srsp water
-
‘ఎస్సారెస్పీ’ నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, వరంగల్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. గతంలో ఈ అంశాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఎట్టకేలకు నీటి విడుదలకు గ్రీన్‌సిగ్న ల్ ఇచ్చింది. ఈమేరకు ఆదివారం 9 గంటలకు లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) వద్ద నీరు విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ చీఫ్ ఇంజి నీర్ అనిల్‌కుమార్ ప్రకటించారు. త ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 2,10,250 ఎకరాల్లో పంటలకు మేలు జరగనుంది. కాగా, దిగువ మానేరు కింద ఉన్న కొత్త 10 జిల్లాల్లో స్థిరీకరించిన ఆయకట్టు సుమారు 9 లక్షల ఎకరాల వరకు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎస్సారెస్పీ ద్వారా ఖరీఫ్ పంటలకు సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. పాత వరంగల్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల వరకు ఈ నీరు సరఫరా అవుతుంది. ఈ మేరకు ఖరీఫ్ చివరి దశలో ఉన్న పంటలకు ఉపయోగపడేలా చూడడంతో పాటు చెరువులు, కుంటలు నింపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ఎండీ నీటి మ ట్టం 24.034 టీఎంసీలు కాగా, శనివారం నా టికి 20.543 టీఎంసీలకు చేరుకుంది. ఎల్ఎండీ ద్వారా ఆదివారం నుంచి రెండు వేల క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడుదల చేయనుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నీటి విడుదల కార్యాచరణ ఇదీ.. ఎల్ఎండీ ఎగువ, దిగువన ఉన్న ఆయకట్టుతో పాటు చెరువులు, కుంటలు నింపడానికి ఈ నెల 13 నుంచి 23 వరకు ఎస్సారెస్పీ నీరు విడుదల చేయనున్నారు. కొద్ది రోజుల్లో రబీ సీజన్ ఆరంభం కానుండగా.. ఇప్పటి నుంచే ప్రభుత్వం కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని రైతులకు సూచిస్తోంది. ఈ మేరకు రబీ సాగుకు ఎస్సారెస్పీ అధికారులు పంపిన సాగునీటి ప్రణాళికలను కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఇదే సమయంలో శ్రీరాంసాగర్‌కు 80 టీఎంసీల నీరు చేరుకోగా.. రోజుకు 6,060 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఎల్ఎండీలోకి 20.543 టీఎంసీల నీరు చేరడంతో నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించారు. అధికారుల ప్రతిపాదనల ప్రకారం ఎల్ఎండీ దిగువన పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన ఆయకట్టుకు పది రోజుల పాటు నీటి సరఫరా చేసేందుకు ఆదివారం విడుదల చేయనున్నారు. దీంతో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల పరిధిలోని 2,10,250 ఎకరాల ఆయకట్టుకు మేలు జరుగుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే వర్షాలతో చాలా చెరువులు, కుంటలకు నీరు చేరగా.. ఎల్ఎండీకి దిగువన ఉన్న కాల్వల ద్వారా జీవీసీ – 4 పరిధిలోని 439, వరంగల్(సీసీహెచ్) 154, స్టేజీ – 2 పరిధిలో 270 చెరువు కుంటలను పూర్తిగా నింపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రబీ సాగుకు ఎస్సారెస్పీ నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 84 టీఎంసీల నీరు ఉంది. అయితే, ఇన్ ఫ్లో ఉండడంతో ఎల్ఎండీలోకి నీరు సమృద్ధిగా చేరుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ స్టేజీ–1, 2 పరిధిలో రబీ సాగుకు నీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం నుంచి చెరువులు, కుంటలు నింపనుండగా.. భూగర్భజలాలు కూడా పెరుగుతాయి. మరోవైపు రబీలో ఆరుతడి పంటలే వేసుకోవాలని నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు ఇప్పటి నుంచే రైతులను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు 18.82 లక్షల ఎకరాలు కాగా, వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,98,290 ఎకరాలకు రబీలో నీరందే అవకాశం ఉంది. నేడు దిగువకు విడుదల చేయనున్నాం.. దిగువ మానేరు ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా ఆదివారం నీటిని దిగువకు విడుదల చేయనున్నాం. స్టేజ్–1, 2 ద్వారా ఉదయం 9 గంటలకు నీటిని వదులుతాం. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలే తప్ప ఎక్కడ కాల్వవకు గండి పెట్టొద్దని కోరుతున్నాం. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే రబీ పంటలకు కూడా నీరు అందుతుంది. ఎల్ఎండీ నుంచి సూర్యాపేట వరకు చెరువులు, కుంటలు కూడా నింపనున్నాం. ఆదివారం ఉదయం 500 క్యూసెక్కులతో నీటిని విడుదల చేసి... సాయంత్రం వరకు రెండు వేల క్యూసెక్కులు పెంచుతాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరింత పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. – శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జీవీసీ–4, ఎస్సారెస్పీ -
ఎస్సారెస్పీలోకి రసాయనాలు!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీరు పూర్తిగా రంగు మారుతోంది. స్థానిక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన 20 రోజులు క్రితం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల్లో ఫ్యాక్టరీల నుంచి రసాయనాలను ప్రాజెక్ట్‌లోకి మళ్లించడంతోనే నీరు కలుషితమవుతోందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలు కలిసిన నీటిని పంటలకు అందిస్తే తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ నుంచి వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుంది. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు తాగు నీటిని కూడ ఈ ప్రాజెక్ట్ నుంచే సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ నీటి కలుషితంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రాజెక్ట్ కాలనీ వాసులకు ఇక్కడి నుంచే తాగు నీటిని అందిస్తారు. కాలనీలో వాటర్ ట్యాంకు వరకు నీటి సరఫరా చేసి అక్కడ శుద్ధి చేసి సరఫరా చేస్తారు. ఉన్నతాధికారులు ప్రాజెక్ట్‌లో నీటి కలుíషితంపై విచారణ చేపట్టాలని, ఆయకట్టు పంటలను రక్షించాలని రైతులు కోరుతున్నారు. అయితే, ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలో వ్యర్థాలు కలవడం వలనే ప్రాజెక్ట్ నీరు రంగు మారుతుందని, ప్రతి ఏటా ఇలానే జరుగుతుందని ఎస్సారెస్పీ డ్యాం డిప్యూటీఈఈ జగదీష్ తెలిపారు. -
యాసంగి పంటలకు ఎస్సారెస్పీ నీళ్లు
వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో యాంసంగి పంటకు సాగునీటిని అందించాలని సర్కారు నిర్ణయించింది. రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు ఏటా రెండు పంటలకు సాగు నీటిని అందించే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఎస్సారెస్పీ పరిధిలో సాగులో ఉన్న ఆయకట్టు ప్రాంత ఎమ్మెల్యేలతో బుధవారం నీటిపారుదల శాఖ అధికారులు హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశం నిర్వహించారు. రబీసాగుకు నీటి విడుదల, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనుల పురోగతిపై చర్చించారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్, సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎస్సారెస్పీపై హైదరాబాద్‌లో నిర్వహిం చిన సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో ఉన్న నీటి నిల్వలు, కాల్వల ద్వారా అందించేందుకు నీటి లభ్యత, సాగు విస్తీర్ణం పెంచేందుకు ఎస్సారెస్పీ సామర్థ్యం పెంపు పనుల పురోగతి, ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చ జరిగింది. ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ పనులు జూన్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యేలు సూచించారు. నిధులు వంద శాతం ఖర్చుచేయడంతో పాటు పనుల పురోగతి చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు పునరుజ్జీవ పనులు వేగవంతంగా చేపట్టడంతో పాటు రబీలో చెరువులు, కుంటలు అధికారికంగా నింపి ఒక్క ఎకరం నేల కూడా ఎండిపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. 14.40 లక్షల ఎకరాలకు నీరు.. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పుడు కూడా ఆరు లక్షల ఎకరాలకు మించి నీరు ఇవ్వలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సారెస్పీ ద్వారా 14.4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం జరుగుతుందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఎత్తయిన ప్రాంతాలకు లిఫ్టుద్వారా సాగునీటిని అందించే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించాలన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త ఆయకట్టుతో పాటు ఎస్సారెస్పీ సామర్థ్యం పెంపు కోసం ప్రాజెక్టు ఆ«ధునికీకరణకు కూడా నిధులు కేటాయించి సాగు విస్తీర్ణం పెంచుతున్నామన్నారు. ప్రాజెక్టు సామర్థ్యం పెంపుతో పాటు ఎస్సారెస్పీ కాలువల సామర్థ్యాన్ని 3000 క్యూసెక్కుల నుంచి 6000 క్యూసెక్కులకు పెంచడం జరిగిందని వెల్లడించారు. పునరుజ్జీవ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జూన్ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తే వర్షాకాలంలో ప్రాజెక్టు నీటితో కలకలాడే అవకాశం ఉందన్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిరోజు టార్గెట్ పెట్టుకొని పనుల్లో వేగం పెంచి గడువులోపు పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఎండాకాలంలోపు గౌరవెల్లి వరకు... మిడ్ మానేరు నుంచి గౌరవెళ్లి వరకు జరుగుతున్న పనులు ఎండాకాలం లోపే పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఎమ్మెల్యేలు ఇరిగేషన్ అధికారులను కోరారు. కాలువల తవ్వకం కోసం భూసేకరణతో పాటు ఉన్న ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోదావరినదిపై చేపట్టిన కాళేశ్వరం రివర్స్ పంపింగ్ నీళ్లు వర్షాకాలం వరకు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లు అందితే ఇక తెలంగాణలో నీటి కొరత అనేదే ఉండదని తెలిపారు. పోచంపాడ్ నుంచి ఖమ్మం వరకు 14.40 లక్షలతో పాటు ఎత్తైన ప్రాంతాలకు లిఫ్ట్‌ల ద్వారా నీరు అందిస్తామని వెల్లడించారు. జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సమావేశంలో చర్చించారు. 10 నుంచి ఎల్ఎండీ నీటి విడుదల కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) కింద సాగయ్యే ఆయకట్టు పంటలకు ఫిబ్రవరి 10 నుంచి ఒక తడి నీరు విడుదల చేస్తామని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అధికారులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో 5లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎస్సారెస్పీ ద్వారా 14లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని, రబీ పంటకు కూడా అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే తవ్విన కాల్వలకు 3వేల క్యూసెక్కుల కెపాసిటీ నుంచి 6వేల క్యూసెక్కుల నీరు వదిలి పరీక్షించడం జరిగిందన్నారు. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్‌ను బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారికంగా చెరువులు, కుంటలు నింపాలన్నారు. తద్వారా భూగర్భ జలాలు, మత్స్య సంపద పెరుగుతుందని తెలిపారు. జూన్ 30 వరకు కేటాయించిన నిధులు 100 శాతం ఖర్చు చేయాలని, అవసరం అయితే మరిన్ని నిధులు తెచ్చుకుంటామన్నారు. కొన్ని చోట్ల భూ సేకరణలో సమస్యలు ఉన్నాయని, వాటిపైన పూర్తి దృష్టి సారిస్తామన్నారు. వర్షాకాలనికి గౌరవెళ్లి వరకు నీళ్లు తీసుకెళ్తామని తెలిపారు. పనులు ఎక్కడా ఆగలేదని, వేగంగా జరిగేలా ప్రజాప్రతినిధులం కృషి చేస్తున్నామని అన్నారు. కాళేశ్వరం నీళ్లు వీటికి అనుసంధానం కాబోతున్నాయని, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్, సోలిపేట రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, వి.సతీష్‌బాబు, సుంకే రవిశంకర్, నన్నపనేని నరేందర్, సీతక్క, ఆరూరి రమేష్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి హాజరయ్యారు. -
ఎల్ఎండీకి చేరిన ఎస్సారెస్పీ నీళ్లు
తిమ్మాపూర్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు లోయర్ మానేరు డ్యాంలోకి శనివారం మధ్యాహ్నం చేరుకుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ, వరద కాలువ ద్వారా నీటి విడుదలను మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి ఈ నెల 3న ప్రారంభించారు. అక్కడినుంచి ఎల్ఎండీకి నీళ్లు చేరుకోవడానికి మూడు రోజులు పట్టింది. ఆదివారం ఉదయం నుంచి ఎల్ఎండీలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. -
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు సుల్తానాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి డీ–86, డీ–83 కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలంటూ సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రస్తుతం 20 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేసి గ్రామాల్లో చెరువులు, కుంటలను నింపాలని కోరారు. నీటి విడుదలలో జాప్యం చేస్తే తమ ఆందోళను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ వర్తించడం లేదని.. ప్రభుత్వం హరితహారం పేరిట కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో మహేందర్, ప్రకాశ్‌రావు, డీసీఎంస్ జిల్లా డైరెక్టర్ కల్లెపల్లి జాని, మండల నాయకులు అబ్బయ్యగౌడ్, కిశోర్, చిలుక సతీష్, తిరుపతి, రాజలింగం, మహేష్, మల్లయ్య. రామన్న, తాహేర్, మ«ధు, గణేష్, శంకర్‌గౌడ్, నిరంజన్ పాల్గొన్నారు. -
రబీకి గండమే!
తిమ్మాపూర్ : కరువు ఛాయల నేపథ్యంలో సాగుభూములు బీళ్లు గా మారనున్నాయి. గతేడాది నీటితో నిండు కుండల్లా కనిపించిన ప్రాజెక్టులు ఈసారి వర్షాభావంతో వెలవెలబోతున్నాయి. జిల్లా వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈసారి కనీస వరద నీరు కూడా చేరలేదు. ఫలితంగా రెండు పంటలకు నీరందించాల్సిన ప్రాజెక్టు... ఒక్క పంటకు కూడా నీరందిం చలేని దుస్థితిలో ఉంది. ఖరీఫ్ సీజన్లో పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోవడం తో ఖరీఫ్ చివరిదశలో ఒక తడి నీరు అం దించారు. ఈ రబీ సీజన్‌కు సాగునీరిచ్చే అవకాశమే లేదని సీఈ శంకర్ ప్రకటించారు. ఇప్పుడున్న నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతుందని తెలి పారు. ఇప్పటికే బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో గోదావరి వరద నీరు వచ్చే అవకాశమే లేకుండా పో యింది. దీంతో రబీలో ఆయకట్టు మొత్తం బీడుగానే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా బోర్లు, బావులు ఉన్నచోట లక్ష ఎకరాలు మాత్రమే సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.