కాగితం పులేనా..?
నాలుగేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఆర్‌టీఈ(రైట్ టూ ఎడ్యుకేషన్) చట్టం చివరకు కాగితపు పులిగానే మిగిలిపోయింది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చట్టం చేయడంతో పాటు విస్తృత ప్రచారం చేయడంతో పేద వర్గాల్లో ఎన్నో ఆశలు రేపింది. కార్పొరేట్ పాఠశాలల్లో సైతం 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలని ఆ చట్టంలో పేర్కొనడంతో పేద విద్యార్థులు మనకు మంచిరోజులొచ్చాయని భావించారు. నిర్బంధ విద్య ప్రవేశపెట్టడం ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. ఎన్నో ఉత్తమ ఆశయాలతో రూపొందించిన ఈ చట్టం అమలులో ఇంకా ఆమడదూరంలోనే ఉంది. ప్రభుత్వం చట్టం చేసి చేతులు దులుపుకొందే కాని, అమలు విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో చట్టం కాగితాలకే పరిమితమైంది.
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :బడి ఈడు బాలలందరికీ నిర్బంధ విద్య అందించే లక్ష్యంతో రూపొందించిన నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. చదువు కావాలని కోరిన ప్రతి పిల్లవాడికి విద్యను హక్కుగా చేసి ఉచితంగా చదువు చెప్పించేలా ప్రతిష్టాత్మకంగా తెచ్చిన చట్టం అమల్లో ప్రభుత్వం అడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2010లో దేశ వ్యాప్తంగా ఆర్భాటంగా అమల్లోకి తెచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్‌టీఈ-2009)కు బూజు పట్టింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై అటు ప్రభుత్వం, ఇటు విద్యా శాఖాధికారులు దృష్టి సారించకపోవడంతో విద్యాహక్కు చట్టం ప్రహసనంగా మారింది. ఆరేళ్ల వయసు నుంచి 14 ఏళ్ల లోపు బాలలను పాఠశాలలకే పరిమితం చేసి, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా రూపు మాపే లక్ష్యంతో తీసుకొచ్చిన మహత్తరమైన చట్టం ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను నిరుపేద, అల్పాదాయ వర్గాల పిల్లలతో ఉచితంగా భర్తీ చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టం అమలుకు ముందుకు రాని నేపథ్యంలో విద్యాశాఖాధికారులు సైతం చేతులు ముడుచుకుని కూర్చున్నారు.
2010లో అమల్లోకి వచ్చిన చట్టం
విద్యాభివృద్ధి లేనిదే సమాజం అభివృద్ధి సాధించలేదనే కోణంలో కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 27న విద్యాహక్కు చట్టాన్ని రూపొందించింది. చట్టం వచ్చిన ఎనిమిది నెలల తరువాత 2010 ఏప్రిల్ 1న అమల్లోకి తెచ్చింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పేద విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్, ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు కొనసాగరాదనే ప్రధానాంశాలు చట్టం ఇమిడి ఉండగా, వీటిలో ఏ ఒక్కటీ జిల్లాలో సక్రమంగా అమలుకాలేదు. చట్టం వచ్చిన నాలుగేళ్ల కాలంలో జిల్లాలోని ఏ ఒక్క కార్పొరేట్ పాఠశాలలనూ పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా భర్తీ చేయలేదు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభించింది. ప్రతి ఏటా జూన్‌లో పాఠశాలలు తెరిచే ముందుగా విద్యా పక్షోత్సవాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై నిర్దిష్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమైంది.
పేదలపై ఫీజుల భారం...
సమాజంలో బడుగు, బలహీన వర్గాల కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించడం ద్వారా ఆయా వర్గాలను ఉద్ధరించవచ్చనే ఉద్దేశంతో తెచ్చిన నిర్బంధ విద్యాహక్కు చట్టం ఉద్దేశం నెరవేరలేదు. పేద, అల్పాదాయ వర్గాల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. చట్టం నిర్దేశించిన విధంగా జరిగితే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వడం ద్వారా పేద ప్రజలకు ఆర్థికంగా వెసులు బాటు కల్పించినట్లయ్యేది. ఈ విధంగా 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేసిన పాఠశాలలకు ఆ మేరకు ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని చట్టంలో పొందుపర్చారు. మరోవైపు చట్టంలో పొందుపర్చిన విధంగా ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవన నిర్మాణాలు చేపట్టి, పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా, చట్టం అమలుకు నిధులు విడుదల చేసిన పరిస్థితులు లేదు. అసాధారణమైన అంశాలను చట్టంలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చట్టాన్ని అమలుపర్చే దిశగా విఫలం చెందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో విద్యాశాఖాధికారులు చేసేది లేక మిన్నకుండిపోతున్నారు. ఫలితంగా చట్టం చట్టుబండగా మారి ప్రభుత్వాల చిత్తశుద్ధిని వెక్కిరిస్తోంది.
ఆదేశాలు వస్తే అమలు చేస్తాం...
ప్రైవేటు పాఠశాలల్లో 25 సీట్లను అల్పాదాయ వర్గాల పిల్లలతో భర్తీ చేసే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే అమలు పరుస్తాం. గుర్తింపు లేని పాఠశాలలపై గతంలో దాడులు చేసి నోటీసులు ఇవ్వడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేశాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఏటా పటిష్టమైన చర్యలు చేపడుతున్నాం.
-డి.ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖాధికారి
ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తే సిద్ధమే
విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రకారం పేద కుటుంబాల పిల్లలకు 25 సీట్లను ఇచ్చేందుకు పాఠశాలల యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఓవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో చెల్లించాల్సిన నిధులను చెల్లించడంలోనే విఫలమవుతున్న ప్రభుత్వం ఇక స్కూలు పిల్లల ఫీజులు చెల్లిస్తుందనే నమ్మకం లేదు. ఇదే విషయమై జాతీయ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్య సంఘం సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేసులో తీర్పు వెలువడాల్సి ఉంది.
-ఎన్.చక్రనాగ్, జిల్లా కార్యదర్శి,ఏపీ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్