలో విభాగం ఇన్చార్జిగా ఉన్న సీఐ సత్యనారాయణ ఇద్దరు అధికార పార్టీ నేతలను కేసు నుంచి తప్పించేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై ఆకస్మిక బదిలీ వేటు వేశారు. ఆయనను ఏఆర్ వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆ విభాగం పనితీరే ప్రశ్నార్థకంగా మారింది. కమిషనరేట్‌లో ప్రత్యేకం.. ప్రత్యేక అధికారాలు కలిగిన టాస్క్‌ఫోర్స్ విభాగం కేవలం పోలీసు కమిషనరేట్ ఉన్న చోట మాత్రమే ఏర్పాటు చేస్తారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్న విభాగంలో సుమారు పది మంది వరకు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే చాలు విభాగం జిల్లా అంతట ఎక్కడైనా ఆకస్మిక దాడులు (రైడ్స్) నిర్వహించవచ్చు. సెర్చ్ వారెంట్ కూడా ఈ విభాగానికి అవసరం లేదు. మరి అంతటి అధికారాలున్న ఈ విభాగం అధికార పార్టీ నేతలకు వంతపాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానిక పోలీసులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల చెప్పుచేతల్లో పనిచేయడం సర్వసాధారణమై పోవడమే పోలీసుశాఖ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. మరి అలాంటిది ప్రత్యేక అధికారాలు కలిగిన ఈ విభాగం కూడా అదే అధికార పార్టీ నేతలకు తొత్తుగా వ్యవహరించడంతో స్థానిక పోలీసులకు, ఈ ప్రత్యేక విభాగానికి ఏం తేడా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తర్వులు వెనక్కి తీసుకుందామా..? టాస్క్‌ఫోర్స్ సీఐపై బదిలీ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయాన్ని మార్చుకునే యోచనలో ఉన్నారు. సీఐని వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ఈవిషయమై సీపీ కార్తికేయను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
స్పీడ్ 'గన్' గురి తప్పిందా..?
సాక్షి, నిజామాబాద్: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న వాహనాల అతి వేగానికి చెక్ పెట్టేందుకు పోలీసుశాఖ చేపట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్పీడ్ లేజర్‌గన్ గురి తప్పింది. గురువారం ఉదయం 11.48 గంటలకు 44వ జాతీయ రహదారిపై ఓ వాహనం ఓవర్ స్పీడ్‌తో వెళుతుంటే.. మెదక్ జిల్లా రామాయంపేట్ వద్ద ఈ స్పీడ్ లేజర్‌గన్‌తో గుర్తించిన పోలీసులు.. జరిమానాకు సంబంధించిన చలానా మాత్రం మరో వాహనానికి పంపారు. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వాహనం ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే.. తన వాహనం టీఎస్ 16 ఈఆర్7299కు చాలనా విధిస్తూ ఎస్ఎంఎస్ సందేశాన్ని పంపారని మాక్లూర్‌కు చెందిన అమర్ వాపోయారు. హైస్పీడ్‌తో వెళ్లిన వాహనం నెంబర్ కూడా ఇదే నెంబరుకు కాస్త దగ్గరలోనే ఉండటంతో పొరపాటున ఈ చలానా జారీ అయి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పొరపాటున జరిమానా విధించిన వాహనం ఇది -
వివాహేతర సంబంధం: నమ్మించి చంపేశారు!
సాక్షి, నిజాంసాగర్: తరచూ కుటుంబ కలహాలు అవుతున్నాయన్న అనుమానంతో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేశారు. నిజాంసాగర్ మండలం సింగితం గ్రామ అటవీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం జరిగిన హత్య ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం దక్కల్‌దాని తండాకు చెందిన బోడ అరుణ(35) అనే వివాహితతో, ముదెల్లికి చెందిన వట్నాల అంజయ్య చనువుగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడంతో మరింత దగ్గరయ్యారు. అప్పటి నుంచి అంజయ్య తన భార్య, పిల్లలతో తరచూ గొడవలు పడ్డాడు. అంజయ్య భార్య కాశవ్వకు, అరుణపై అనుమానం వచ్చింది. తన భర్తతో సంబంధం కారణంగానే గొడవలు జరుగుతున్నాయని కక్ష పెట్టుకున్న కాశవ్వ అరుణను అంతం చేసేందుకు పన్నాగం పన్నింది. ముదెల్లికి చెందిన సుతారి బాలయ్య సహాయం తీసుకుంది. ఎప్పటిలాగే అరుణతో కలిసి కాశవ్వ బాన్సవాడ పట్టణానికి వచ్చింది. తమ బంధువులు పండుగ చేస్తున్నారని, ఊరికి వెళ్దామని అరుణతో నమ్మబలికింది. అప్పటికే సుతారి బాలయ్య గాలీపూర్ గేటు వద్ద వీరి కోసం కాపు కాస్తున్నాడు. బాన్సువాడ నుంచి కాశవ్వ, అరుణ ఇద్దరు కలిసి ఆర్టీసీ బస్సులో వచ్చారు. గాలీపూర్ గేటు వద్ద బస్సు దిగి నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్టపై నుంచి కాలినడకన వచ్చారు. అక్కడే ఉన్న బాలయ్య, కాశవ్వ, అరుణ కలిసి సింగితం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. తర్వాత బాలయ్య తన ధోతిని అరుణ గొంతు చుట్టూ చుట్టి నులిమాడు. ఊపిరాడకుండా కొట్టుకుంటున్న అరుణపై కాశవ్వ బండరాయితో మోదడటంతో అరుణ మృతి చెందింది. దాంతో బాలయ్య, కాశవ్వ తిరిగి బాన్సువాడకు వెళ్లి అక్కడి నుంచి ముదెళ్లికి వెళ్లారు. తండా నుంచి వెళ్లిన అరుణ రాత్రి వరకు ఇంటికి రాకపోవడం, ఆచూకీ లేక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ వెంట కాశవ్వ వెళ్లినట్లు తండావాసులు ఫిర్యాదులో పేర్కొనడంతో హత్య ఉందంతం వెలుగులోకి వచ్చింది. కాశవ్వను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అరుణను హత్య చేసినట్లు ఒప్పుకుంది. దాంతో బాన్సువాడ డీఎస్పీ యాదగిరి, పట్టణ సీఐ మహేశ్‌గౌడ్, స్థానిక ఎస్ఐ సాయన్న పోలీసు బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బోడ అరుణ మృతదేహం: మృతదేహాన్ని మోసుకు వస్తున్న సిబ్బంది -
భార్యతో గొడవ.. భర్త బలవన్మరణం
సాక్షి, మోపాల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లి పోవడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకున్నాడు. రూరల్ ఎస్‌హెచ్‌వో ప్రభాకర్ కథనం ప్రకారం.. నిజామాబాద్ రూరల్ మండలంలోని కాలూర్ గ్రామంలో బాశెట్టి లింగం(48) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి తోడు భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఐదురోజుల క్రితం భార్య సుజాత, కొడుకుతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న లింగం జీవితంపై విరక్తి చెంది దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారమందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. విడాకులు తీసుకుని.. జీవితంపై విరక్తి చెంది రుద్రూర్: భర్తతో మనస్పర్థలతో విడాకులు తీసుకు న్న ఓ ఇల్లాలు.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. రుద్రూర్ మండల కేంద్రం లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. రుద్రూర్‌కు చెం దిన జల్లపురం స్రవంతి (26) మనస్పర్థలతో ఇటీవలే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి విడాకుల గురించి ఆలోచనల్లో మునిగి పోయిన ఆమె.. జీవితంపై విరక్తి చెంది ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరే సుకుంది. స్రవంతి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసై.. గాంధారి: మద్యానికి బానిసై, అప్పుల పాలైన ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. గాంధారి ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సర్వాపూర్ గ్రామానికి చెందిన పిట్ల శేఖర్ (28) మద్యానికి బానిసై గ్రామస్తులతో పాటు తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేక బుధవారం సాయంత్రం గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడ్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లింగం మృతదేహం, శేఖర్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసు -
గణేష్ చందా ముసుగులో మహారాష్ట్ర దొంగలు
సాక్షి, నిజామాబాద్ : గణేష్ చందాల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ చందా ఇవ్వని వారింట్లో దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన నగరంలో సంచలనం రేపింది. సాయికృప నగర్ కాలనీలో ఉన్న మొదటి అంతస్థులోని ఓ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు వినాయక చవితి పండుగ నిమిత్తం చందా అడగడానికి వెళ్లారు. ఇంటి ఇల్లాలు చందా డబ్బులు ఇవ్వననడంతో మంచి నీళ్లు కావాలని అడిగి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. దీంతో భయపడ్డ ఇల్లాలు అరుస్తూ ఇంట్లోకి పరుగు తీసింది. అప్రమత్తమైన ఇల్లాలి భర్త వెంటనే గేటు తాళం వేసి వారిని ప్రశ్నించగా, వారిలో ఒకరు భర్తను తోసేసి గేటు దూకి పారిపోయాడు. మిగిలిన మరొకరిని పట్టుకొని స్థానికులు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమందించగా వారు విచారించి నిందితులు మహారాష్ట్రకి చెందినవారుగా గుర్తించారు. పారిపోయిన మరో నిందితుడి కోసం పోలీసులు నగరమంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తోపులాటలో భర్తకు స్పల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గణేష్ చందాల పేరుతో వచ్చేవారి విషయంలో సాయికృప నగర్, వినాయక నగర్ కాలనీ వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. -
కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
సాక్షి, బోధన్: మద్యం మత్తులో తొమ్మిదేళ్ల కూతురుపై కన్న తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల కూతురిని ఇంట్లో ఉంచి తల్లి సోమవారం కూలి పనికి వెళ్లింది. సాయంత్రం సమయంలో మద్యం తాగి వచ్చిన తండ్రి షాదుల్ ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి కూలి పని ముగించుకుని రాత్రికి ఇంటికి వచ్చే సరికి కూతురు ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని ఆరా తీయగా బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో తల్లి బోధన్ రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసు శాఖలో.. 'మెమో' కలకలం
సాక్షి, నిజామాబాద్: రాత్రి వేళల్లో దొంగతనాలు, దోపిడీలను అరికట్టేందుకు నిర్వహించే పెట్రోలింగ్ విధులను పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విధుల కోసమే నియమితులైన సి బ్బంది, వారిని పర్యవేక్షించే అధికారులు తమకేమీ పట్టనట్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో నిజామాబాద్ నగరంతో పాటు, జిల్లా వ్యాప్తంగా తరచూ దోపిడీలు, దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా నగరంలోని ప్రధాన వ్యాపార కూడళ్లు, దుకాణ సముదాయాలను సైతం దొంగలు యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు. ఈ ఘటనలు పరిశీలిస్తే పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ కార్తికేయ చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల సుమారు 35 మందికి మెమోలు జారీ చేశారు. ఇందులో ఎస్ఐలు, ఎస్హెచ్ఓలు సైతం ఉన్నారు. వారి వారి పోలీస్స్టేషన్లలో పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందిపై పర్యవేక్షణ లేకుండా అలసత్వం వహించినందుకు నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకా రం ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పెట్రోలింగ్ నిర్వహించాలి. షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఎన్ని గంటలకు ఏఏ రూట్లో తిరగాలి.. ఏ పాయింట్ వద్ద ఎన్నిగంటలకు హాజరుకావాలి. వంటివన్నింటిని ప్రత్యేకంగా చార్ట్ రూపొందించి నిర్దేశిస్తారు. ఆ మేరకు పెట్రోలింగ్ విధులు నిర్వర్తించాలి. అయితే పోలీసు అధికారుల నిర్లక్ష్యం కార ణంగా సిబ్బంది ఈ విధులను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. జీపీఆర్ఎస్తో గుర్తింపు.. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పోలీసు వ్యవస్థలో జరుగుతున్న లోపాలను అధికారులు సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెట్రోలింగ్ వాహనాలకు జీపీఆర్ఎస్ పరికరాన్ని అమర్చారు. పరికరం అమర్చితే ఆ వాహనం ఎక్కడెక్కడ తిరిగింది.. ఎక్కడ ఎంత సేపు ఆగింది.. అనేది పూర్తి స్థాయిలో ఆన్లైన్లో రికార్డు అవుతుంది. ఇలా రికార్డులను ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారులు అలసత్వం వహించిన అధికారులు, సిబ్బందిపై చర్య లు చేపడుతున్నారు. సిబ్బంది కొరత.. మరోవైపు పోలీసుశాఖలో ఖాళీలతో కింది స్థాయిలో పనిచేసే సిబ్బందిపై భారం పడుతోంది. ఆయా పోలీస్స్టేషన్లకు సరిపడా కానిస్టేబుళ్లు లేరు. దీంతో ఉన్న కొద్ది మందిపైనే పనిభారం పెరుగుతోంది. దీనికి తోడు ఏమైనా ప్రత్యేక ఉత్సవాలు, వీఐపీల పర్యటనలు, సభలు, సమావేశాలు జరిగినప్పుడు కింది స్థాయి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడం కూడా పెట్రోలింగ్ విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారు తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జిల్లాలో ఉగ్రవాదులు లేరు: సీపీ కార్తికేయ
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామంలో గాంధీ విగ్రహానికి కొంత మంది అ సాంఘిక శక్తులు గాంధీ ముఖానికి బొగ్గుతో రాసి కాగితాల దండ వేయడంపై పోలీసుశాఖ సీరియస్‌గా దర్యాప్తు జరుపుతోందని సీపీ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలోని అసాంఘిక శక్తుల ఆట కట్టించి, కూకటి వేళ్లతో పెకిలిస్తామని సీపీ పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా ఫొటోలు, వీడియోలు వస్తే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, ఇతరు లు పోస్టుచేయవద్దని సూచించారు. సో షల్ మీడియాపై పూర్తి స్థాయి దృష్టి సారించామన్నారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దన్నారు. నిజామాబాలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం లేదన్నారు. ఈ విషయంలో నిజామాబాద్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని స్పష్టం చేశారు. -
కలెక్టరేట్ వద్ద కలకలం..
సాక్షి, నిజామాబాద్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిషేధిత సిమి అనుబంధ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులుగా భావిస్తున్న ముగ్గురిని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. నిజామాబాద్‌లో సమావేశం నిర్వహించేందుకు అనుమతి కోసం సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు అరెస్టుచేసి విచారణ చేపట్టగా నిషేధిత సంస్థ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై ఒకటవ టౌన్ పోలీసులను సంప్రదించగా వివరాలు చెప్పడానికి నిరాకరించారు. అరెస్టయిన వారిలో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాజిద్, నిజామాబాద్‌కు చెందిన షాదుల్ల ఉన్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ఐ సంస్థ రాష్ట్ర నాయకుడు ఇటీవల జగిత్యాల్లో ఓ వర్గం వారితో సమావేశం నిర్వహించగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
అయినా.. బుద్ధి మారలేదు
సాక్షి, కామారెడ్డి: దొంగతనాలకు పాల్పడి గతంలో పలుమార్లు జైలుకు వెళ్లాడు. శిక్ష అతడిలో ఎలాంటి పరివర్తన తీసుకురాలేకపోయింది. చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుపాలవ్వడం.. విడుదల కాగానే మళ్లీ చోరీలకు పాల్పడడం.. అలవాటుగా మారిపోయింది. ఇలా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని కామారెడ్డి పోలీసులు మళ్లీ పట్టుకుని కటకటాల వెనక్కిపంపారు. జల్సాల కోసం చోరీలను ఎంచుకున్నాడు. ఇప్పటికే చాలాసార్లు పట్టుబడి జైలుకు వెళ్లివచ్చాడు. అయినా అతడి బుద్ధి మారలేదు. జైలు నుంచి విడుదలైన రోజే చోరీలు మళ్లీ ప్రారంభించాడు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ కరుడుగట్టిన నిందితుడిని బుధవారం కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ లక్ష్మీనారాయణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ట్టణంలోని పిట్ల గల్లీలోని శివాజీ రోడ్ లో ఉన్న తోకల నర్సింలు కుటుంబం గత నెల 21న ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని వెళ్లారు. అదే రోజు రాత్రి తాళం పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోని రెండు తులాల బంగారం, పదితులాల వెండి, రూ.2 లక్షల 9 వేల నగదును చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించగా చోరీ చేసిన వ్యక్తిని గుర్తించారు. ఇందిరానగర్ కాలనీకి చెందిన మహ్మద్ షాహిద్‌గా గుర్తించి అతడి కోసం గాలించారు. రెండు బృందాలుగా పోలీసులు పాత నేరస్తుడైన షాహిద్ కోసం గాలిస్తున్నారు. బుధవారం సిరిసిల్లా రోడ్‌లోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ వద్ద పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రెండు తులాల బంగారం, పది తులాల వెండి, రూ.35,550 నగదును, అతడు చోరీ చేసిన ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసమే చోరీలు... పిట్లగల్లీలో జరిగిన చోరీ కేసులో పోలీసులు గుర్తించిన మహ్మద్ షాహిద్ పాత నేరస్తుడు. అతడిపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే 30 కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు కరడుగట్టిన నేరస్తుడని చెప్పారు. ఇప్పటికే చాలాసార్లు జైలుకు వెళ్లివచ్చిన అతనిలో మార్పు రాలేదన్నారు. జైలు నుంచి వచ్చిన ప్రతీసారి చోరీలు చేయడమే పనిగా మారినట్లు తెలిపారు. గతనెల 18నే జైలు నుంచి విడుదలైన అతను అదే రోజున అయ్యప్పనగర్‌లో ఓ బైక్‌ను చోరీ చేసినట్లు తెలిపారు. ఆ మరుసటి రోజునే పిట్లగల్లీలో చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడు కేవలం జల్సాల కోసమే చోరీలను ఎంచుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వచ్చిన డబ్బులతో ఢిల్లీ, అజ్మీర్, రాజస్థాన్, షిరిడీ, తిరుపతి ప్రాంతాల్లో తిరిగి దైవ దర్శనాలు, జల్సాలు చేసి వచ్చాడన్నారు. సిబ్బందికి అభినందనలు.. నిందితుడిని గుర్తించాక అతడిని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి కృషి చేసిన పట్టణ ఎస్ఐలు రవికుమార్, గోవింద్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కేసు చేదనలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర వహించాయన్నారు. సీసీ కెమెరాల కారణంగానే చోరీకి పాల్పడింది పాత నేరస్తుడేనని 24 గంటల్లోగా గుర్తించగలిగామన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. ఎస్హెచ్ఓ రామక్రిష్ణ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఐదిళ్లల్లో చోరీ
సాక్షి, నిజామాబాద్(ఆర్మూర్) : మండలంలోని రాంపూర్‌లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీకి ఎగబడ్డారు. దుండగులు గ్రామంలోని ఐదు ఇళ్లలో శనివారం అర్ధరాత్రి చోరీ చేసి నగదు, నగలను ఎత్తుకెళ్లారు. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లిన హైమద్ ముక్తార్, ఈరోళ్ల సాయన్న, ఈరోళ్ల రమేశ్, కే. హరీష్ ఇళ్లతో పాటు బీడీ ఖార్ఖానాలో దొంగలు చోరీ చేశారు. నలుగురి ఇళ్ల తాళాలను ధ్వంసం చేసి లోనికి చొరబడి బీరువాను తెరిచి నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. హైమద్ ముక్తార్ ఇంట్లో నుంచి రూ.లక్షన్నరతో పాటు ఐదు తులాల బంగారం, కే. హరీష్ ఇంట్లో నుంచి ఆరు బంగారు ఉంగరాలు, మూడు జతల బంగారు కమ్మలు, ఈరోళ్ల సాయన్న ఇంట్లో నుంచి రూ.4 వేలు, ఈరోళ్ల రమేశ్ ఇంట్లో నుంచి రూ.8 వేల నగదు చోరీకి గురైనట్లు తెలిసింది. దుండగులు ముందే పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీ చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన క్లూసీం టీం చోరీ జరిగిన ఇళ్లలో ఆధారాలు సేకరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చోరీ తీరును పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటు ఎస్‌హెచ్‌వో రాఘవేందర్ తెలిపారు. -
తస్మాత్ జాగ్రత్త..!
అసలే వర్షాకాలం.. ఆపై అందరూ పొలం పనుల్లో నిమగ్నమవుతుంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకూ బిజీబిజీగా గడుపుతారు. ఫలితంగా ఇళ్లు దాదాపుగా ఎవరూ లేకుండా ఉంటాయి! ఇదే అదునుగా భావించే చోరులు చోరీలకు ఎగబడుతారు. అందినంత దోచుకెళ్తారు. ఇలాంటి సమయాల్లో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని, టూర్లకు, ఇతర ఊళ్లకు వెళ్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. సాక్షి, నిజామాబాద్ : సాధారణంగా వర్షాకాలం రాగానే పొద్దున లేవగానే పల్లె ప్రజలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోతారు. ఉదయం అనగానే చేన్లలోకి వెళ్లిన రైతులు చీకటి పడేదాక ఇంటి ముఖం చూడకుండా పంట పొలాల్లో పనులు చేస్తారు. పిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తుంటారు. ఇంటి దగ్గర ఎవరు లేకుండా ఎవరి పనికి వారు వెళ్లేదానిని అదునుగా భావించి దుండగులు చక్కగా ఇళ్లట్లోకి చొరబడి బంగారం, నగదు సొత్తుతో పారిపోతుంటారు. ఊళ్లకు వెళ్లే కుటుంబాలే లక్ష్యంగా దుండగులు చెలరేగుతుంటారు. పోలీసులు కూడా ప్రతి ఇంటినీ గమనించలేరు. అందుకే ప్రజలు కూడా చైతన్యం కావాలంటున్నారు వారు. అందుకోసం భిక్నూర్ సీఐ రాజశేఖర్ ప్రజలకు పలు సూచనలు జాగ్రత్తలు తెలుపుతున్నారు. కొత్త వ్యక్తులు వస్తే తెలపాలి.. చోరీలకు వర్షాకాలం అనువుగా ఉంటుంది. దుండగులు ఎంచుకున్న ఇంటి పరిసరాలను రెండు, మూడు రోజులు ముందు పరిశీలిస్తారు. అంటే చెత్త కాగితాలు, భిక్షగాళ్లుగా, వస్తువులు అమ్మేవారిగా వచ్చి చుట్టూ పక్కల పరిశీలించిన అనంతరం ప్రణాళిక రచించి సులువుగా పని ముగించుకుంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ⇔చోరీలకు వచ్చే దుండగులు ఒకరోజు ముందే పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ⇔ఇంటి కిటికీలను మూసివేయాలి. వాటికి ఉన్న బోర్డులు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడూ చూసుకోవాలి. ⇔ దూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌కు తెలపాలి. ⇔ రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వస్తే వారి వివరాలు సేకరించి పెట్టుకోవడం మంచిది. ⇔ దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించరాదు. దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైతే కాపాలదారున్ని ఏర్పాటు చేసుకోవాలి. ⇔ వ్యవసాయ పనులకు వెళ్లేవారు చుట్టుపక్కల వారికి తెలియజేయాలి. తాళం వేసి వాటి తాళాలను ఇంటి దగ్గర పెట్టకూడదు. ⇔ ప్రతి ఇంట్లో తాళాలు వేసి తాళాలను అక్కడే ఉంచడంతో దొంగలకు అవకాశాలు ఎక్కువగా ఉండి దోచుకునేందుకు వీలవుతుంది. వాటిని పెట్టకూడదు. ⇔ ఇంటికి ఒకటి, లేక రెండు తాళాలు వేసుకోవాలి. దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ⇔ బంగారు ఆభరణాలు ధరించి నిద్రించకూడదు. కిటికీలు తెరిచి ఉండేవైపు పడుకోరాదు. ⇔ ఇంట్లో బంగారం, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవడం అన్ని విధాలా ఉత్తమం. పోలీసు కంట్రోల్ రూం నం.100 ముందస్తు సమాచారమివ్వాలి.. గ్రామాల ప్రజలు ప్రస్తుతం వ్యవసాయ ప నుల్లో నిమగ్నమయ్యా రు. ఇంటికి తాళాలు వేసుకొని చేన్లలోకి వెళ్లే ముందు చుట్టు పక్కల వారికి తెలియజేయాలి. ముఖ్యంగా మహిళలు పొలం వద్దకు ఒంటరిగా పోవద్దు. ఒకవేళ యాత్రలకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇప్పటికే మండలంలోని చాలా గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాం. ఊర్లకు వెళ్లేవారి ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే వాటిని బంద్ చేయకుండా ఉంచాలి. –సురేష్, ఎస్ఐ, బీబీపేట. జాగ్రత్తలు తీసుకోవాలి.. పట్టణాలు, వివిధ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దీంతోపాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పిల్లలకు సెలవులు ఉన్న సమయంలో తీర్థయాత్రలకు, టూర్లకు, సొంత గ్రామాలకు వెళ్లేవారు వారి పరిధిలోని పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ ఏర్పాటు నిర్వహిస్తున్నారు. –రాజశేఖర్, సీఐ, భిక్కనూరు. -
హుండీ ఎత్తుకెళ్లిన దొంగల అరెస్ట్
సాక్షి, నిజామాబాద్: కొద్ది రోజుల క్రితం జిల్లాలోని సారంగపూర్ ఆలయంలో జరిగిన చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ నిందితులను లింగం, రమేశ్, నరేశ్‌లుగా గుర్తించారు. వీరు పాత నేరస్థులేనని తెలిపారు. కాగా వీరి దగ్గరి నుంచి రూ.1,02,450 హుండీ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
డమ్మీ గన్‌తో పోలీసులనే బెదిరించి..!
సాక్షి, నిజమాబాద్ : ఓ వ్యక్తి డమ్మీ గన్‌తో పోలీసులను బెదిరించిన ఘటన నిజామాబాద్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌లోని కోటగల్లిలో జరిగిన పోలీసుల దాడిలో తప్పించుకుని, ఆ తర్వాత డమ్మీ గన్‌తో బెదిరించిన వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరెస్టు చేయబడిన వ్యక్తిని పోలీసులు చాట్ల గోపిగా గుర్తించారు. గోపి పై గతంలో మర్డర్ కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గోపి దగ్గర ఉన్న కత్తి, డమ్మీ గన్లను స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కామారెడ్డిలో పట్టపగలే భారీ చోరీ
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. నాలుగిళ్లలోకి చొరబడి 35 తులాల బంగారం, రూ.4.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం పట్టపగలే జరిగిన ఈ చోరీతో కామారెడ్డిలో కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పరిధిలో ఉన్న విద్యుత్‌నగర్ కాలనీలో నివాసం ఉండే మూడు కుటుంబాలు కలిసి బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దగ్గర్లోని చుక్కాపూర్ నర్సింహాస్వామి ఆలయానికి వెళ్లారు. మాచారెడ్డి మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన అన్నదమ్ములు భరత్‌రెడ్డి, లింగారెడ్డి రెండేళ్ల క్రితం కాలనీలో ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డారు. చిట్‌ఫండ్ కంపెనీలో పని చేసే సోదరులిద్దరు తమ కుటుంబాలతో కలిసి బుధవారం తమ ఇళ్లకు తాళాలు వేసి చుక్కాపూర్కు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో దాచిన 20 తులాల బంగారం, రూ.3 లక్షల వరకు నగదు ఎత్తుకెళ్లాడు. ఎదురుగా నివాసముండే ఏఆర్ కానిస్టేబుల్ తారాసింగ్, జైపాల్ కుటుంబ సభ్యులు కూడా ఇళ్లకు తాళాలు వేసి చుక్కాపూర్ వెళ్లారు. వీరిళ్లలోకి చొరబడిన దొంగలు రూ.70 వేల నగదు, 8 తులాల బంగారం, 18 తులాల వెండి ఆభరణాలను అపహరించినట్లు బాధితులు తెలిపారు. పక్కనే ఉన్న ఇంటి యజమాని వలిపిరిశెట్టి శరత్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతను ఉదయాన్నే విధులకు వెళ్లగా, పిల్లలు పాఠశాలలకు వెళ్లారు. భార్య పావని ఇంటికి తాళం వేసి, టేక్రియాల్లోని తల్లిగారింటికి వెళ్లింది. ఆ ఇంటితాళాలు పగలగొట్టిన చోరులు 6 తులాల బంగారం, రూ.70 వేల నగదును దోచుకున్నారు. పక్కనే ఉన్న గల్లీలోని మరో ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అల్లకుంట సంధ్య కుటుంబం ఇటీవలే కాలనీలో ఇల్లు కొనుక్కున్నారు. సంధ్య టైపింగ్ నేర్చుకునేందుకు వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చారు. అప్పటికే చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోని రూ.10వేల నగదు, రెండు మాసాల బంగారం పోయినట్లు ఆమె తెలిపారు. ఒక్కడే వచ్చి దోచేశాడు...! నాలుగిళ్లలో చోరీకి పాల్పడింది ఒక్కడేనని పోలీసులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి కాలనీలో అనుమానాస్పదంగా బైక్‌పై తిరుగుతూ, ఆయా ఇళ్లలోకి చొరబడినట్లుగా దగ్గర్లోని సీసీ టీవీ ఫుటేజీల్లో నిక్షిప్తమైనట్లు తెలిసింది. ఘటన స్థలాన్ని అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ భిక్షపతి, పలువురు ఎస్సైలు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీం బృందాలను రప్పించి ఆధారాలు సేకరించారు.