నా చావుకు స్నేహితులే కారణం.. | - | Sakshi
Sakshi News home page

కలసి ఓడినా కలహం.. బలిగొంది ప్రాణం

Published Sun, Feb 9 2025 1:19 AM | Last Updated on Sun, Feb 9 2025 12:16 PM

-

బెట్టింగ్‌ యాప్‌లో రూ.9 లక్షలు నష్టపోయిన నలుగురు స్నేహితులు

నీ వల్లే ఓడామంటూ ముగ్గురు కలిసి ఒకరిపై తీవ్ర ఒత్తిడి 

అవమాన భారంతో స్నేహితుడి ఆత్మహత్య

ఉరవకొండ: నలుగురు స్నేహితులు. సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఎంతో ఆశతో బెట్టింగ్‌ యాప్‌లో రూ.లక్షలు పోశారు. లాభం కాదు కదా చిల్లిగవ్వ లేకుండా డబ్బంతా పోయింది. అయితే, కలసి కట్టుగా ఆడిన వారు.. నష్టం వస్తే మాత్రం తట్టుకోలేకపోయారు. ముగ్గురు కలిసి తమ స్నేహితుడిపైనే తిరగబడ్డారు. నీ వల్లే జరిగిందని, తమ డబ్బు ఇవ్వాలని ఒత్తిళ్లు చేయడం ప్రారంభించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణం పొందాడు. ఉరవకొండలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. 

ఉరవకొండ పంచాయతీ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న కిషోర్‌కుమార్‌ (41) స్థానిక ముద్దలాపురం వద్ద ఉన్న సుజలాన్‌ విండ్‌ పవర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సునీతతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైఎస్సార్‌ జిల్లా చెన్నూరు సచివాలయంలో మహిళా పోలీసుగా సునీత విధులు నిర్వహిస్తున్నారు. తన స్నేహితులైన హరి, కేదార్‌, సంజయ్‌తో కలిసి కిషోర్‌కుమార్‌ మూడేళ్ల నుంచి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడేవారు. ఇటీవల నలుగురూ దాదాపు రూ.9 లక్షల వరకు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నారు. 

ఇందుకు కారణం నువ్వేనంటూ కిషోర్‌కుమార్‌ను హరి, కేదార్‌, సంజయ్‌లు నిందించడం ప్రారంభించారు. డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. శనివారం ఇంటి వద్ద గొడవకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషోర్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఊరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్‌ఐ జనార్దన్‌ నాయుడు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

నా చావుకు స్నేహితులే కారణం..
ఆత్మహత్య చేసుకొనే ముందు కిషోర్‌ తన చావుకు ముగ్గురు స్నేహితులే కారణమని, వారి పేర్లు హరి, కేదార్‌, సంజయ్‌ అని ఒక పేపర్‌తో పాటు షర్టుపై పెద్ద అక్షరాలతో రాశాడు. డేటా బెట్టింగ్‌ యాప్‌లో పెట్టిన డబ్బు మొత్తం తననే కట్టమని తీవ్ర ఒత్తిడి చేశారంటూ అందులో పేర్కొన్నాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement