గార్లదిన్నె: అయ్యప్ప మాల ధరించిన ఓ యువకుడు అపరిచితుల ఇంట్లోకి చొరబడి వారి వండి పెట్టుకున్న మటన్ ఆరగించి, విలువైన బంగారు నగలు, నగదు అపహరించుకెళ్లాడు. గార్లదిన్నె మండలం కోటంకలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కోటంకకు చెందిన రైతు గోవిందరెడ్డి మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి భార్యతో కలసి పొలానికి వెళ్లాడు.
ఆ సమయంలో అయ్యప్ప మాల ధరించిన యువకుడు ఇంట్లోకి చొరబడి వండిపెట్టిన మటన్, ఇతర ఆహార పదార్థాలను తిని, బీరువాలో ఉన్న ఇంటి యాజమాని దుస్తులు ధరించి, అయ్యప్ప దుస్తులు అక్కడే పడేసి బయటకెళ్లాడు. ఆ సమయంలో ఎదురుపడిన గోవిందరెడ్డి తల్లిని బెదిరించి ఉడాయించాడు. పొలం నుంచి ఇంటికి వచ్చిన గోవిందరెడ్డి దంపతులు ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకెళ్లి పరిశీలించారు.
బీరువాలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నారు. అదే సమయంలో జరిగిన విషయాన్ని తల్లి చెప్పడంతో చెరువు ప్రాంతం వైపు వెళ్లి అక్కడ తచ్చాడుతున్న యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో తాను దొంగతనం చేయలేదని, ఇంట్లో భోజనం చేసి వచ్చానని అంగీకరించాడు. యువకుడు తెలిపిన ఆధారాలతో అనంతపురంలోని బంధువులకు సమాచారం అందివ్వడంతో యువకుడికి మతిస్థిమితం లేదని వారు తెలిపారు. అయితే బాధితులు మాత్రం రూ.50 వేలు నగదు, 2 తులాల బంగారు నగలు చోరీ జరిగినట్లు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment