Child labor System
-
బాల్యాన్ని బందీ కానీయొద్దు.. బాల్య వివాహాల చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
వికారాబాద్ అర్బన్: బాల్య వివాహాల నివారణ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జూలై మాసంలో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితంలో బాల్యం చాలా గొప్పదన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో జూలై 31లోపు అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పిల్లల సంక్షేమ కమిటీ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలన్నారు. పిల్లలకు మంచి జీవితాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కొంత కటువుగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఈ విషయంలో అధికారులకు ఏదైనా సమస్య ఎదురైతే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. తప్పిపోయిన పిల్లల విషయంలో చైల్డ్‌లైన్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జూలై 9న జరిగే సమావేశానికి గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివి పైచదువులకు వెళ్లని విద్యార్థినుల జాబితా సేకరించి తీసుకురావాలని డీఈఓను ఆదేశించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ చట్టం పరిధిలో పనిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా సంబంధిత సెక్రటరీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యాన్ని బందీ కానీయొద్దని.. బడీడు పిల్లలందరూ పాఠశాలలో ఉండేలా చూడాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అనంతరం దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ రూపొందించిన పలు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ లలితకుమారి, డీఆర్ఓ అశోక్‌కుమార్, డీఎంహెచ్ఓ పాల్వాన్ కుమార్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి వీధి బాలలే రేపటి విద్యావంతులు
సాక్షి, అమరావతి: నేటి వీధి బాలలే రేపటి విద్యావంతులు కావాలనే లక్ష్యంతో మనమంతా కృషి చేయాలని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వీధి బాలలను కాపాడటానికి ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ ముగింపు సందర్భంగా బుధవారం వెబినార్ నిర్వహించారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు.. 13 జిల్లాల పోలీస్ అధికారులు, వీధిబాలలతో నిర్వహించిన వెబినార్‌ను గుంటూరు నుంచి హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించే ముస్కాన్ గొప్ప కార్యక్రమమన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 16,457 మంది బాలలను కాపాడామని చెప్పారు. -
బాల వికాసానికి 'మూలస్థానం'
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గోదావరి చెంత బాల వికాసం పరవళ్లు తొక్కుతోంది. అధికారుల అంకితభావం అక్కడి బాలకార్మిక వ్యవస్థకు అడ్డుకట్ట వేసింది. బాల్య వివాహాలను తరిమికొట్టింది. అంగన్వాడీల లాలన చిన్నారుల్లో రక్తహీనతను రూపుమాపి బాలల ఆరోగ్యానికి బాటలు వేసింది. శిశు మరణాలను దూరం చేసింది. గ్రామస్తుల సహకారం సమస్యాత్మక పల్లెకు సరికొత్త రూపు తెచ్చింది. అదే ఆ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. బాలల సంరక్షణ విషయంలో సమర్థవంతమైన పనితీరు కనబర్చినందుకు గాను 2020 సంవత్సరానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘బాలమిత్ర (చైల్డ్ ఫ్రెండ్లీ) పంచాయతీ’ పురస్కారాన్ని దక్కించుకుంది. గౌతమీ గోదావరి చెంతన చెన్నై–కలకత్తా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆ గ్రామమే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని మూలస్థానం పంచాయతీ. సమస్యల చీకట్లను జయించి.. ► నిత్యం తగాదాలతో మూలస్థానం తల్లడిల్లేది. మరోవైపు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహారం లోపం తదితర సమస్యలు గ్రామాన్ని పీడిస్తుండేవి. ► గ్రామంలోని అంగనవాడీ కేంద్రాల పరిధిలో ఆరేళ్లలోపు చిన్నారులు 434 మంది, గర్భిణులు 51 మంది, బాలింతలు 44 మంది ఉన్నారు. ► గ్రామస్తులు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చి రుగ్మతలను రూపుమాపేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతోపాటు మండలస్థాయి అధికారుల వరకు అందరూ సమష్టిగా పనిచేశారు. ► అధికారులు, గ్రామంలోని ఉద్యోగుల కృషికి గ్రామస్తుల సహకారం తోడవటంతో ఏడాదిలోనే మంచి ఫలితాలను సాధించారు. ఆరోగ్య లోపాలను అధిగమించి.. ► మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచీ ప్రసవమయ్యే వరకూ అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలుఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శిశు మరణాలకు అడ్డుకట్ట వేయగలిగారు. ► చిన్నారులకు సకాలంలో టీకాలు వేయడం, వయసుకు అనుగుణంగా వారి ఎత్తు, బరువును నమోదు చేసి లోపాలున్న వారికి పౌష్టికాహారం అందించారు ► తీవ్ర పోషకాహార లోపం, అతి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వైద్య సిబ్బందితో కలిసి రక్తహీనత గల చిన్నారులను గుర్తించి రెట్టింపు పోషకాహారాన్ని అందించారు. ► ఏడాది క్రితం వరకు గ్రామంలో శిశు మరణాలు 3 శాతం వరకు ఉండగా.. అంగన్వాడీలు ప్రత్యేక శ్రద్ధ వహించి గత ఏడాదిలో ఒక్క శిశు, బాలింత మరణం కూడా సంభవించకుండా చర్యలు చేపట్టారు. ► గతంలో గ్రామంలోని 10 శాతం మంది చిన్నారులు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బాల్య వివాహాలకు.. బాల కార్మిక వ్యవస్థకు చెక్ ► దగ్గరి బంధువులనో.. మంచి సంబంధమనో 10వ తరగతిలోపు బాలికలకు పెళ్లిళ్లు చేసేవారు. ► వీటిని అరికట్టే దిశగా అంగన్వాడీ కార్యకర్తలు 2015లో చర్యలు చేపట్టారు. వారికి పంచాయతీ, మండల అధికారుల సహకారం తోడవటంతో బెదిరింపులు వచ్చినా ఎదురొడ్డి నిలబడి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించారు. ► గ్రామంలోని 80 వరకు ఇటుకల బట్టీలు, కూరగాయల సాగు విస్తరించి ఉన్నాయి. 2018 నాటికి 52 బాల కార్మికులు ఉండగా వారిని గుర్తించి బడిబాట పట్టించారు. అవార్డు రావడం గర్వంగా ఉంది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ‘చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ’ అవార్డు మా గ్రామానికి దక్కడం చాలా గర్వంగా ఉంది. యు.రేణుక, పంచాయతీ కార్యదర్శి నిరంతర పర్యవేక్షణ పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల వయసు చిన్నారుల వరకు వారికి నిర్ణీత సమయంలో వైద్య సేవలందించి శిశు మరణాలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించాం. ఎం.సుమలత, పీహెచ్సీ అధికారి, చొప్పెల్ల పౌష్టికాహార లోపం లేకుండా పర్యవేక్షణ చిన్నారుల్లో పౌష్టికాహార లోపం లేకుండా చర్యలు తీసుకున్నాం. నిరంతరం ఆటపాటలు నేర్పించి చురుకుదనం పెరిగేందుకు కృషి చేశాం. ఎల్.విజయ కుమారి, అంగన్వాడీ కార్యకర్త -
పొంతలేని లెక్కలు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఎన్రోల్మెంట్ డ్రైవ్, చదువుల పండుగ, బడిబాట, విద్యావారోత్సవాలు, విద్యా పక్షోత్సవాలు, విద్యాసంబరాలు, ఆచార్య జయశంకర్ చదువుల పండుగ.. ఇలా పదేళ్లలో ప్రభుత్వం అనేక కార్యమాలు నిర్వహించింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే.. బడీడు పిల్లలు బడిలోనే ఉండేవారు. కానీ.. అలా జరగలేదు. ఆరేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం సైతం పనిచేసినట్టు కన్పించడం లేదు. ఫలితంగా పలకాబలపం పట్టాల్సిన చేతులు మెకానిక్ షెడ్లల్లో, ఇటుకబట్టీల్లో పానలు, పారలు పడుతున్నాయి. పుస్తకాలు చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణాల్లో రద్దీ ప్రదేశాల్లో బడీడు పిల్లలు భిక్షాటన చేస్తూ పొట్టపోసుకోవడం కనిపిస్తోంది. కరీంనగర్‌ఎడ్యుకేషన్: జిల్లాలోని 16 మండలాల్లో బడిబయట ఉన్న పిల్లల సర్వేను సెప్టెంబర్ 06 నుంచి అక్టోబర్ 28 వరకు రాజీవ్ విద్యామిషన్, మెప్మా ప్రాజెక్టు ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్, ఐఈడీ రిసోర్స్ టీచర్లు, పార్ట్‌టైం టీచర్లు నిర్వహించారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 354 మంది బడికి వెళ్లని విద్యార్థులను గుర్తించినట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. అందులోనుంచి బడిలో చేరి అర్ధాంతరంగా చదువు మానేసిన వారు 142 మంది ఉన్నారని, బడీడు ఉండీ.. ఇప్పటికి పాఠశాలల్లోకి వెళ్లనివారు 212 మంది ఉన్నట్లు అధికారులకు లెక్క అందజేశారు. అయితే సీఆర్పీలు ఆయా గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉండగా.. చాలామంది గతేడాది నిర్వహించిన సర్వే లెక్కలనే ఈ ఏడాది కూడా చూపించి మమ అనిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేపై సందిగ్ధత నెలకొనడంతో మరోసారి సర్వే చేయాలని డీఈవో సీఆర్పీ, ఐఈడీ టీచర్లు, పార్ట్‌టైం టీచర్ల సమావేశంలో ఆదేశించారు. అయితే పిల్లల సంఖ్యను కొంత పెంచి ఆ నివేదికను ఎంఈవోలకు సమర్పించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి బడిబయట పిల్లలను గుర్తించి వారి వివరాలు సమర్పించాలి. కానీ ఎక్కడా గ్రామసభలు జరిగిన దాఖలాలు లేవు. ఎక్కడ చూసిన బాల కార్మికులే... కరీంనగర్ నగరంలో బడికి వెళ్లని పిల్లలు వందల సంఖ్యల్లోనే ఉంటారని లెక్కలే తేలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇటుకబట్టీల్లో, హోటళ్లు, కాగితాలు ఏరుకుంటూ, భిక్షాటనలో బాలకార్మికులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నా.. ఇటు విద్యాశాఖ, అటు లేబర్ ఆఫీసర్లు చూసిచూడనట్లు ఉంటున్నారు. బాలకార్మికులను బడిలో చేర్పించేందుకు విద్యాహక్కు చట్టంలో భాగంగా ఏర్పాటు చేసిన స్పెషల్ స్కూళ్లను నగర శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అధికారులు.. ఆ తరువాత పట్టించుకోలేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి చర్యలేవీ తీసుకోలేదు. ఇటీవల బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు కోసం అధికారులు సర్వే చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సర్వే జరుగలేదని ఆ శాఖ అధికారులే పేర్కొనడం గమనార్హం. సర్వే చేసిన వారిలో చాలామంది ఇంట్లో కూర్చోని కాకి లెక్కలు సమర్పించినట్లు తెలుస్తుంది. పొంతన లేని లెక్కలు బడిబయటి పిల్లల గుర్తింపు కోసం చేస్తున్న సర్వేలు ఏమాత్రమూ నమ్మశక్యంగా లేవు. ప్రతి బడీడు పిల్లవాడి పేరును చేర్చుకుంటున్న అధికారులు.. వారు బడికి వస్తున్నారో..? లేదో..? చూడడం లేదు. బడిబయటి పిల్లల విషయంలో ఒక్కొక్కరి సర్వేలు ఒక్కో రకంగా ఉంటున్నాయి. జిల్లాలో రెండు వేల మందిబాల కార్మికులు ఆయా పనుల్లో కొనసాగుతున్నారని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా.. ఆ సంఖ్య ఆరువేల వరకు ఉందని సాక్షర భారత్ కార్యకర్తలు గతేడాది నిర్వహించిన సర్వే చెబుతోంది. ఇక స్వచ్ఛంద సంస్థలు చెబుతున్న దాని ప్రకారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8 వేల మందికిపైగా పిల్లలు బడి బయట ఉన్నట్లు గతంలో నివేదికలు సమర్పించారు. నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేదలకు విద్య అందించాలనే ప్రభుత్వం లక్ష్యం పేద విద్యార్థుల దరిచేరడం లేదు. దేశ భవిత తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని విద్యావేత్త ‘కొఠారి’ ఏళ్ల క్రితమే చెప్పారు. కానీ.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 66 ఏళ్లు దాటినా పేదవాడికి విద్య అందని ద్రాక్షగానే మిగిలింది. ఆరేళ్ల క్రితం విద్యాహక్కు చట్టాన్ని సైతం పార్లమెంటు ఆమోదించింది. ‘పిల్లలు బడికి, పెద్దలు పనికి..’ అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తం నిధులను ఖర్చు చేస్తున్నా.. అనుకున్న లక్ష్యానికి చేరవ కాకపోవడంతో పలువురు విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2016 నాటికి పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని 2000 సంవత్సరంలో జరిగిన ప్రపంచ విద్యావేదిక అభిప్రాయపడింది. దీంతో మన దేశం మరో అడుగు ముందుకేసి అందరికి విద్యను అందిస్తామని ప్రతిన బూనడంతోపాటు 2009 ఆగస్టు 27న పార్లమెంట్లో విద్యాహక్కు చట్టాన్ని ఆమోదించింది. 2010 ఏప్రిల్ 1 నుంచి ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు వివక్షత చూపడం వల్లే నేటికీ ఉచిత నిర్భంద విద్య అమలుకాలేదు. ఫలితం బాలకార్మికుల సంఖ్య పెరిగి, నిరక్షరాస్యత శాతంలో కూడా అదేస్థాయిలో పెరిగి విద్యలో వెనుకబడ్డ విషయం ప్రభుత్వ లెక్కలే రుజువు చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టంలోని ప్రధానాంశాలు... 2010 ఏప్రిల్ నుంచి విద్యాహక్కు చట్టం అమలవుతోంది. 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో పిల్లలను కచ్చితంగా చేర్చుకోవాల్సిందే. టీసీలు, రికార్డుషీట్లు, పుట్టినతేదీ నిర్ధరణ సర్టిఫికెట్లు లేవని, ప్రమాణాలు లేవని తిరస్కరించడం నేరం. సెక్షన్ 17 ప్రకారం విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దండించడం నేరం. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలి. మానవ వనరులను ఏర్పాటు చేయాలి కనీస విద్యాప్రమాణాలను పాటించాలి ప్రవేశ, పరీక్ష, స్పోర్ట్స్, టీసీలకు ఫీజులు వసూలు చేయరాదు. పాఠశాలల్లో చేర్పించుకునేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు. కారణం లేకుండా విద్యార్థుల పేర్లను తొలగించరాదు. బడుల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండాలి. పదిశాతం మించి ఉపాధ్యాయ ఖాళీలు ఉండరాదు. గుర్తింపులేని బడులకు మండల విద్యాధికారి రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. బడిని మూసివేయించవచ్చు. ఉపాధ్యాయులను విద్యేతర కార్యక్రమాల్లో వినియోగించరాదు. (సెన్సెస్, ఎలక్షన్ విధులు మినహా). ఉపాధ్యాయులు ట్యూషన్లు చెప్పరాదు బడుల్లో 14 ఏళ్లలోపు పిల్లల వివరాలను, వివిధ కమిటీల వివరాలను ప్రదర్శించాలి. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ప్రభుత్వ బడుల సిఫార్సుతో భర్తీ చేయాలి. వీరి ఫీజులు ప్రభుత్వం భరిస్తుంది. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఇంటివద్దనే విద్యాబోధన చేయడానికి శిక్షకులను ఏర్పాటు చేయాలి. బడికిరాని, డ్రాపౌట్ విద్యార్థులను విద్యా స్రవంతిలో కలపడానికి ప్రత్యేక ఆవాస శిక్షణ కేంద్రాలు, వర్క్‌సైట్ స్కూల్స్, ట్రాన్సిట్ హోంలు, హెల్ప్‌డెస్క్, సీజనల్ హాస్టల్స్, సంచార పాఠశాలలు ఏర్పాటు చేయాలి. బడీడు పిల్లలతో పనులు చేయించుకోవద్దు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దళిత విద్యార్థులకు, దారిద్య్ర రేఖ కు దిగువ బాలల యూనిఫాంలకు ఒక్కొక్కరికి రూ.400 చెల్లించాలి. పాఠశాలలు ఏర్పాటు చేయడానికి వీలుకాని ప్రాంతాల్లో దూరపు పాఠశాలలకు రవాణా చేయడానికి నెలకు రూ.300 చెల్లించాలి. తల్లిదండ్రులులేని పిల్లలందరికీ చదువు చెప్పించే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలి. ఒక ఉపాధ్యాయుడు గైర్హాజరైనా, సరిగ్గా బోధించకపోయినా సెక్షన్ 24 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. -
పటిష్టంగా బాలకార్మిక చట్టాల అమలు
- కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి - 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు - బాల కార్మిక నిర్మూలన పర్యవేక్షణకు ప్రత్యేక కార్యక్రమం - ఉపాధి కల్పనలో తెలంగాణ సర్కారు చొరవకు ప్రశంస సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణాను అరికడతామన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాల కార్మిక నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) చేసిన రెండు కన్వెన్షన్స్పై (138–ఉపాధికి కనీస వయసు, 182–హీనమైన బాల కార్మిక విధానాలు) స్విట్జర్లాం డ్లోని జెనీవాలో ఇటీవల జరిగిన ఐఎల్వో సదస్సులో భారత్ సంతకాలు చేసిందన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఇందుకు జిల్లా మేజిస్ట్రేట్లకు పూర్తి అధికారాలు కల్పించామన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య జాతీయ బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టు పర్యవేక్షణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికగా ‘పెన్సిల్’(ప్రొవైడింగ్ యాన్ ఎలక్ట్రానిక్ సపరేట్ ప్లాట్‌ఫాం)ను ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సంస్థ జీవనోపాధికి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే భారతీయులు ఇక్కట్లు పడకుండా గల్ఫ్ దేశాలతో కలసి ఐఎల్వో తరహాలో ప్రత్యేక సంస్థను ఏర్పా టుకు నిర్ణయించినట్లు దత్తాత్రేయ తెలిపా రు. పనికోసం వీసాపై ఒక దేశానికి వెళ్లి అక్కడి నుంచి ఇతర గల్ఫ్ దేశాలకు అక్రమంగా వెళ్తుండటం వల్లే కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా మని అన్నారు. నిరుద్యోగుల రేటు తగ్గుతోంది... దేశంలో నిరుద్యోగుల రేటు ఏటా తగ్గుతోందని దత్తాత్రేయ వివరించారు. ఉపాధి కల్ప న కేంద్రమే కల్పించేది కాదని, దీనిపై రాష్ట్రా లూ కేంద్రంతో కలసి పనిచేయాలన్నారు. దీనిపై తెలంగాణ తీసుకుంటున్న చొరవను అభినందించారు. సంగారెడ్డిలో పరిశ్రమల హబ్ ఏర్పాటుతోపాటు పరిశ్రమలకు పన్ను రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. ఇలా అన్ని రాష్ట్రాలూ ప్రోత్సాహకాలిస్తే కేంద్రం తన వంతుగా సాయం చేస్తుందన్నారు. -
బాల కార్మికుల నిర్మూలన చట్టం ఓ మైలురాయి
జెనీవా కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు చేసిన బాలకార్మికుల నిర్మూలన చట్టం సవరణ బిల్లు–2016 ఓ మైలురాయి అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణిం చారు. జెనీవాలో రెండు రోజులుగా జరుగు తున్న అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల కార్మికుల నిర్మూల నకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) కన్వెన్షన్– 138, ప్రమాదకర పరిశ్రమల్లో 14 ఏళ్లలోపు బాలల నిషేధానికి నిర్దేశించిన కన్వెన్షన్–182 చట్టాలను భారత దేశం ఆమోదించిందని దత్తాత్రేయ తెలిపారు.దీనికి సంబంధించి రాష్ట్రపతి సంతకం చేసిన ఉత్తర్వులను ఐఎల్‌వోకు సమర్పించారు. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం అమలు కోసం ఫిర్యాదుల పరిష్కారానికి ‘పెన్సిల్’పేరుతో డిజిటల్ వేదికను రూపొందించామని తెలిపారు. బాలల అక్రమ రవాణాను అరికట్టడానికి పట్టిష్ట మైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ కన్వెన్షన్లను భారత్ ఆమోదిం చడం చారిత్రాత్మక చర్యగా ఐఎల్వో డైరెక్టర్ జనరల్ రైడర్ కొనియాడారు. ఈ చట్టాలను ఆమోదింపజేయడంలో భారత ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయమని పేర్కొ న్నారు. భారతదేశంలో కార్మికుల సామాజిక భద్రతకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి దత్తాత్రేయ ఈ సందర్భంగా వివరించారు. -
బాలలతో పనులు చేయిస్తే ఖబడ్దార్
హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం యుద్ధం మొదలైంది. కార్మిక శాఖతోపాటు అన్ని శాఖలూ ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఇకపై బాలలతో పనులు చేయిస్తే ఊరుకునేది లేదు. సమాచారం ఇస్తే చాలు దాడులు చేసి జైలుకు పంపుతాం’ అని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సదస్సులో మంత్రి మాట్లాడారు. చిన్నపిల్లల్ని పనుల్లో పెట్టుకోవడంతో పాటు వారిని హింసిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించి యజమానులపై కేసులు నమోదు చేసి బాలలకు విముక్తి కలిగిస్తున్నామని చెప్పారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
బాలల హక్కుల పరిరక్షణకు కృషి అందరి మన్నలు అందుకుంటున్న చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నగర కన్వీనర్ సీతారాం నేడు బాల కార్మిక దినం విశాఖపట్నం : స్మార్ట సిటీగా రూపుదిద్దుకునేందుకు వేగంగా పరుగులు తీస్తున్న విశాఖ నగరంలో బాల కార్మిక వ్యవస్థ వేళ్లూనుకొని ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నగర కన్వీనర్ గొండు సీతారాం బాలకార్మిక వ్యవస్థను రూపుమాపి, ప్రతి విద్యార్థిని బడికి పరిచయం చేసి, తద్వారా విశాఖ నగర అభివృద్ధికి పెద్ద పీట వేసేందుకు నిరంతరం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో కలెక్టర్ చైర్మన్‌గా పని చేస్తున్న జాతీయ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తూ ఎక్కడ బాలకార్మికులు ఉన్నా వారిని ఆ పని నుంచి విముక్తుల్ని చేస్తూ వారికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా జిల్లా స్థాయిలో మూడు, రాష్ట్ర స్థాయిలో మూడు అవార్డులు లభించాయి. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ అధ్యక్షురాలు శాంతా సిన్హా విశాఖ నగర కన్వీనర్‌గా సీతారామ్‌ను నియమించారు. అప్పటి నుంచి ఆయన కార్మిక, విద్యాశాఖల అధికారులు, జాతీయన చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులతో కలసి దుకాణాలు, పరిశ్రమలు, హోటళ్లు, కార్కానాలపై తరచూ దాడులు నిర్వహిస్తూ బాల కార్మికులకు విముక్తి కలిగిస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రాత్రి బస, బాలల భోజన వసతులపై ఆరాాతీస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి, మానసిక, శారీరక వికలాంగ విద్యార్థులకు వైద్య ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో కనీస వసతుల కల్పనకు అధికారులతో సంప్రదించి తగిన ఏర్పాట్లు చేయిస్తున్నారు. సేవలకు గుర్తింపు : సీతారాం సేవలను గుర్తించిన కలెక్టర్ యువరాజ్, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ ఈ ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ బాలల హక్కుల రక్షణ సంస్థ అవార్డును సీతారాంనకు అందజేశారు. వుడా వీసీ బాబూరావు నాయుడు, ఆంధ్రాయూనివర్సిటీ వీసీ జి.ఎస్.ఎన్.రాజు ఉగాది పురస్కారాన్ని అందజేశారు. -
కాగితం పులేనా..?
నాలుగేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఆర్టీఈ(రైట్ టూ ఎడ్యుకేషన్) చట్టం చివరకు కాగితపు పులిగానే మిగిలిపోయింది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చట్టం చేయడంతో పాటు విస్తృత ప్రచారం చేయడంతో పేద వర్గాల్లో ఎన్నో ఆశలు రేపింది. కార్పొరేట్ పాఠశాలల్లో సైతం 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలని ఆ చట్టంలో పేర్కొనడంతో పేద విద్యార్థులు మనకు మంచిరోజులొచ్చాయని భావించారు. నిర్బంధ విద్య ప్రవేశపెట్టడం ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. ఎన్నో ఉత్తమ ఆశయాలతో రూపొందించిన ఈ చట్టం అమలులో ఇంకా ఆమడదూరంలోనే ఉంది. ప్రభుత్వం చట్టం చేసి చేతులు దులుపుకొందే కాని, అమలు విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో చట్టం కాగితాలకే పరిమితమైంది. గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :బడి ఈడు బాలలందరికీ నిర్బంధ విద్య అందించే లక్ష్యంతో రూపొందించిన నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. చదువు కావాలని కోరిన ప్రతి పిల్లవాడికి విద్యను హక్కుగా చేసి ఉచితంగా చదువు చెప్పించేలా ప్రతిష్టాత్మకంగా తెచ్చిన చట్టం అమల్లో ప్రభుత్వం అడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2010లో దేశ వ్యాప్తంగా ఆర్భాటంగా అమల్లోకి తెచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్టీఈ-2009)కు బూజు పట్టింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై అటు ప్రభుత్వం, ఇటు విద్యా శాఖాధికారులు దృష్టి సారించకపోవడంతో విద్యాహక్కు చట్టం ప్రహసనంగా మారింది. ఆరేళ్ల వయసు నుంచి 14 ఏళ్ల లోపు బాలలను పాఠశాలలకే పరిమితం చేసి, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా రూపు మాపే లక్ష్యంతో తీసుకొచ్చిన మహత్తరమైన చట్టం ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను నిరుపేద, అల్పాదాయ వర్గాల పిల్లలతో ఉచితంగా భర్తీ చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టం అమలుకు ముందుకు రాని నేపథ్యంలో విద్యాశాఖాధికారులు సైతం చేతులు ముడుచుకుని కూర్చున్నారు. 2010లో అమల్లోకి వచ్చిన చట్టం విద్యాభివృద్ధి లేనిదే సమాజం అభివృద్ధి సాధించలేదనే కోణంలో కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 27న విద్యాహక్కు చట్టాన్ని రూపొందించింది. చట్టం వచ్చిన ఎనిమిది నెలల తరువాత 2010 ఏప్రిల్ 1న అమల్లోకి తెచ్చింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పేద విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్, ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు కొనసాగరాదనే ప్రధానాంశాలు చట్టం ఇమిడి ఉండగా, వీటిలో ఏ ఒక్కటీ జిల్లాలో సక్రమంగా అమలుకాలేదు. చట్టం వచ్చిన నాలుగేళ్ల కాలంలో జిల్లాలోని ఏ ఒక్క కార్పొరేట్ పాఠశాలలనూ పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా భర్తీ చేయలేదు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభించింది. ప్రతి ఏటా జూన్‌లో పాఠశాలలు తెరిచే ముందుగా విద్యా పక్షోత్సవాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై నిర్దిష్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమైంది. పేదలపై ఫీజుల భారం... సమాజంలో బడుగు, బలహీన వర్గాల కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించడం ద్వారా ఆయా వర్గాలను ఉద్ధరించవచ్చనే ఉద్దేశంతో తెచ్చిన నిర్బంధ విద్యాహక్కు చట్టం ఉద్దేశం నెరవేరలేదు. పేద, అల్పాదాయ వర్గాల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. చట్టం నిర్దేశించిన విధంగా జరిగితే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వడం ద్వారా పేద ప్రజలకు ఆర్థికంగా వెసులు బాటు కల్పించినట్లయ్యేది. ఈ విధంగా 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేసిన పాఠశాలలకు ఆ మేరకు ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని చట్టంలో పొందుపర్చారు. మరోవైపు చట్టంలో పొందుపర్చిన విధంగా ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవన నిర్మాణాలు చేపట్టి, పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా, చట్టం అమలుకు నిధులు విడుదల చేసిన పరిస్థితులు లేదు. అసాధారణమైన అంశాలను చట్టంలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చట్టాన్ని అమలుపర్చే దిశగా విఫలం చెందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో విద్యాశాఖాధికారులు చేసేది లేక మిన్నకుండిపోతున్నారు. ఫలితంగా చట్టం చట్టుబండగా మారి ప్రభుత్వాల చిత్తశుద్ధిని వెక్కిరిస్తోంది. ఆదేశాలు వస్తే అమలు చేస్తాం... ప్రైవేటు పాఠశాలల్లో 25 సీట్లను అల్పాదాయ వర్గాల పిల్లలతో భర్తీ చేసే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే అమలు పరుస్తాం. గుర్తింపు లేని పాఠశాలలపై గతంలో దాడులు చేసి నోటీసులు ఇవ్వడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేశాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఏటా పటిష్టమైన చర్యలు చేపడుతున్నాం. -డి.ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తే సిద్ధమే విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రకారం పేద కుటుంబాల పిల్లలకు 25 సీట్లను ఇచ్చేందుకు పాఠశాలల యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఓవైపు ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లించాల్సిన నిధులను చెల్లించడంలోనే విఫలమవుతున్న ప్రభుత్వం ఇక స్కూలు పిల్లల ఫీజులు చెల్లిస్తుందనే నమ్మకం లేదు. ఇదే విషయమై జాతీయ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్య సంఘం సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేసులో తీర్పు వెలువడాల్సి ఉంది. -ఎన్.చక్రనాగ్, జిల్లా కార్యదర్శి,ఏపీ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్