చేతిలో ప్లకార్డులతో బడి బయట నిరసన...
తిరుపూర్/తిరువనంతపురం : ఒకటో తరగతి విద్యార్థికి కరాటే, యోగ ఫీజు కింద 20 వేల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో ఆ పిల్లాడి తండ్రి షాక్ గురయ్యాడు. ఆరేళ్ల పిల్లాడికి యోగా, కరాటే ఎందుకని ప్రశ్నించడంతో స్కూలు యాజమాన్యం వారిని గేటు బయటే నిల్చోబెట్టింది. అయినా, ప్రభుత్వ సహకారంతో విద్యనభ్యసిస్తున్న తన కొడుక్కి ఫీజు ఎలా వసూలు చేస్తారని ఆ తండ్రి మంగళవారం ఉదయం నుంచి గేటు బయటే నిరసన వ్యక్తం చేస్తున్నాడు.
వివరాలు.. ‘విద్యా హక్కు చట్టం - 2009’ (ఆర్టీఈ) ప్రకారం అన్ని ప్రైవేటు, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం 25 శాతం సీట్లు కేటాయించాలి. తిరుపూర్‌లోని కొంగు వెల్లలార్ ప్రైవేటు పాఠశాలలో గాంధీజీ అనే విద్యార్థి ఆర్టీఈ కోటాలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగానే తన కొడుకు గాంధీజీని స్కూల్లో దింపడానికి వచ్చిన పళనికుమార్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది.
‘ఎక్స్‌ట్రా కరిక్యులర్’ ఫీజుల కింద 20 వేల రూపాయలు చెల్లించాలని అతన్ని స్కూలు యాజమాన్యం డిమాండ్ చేసింది. ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న తన కొడుకుపై ఈ ఫీజుల భారమేంటో పళని కుమార్‌కు అర్థం కాలేదు. కరాటే, యోగా, లైబ్రరీ, తమిళ్, ఇంగ్లిష్ హ్యాండ్ రైటింగ్, టేబుల్ టెన్నిస్ అంటూ చాంతాడంతా ఫీజుల చిట్టాను పాఠశాల సిబ్బంది అతని చేతిలో పెట్టారు. గాంధీజీతో పాటు ఆర్టీఈ కోటాలో విద్యనభ్యసిస్తున్న మరో ఇద్దరు విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. పళనికుమార్ ఆందోళనకు ఆ విద్యార్థుల తండ్రి సెల్వం కూడా తోడయ్యారు.
చేతిలో ప్లకార్డులతో వారంతా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న తిరుపూర్ తహసీల్దార్ స్పందించారు. స్కూలు యాజమాన్యంతో చర్చలు జరిపారు. ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లిస్తుందనీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఫీజు చెల్లింపు తప్పనిసరని తేల్చారు. అరవై రోజుల గడువుతో ఫీజు చెల్లించాలనే షరతుతో విద్యార్థులను తరగతులకు అనుమతించారు. అయితే, తహసీల్దార్ స్కూలు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనీ, అందుకే ఫీజు చెల్లించమంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎందరో ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న విద్యార్థులు ఎక్స్‌ట్రా ఫీజులతో సతమతమవుతున్నారనీ, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment