![TRS Leader Koncha Ramana Reddy Murdered in Navipet Nizamabad - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/22/trs.jpg.webp?itok=zNSAtt8c)
రక్తపు మరకలను పరిశీలిస్తున్న నిజామాబాద్ ఏసీపీ , రమణారెడ్డి (ఫైల్)
నిజామాబాద్, నవీపేట(బోధన్): నవీపేటలో శుక్రవారం టీఆర్‌ఎస్ నాయకుడు కొంచ రమణారెడ్డి(54) దారుణ హత్య సంచలనం సృష్టించింది. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో ఆయనను నరికి చంపారు. నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ట్రెయినీ ఐపీఎస్(నవీపేట ఎస్‌హెచ్‌వో) కిరణ్ ప్రభాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వారు తెలిపిన వివరాల మేరకు.. రమణారెడ్డి ఇంటి గేటులోపలికి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఆవరణలో ఫోన్ మాట్లాడుతున్న రమణారెడ్డి మెడ, తలపై గొడ్డలితో విచక్షణ రహితంగా నరికి పారిపోయారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రమణారెడ్డిని ఆలయానికి వెళ్లి వచ్చిన ఆయన రెండో కూతురు చూసి, బోరున విలపించింది. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ట్రెయినీ ఐపీఎస్ కిరణ్ ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకుని కొన ఊపిరితో రక్తపు మడుగులో ఉన్న రమణారెడ్డిని పోలీస్ వాహనంలోనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులు హత్యకు వాడిన గొడ్డలిని ఆవరణలో పడేసి పారిపోయారు. నిందితులు ప్రహరీ దూకి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ పేర్కొన్నారు. నిందితుల కోసం పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. కుక్క హతుడి ఇంటి నుంచి నిందితులు పారిపోయిన రహదారిని వెంట పరుగులు తీసింది. అర కిలో మీటర్ పరుగు తీసిన డాగ్ స్క్వాడ్ మళ్లీ తిరిగి వచ్చింది.
భార్య కుట్రేనా?
నవీపేట పక్కన గల కమలాపూర్‌లో ఉండే రమణారెడ్డి పదేళ్ల కిందట నవీపేటలో ఇళ్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నాడు. ఆయన తల్లిదండ్రులు కమలాపూర్‌లోనే ఉంటున్నారు. ఆయనకు భార్య నాగసులోచన, ముగ్గురు కూతుళ్లు హరిణి, రక్షిత, హిమబిందు ఉన్నారు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఎనిమిదేళ్ల కిందట ఆమె పెద్ద కూతురు హరిణి, చిన్న కూతురు హిమబిందుతో కలిసి నిజామాబాద్‌లో ఉంటుంది. ఈ నే పథ్యంలో భార్యభర్తల గొడవలు విడాకుల వర కు వెళ్లి కోర్టును ఆశ్రయించారు. ఆస్తి పంపకాల విషయంలో ఇరువురి మధ్య గొడవలు మరింత ముదిరిపోయాయి. ఈ నేపథ్యంలోనే రమణా రెడ్డి హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య వివాహేతర సంబంధం, ఆస్తి పంపకాల గొడవలు హత్యకు కారణమవ్వచ్చనే కోణంలో ప్రాథమికంగా విచారణ చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment