సాక్షి, డిచ్‌పల్లి(నిజామాబాద్) : అనారోగ్యంతో ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందనే మూఢ నమ్మకంతో కన్నతల్లి జుట్టు పట్టుకుని చెప్పుతో బాగా కొట్టడంతో మృతి చెందిన ఘటన డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ శివారులో చోటుచేసుకుంది. వివరాలు.. నిజామాబాద్ నగరానికి చెందిన జ్యోతికి ఐదుగురు పిల్లలు. ఆమె ఊరూరు తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువులు, చిత్తు కాగితాలు ఏరుకుని వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో పిల్లలను పోషిస్తోంది. ఏడాదిగా పిల్లలను వెంటేసుకుని డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ శివారులోని మహాలక్ష్మీ ఆలయం సమీపంలో నివసిస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి కొడుకు కడమంచి కిశోర్ (7) కు వాంతులు, విరోచనాలు అయ్యాయి. గురువారం ఉదయం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలుడికి వైద్యం చేయించిన జ్యోతి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చింది. రాత్రికి కల్లు తాగిన మత్తులో అనారోగ్యంతో పడి ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందని పేర్కొంటూ జుట్టు పట్టుకుని చెప్పుతో బాగా కొట్టింది.
గమనించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఎస్సై సురేశ్‌కుమార్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది బాలుడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కిశోర్ అనారోగ్యంతో మృతి చెందాడా లేక తల్లి కొట్టిన దెబ్బలకు చనిపోయాడా అనే విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. ఇటీవలే ధర్మారం(బి) గ్రామంలో తల్లి చేతిలో కొడుకు మృతి చెందిన ఘటన మరువక ముందే మరో చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
బాలుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి
Comments
Please login to add a commentAdd a comment