సిద్దపల్లిలో పరిశీలిస్తున్న సీపీ కార్తికేయ మిశ్రా, (ఇన్‌సెట్లో) కూనె రాజేశ్వర్ మృతదేహం
భీమ్‌గల్: మైనర్ల మధ్య కలిగిన ప్రేమ వ్యవహారం పెద్దల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ వ్యవహారంలో జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానై చివరికి ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. భీమ్‌గల్ మండలంలోని సిద్దపల్లి గ్రామానికి చెందిన కూనె రాజేశ్వర్(50) గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి కుమారుడు కూనె రవి భీమ్‌గల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దళితుడైన మృతుడు కూనె రాజేశ్వర్ సమీప బంధువుకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మైనర్ బాలిక తన తండ్రి ఇంట్లో దాచిన రూ.18 వేల నగదును ఈనెల 4న బైక్ కొనుక్కొమ్మని ప్రియుడికి ఇచ్చింది.
దీంతో ఆ బాలుడు భీమ్‌గల్‌లో సెకండ్ హ్యాండ్ బైక్ కొనుకున్నాడు. ఈ క్రమంలో బాలిక తండ్రి తన ఇంట్లో డబ్బు గల్లంతైన విషయం గమనించి సదరు మైనర్ బాలుడిపై అనుమానంతో చోరీ నెపం మోపి గ్రామంలో పంచాయతీ నిర్వహించాడు. పెద్దలు విచారించి అసలు విషయం తెలుసుకుని బైక్ అమ్మి నగుదును లింబాద్రికి వాపసు ఇవ్వాలని తెలుపడంతో బాలుడి తరపువారు ఇచ్చేసారు. ఈ విషయాన్ని మనసులో ఉంచుకున్న లింబాద్రి మృతుడు రాజేశ్వర్‌ను దూషించగా, మీ డబ్బులు ఇచ్చినం కదా ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించాడు. దీంతో రాజేశ్వర్‌పై మనసులో కక్ష పెంచుకున్న లింబాద్రి నీ అంతు చూస్తా.. అంటూ వెళ్లిపోయాడు. అయితే గురువారం రాత్రి 12 గంటల సమయంలో రాజేశ్వర్ బహిర్భూమి కోసం గ్రామ పొలిమేరల్లోని చెరువు కట్ట వద్దకు వెళ్లాడు. వెనుక నుంచి లింబాద్రి కర్రతో మోది హత్య చేశాడన్నారు. తన తండ్రి ఎంత సేపటికీ రాకపోయే సరికి అనుమానంతో తాను వెళ్లగా లింబాద్రి సీసీ రోడ్డుపై ఉన్న రక్తం మరకలను కడిగివేస్తున్నాడన్నారు.
అనుమానంతో ముందుకు వెళ్లి చూడగా తన తండ్రి రక్తం మడుగులో కొట్టుకుంటున్నాడన్నారు. వెంటనే తాను స్థానికుల సాయంతో ఆర్మూర్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారన్నారు. హత్య విషయం తెలిసి ఉదయమే పోలీస్ కమిషనర్ కా ర్తికేయ, ఏసీపీ రాములు, సీఐ సైదయ్యలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. దళిత వ్యక్తిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కర్నె శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment