సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ అర్బన్: బాల్య వివాహాల నివారణ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జూలై మాసంలో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితంలో బాల్యం చాలా గొప్పదన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో జూలై 31లోపు అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పిల్లల సంక్షేమ కమిటీ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలన్నారు.
పిల్లలకు మంచి జీవితాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కొంత కటువుగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఈ విషయంలో అధికారులకు ఏదైనా సమస్య ఎదురైతే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. తప్పిపోయిన పిల్లల విషయంలో చైల్డ్‌లైన్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జూలై 9న జరిగే సమావేశానికి గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివి పైచదువులకు వెళ్లని విద్యార్థినుల జాబితా సేకరించి తీసుకురావాలని డీఈఓను ఆదేశించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ చట్టం పరిధిలో పనిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు.
ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా సంబంధిత సెక్రటరీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యాన్ని బందీ కానీయొద్దని.. బడీడు పిల్లలందరూ పాఠశాలలో ఉండేలా చూడాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అనంతరం దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ రూపొందించిన పలు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ లలితకుమారి, డీఆర్‌ఓ అశోక్‌కుమార్, డీఎంహెచ్‌ఓ పాల్వాన్ కుమార్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment