ఎస్సారెస్పీలో రంగు మారిన నీళ్లు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీరు పూర్తిగా రంగు మారుతోంది. స్థానిక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన 20 రోజులు క్రితం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల్లో ఫ్యాక్టరీల నుంచి రసాయనాలను ప్రాజెక్ట్‌లోకి మళ్లించడంతోనే నీరు కలుషితమవుతోందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలు కలిసిన నీటిని పంటలకు అందిస్తే తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ నుంచి వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుంది. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు తాగు నీటిని కూడ ఈ ప్రాజెక్ట్ నుంచే సరఫరా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ నీటి కలుషితంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రాజెక్ట్ కాలనీ వాసులకు ఇక్కడి నుంచే తాగు నీటిని అందిస్తారు. కాలనీలో వాటర్ ట్యాంకు వరకు నీటి సరఫరా చేసి అక్కడ శుద్ధి చేసి సరఫరా చేస్తారు. ఉన్నతాధికారులు ప్రాజెక్ట్‌లో నీటి కలుíషితంపై విచారణ చేపట్టాలని, ఆయకట్టు పంటలను రక్షించాలని రైతులు కోరుతున్నారు. అయితే, ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలో వ్యర్థాలు కలవడం వలనే ప్రాజెక్ట్ నీరు రంగు మారుతుందని, ప్రతి ఏటా ఇలానే జరుగుతుందని ఎస్సారెస్పీ డ్యాం డిప్యూటీఈఈ జగదీష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment