►దారి తప్పిన గురువులపై చర్యలు అంతంతే
►కొద్దిరోజులకే తిరిగి విధుల్లోకి..
►ఏడాదిలో అరడజను కేసులు
►కోర్టుకెళ్లి.. జరిమానాతో విడుదల
►అభాసుపాలవుతున్న విద్యాశాఖ
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల వ్యవహార శైలి ఆ వృత్తికే మచ్చ తెస్తోంది. దేవాలయం వంటి బడిలో మద్యం తాగుతూ కొందరు.. తాగి తగువులాడుకుని ఇంకొందరు.. విద్యార్థినులతో ప్రేమాయణం సాగి స్తూ.. ఉపాధ్యాయినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి తప్పులకు విద్యాశాఖ విధించే శిక్ష... కొన్నాళ్ల సస్పెన్షన్ మాత్ర మే. ఆ తర్వాత రీపోస్టింగ్‌తో మళ్లీ విధుల్లో చేరుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఇలాంటి సంఘటనలు విద్యాశాఖ.. ఉపాధ్యాయులనే కాదు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో జిల్లాలో అనేకం చోటుచేసుకుంటున్నాయి.
దారి తప్పిన గురువులపై జిల్లా విద్యాశాఖ వ్యవహరిస్తున్న తీరుపై ఉపాధ్యాయ వర్గాలు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంలో.. జిల్లాలో ఇలాంటి ఐదు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విద్యాశాఖ ఆ తర్వాత మళ్లీ విధుల్లో తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు యక్తమవుతున్నాయి. ఈ నెల 11న కరీంనగరలోని ధన్గర్‌వాడీలో మద్యం తాగుతూ పట్టుబడ్డ ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన డీఈవో.. వారికి రీపోస్టింగ్ ఆర్డర్లు త్వరలోనే ఇస్తారని విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. కనీసం వీరి విషయంలోనైనా క ఠినంగా వ్యవహరించి.. సస్పెన్షన్ వేటును తొందరగా ముగించకుండా.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో తప్పుడు పని చేసే ఉపాధ్యాయులకు గుణపాఠంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో జరిగిన సంఘటనలు మచ్చుకు కొన్ని..
►ఈ నెల 11న ధన్గర్‌వాడీ పాఠశాలలో మద్యం సేవిస్తూ.. ఏడుగురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ కార్యాలయంలో పని చేసే ఓ టైపిస్టు పోలీసులకు చిక్కారు. పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చగా.. రూ.250 జరిమానా విధించి వదిలిపెట్టింది. సదరు ఉపాధ్యాయులపై కేసు నమోదు కావడంతో డీఈవో లింగయ్య సస్పెండ్ చేశారు.
►గత విద్యా సంవత్సరం జూలపల్లి మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు అనుచిత ప్రదేశంలో మద్యం సేవిస్తూ.. పోలీసులకు పట్టుబట్టారు. పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చగా.. రూ.50 జరిమానా విధించి.. వదిలిపెట్టింది. ఈ విషయం ఇంత వరకు డీఈవో దృష్టికి రాలేదు.
►గత ఎన్నికల్లో గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లిన ఐదుగురు ఉపాధ్యాయులు పోలింగ్ కంటే ఒకరోజు ముందే తప్పతాగి చిందులేశారు. గ్రామస్తులు ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లగా.. స్కూలుకు వచ్చిన ఎంపీడీవో వారిని అదేరోజు రాత్రి ఎన్నికల విధుల నుంచి తప్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇతరులకు విధులు అప్పగించారు. స్కూళ్లో మద్యం తాగిన ఐదుగురు ఉపాధ్యాయులను డీఈవో సస్పెండ్ చేశారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ రీపోస్టింగ్ ఇచ్చారు.
►గత విద్యా సంవత్సరం జమ్మికుంట మండల పరిధిలోని ఓ పాఠశాల ఉపాధ్యాయడు తొమ్మిదో తరగతి విద్యార్థినితో ఫోన్లో మాట్లాడుతూ వారి తల్లిదండ్రులకు పట్టుబడ్డాడు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు స్కూలుకు వెళ్లి సదరు ఉపాధ్యాయుడిని చితకబాదారు. దీంతో డీఈవో లింగయ్య ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. తర్వాత కొన్నాళ్లకు రీ పోస్టింగ్ ఇచ్చారు.
►మూడేళ్ల క్రితం.. కరీంనగర్‌లోని ఓ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ మద్యం తాగి.. అదే పాఠశాలలో పని చేసే సహచర ఉపాధ్యాయురాలి ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంలో అతను సస్పెండ్ కూడా అయ్యాడు. కొన్నాళ్లకు అతనికి రీపోస్టింగ్ ఇచ్చిన విద్యాశాఖ.. గెజిటెడ్ హెచ్‌ఎంగా పదోన్నతి కల్పించడం విశేషం.
►గతేడాది జరిగిన ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో రామడుగు మండలంలో పని చేసే ఓ ప్రధానోపాధ్యాయుడు తాగిన మైకంలో కరీంనగర్‌లో పని చేసే మరో హెచ్‌ఎంపై దాడి చేశాడు. వీరిపై విద్యాశాఖ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
వేటు కొద్దిరోజులే!
Published Sat, Aug 16 2014 2:56 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement