అనంతపురం: ఉద్యోగాన్వేషణలో విసిగిపోయిన ఓ యువ న్యాయవాది జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం రెండో పట్టణ ఎస్‌ఐ రుష్యేంద్రబాబు తెలిపిన మేరకు... శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన జి.లాలూసాహెబ్‌కు ముగ్గురు కుమార్తెలు కాగా, వారి చదువుల కోసమని రెండేళ్ల క్రితం అనంతపురానికి వలస వచ్చి కోర్డు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. పెద్ద కుమార్తె రుక్సానా (27) అనంతపురం జిల్లా కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
సీనియర్ న్యాయవాది ఎల్. ప్రభాకర్‌రెడ్డి వద్ద ప్రాక్టీస్ చేస్తున్న ఆమె అనంతపురం న్యాయవాదుల బార్ అసోసియేషన్‌లో క్రియాశీల సభ్యురాలిగా ఉన్నారు. రెండో కుమార్తె ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా, మూడో కుమార్తె అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. ఈ క్రమంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రుక్సానా ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వచ్చారు. అయినా ఏ ఒక్క అవకాశమూ రాలేదు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె... నెల రోజులుగా తీవ్ర మానసిక వేదనతో కోర్టుకు కూడా వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటూ వచ్చారు.
ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై అనంతపురం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ఎస్కేయూ క్యాంపస్ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన రుక్సానాకు గత ప్రభుత్వంలో నెలకు రూ.5 వేలు స్టయిఫండ్ అందేదని, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్టయిఫండ్ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ వచ్చినట్లుగా సమాచారం. వృత్తిలో నిలదొక్కుకునే వరకూ జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ చేయూత అవసరమని యువ న్యాయవాదులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment