బాలికను పెళ్లి చేసుకున్న హరికృష్ణ (ఫైల్)
అనంతపురం క్రైం: పేదరికం, తల్లి అనారోగ్యం కారణాలను ఆసరాగా చేసుకున్న దుర్మార్గులు ఓ బాలికను పోరంబోకుకు కట్టబెట్టారు. తండ్రి స్థానంలో ఉన్న మామ బలాత్కరించబోగా తప్పించుకుని బయటపడిన బాలిక నేరుగా తల్లి చెంతకు చేరింది. వివరాలు... అనంతపురం నగర శివారులోని ఓ కాలనీకి చెందిన బాలిక తండ్రి చిన్నప్పుడే మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి కూలి పనులు చేస్తూ ఏడో తరగతి వరకూ చదివించింది.
ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యం బారిన పడింది. ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో పెళ్లిళ్ల పేరయ్య చాకలి చౌడప్ప ఓ వరుడి తరఫున పెద్ద ఎత్తున కమీషన్ దండుకుని బాలిక తల్లిని మరింత ఆందోళనకు గురి చేశారు. చనిపోతే బిడ్డ భవిష్యత్తు ఏమిటంటూ ఆమెను భయపెట్టాడు. ఈ క్రమంలోనే కంబదూరు మండలం, పాళ్లూరు నివాసి, మరో కులానికి చెందిన యువకుడు హరికృష్ణ, కుటుంబసభ్యులను పిలిపించి పెళ్లి చూపులు సిద్ధం చేయించాడు.
తనకు ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పిన బాలికను దబాయించి, భయపెట్టారు. పెళ్లికొడుక్కి హిందూపురంలో ఓ పెట్రోలు బంకు, 15 ఎకరాల భూమి, రూ.కోట్లలో డబ్బుందని నమ్మించి ఆగస్టు 27న పాపంపేటలోని రామాలయంలో పెళ్లి జరిపించేశారు. పెళ్లి సమయంలో అనుమానాలు వ్యక్తం చేసిన వారికి అప్పటికే బాలిక వయసు13 ఏళ్లు కాగా, 19 ఏళ్లుగా మార్చేసిన ఆధార్ కార్డును చూపించి మభ్య పెట్టారు.
హిందూపురంలో తనదిగా చెప్పుకున్న పెట్రోలు బంకులోనే హరికృష్ణ కాపురం పెట్టాడు. భర్త లేని సమయాల్లో మామ బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని బాలిక అత్తకు తెలిపినా ఫలితం లేకపోవడంతో తనను చూసేందుకు వచ్చిన తల్లితో మొరబెట్టుకుంది.
ఆ సమయంలో తల్లీబిడ్డపై కుటుంబసభ్యులంతా దాడి చేయబోగా తప్పించుకున్న అనంతపురానికి చేరుకున్న ఆమె పెళ్లిళ్ల పేరయ్యతో పాటు పెళ్లికి పెద్ద మనుషులుగా వ్యవహరించిన నిలదీసింది. దీనిపై వారు స్పందించకపోవడంతో బుధవారం ఉదయం నాల్గో పట్టణ పోలీసులకు తల్లి, బాలిక ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment