child marraige
-
అనారోగ్యంతో తల్లి.. దగా చేసిన పెళ్లిళ్ల పేరయ్య!
అనంతపురం క్రైం: పేదరికం, తల్లి అనారోగ్యం కారణాలను ఆసరాగా చేసుకున్న దుర్మార్గులు ఓ బాలికను పోరంబోకుకు కట్టబెట్టారు. తండ్రి స్థానంలో ఉన్న మామ బలాత్కరించబోగా తప్పించుకుని బయటపడిన బాలిక నేరుగా తల్లి చెంతకు చేరింది. వివరాలు... అనంతపురం నగర శివారులోని ఓ కాలనీకి చెందిన బాలిక తండ్రి చిన్నప్పుడే మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి కూలి పనులు చేస్తూ ఏడో తరగతి వరకూ చదివించింది. ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యం బారిన పడింది. ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో పెళ్లిళ్ల పేరయ్య చాకలి చౌడప్ప ఓ వరుడి తరఫున పెద్ద ఎత్తున కమీషన్ దండుకుని బాలిక తల్లిని మరింత ఆందోళనకు గురి చేశారు. చనిపోతే బిడ్డ భవిష్యత్తు ఏమిటంటూ ఆమెను భయపెట్టాడు. ఈ క్రమంలోనే కంబదూరు మండలం, పాళ్లూరు నివాసి, మరో కులానికి చెందిన యువకుడు హరికృష్ణ, కుటుంబసభ్యులను పిలిపించి పెళ్లి చూపులు సిద్ధం చేయించాడు. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పిన బాలికను దబాయించి, భయపెట్టారు. పెళ్లికొడుక్కి హిందూపురంలో ఓ పెట్రోలు బంకు, 15 ఎకరాల భూమి, రూ.కోట్లలో డబ్బుందని నమ్మించి ఆగస్టు 27న పాపంపేటలోని రామాలయంలో పెళ్లి జరిపించేశారు. పెళ్లి సమయంలో అనుమానాలు వ్యక్తం చేసిన వారికి అప్పటికే బాలిక వయసు13 ఏళ్లు కాగా, 19 ఏళ్లుగా మార్చేసిన ఆధార్ కార్డును చూపించి మభ్య పెట్టారు. హిందూపురంలో తనదిగా చెప్పుకున్న పెట్రోలు బంకులోనే హరికృష్ణ కాపురం పెట్టాడు. భర్త లేని సమయాల్లో మామ బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని బాలిక అత్తకు తెలిపినా ఫలితం లేకపోవడంతో తనను చూసేందుకు వచ్చిన తల్లితో మొరబెట్టుకుంది. ఆ సమయంలో తల్లీబిడ్డపై కుటుంబసభ్యులంతా దాడి చేయబోగా తప్పించుకున్న అనంతపురానికి చేరుకున్న ఆమె పెళ్లిళ్ల పేరయ్యతో పాటు పెళ్లికి పెద్ద మనుషులుగా వ్యవహరించిన నిలదీసింది. దీనిపై వారు స్పందించకపోవడంతో బుధవారం ఉదయం నాల్గో పట్టణ పోలీసులకు తల్లి, బాలిక ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పాపను మాతో పంపించండన్నా.. వినని పోలీసు అధికారి..!
సాక్షి, వరంగల్: మైనర్‌ను పెళ్లి చేసుకుని భద్రత కోసం వచ్చిన ఓ వ్యక్తికి వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు అనుకూలంగా వ్యవహరించడం సంచలనంగా మారింది. పుట్టిన తేదీకి ఆధార్ కార్డు ఆధారం కాదంటూ సుప్రీంకోర్టు చెప్పినా అదే ఆధార్ కార్డును ఆసరా చేసుకుని సదురు బాలికను మేజర్‌గా గుర్తించి మరీ అతడి వెంట పంపడం పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. మహిళల భద్రత విషయంలో ఎక్కడా తగ్గేదే లేదని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే.. అందుకు విభిన్నంగా చెన్నారావుపేట పోలీసులు అది కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ వ్యవహరిస్తున్నారు. కనీసం బాధితురాలి తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకపోవడం తెరవెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ జోరుగా జరుగుతోంది. పాపను తమ వెంట పంపకుండా.. ఎక్కడ భద్రత కల్పిస్తారంటే సదరు ఎస్సై కనీస సమాధానం ఇవ్వకపోవడంతో మంగళవారం రాత్రంతా ఆ తల్లిదండ్రులకు జాగారం చేస్తూ బోరున విలపించారు. అన్ని ధ్రువపత్రాలు సమర్పించినా ససేమిరా.. దాదాపు 30 ఏళ్లున్న వ్యక్తితో బాలికకు వివాహం జరిగితే వాస్తవం తెలుసుకోకుండా సదరు పోలీసు అధికారి ఏకపక్షంగా వ్యవహరించడంతో బాలికల భద్రత చట్టం సరిగా అమలు అవుతుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక(15)కు 30 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరారు. ఆ వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందడంతో ఠాణాకు వెళ్లి తమ పాప బాలికనని తెలిపారు. దీనికి ఆధారంగా ఆధార్ కార్డు చూపించినా అదీ చెల్లదన్నారు. బాలిక పుట్టిన తేదీ, బాలిక జన్మించినప్పటి దవాఖాన డిశ్చార్జ్ కార్డు చూపించినా సదరు అధికారి తిరస్కరించారు. బాలిక చదివిన పాఠశాలలో స్టడీ సర్టిఫికెట్ తీసుకురమ్మని చెప్పగా ‘రాత్రి అయిందా కదా సార్ రేపు తీసుకొస్తాం. పాపను మాతో పంపించండన్నా’ స్పందించలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులను అక్కడి నుంచి పంపిన అనంతరం బాలికను ఆ వ్యక్తితోనే పంపించారు. మంగళవారం సాయంత్రం వరకూ బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిబంధనలు ఏంటీ.. బాలల న్యాయ చట్ట ప్రకారం.. 18 సంవత్సరాలు లోపు బాలల విషయాలు పోలీసుల దృష్టికి వస్తే వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ హెల్ప్ లైన్, బాలల సంరక్షణ విభాగాలకు సమాచారం అందించాలి. సదరు అధికారులు బాలుడు లేదా బాలిక స్థితిగతులు తెలుసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి వారి ఆదేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. పోలీసులు ఏకంగా పెళ్లి చేసుకున్న వ్యక్తి వెంట సదరు బాలికను పంపించడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సీడబ్ల్యూసీ ముందుకువస్తే ఆ బాలికతో మాట్లాడి సఖి కేంద్రానికి పంపి కౌన్సెలింగ్ ఇస్తారు. లేదంటే తల్లిదండ్రులతోని వెళ్తానంటే పంపిస్తారు. అయితే ఇక్కడ అవేమీ జరగకుండా పోలీసులు నిర్ణయం తీసుకుని బాలికను ఆ వ్యక్తితో పంపడంతో ఆమె పరిస్థితి ఎలా ఉందనే టెన్షన్ తల్లిదండ్రుల్లో నెలకొని ఉంది. విచారణ చేపట్టిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ.. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు పోలీసులను కలిసి వచ్చిన అనంతరం మండల స్థాయి ఐసీడీఎస్ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. సదరు బాలికకు 15 సంవత్సరాలు మాత్రమే ఉండగా, చట్ట విరుద్ధంగా వ్యక్తి పెళ్లి చేసుకున్నాడని, బాలిక ఆచూకీ సైతం లేదని సీడబ్ల్యూసీ కమిటీని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. కాగా, బాలల న్యాయ చట్టాలను ఉల్లంఘించిన సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాలల హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. -
బాల్యాన్ని బందీ కానీయొద్దు.. బాల్య వివాహాల చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
వికారాబాద్ అర్బన్: బాల్య వివాహాల నివారణ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జూలై మాసంలో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితంలో బాల్యం చాలా గొప్పదన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో జూలై 31లోపు అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పిల్లల సంక్షేమ కమిటీ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలన్నారు. పిల్లలకు మంచి జీవితాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కొంత కటువుగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఈ విషయంలో అధికారులకు ఏదైనా సమస్య ఎదురైతే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. తప్పిపోయిన పిల్లల విషయంలో చైల్డ్‌లైన్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జూలై 9న జరిగే సమావేశానికి గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివి పైచదువులకు వెళ్లని విద్యార్థినుల జాబితా సేకరించి తీసుకురావాలని డీఈఓను ఆదేశించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ చట్టం పరిధిలో పనిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా సంబంధిత సెక్రటరీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యాన్ని బందీ కానీయొద్దని.. బడీడు పిల్లలందరూ పాఠశాలలో ఉండేలా చూడాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అనంతరం దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ రూపొందించిన పలు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ లలితకుమారి, డీఆర్ఓ అశోక్‌కుమార్, డీఎంహెచ్ఓ పాల్వాన్ కుమార్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
58 ఏళ్ల వృద్ధుడికి 16 ఏళ్ల బాలికతో వివాహం, కట్ చేస్తే..
సాక్షి, కంప్లి(కర్నాటక): బాలికతో పెళ్లికి సిద్ధమైన వృద్ధుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. హంపాదేవినహళ్లి పంచాయతీ పరిధిలోని జీరిగనూరు గ్రామానికి చెందిన 58 ఏళ్ల వృద్ధుడికి 16 ఏళ్ల బాలికను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 23న పెళ్లికి ఏర్పాట్లు చేయగా గుర్తు తెలియని వ్యక్తులు 1098 నంబర్‌కు ఇచ్చిన సమాచారంతో హొసపేటె శిశు అభివృద్ధి యోజన అధికారి కంప్లి పోలీసు సిబ్బందితో కలిసి వెళ్లి వివాహం రద్దు చేయించారు. అయితే మరుసటి రోజు పట్టణ సెరుగు గ్రామంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్ గౌసియాబేగం వెళ్లి వివాహాన్ని అడ్డుకొని వృద్ధుడిని కంప్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి బాల్య వివాహ నిషేద చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: ఇటు భర్త.. అటు భార్య మిస్సింగ్.. తలలు పట్టుకున్న పోలీసులు.. -
అన్నదమ్ముల మోసం.. బాలికలకు గర్భం
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రేమ పేరుతో ఇద్దరన్నదమ్ములు, ఇద్దరు మైనర్ బాలికలను మోసగించి, ఆనక ముఖం చాటేశారంటూ.. కుల పెద్దలు వారికి వివాహం చేయాలని నిశ్చయించారు. అనుకున్నదే తడవుగా అన్నదమ్ముల్లో తమ్ముడికి ఆదివారం అర్ధరాత్రి సమయంలో వివాహం చేశారు. మరుసటిరోజు సోమవారం ఉదయం అన్నయ్యకు వివాహం జరిపే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. మండలంలోని తిరుమలంపాలెం ఎస్సీ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికుల కథనం ప్రకారం. కాలనీకి చెందిన ఇద్దరు బాలికలు(ఒకరి వయస్సు 16, మరొకరి వయస్సు 17) తమను ఇద్దరన్నదమ్ములు మోసగించి, గర్భవతులను చేశారంటూ కుల పెద్దలను ఆశ్రయించారు. దీనిపై ఆదివారం రాత్రి కాలనీలోని రామాలయం వద్ద పంచాయితీ నిర్వహించారు. అనంతరం బాలికలకు, అన్నదమ్ములతో వివాహం జరపాలని తేల్చారు. దీంతో అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అన్నదమ్ముల్లో మైనరైన(17 ఏళ్ల వయస్సు గల) తమ్ముడికి, 7 నెలల గర్భవతి అయిన బాలికతో వివాహం జరిపించారు. మరుసటి రోజు ఉదయం మేజరైన అన్నయ్యకు, 8 నెలల గర్భవతి అయిన బాలికతో వివాహం జరిపే ప్రయత్నం చేశారు. ఫిర్యాదు అందడంతో.. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, కాలనీలోని రామాలయం వద్ద జరుగుతున్న వివాహాన్ని అడ్డుకున్నారు. అక్కడున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, పోలీస్టేషన్‌కు తరలించారు. అయితే తమను మోసగించి, గర్భవతులను చేసింది ముమ్మాటికీ ఈ ఇద్దరు అన్నదమ్ములేనని బాలికలు అంటుంటే, తమకు ఏమాత్రం సంబంధం లేదని, కావాలని కుల పెద్దలు, బాలికల తరపువారు తమను ఇందులో ఇరికిస్తున్నారని అన్నదమ్ములు, వారి తల్లిదండ్రులు అంటున్నారు. అయితే ఈ అన్నదమ్ములకు చెందిన తోటలోకే బాధిత బాలికలు పొలం పనులకు వెళ్తుంటారని స్థానికులు చెప్పారు. రాజీకి యత్నాలు.. పోలీస్టేషన్‌కు చేరిన ఇరు కుటుంబ సభ్యులు, కుల పెద్దలు రాజీకి యత్నించారు. గ్రామంలో మరోమారు తాము చర్చించుకుని వస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఈ ఘటన గ్రామంలో తీవ్ర అలజడిని సృష్టించింది. బాలికలకు నెలలు నిండే వరకు కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
అమ్మాయికి 12 ఏళ్లు..అబ్బాయికి 22
వికారాబాద్ అర్బన్ : బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ చిన్నఅప్పల నాయుడు హెచ్చరించారు. మండల పరిధిలోని ద్యాచారం గ్రామానికి చెందిన ఓ బాలికకు 22 ఏళ్ల యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారని చైల్డ్‌లైన్‌కు సమాచారం అందింది. ఈమేరకు తహసీల్దార్ ఆదేశాల మేరకు మంగళవారం వీఆర్ఓ, చైల్డ్‌లైన్ సిబ్బంది గ్రామానికి వెళ్లి బాలిక తల్లిదండ్రులను తీసుకొచ్చి తహసీల్దార్ ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహం ద్వారా జరిగే అనర్థాలను వివరించారు. బాల్య వివాహంతో అమ్మాయి అనారోగ్యం బారినపడుతుందని తెలిపారు. బాలిక చదువు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి వివాహం చేస్తే బాధ్యులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బాలికకు మైనారిటీ తీరేవరకు వివాహం చేయబోమని ఆమె తల్లిదండ్రులతో హామీపత్రం రాయించుకున్నారు. గ్రామ కార్యదర్శి ప్రసన్న కుమార్, వీఆర్ఓ గోపాల్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సత్యమ్మ, చైల్డ్‌లైన్ ప్రతినిధి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య, ఎంవీఎఫ్ ఆర్గనైజర్లు వెంకటయ్య, ఆశలత ఉన్నారు. -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న ‘చైల్డ్‌లైన్’
కుల్కచర్ల: అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు సహకరించిన వారిపై చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రీనివాస్ శంకర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి రాములు హెచ్చరించారు. మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన బాలయ్య, మంగమ్మల కుమార్తె (17)కు మైనారిటీ తీరకుండానే పెళ్లి చేయడానికి నిశ్చయించారు. ఈ విషయం చైల్డ్ లైన్ ప్రతినిధులకు తెలియడంతో గురువారం స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో బండవెల్కిచర్ల గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలకు పెళ్లి వయస్సు రాకముందే వివాహం చేస్తే కలిగే అనర్థాల గురించి వివరించారు. తహసీల్దార్ శ్రీనివాస్ దగ్గరకు తీసుకొచ్చి వారితో హమీ పత్రం రాయించుకున్నారు. తమ బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన తరువాతనే పెళ్లి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
మద్దూరు : ఓ బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకోగలిగారు. వివరాలిలా ఉన్నాయి. మద్దూరులోని 15ఏళ్ల బాలిక గతేడాది దామరగిద్ద కేజీవీబీలో ఏడోతరగతి చదువుతూ మధ్యలోనే మానేసింది. కాగా, ఈ బాలికకు పెద్దరాయిచూర్‌కు చెందిన వీరేష్‌తో వారం పది రోజుల్లో వివాహం చేయడానికి కుటుంబ పెద్దలు నిశ్చయించారు. శుక్రవారం విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్త సుజాత వెంటనే ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, చైల్డ్ హెల్ప్‌లైన్1098 సభ్యుడు విజయ్‌కుమార్, ఎస్ఐ నరేందర్‌లకు సమచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయిని తహసీల్దార్ చందర్ ఎదుట హాజరుపర్చి అనంతరం జిల్లా కేంద్రంలోని బాలల సదన్‌కు పంపించారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న సీడీపీఓ
సంగం: సంగం మండలం జంగాలదరువులో బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారంతో సోమవారం సీడీపీఓ విజయలక్ష్మి గ్రామానికి వెళ్లి బాల్య వివాహం జరగనివ్వకుండా పెద్దలను ఒప్పించారు. జంగాలదరువుకు చెందిన 13 సంవత్సరాల మైనర్ బాలికకు ఈనెల 25వ తేదీ వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. సమాచారం సీడీపీఓ విజయలక్ష్మికి తెలియడంతో ఆమె గ్రామానికి వెళ్లి మైనర్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. మైనర్ బాలికకు వివాహం చేస్తే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని వారికి తెలిపారు. మైనర్ వివాహం చేస్తే పోలీసు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో మైనర్ బాలిక తల్లిదండ్రులు తాము వివాహం చేయమంటూ తెలిపారు. ఈమె వెంట అంగన్వాడీ సూపర్వైజర్ నాగమణి, సంగం పోలీసులు ఉన్నారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
చిల్లకూరు : మండలంలోని వల్లిపేడులో శుక్రవారం బ్యాల వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. వల్లిపేడుకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడికి అదే గ్రామానికి చెందిన 16 ఏళ్లతో బాలికతో ఈ నెల 25న వివాహం జరిపించేందుకు వారి తల్లిదండ్రులు నిశ్చియించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ సీతాలక్ష్మి రెవెన్యూ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూపర్వైజర్ సీతాలక్ష్మి, వీఆర్వో సుబ్బయ్య, కానిస్టేబుళ్లు సాయినాథ్, కిషోర్ గ్రామానికి చేరుకుని బాలిక తల్లిదండ్రలతో మాట్లాడారు. యువకుడి తల్లిదండ్రలకు అవగాహన కల్పించి ఇద్దరికి వివాహం జరిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరువురి తల్లిదండ్రుల నుంచి మరో రెండేళ్ల పాటు వివాహం చేయమని వారి వద్ద లిఖిత పూర్వకంగా హామీ పత్రాలు తీసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు వాణి, పరమేశ్వరి పాల్గొన్నారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ఆమదాలవలస : పట్టణంలో ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి జరగాల్సిన బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. మున్సిపాల్టీ పరిధి 7వ వార్డు చింతాడ గ్రామానికి చెందిన పావనికి అదే గ్రామానికి చెందిన నాగరాజుకు వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించి ముహూర్తం నిర్ణయించారు. అయితే పావనికి 18 సంవత్సరాలు నిండకుండానే వివాహం జరుపుతున్నారని చింతాడ గ్రామానికి చెందిన స్థానికులు 1098కు సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న జిల్లా బాలిక సంరక్షణాధికారి బి.రమణమూర్తి, అంగన్వాడీ సూపర్వైజర్స్ ప్రసన్నకుమారి, విజయశ్రీ, చైల్డ్‌లైన్ సభ్యులు మాధవి అందరూ కలిసి వివాహం జరుగుతున్న కల్యాణ మండపానికి మంగళవారం చేరుకున్నారు. వధూవరుల తల్లిదండ్రులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని అందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులు శిక్షార్హులని వివరించారు. బాలిక చింతాడ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నందున ఆమె వయస్సు 14 సంవత్సరాల ఉందని, చదువుతున్న బాలికకు వివాహం చేయడం నేరమని తెలియజేశారు. వివాహాన్ని నిలుపుదల చేసి బాలికకు వయస్సు నిండాక జరుపుకోవాలని పెళ్లి కుమారుని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన తల్లిదండ్రులు వివాహాన్ని నిలుపుదల చేస్తున్నట్లు రాత పూర్వకంగా తెలియజేశారు. -
60 ఏళ్ల వృద్ధుడికి ఆరేళ్ల పాప కానుక అట!
అరవై ఏళ్ల వయస్సున్న ఓ ముస్లిం మతగురువు అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. మతప్రకారం చెల్లించుకున్న కానుక ఆ పాప అని, అందుకే ఆమెను తాను మనువాడినట్టు ఆ వృద్ధ మతగురువు చెప్తున్నాడు. ఈ వివాహం గురించి ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా తెలుసనని అంటున్నాడు. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్‌లోని ఘోర్ ప్రావిన్స్‌లో జరిగింది. ఆరేళ్ల పాపను పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆ పెళ్లిని సమర్థించుకుంటున్న మతగురువు మహమ్మద్ కరీమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తమకు తెలియకుండా తమ బిడ్డను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత మత గురువు పెళ్లిచేసుకున్నాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మతగురువు నుంచి బాలికను కాపాడి ఓ మహిళ సంరక్షణలో ఉంచారు. చిన్నారికి ఆ మతగురువు శారీరకంగా ఎలాంటి హాని తలపెట్టలేదని గుర్తించారు. అయితే, మాటలు కూడా సరిగ్గారాని బాధిత బాలిక అతడిని చూసి బెంబేలెత్తినట్టు కనిపిస్తున్నదని పోలీసులు తెలిపారు. అఫ్ఘానిస్థాన్‌లో అమ్మాయిలకు 16 ఏళ్లు, అబ్బాయిలకు 18 ఏళ్లు చట్టబద్ధమైన వివాహ వయస్సు. అయితే షరియత్ చట్టం ప్రకారం తండ్రి లేదా, తాత ఒప్పుకుంటే చిన్నపిల్లలకు కూడా పెళ్లిలు చెయ్యొచ్చు. ఆఫ్ఘన్‌లోని చాలామంది పేదలు డబ్బుకు ఆశపడి చిన్నారులను ముసలివారికి కట్టబెట్టే ఆచారముంది.