పటిష్టంగా బాలకార్మిక చట్టాల అమలు
పటిష్టంగా బాలకార్మిక చట్టాల అమలు
Published Sun, Jun 18 2017 12:47 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
- కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి
- 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు
- బాల కార్మిక నిర్మూలన పర్యవేక్షణకు ప్రత్యేక కార్యక్రమం
- ఉపాధి కల్పనలో తెలంగాణ సర్కారు చొరవకు ప్రశంస
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణాను అరికడతామన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాల కార్మిక నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) చేసిన రెండు కన్వెన్షన్స్‌పై (138–ఉపాధికి కనీస వయసు, 182–హీనమైన బాల కార్మిక విధానాలు) స్విట్జర్లాం డ్‌లోని జెనీవాలో ఇటీవల జరిగిన ఐఎల్‌వో సదస్సులో భారత్ సంతకాలు చేసిందన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఇందుకు జిల్లా మేజిస్ట్రేట్‌లకు పూర్తి అధికారాలు కల్పించామన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య జాతీయ బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టు పర్యవేక్షణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికగా ‘పెన్సిల్’(ప్రొవైడింగ్ యాన్ ఎలక్ట్రానిక్ సపరేట్ ప్లాట్‌ఫాం)ను ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు.
గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సంస్థ
జీవనోపాధికి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే భారతీయులు ఇక్కట్లు పడకుండా గల్ఫ్ దేశాలతో కలసి ఐఎల్‌వో తరహాలో ప్రత్యేక సంస్థను ఏర్పా టుకు నిర్ణయించినట్లు దత్తాత్రేయ తెలిపా రు. పనికోసం వీసాపై ఒక దేశానికి వెళ్లి అక్కడి నుంచి ఇతర గల్ఫ్ దేశాలకు అక్రమంగా వెళ్తుండటం వల్లే కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా మని అన్నారు.
నిరుద్యోగుల రేటు తగ్గుతోంది...
దేశంలో నిరుద్యోగుల రేటు ఏటా తగ్గుతోందని దత్తాత్రేయ వివరించారు. ఉపాధి కల్ప న కేంద్రమే కల్పించేది కాదని, దీనిపై రాష్ట్రా లూ కేంద్రంతో కలసి పనిచేయాలన్నారు. దీనిపై తెలంగాణ తీసుకుంటున్న చొరవను అభినందించారు. సంగారెడ్డిలో పరిశ్రమల హబ్ ఏర్పాటుతోపాటు పరిశ్రమలకు పన్ను రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. ఇలా అన్ని రాష్ట్రాలూ ప్రోత్సాహకాలిస్తే కేంద్రం తన వంతుగా సాయం చేస్తుందన్నారు.
Advertisement