
సాక్షి, అమరావతి: నేటి వీధి బాలలే రేపటి విద్యావంతులు కావాలనే లక్ష్యంతో మనమంతా కృషి చేయాలని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వీధి బాలలను కాపాడటానికి ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ ముగింపు సందర్భంగా బుధవారం వెబినార్ నిర్వహించారు.
మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు.. 13 జిల్లాల పోలీస్ అధికారులు, వీధిబాలలతో నిర్వహించిన వెబినార్‌ను గుంటూరు నుంచి హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించే ముస్కాన్ గొప్ప కార్యక్రమమన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 16,457 మంది బాలలను కాపాడామని చెప్పారు.