వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే హత్య
మిస్టరీని ఛేదించిన ఆత్మకూరు పోలీసులు
రిమాండ్‌కు నిందితులు
ఆత్మకూరు: ఓ సాధారణ మృతి కేసులో దాగి ఉన్న మిస్టరీని పోలీసులు ఛేదించారు. పోస్టు మార్టం నివేదిక ఆధారంగా హత్యగా నిర్ధారించుకున్న పోలీసులు ఆ దిశగా కేసు మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటుకపల్లి సీఐ హేమంత్‌కుమార్, ఆత్మకూరు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు...
11 నెలల క్రితం ఘటన..
ఆత్మకూరు మండలంలోని ముట్టాల గ్రామానికి చెందిన మట్టి పెద్దరాజులు(36)కు భార్య శివమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గొరిదిండ్ల సమీపంలోని హంద్రీ–నీవా కాలువ పక్కన తనకున్న పొలంలో గుడిసె వేసుకుని భార్యాపిల్లలతో నివసిస్తూ వ్యవసాయంతో పాటు వృషభాలకు రాతిదూలం లాగే శిక్షణ ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 30న పొలం పనులు చేసిన అనంతరం రాత్రి భోజనం చేసి నిద్రించాడు. 31న ఉదయం ఎంత లేపినా నిద్ర లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పెద్దరాజులు మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే అప్పట్లో పాము కాటుతోనో లేదా ఎద్దులు పొడవడం వల్లనో మృతి చెంది ఉంటాడని అందరూ భావించారు. ఆ దిశగానే భార్య శివమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజం బయటపెట్టిన పోస్టుమార్టం..
పెద్దరాజులు మృతి అనంతరం శివమ్మ కావాలనే తన అత్తమామలతో ఘర్షణ పడి మదిగుబ్బలోని పుట్టింటికి చేరుకుంది. ఈ క్రమంలోనే పెద్దరాజులు మృతదేహానికి వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందించింది. ఆయనది సాధారణ మరణం కాదని, ఊపిరి అందకుండా చేసి హతమార్చినట్లుగా నిర్ధారణ కావడంతో హత్య కేసుగా పోలీసులు మార్చి దర్యాప్తు చేపట్టారు. దీంతో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. హతుడి తమ్ముడు అనిల్‌తో శివమ్మకు వివాహేతర సంబంధం ఉందనే విషయం తెలిసింది. ఇదే సమయంలో తమ చుట్టూ పోలీసుల ఉచ్చు బిగుస్తోందని తెలుసుకున్న అనిల్, శివమ్మ ఈ నెల 21న వీఆర్వో మహమ్మద్ రఫీ సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు. అనంతరం హత్య చేసిన వైనాన్ని వివరించడంతో వారిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment