బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
Published Tue, Aug 16 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
ఆమదాలవలస : పట్టణంలో ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి జరగాల్సిన బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. మున్సిపాల్టీ పరిధి 7వ వార్డు చింతాడ గ్రామానికి చెందిన పావనికి అదే గ్రామానికి చెందిన నాగరాజుకు వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించి ముహూర్తం నిర్ణయించారు. అయితే పావనికి 18 సంవత్సరాలు నిండకుండానే వివాహం జరుపుతున్నారని చింతాడ గ్రామానికి చెందిన స్థానికులు 1098కు సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న జిల్లా బాలిక సంరక్షణాధికారి బి.రమణమూర్తి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్స్ ప్రసన్నకుమారి, విజయశ్రీ, చైల్డ్‌లైన్ సభ్యులు మాధవి అందరూ కలిసి వివాహం జరుగుతున్న కల్యాణ మండపానికి మంగళవారం చేరుకున్నారు. వధూవరుల తల్లిదండ్రులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని అందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులు శిక్షార్హులని వివరించారు. బాలిక చింతాడ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నందున ఆమె వయస్సు 14 సంవత్సరాల ఉందని, చదువుతున్న బాలికకు వివాహం చేయడం నేరమని తెలియజేశారు. వివాహాన్ని నిలుపుదల చేసి బాలికకు వయస్సు నిండాక జరుపుకోవాలని పెళ్లి కుమారుని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన తల్లిదండ్రులు వివాహాన్ని నిలుపుదల చేస్తున్నట్లు రాత పూర్వకంగా తెలియజేశారు.
Advertisement