పొంతలేని లెక్కలు | Child Labor Act Not Implemented Karimnagar | Sakshi
Sakshi News home page

అమలు కానీ విద్యాహక్కు చట్టం

Published Mon, Nov 12 2018 1:29 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Child Labor Act Not Implemented Karimnagar - Sakshi

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్, చదువుల పండుగ,  బడిబాట, విద్యావారోత్సవాలు, విద్యా పక్షోత్సవాలు, విద్యాసంబరాలు, ఆచార్య జయశంకర్‌ చదువుల పండుగ.. ఇలా పదేళ్లలో ప్రభుత్వం అనేక కార్యమాలు నిర్వహించింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే.. బడీడు పిల్లలు బడిలోనే ఉండేవారు. కానీ.. అలా జరగలేదు. ఆరేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం సైతం పనిచేసినట్టు కన్పించడం లేదు. ఫలితంగా పలకాబలపం పట్టాల్సిన చేతులు మెకానిక్‌ షెడ్లల్లో, ఇటుకబట్టీల్లో పానలు, పారలు పడుతున్నాయి. పుస్తకాలు చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణాల్లో రద్దీ ప్రదేశాల్లో బడీడు పిల్లలు భిక్షాటన చేస్తూ పొట్టపోసుకోవడం కనిపిస్తోంది. 

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: జిల్లాలోని 16 మండలాల్లో బడిబయట ఉన్న పిల్లల సర్వేను సెప్టెంబర్‌  06 నుంచి అక్టోబర్‌ 28 వరకు రాజీవ్‌ విద్యామిషన్, మెప్మా ప్రాజెక్టు ఆధ్వర్యంలో క్లస్టర్‌ రిసోర్స్, ఐఈడీ రిసోర్స్‌ టీచర్లు, పార్ట్‌టైం టీచర్లు నిర్వహించారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 354 మంది బడికి వెళ్లని విద్యార్థులను గుర్తించినట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. అందులోనుంచి బడిలో చేరి అర్ధాంతరంగా చదువు మానేసిన వారు 142 మంది ఉన్నారని, బడీడు ఉండీ.. ఇప్పటికి పాఠశాలల్లోకి వెళ్లనివారు 212 మంది ఉన్నట్లు అధికారులకు లెక్క అందజేశారు.

అయితే సీఆర్‌పీలు ఆయా గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉండగా.. చాలామంది గతేడాది నిర్వహించిన సర్వే లెక్కలనే ఈ ఏడాది కూడా చూపించి మమ అనిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేపై సందిగ్ధత నెలకొనడంతో మరోసారి సర్వే చేయాలని డీఈవో సీఆర్పీ, ఐఈడీ టీచర్లు, పార్ట్‌టైం టీచర్ల సమావేశంలో ఆదేశించారు. అయితే పిల్లల సంఖ్యను కొంత పెంచి ఆ నివేదికను ఎంఈవోలకు సమర్పించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి బడిబయట పిల్లలను గుర్తించి వారి వివరాలు సమర్పించాలి. కానీ ఎక్కడా గ్రామసభలు జరిగిన దాఖలాలు లేవు. 

ఎక్కడ చూసిన బాల కార్మికులే...
కరీంనగర్‌ నగరంలో బడికి వెళ్లని పిల్లలు వందల సంఖ్యల్లోనే ఉంటారని లెక్కలే తేలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇటుకబట్టీల్లో, హోటళ్లు, కాగితాలు ఏరుకుంటూ, భిక్షాటనలో బాలకార్మికులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నా.. ఇటు విద్యాశాఖ, అటు లేబర్‌ ఆఫీసర్లు చూసిచూడనట్లు ఉంటున్నారు. బాలకార్మికులను బడిలో చేర్పించేందుకు విద్యాహక్కు చట్టంలో భాగంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ స్కూళ్లను నగర శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన  అధికారులు.. ఆ తరువాత పట్టించుకోలేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి చర్యలేవీ తీసుకోలేదు. ఇటీవల బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు కోసం అధికారులు సర్వే చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సర్వే జరుగలేదని ఆ శాఖ అధికారులే పేర్కొనడం గమనార్హం. సర్వే చేసిన వారిలో చాలామంది ఇంట్లో కూర్చోని కాకి లెక్కలు సమర్పించినట్లు తెలుస్తుంది.

పొంతన లేని లెక్కలు
బడిబయటి పిల్లల గుర్తింపు కోసం చేస్తున్న సర్వేలు ఏమాత్రమూ నమ్మశక్యంగా లేవు. ప్రతి బడీడు పిల్లవాడి పేరును చేర్చుకుంటున్న అధికారులు.. వారు బడికి వస్తున్నారో..? లేదో..? చూడడం లేదు. బడిబయటి పిల్లల విషయంలో ఒక్కొక్కరి సర్వేలు ఒక్కో రకంగా ఉంటున్నాయి. జిల్లాలో రెండు వేల మందిబాల కార్మికులు ఆయా పనుల్లో  కొనసాగుతున్నారని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా.. ఆ సంఖ్య ఆరువేల వరకు ఉందని సాక్షర భారత్‌ కార్యకర్తలు గతేడాది నిర్వహించిన సర్వే చెబుతోంది. ఇక  స్వచ్ఛంద సంస్థలు  చెబుతున్న దాని ప్రకారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8 వేల మందికిపైగా పిల్లలు బడి బయట ఉన్నట్లు గతంలో నివేదికలు సమర్పించారు. 

నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం
సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన  విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేదలకు విద్య అందించాలనే ప్రభుత్వం లక్ష్యం పేద విద్యార్థుల దరిచేరడం లేదు. దేశ భవిత తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని  విద్యావేత్త ‘కొఠారి’ ఏళ్ల క్రితమే చెప్పారు. కానీ.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 66 ఏళ్లు దాటినా పేదవాడికి విద్య అందని ద్రాక్షగానే మిగిలింది. ఆరేళ్ల క్రితం విద్యాహక్కు చట్టాన్ని సైతం పార్లమెంటు ఆమోదించింది. ‘పిల్లలు బడికి, పెద్దలు పనికి..’ అనే నినాదంతో  విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తం నిధులను ఖర్చు చేస్తున్నా.. అనుకున్న లక్ష్యానికి చేరవ కాకపోవడంతో పలువురు విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు.

2016 నాటికి  పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని 2000  సంవత్సరంలో జరిగిన ప్రపంచ విద్యావేదిక అభిప్రాయపడింది. దీంతో మన దేశం మరో అడుగు ముందుకేసి అందరికి విద్యను అందిస్తామని ప్రతిన బూనడంతోపాటు 2009 ఆగస్టు 27న పార్లమెంట్‌లో విద్యాహక్కు చట్టాన్ని  ఆమోదించింది. 2010 ఏప్రిల్‌ 1 నుంచి ఈ చట్టాన్ని  దేశవ్యాప్తంగా  అమలు చేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు  వివక్షత చూపడం వల్లే  నేటికీ ఉచిత నిర్భంద విద్య అమలుకాలేదు. ఫలితం బాలకార్మికుల సంఖ్య పెరిగి, నిరక్షరాస్యత శాతంలో కూడా అదేస్థాయిలో పెరిగి  విద్యలో వెనుకబడ్డ విషయం ప్రభుత్వ లెక్కలే రుజువు చేస్తున్నాయి. 
విద్యాహక్కు చట్టంలోని ప్రధానాంశాలు...

  •      2010  ఏప్రిల్‌ నుంచి విద్యాహక్కు చట్టం అమలవుతోంది.
  •      1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో పిల్లలను కచ్చితంగా చేర్చుకోవాల్సిందే. టీసీలు, రికార్డుషీట్లు, పుట్టినతేదీ నిర్ధరణ సర్టిఫికెట్లు లేవని, ప్రమాణాలు లేవని తిరస్కరించడం నేరం. 
  •      సెక్షన్‌ 17 ప్రకారం  విద్యార్థులను  శారీరకంగా, మానసికంగా  దండించడం నేరం. 
  •      ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలి. 
  •      మానవ వనరులను ఏర్పాటు చేయాలి
  •      కనీస విద్యాప్రమాణాలను పాటించాలి
  •      ప్రవేశ, పరీక్ష, స్పోర్ట్స్, టీసీలకు ఫీజులు వసూలు చేయరాదు. 
  •      పాఠశాలల్లో  చేర్పించుకునేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు. 
  •      కారణం లేకుండా విద్యార్థుల పేర్లను తొలగించరాదు. 
  •      బడుల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండాలి. 
  •      పదిశాతం మించి ఉపాధ్యాయ ఖాళీలు ఉండరాదు.
  •      గుర్తింపులేని బడులకు మండల విద్యాధికారి రూ.లక్ష వరకు జరిమానా  విధించవచ్చు. బడిని మూసివేయించవచ్చు. 
  •      ఉపాధ్యాయులను విద్యేతర కార్యక్రమాల్లో  వినియోగించరాదు. (సెన్సెస్, ఎలక్షన్‌ విధులు మినహా).
  •      ఉపాధ్యాయులు ట్యూషన్లు చెప్పరాదు
  •      బడుల్లో  14 ఏళ్లలోపు పిల్లల వివరాలను, వివిధ కమిటీల వివరాలను ప్రదర్శించాలి. 
  •      ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ప్రభుత్వ బడుల సిఫార్సుతో భర్తీ చేయాలి. వీరి ఫీజులు ప్రభుత్వం భరిస్తుంది.
  •      ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఇంటివద్దనే విద్యాబోధన చేయడానికి శిక్షకులను ఏర్పాటు చేయాలి. 
  •      బడికిరాని, డ్రాపౌట్‌ విద్యార్థులను విద్యా స్రవంతిలో కలపడానికి ప్రత్యేక ఆవాస శిక్షణ కేంద్రాలు, వర్క్‌సైట్‌ స్కూల్స్, ట్రాన్సిట్‌ హోంలు, హెల్ప్‌డెస్క్, సీజనల్‌ హాస్టల్స్, సంచార పాఠశాలలు ఏర్పాటు చేయాలి. 
  •      బడీడు పిల్లలతో పనులు చేయించుకోవద్దు.
  •      ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దళిత విద్యార్థులకు, దారిద్య్ర రేఖ కు దిగువ బాలల యూనిఫాంలకు ఒక్కొక్కరికి రూ.400 చెల్లించాలి.
  •      పాఠశాలలు ఏర్పాటు చేయడానికి వీలుకాని ప్రాంతాల్లో దూరపు పాఠశాలలకు రవాణా చేయడానికి నెలకు రూ.300 చెల్లించాలి. 
  •      తల్లిదండ్రులులేని పిల్లలందరికీ చదువు చెప్పించే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలి. 
  •      ఒక ఉపాధ్యాయుడు గైర్హాజరైనా, సరిగ్గా బోధించకపోయినా సెక్షన్‌ 24 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement