RTE
-
నీరుగారుతోన్న ఆర్టీఈ లక్ష్యం
జైపూర్: పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) లక్ష్యం మధ్యలోనే నీరుగారిపోతోంది. 6 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలన్న సమున్నత లక్ష్యంతో కేంద్రం ఈ చట్టాన్ని 2010, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రాథమిక విద్య పూర్తయేంతవరకు పిల్లలకు ఉచితంగా, నిర్బంధ విద్యను అందించాల్సి ఉంటుంది. పిల్లలు తమకు సమీపంలోని పాఠశాలలో ఉచితంగా ప్రాథమిక విద్యను పూర్తి చేసేందుకు విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 3 అవకాశం కల్పిస్తోంది. ఆర్టీఈ కింద పాఠశాలన్నీ 25శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ప్రముఖ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన విద్యార్థులు తర్వాత బడి మానేసి దినసరి కూలీలుగా మారిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల కారణంగా ఆర్టీఈ విద్యార్థులు విద్య కొనసాగించలేకపోతున్నారు. ఆర్టీఈ కింద 8వ తరగతి వరకు మాత్రమే ఉచితంగా అందిస్తున్నారు. అక్కడి నుంచి ఫీజులు చెల్లించి చదువు కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత చదివించే స్తోమతలేక తల్లిదండ్రులు పిల్లలను చదువు మాన్పించేసి, తమతో పాటు పనులకు తీసుకెళ్లిపోతున్నారు. ‘ఆర్టీఈ కోటాలో చేరిన విద్యార్థుల్లో కొంత మంది చాలా తెలివైనవారు ఉంటున్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేక మధ్యలోనే చదువు ఆపేస్తుండటం బాధ కలిగిస్తోంది. వీరిలో డ్రైవర్లు, దినసరి కూలీల పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. 8వ తరగతి పూర్తి చేసిన తర్వాత తమ తల్లిదండ్రులతో కలిసి పనులకు వెళ్తుఉన్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత వీరిని పాలకులు పట్టించుకోకపోవడం విచారకరమ’ని జైపూర్‌లోని ప్రముఖ పాఠశాల ప్రిన్సిపాల్ ఒకరు వ్యాఖ్యానించారు. ఆర్టీఈ కోటాను 8 నుంచి 12వ తరగతి వరకు పొడించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు రాజస్తాన్ విద్యా శాఖ మంత్రి గోవింద్ సింగ్ తెలిపారు. దీనికి అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. -
‘విద్యాహక్కు’కు గండి
విద్యారంగానికి అవసరమైన నిధులిచ్చి దాని ఎదుగుదలకు దోహదపడటం చేతగాని ప్రభుత్వాలు ప్రమాణాలు పడిపోవడానికి విద్యార్థుల్ని బాధ్యుల్ని చేయడంలో మాత్రం ఉత్సాహం చూపుతు న్నాయి. లోక్‌సభ గతవారం ఆమోదించిన విద్యా హక్కు చట్టం (రెండో సవరణ) బిల్లు గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది. ఈ సవరణ ప్రకారం పిల్లలు ఇకపై ప్రతి తరగతిలోనూ నిర్దేశించిన మార్కులు పొందితేనే వారిని పై తరగతులకు పంపుతారు. ఫెయిలైన విద్యార్థులకు ఫలితాలు వెలువడిన రెండు నెలల్లో మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ ఉత్తీర్ణులు కాలేని విద్యా ర్థులను ఆ తరగతిలోనే ఉంచేస్తారు. ఒకపక్క బడి ఈడు పిల్లలందరికీ నిర్బంధ, ఉచిత విద్య అంది స్తామని ఎనిమిదేళ్ల క్రితం విద్యాహక్కు చట్టం అమల్లోకి తెచ్చారు. విద్యార్థులు ఎలా చదివినా వారిని ఎనిమిదో తరగతి వరకూ ఫెయిల్ చేయకూడదని ఈ చట్టం చెబుతోంది. 14 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరి విద్య అమలు కావాలన్నదే ఈ నిబంధన ముఖ్యోద్దేశం. ఇది కేవలం మన దేశంలో మాత్రమే అమలవుతున్న విధానం కాదు. బ్రిటన్‌లాంటి అభివృద్ధి చెందిన దేశం కూడా దీన్నే అనుసరిస్తోంది. అయితే అక్కడ చదువులో మెరుగ్గా లేని విద్యార్థుల్ని గుర్తించి, అందుకు గల కార ణాలను ఆరా తీసి వారిని మెరుగుపరుస్తారు. మన పాలకులకు అలాంటి అంశాలు పట్టవు. ఫెయి లయ్యే పిల్లల్ని చదువుకు దూరం చేయటమే సమస్యకు పరిష్కారమనుకుంటున్నారు. విద్యాహక్కు చట్టం అమలు ఒక పెద్ద ప్రహసనం. ఇప్పటికీ ప్రాథమిక విద్యా రంగ సంస్థలు సౌకర్యాల లేమితో అల్లాడుతున్నాయి. మొండి గోడలు, చెట్లకింది చదువులు, పిల్లలకు సకాలంలో పుస్తకాలు అందించలేకపోవటం, అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయుల్ని నియమించలేకపోవటం ఇంకా కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉన్నాయి. వీటి సంగతలా ఉంచి బాలబాలికలకు కనీసం మరు గుదొడ్డు నిర్మించాలని, వారికి మంచినీటి సదుపాయం కల్పించాలని కూడా ప్రభుత్వాలకు తోచటం లేదు. దేశంలో పట్టుమని 10 శాతం పాఠశాలలు కూడా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా లేవు. తమ దగ్గర ఇన్ని లోపాలు పెట్టుకుని పిల్లలు మాత్రం మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సిందేనను కోవటం దుర్మార్గం. నిజానికి ఆరేళ్లక్రితం యూపీఏ సర్కారు హయాంలోనే ఈ సవరణ బిల్లుకు బీజాలు పడ్డాయి. చాలామంది విద్యార్థులు తొమ్మిదో తరగతిలో ఫెయిలవుతున్న తీరు గమనించి 2012లో కేంద్ర విద్యా విషయాల సలహా బోర్డు(సీఏబీఈ) అప్పటి హర్యానా విద్యామంత్రి గీతా భుక్కాల్ నేతృత్వంలో ఒక సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ కొండను తవ్వి ఎలుకను పట్టి నట్టు ఎనిమిదో తరగతి వరకూ అమల్లో ఉండే ‘నో డిటెన్షన్’ విధానం వల్లే ఈ సమస్యంతా వచ్చిం దంటూ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను సీఏబీఈ ఏకగ్రీవంగా ఆమోదించింది. చివరకు ‘నో డిటె న్షన్’కు వీలు కల్పిస్తున్న విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 16ను సవరించాలని నిరుడు ఆగస్టులో కేంద్ర కేబినెట్ తీర్మానించింది. 24 రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నాయని, కేవలం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఇప్పుడున్న విధానం కొనసాగాలంటున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవ్డేకర్ ఇటీవల చెప్పారు. రెండింటిలో ఏదో ఒక విధానాన్ని ఎంచుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు విడిచిపెట్టామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమ లవుతుందని కూడా ఆయన చెబుతున్నారు. ఫెయిలవుతామన్న భయం లేకపోవటం వల్ల విద్యార్థుల్లో అలసత్వం ఏర్పడుతున్నదని, బాగా చదివే పిల్లలూ, చదవని పిల్లలూ కూడా పైతరగతులకు వస్తుండటం వల్ల ఉపాధ్యాయులకు బోధన కష్టమవుతున్నదని ‘నో డిటెన్షన్’ నిబంధన రద్దును సమర్థించేవారి వాదన. చదువులో వెనకబడిన వారి కోసం బోధించాలో, చురుగ్గా అందుకోగలిగినవారికోసం బోధించాలో తెలియని స్థితి ఏర్పడుతు న్నదని ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదు వస్తున్నదట. తగినంతమంది ఉపాధ్యాయులను నియమించి చదువులో వెనకబడినవారి మెరుగుదలకు శ్రద్ధ పెడితే ఈ సమస్యను అవలీలగా అధిగమించవచ్చు. తరగతి గదిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులుంటే ఎవరు మందకొడిగా ఉంటున్నారో, ఎవరు సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నారో ఉపాధ్యాయులకు అంచనా ఉంటుంది. సమస్యను సరిదిద్దేందుకు వారికి వీలుంటుంది. అనవసర ఆర్భాటాల కోసం, హంగామా కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తున్న ప్రభుత్వాలకు ఉపాధ్యాయులను నియమించటం వృథా ఖర్చుగా అనిపిస్తోంది. ఏళ్ల తరబడి వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా పడి ఉంటున్నా, చదువు చెప్పేవారు లేక విద్యార్థులు సమస్య ఎదుర్కొంటున్నా పట్టనట్టుండే పాలకులు ఎన్నికలొచ్చేముందు టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించటం రివాజుగా మారింది. ఇలా సమస్య మూలాలు తమ దగ్గర పెట్టు కుని, నెపం విద్యార్థులపైకి నెట్టి వారిని మరింత అధోగతిపాలు చేయటం క్షమించరాని నేరం. విద్యాహక్కు చట్టం తీసుకొచ్చిన ఉద్దేశాన్ని ప్రభుత్వాలు మరిచాయి. 2016–17 ఎకనామిక్ సర్వే లోని గణాంకాలు గమనిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలుస్తుంది. 2013–14లో మొత్తం బడ్జెట్లో విద్యారంగానికి 4.57 శాతం కేటాయించిన కేంద్రం 2017–18కి వచ్చేసరికి దాన్ని 3.71 శాతానికి దిగజార్చింది. రాష్ట్రాల తీరుతెన్నులూ ఇలాగే ఉంటు న్నాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 2 లక్షల పాఠశాలలు మూతబడ్డాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్తాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో పలు పాఠ శాలలు విలీనం పేరుతో మూతబడ్డాయి. వీటిల్లో చాలాభాగం ఆదివాసీ ప్రాంతాల్లోనివి. బడిఈడు పిల్లలు తప్పనిసరిగా తరగతి గదిలో ఉండాలన్న సంకల్పానికి ఇలాంటి చర్యలు గండికొడుతున్నాయి. అట్టడుగు వర్గాల పిల్లలకు తీరని అన్యాయం చేసే విద్యాహక్కు చట్టం సవరణ బిల్లు కనీసం రాజ్య సభలో ప్రవేశించినప్పుడైనా అర్ధవంతమైన చర్చ జరిగి ప్రతిపాదన వీగుతుందని ఆశించాలి. -
ఆరేళ్ల పిల్లాడికి కరాటే, యోగా ఫీజు..!
తిరుపూర్/తిరువనంతపురం : ఒకటో తరగతి విద్యార్థికి కరాటే, యోగ ఫీజు కింద 20 వేల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో ఆ పిల్లాడి తండ్రి షాక్ గురయ్యాడు. ఆరేళ్ల పిల్లాడికి యోగా, కరాటే ఎందుకని ప్రశ్నించడంతో స్కూలు యాజమాన్యం వారిని గేటు బయటే నిల్చోబెట్టింది. అయినా, ప్రభుత్వ సహకారంతో విద్యనభ్యసిస్తున్న తన కొడుక్కి ఫీజు ఎలా వసూలు చేస్తారని ఆ తండ్రి మంగళవారం ఉదయం నుంచి గేటు బయటే నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు.. ‘విద్యా హక్కు చట్టం - 2009’ (ఆర్టీఈ) ప్రకారం అన్ని ప్రైవేటు, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం 25 శాతం సీట్లు కేటాయించాలి. తిరుపూర్‌లోని కొంగు వెల్లలార్ ప్రైవేటు పాఠశాలలో గాంధీజీ అనే విద్యార్థి ఆర్టీఈ కోటాలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగానే తన కొడుకు గాంధీజీని స్కూల్లో దింపడానికి వచ్చిన పళనికుమార్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ‘ఎక్స్ట్రా కరిక్యులర్’ ఫీజుల కింద 20 వేల రూపాయలు చెల్లించాలని అతన్ని స్కూలు యాజమాన్యం డిమాండ్ చేసింది. ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న తన కొడుకుపై ఈ ఫీజుల భారమేంటో పళని కుమార్‌కు అర్థం కాలేదు. కరాటే, యోగా, లైబ్రరీ, తమిళ్, ఇంగ్లిష్ హ్యాండ్ రైటింగ్, టేబుల్ టెన్నిస్ అంటూ చాంతాడంతా ఫీజుల చిట్టాను పాఠశాల సిబ్బంది అతని చేతిలో పెట్టారు. గాంధీజీతో పాటు ఆర్టీఈ కోటాలో విద్యనభ్యసిస్తున్న మరో ఇద్దరు విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. పళనికుమార్ ఆందోళనకు ఆ విద్యార్థుల తండ్రి సెల్వం కూడా తోడయ్యారు. చేతిలో ప్లకార్డులతో వారంతా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న తిరుపూర్ తహసీల్దార్ స్పందించారు. స్కూలు యాజమాన్యంతో చర్చలు జరిపారు. ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లిస్తుందనీ, ఎక్స్ట్రా కరిక్యులర్ ఫీజు చెల్లింపు తప్పనిసరని తేల్చారు. అరవై రోజుల గడువుతో ఫీజు చెల్లించాలనే షరతుతో విద్యార్థులను తరగతులకు అనుమతించారు. అయితే, తహసీల్దార్ స్కూలు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనీ, అందుకే ఫీజు చెల్లించమంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎందరో ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న విద్యార్థులు ఎక్స్ట్రా ఫీజులతో సతమతమవుతున్నారనీ, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. -
ఆర్టీఈని ఎందుకు నీరుగారుస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25% సీట్లను అర్హులైన పేద విద్యార్థులకు కేటాయించాలని విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) నిబంధనలను ఎందుకు అమలు చేయట్లేదని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను హైకోర్టు ప్రశ్నించింది. పేద విద్యార్థులకు ఉపయోగపడాలనే చట్ట సంకల్పాన్ని ఎందుకు నీరుగారుస్తున్నారని ప్రశ్నించింది. ఈ చట్టాన్ని తెలుగు రాష్ట్రాలు సక్రమంగా అమలు చేయట్లేదంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన వై.తిప్పారెడ్డి రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) పరిగణించి అప్పటికే తాండవ యోగేశ్ అనే లా విద్యార్థి దాఖలు చేసిన పిల్‌తో జత చేసి మంగళవారం విచారించింది. ఆర్టీఈ చట్టం 2007లో వస్తే నేటికీ సక్రమంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మండిపడింది. ఏపీకి చెందిన ఒక మంత్రికే ప్రైవేటు విద్యా సంస్థలున్నాయని, ఆర్టీఈ చట్టానికి అనుగుణంగా జారీ అయిన జీవోలపై కోర్టులు స్టేలు ఇస్తే వాటిని ప్రభుత్వాలు రద్దు చేసేందుకు ప్రయత్నించట్లేదని పిటిషనర్ యోగేశ్ వాదించారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీఈ చట్టం బాగా అమలు జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు–వసూలు చేస్తున్న ఫీజులు, సిబ్బంది–వారి విద్యార్హతలు, 25% సీట్ల వివరాలు, ఇతర సమాచారం విద్యాధికారి దగ్గర ఉండాలని, ఇవన్నీ వెబ్సైట్లో పొందుపర్చకుండా నిబంధనల్ని కాలరాస్తున్నారని చెప్పారు. ప్రైవేటు పాఠశాల్లో చదివే విద్యకు ఫీజుల్ని రీయింబర్స్మెంట్ చేస్తే.. సర్కారీ బడులు మూతపడే ప్రమాదం ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆర్టీఈ చట్టం ఏమేరకు అమలు చేశారో వివరణ ఇవ్వాలని రెండు రాష్ట్రాల్ని ఆదేశించింది. కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి, ఇరు రాష్ట్రాల పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. -
‘తోక’ కట్
సాక్షి, రంగారెడ్డి జిల్లా:ప్రైవేటు స్కూళ్ల కట్టడికి విద్యాశాఖ నడుం బిగిస్తోంది. తమ స్కూళ్ల పేర్ల చివర రకరకాల పేర్ల తోకలు తగిలించి.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ఈ విద్యాసంస్థల దందాకు ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తోంది. ఈ దిశగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక ప్రైవేటు పాఠశాలలు హైదరాబాద్, పూర్వ రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. అదేస్థాయిలో నిబంధనల అతిక్రమణ జరుగుతున్నదీ ఇక్కడే కావడం గమనార్హం. మూడో వంతు స్కూళ్లు విద్యా హక్కు చట్టాని (ఆర్టీఈ)కి లోబడి నడుచుకోవడం లేదని పలుమార్లు వెల్లడైంది. స్కూళ్ల పేర్ల నుంచి మొదలుకుని.. ఫీజుల వసూళ్ల వరకు ప్రైవేటు స్కూళ్లు పాల్పడుతున్న దందాకు చరమగీతం పాడటానికి విద్యాశాఖ సమాయత్తమవుతోంది. ఫీజుల పెంపునకే తోకలు.. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో 4,587 ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. ఇందులో 1,530 స్కూళ్లు తమ పేర్ల విషయంలోనూ నిబంధనలు పాటించడం లేదని అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఇటువంటి స్కూళ్ల జాబితాను అధికారులు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఫీజు దోపిడీ.. స్కూల్ పేరును బట్టే మొదలవుతోంది. ఐఐటీ, కాన్సెప్ట్, ఒలింపియాడ్, టెక్నో, ఈ-టెక్నో, ఇంటర్నేషనల్, టాలెంట్, గ్రామర్, డీజీ, క్రియేటివ్.. ఇటువంటి ఆకర్షణీయ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇవి ఆకట్టుకునే యత్నం చేస్తున్నారుు. ఈ పేర్లతో నర్సరీ నుంచే రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లు.. ఈ రెండు జిల్లాల్లో లెక్కలేనన్ని ఉన్నాయి. ఎల్కేజీ, యూకేజీలకే రూ.4 లక్షల ఫీజు వసూలు చేస్తున్న స్కూళ్లు ఉన్నాయి. ఇవికాక రవాణా, యూనిఫాం, పుస్తకాలు, నోట్ బుక్స్, షూ, సాక్స్‌లు.. ఈ ఖర్చులు అదనం. చివరకు ఇవన్నీ చెల్లించేందుకు తల్లిదంద్రుల ఆదాయం కూడా చాలడం లేదు. జీఓ ఉన్నా.. సున్నా స్కూళ్ల పేర్ల విషయంలో అప్పటి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోంది. పేర్లలో ఎటువంటి ఆకర్షణీయ తోకలు ఉండకూడదంటూ... 2009లో జీఓ ఎంఎస్ నం:91ను తీసుకొచ్చారు. స్కూళ్ల పేర్లు సాదాసీదాగా ఉండాలని ఈ జీఓ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల వరకు తమ పేర్లలో ఉన్న తోకలను యాజమాన్యాలు తొలగించేశాయి. ఆ తర్వాత 2011 నుంచి తిరిగి ‘ఆకర్షణీయ’ పర్వం మొదలైంది. పేర్లకు తగ్గట్లుగా ఫీజులను నిర్ణయించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు యాజమాన్యాలు లాగుతూనే ఉన్నాయి. ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు.. పోరాడుతూ వచ్చాయి. చివరకు కోర్టు మెట్లూ ఎక్కారు. అయినా ప్రభుత్వాలు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరించాయి. సాధ్యపడేనా..? 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు ప్రైవేటు స్కూళ్లు కసరత్తు మొదలు పెట్టాయి. ఇప్పటికే కొన్ని స్కూళ్లలో ప్రవేశాలు కూడా జరిగాయని సమాచారం. మరోపక్క వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా స్కూళ్ల పేర్లలో ఆకర్షణీయ తోకలను కత్తిరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తోకలు ఉన్న పాఠశాలల జాబితా సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తొలుత ఆకర్షణీయ పేర్లను కట్టడి చేయడం వల్ల కొంత మేరకు ఫీజులు అదుపులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఫీజుల నియంత్రణపై దృష్టి సారించవచ్చని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
లక్షకు పైగా స్కూళ్లలో ఒకే టీచర్!
డెహ్రాడూన్: దేశంలో విద్యాహక్కు లాంటి చట్టాలు అమలవుతున్నా.. విద్యా ప్రమాణాలు మాత్రం పెరగడం లేదు. ఒకే టీచర్ తో నడుస్తున్న పాఠశాలలు దేశంలో ఒక లక్షకు పైగా ఉన్నట్లు సోమవారం పార్లమెంటు సమావేశాల్లో బయటపడింది. 1,05,630 ప్రభుత్వ ప్రాథమిక, సెకండరీ పాఠశాలలు ఈ దుస్థితిలో మగ్గుతున్నాయని తెలిసింది. అత్యధికంగా మధ్యప్రదేశ్ లో 17,874 స్కూళ్లు, ఉత్తరప్రదేశ్ లో 17,602 పాఠశాలలు ఒక టీచర్ తో నడుస్తున్నాయి. ఈ పాఠశాలలో ఒక టీచరే అన్ని తరగతుల వారికి పాఠాలు చెబుతున్నారు. మానవ వనరుల శాఖ ఉపమంత్రి ఉపేంద్ర కుష్వాహ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ 13,575, ఆంధ్రప్రదేశ్ 9,540, జార్ఖండ్ 7,391లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 13 పాఠశాలలు ఒక టీచర్ తో నడుస్తుండగా.. బీహార్ లో 3,708 స్కూళ్లు ఒక టీచర్ తో నడుస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. ఢిల్లీ మినహాయించి కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ ద్వీపంలో 16, త్రిపురలో 45, దాద్రా అండ్ నగర్ హవేలీలో 49, మిజోరాంలో 73 ఉన్నాయి. హిమాలయన్ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ లో 1,771, హిమాచల్ ప్రదేశ్ లో 1,119, జమ్మూ అండ్ కశ్మీర్ లో 1,430, పంజాబ్ లో 1,360 పాఠశాలలు ఒక టీచర్ తో నడుస్తున్నాయి. అయితే సింగిల్ టీచర్ తో నడుస్తున్న పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్ఫత్తి వివరాలు అందుబాటులో లేవు. -
ఆర్టీఈ నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్లపై చర్యలు
- విద్యాశాఖను ఆదేశించిన సీఎం ఫడ్నవీస్ - వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజావిజ్ఞప్తులు తెలుసుకున్న సీఎం సాక్షి, ముంబై: ‘రైట్ టు ఎడ్యుకేషన్’ (ఆర్టీఈ) నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరపని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ విద్యాశాఖను ఆదేశించారు. ఆర్టీఈ నియమాలను ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. ‘నేషనల్ టెక్నాలజీ డే’ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం రాష్ట్రంలో తొలిసారిగా ప్రజావిజ్ఞప్తులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ముంబై, నవీ ముంబై, మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలల్లోని ఫిర్యాదు దారులు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సీఎంకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదులను తెలియజేశారు. మంత్రాలయలో కార్యక్రమం నిర్వహిస్తే.. ఫిర్యాదుదారులు మంత్రాలయ చేరుకోడానికి సమయంతోపాటు డబ్బు వృథా అవుతోందని, అందుకే వీడియోకాన్ఫొరెన్స్ నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు. పర్బణీ, కోల్హపూర్, సాతారా, భండారా, నాసిక్, జల్గావ్, పుణే, నాగపూర్ మొదలగు జిల్లాలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాయి. ఆయా జిల్లా అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడంతోపాటు ఫిర్యాదుల దారులకు తమ గోడు వినిపించే అవకాశాన్ని సీఎం కల్పించారు. -
పాలకుల పాపం... పేద పిల్లలకు శాపం
విద్యా హక్కు చట్టం (ఆర్ టీఈ) అమలులోకి వచ్చి నేటికి ఐదు వసంతాలు పూర్తయినా, తెలుగు రాష్ట్రాలలో అది అమలుకు నోచుకోలేదు. సర్వశిక్షా అభియాన్ (ఎన్ఎస్ఏ) నిధులతో రెండు రాష్ట్రా ల్లోని సూళ్లకు మౌలిక సదు పాయాలొచ్చాయి. కానీ సక్సెస్ స్కూళ్లు, ఒకటో తర గతి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన, ఏటా శిక్షిత ఉపాధ్యాయ నియామకాలు, బడ్జెట్లో 10% నిధు లు, బడి మానేసిన వారి కోసం బ్రిడ్జి స్కూళ్లు, కస్తూ రిబా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూ ళ్లు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు... ఇలా ఎన్నో చర్యలు చేపట్టారు. అయినా 2003-04 నుంచి 2013-14 మధ్య దశాబ్ద కాలంలో 25 లక్షల మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్ల బాట పట్టారు. ఉమ్మ డి రాష్ట్ర ప్రైవేటు విద్యార్థుల సంఖ్య 32.78 లక్షల నుంచి 57.48 లక్షలకు చేరింది. అలాగే ప్రైవేటు స్కూళ్ల సంఖ్య 12,573 నుంచి 25,302కు చేరింది. అలా అని ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గలేదు. పైగా నిధులు, సౌకర్యాలు బాగా పెరిగాయి. కానీ పాలకులలో, ఉపాధ్యాయులలో అంకితభావం లేకపోవడం వలన వేల కోట్ల రూపా యల ప్రజాధనం నిరుపయోగమవుతోంది. జాతీ య అక్షరాస్యత 73% శాతం కాగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అది 67.2%. బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలకు వెనుకే. విద్యా హక్కు చట్టం-2010 సెక్షన్-12(సి) ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. ఆ 25 శాతం విద్యా ర్థుల ఫీజులను రీయింబర్స్మెంట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలి. అంటే తెలుగు రాష్ట్ర ప్రభు త్వాలపై రూ.400 కోట్ల భారం. సర్వశిక్షా అభి యాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ల అమ లుతో చాలా స్కూళ్లకు కొత్త భవనాలు ఏర్పాటయ్యా యి. విద్యాహక్కు అమలు వల్ల ఏ ఒక్కటీ నిర్మాణం కాలేదు. ఉపాధ్యాయులపై పర్యవేక్షణ చేసే అధి కారులు లేరు. పాఠశాలల పర్యవేక్షణకు మండల విద్యాధికారులను, డిప్యూటీ విద్యాధికారులను నియమించడంపై పాలకులు ఆసక్తి చూపడం లేదు. దీంతో విద్య, బోధన ప్రమాణాల పెంపుదలను పట్టించుకునేవారే లేకుండాపోయారు. తెలంగాణ లోని 10 జిల్లాలో 462 మంది మండల విద్యాధికా రులు ఉండాల్సి ఉండగా 42 మంది, 67 మంది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకుగానూ 8 మంది ఉన్నారు. 59 డిప్యూటీ ఈఓ పోస్టులు, 420 మండల విద్యాధికారుల పోస్టులను భర్తీ చేయడం లేదు. ఒక్క టీచర్ మాత్రమే ఉన్న స్కూళ్లు 3,895. రెండు వేల స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేరు. దీనికి తోడు బదిలీల వల్ల 717 స్కూళ్లలో టీచర్లు లేరు. ఈ దుస్థితిలో 8వ తరగతిలోపు 32.56% బడి మానేయడంలో ఆశ్చ ర్యం లేదు. వీటన్నిటికి తోడు ఈ ఆర్థిక సంవత్స రంలో కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లు విద్యకు నిధులలో కోత విధించాయి. ఇన్ని దుర్భర పరిస్థితులలో, ప్రభుత్వ పాఠశాలలు ఎలా బతికి బట్టకట్టాలి? ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదవా రికి ఇవ్వాలనే విద్యా హక్కు చట్ట నిబంధన అర్థరహి తమైనది. నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందిస్తూ అద్భుత ఫలి తాలను సాధిస్తున్నాయి. అలాంటి స్కూళ్ల సంఖ్యను పెంచడం అన్నివిధాల ఉత్తమం. పేద విద్యార్థులను ప్రైవేట్ స్కూళకు పంపడం వల్ల ప్రజాధనం దుర్వి నియోగం కావడమేకాదు, అక్కడ వాళ్లు వివక్షను చవిచూడాల్సి వస్తోంది. అయినా లెక్కచేయక మన ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యాసంస్థలకు మేలు చేకూ ర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ, పేదలకు విద్యను అందకుండా చేస్తున్నారు. ఇకనైనా తెలుగు పాలకులు ప్రైవేటు విద్యా సంస్థల సేవ మాని, అన్ని స్థాయిలలోని అధి కారులను, ఉపాధ్యాయులను సకాలంలో నియమిం చాలి. ప్రత్యేకించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి విధిగా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని శాసించి, కచ్చితంగా అమలు చేయాలి. అప్పుడే అం దరికీ నాణ్యమైన విద్యకు హామీ. (విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా...) (వ్యాసకర్త ‘సోషల్ ఎవేర్నెస్ కాంపెయిన్’ ప్రతినిధి. మొబైల్ నం: 9441048958) -
కాగితం పులేనా..?
నాలుగేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఆర్టీఈ(రైట్ టూ ఎడ్యుకేషన్) చట్టం చివరకు కాగితపు పులిగానే మిగిలిపోయింది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చట్టం చేయడంతో పాటు విస్తృత ప్రచారం చేయడంతో పేద వర్గాల్లో ఎన్నో ఆశలు రేపింది. కార్పొరేట్ పాఠశాలల్లో సైతం 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలని ఆ చట్టంలో పేర్కొనడంతో పేద విద్యార్థులు మనకు మంచిరోజులొచ్చాయని భావించారు. నిర్బంధ విద్య ప్రవేశపెట్టడం ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. ఎన్నో ఉత్తమ ఆశయాలతో రూపొందించిన ఈ చట్టం అమలులో ఇంకా ఆమడదూరంలోనే ఉంది. ప్రభుత్వం చట్టం చేసి చేతులు దులుపుకొందే కాని, అమలు విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో చట్టం కాగితాలకే పరిమితమైంది. గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :బడి ఈడు బాలలందరికీ నిర్బంధ విద్య అందించే లక్ష్యంతో రూపొందించిన నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. చదువు కావాలని కోరిన ప్రతి పిల్లవాడికి విద్యను హక్కుగా చేసి ఉచితంగా చదువు చెప్పించేలా ప్రతిష్టాత్మకంగా తెచ్చిన చట్టం అమల్లో ప్రభుత్వం అడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2010లో దేశ వ్యాప్తంగా ఆర్భాటంగా అమల్లోకి తెచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్టీఈ-2009)కు బూజు పట్టింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై అటు ప్రభుత్వం, ఇటు విద్యా శాఖాధికారులు దృష్టి సారించకపోవడంతో విద్యాహక్కు చట్టం ప్రహసనంగా మారింది. ఆరేళ్ల వయసు నుంచి 14 ఏళ్ల లోపు బాలలను పాఠశాలలకే పరిమితం చేసి, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా రూపు మాపే లక్ష్యంతో తీసుకొచ్చిన మహత్తరమైన చట్టం ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను నిరుపేద, అల్పాదాయ వర్గాల పిల్లలతో ఉచితంగా భర్తీ చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టం అమలుకు ముందుకు రాని నేపథ్యంలో విద్యాశాఖాధికారులు సైతం చేతులు ముడుచుకుని కూర్చున్నారు. 2010లో అమల్లోకి వచ్చిన చట్టం విద్యాభివృద్ధి లేనిదే సమాజం అభివృద్ధి సాధించలేదనే కోణంలో కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 27న విద్యాహక్కు చట్టాన్ని రూపొందించింది. చట్టం వచ్చిన ఎనిమిది నెలల తరువాత 2010 ఏప్రిల్ 1న అమల్లోకి తెచ్చింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పేద విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్, ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు కొనసాగరాదనే ప్రధానాంశాలు చట్టం ఇమిడి ఉండగా, వీటిలో ఏ ఒక్కటీ జిల్లాలో సక్రమంగా అమలుకాలేదు. చట్టం వచ్చిన నాలుగేళ్ల కాలంలో జిల్లాలోని ఏ ఒక్క కార్పొరేట్ పాఠశాలలనూ పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా భర్తీ చేయలేదు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభించింది. ప్రతి ఏటా జూన్‌లో పాఠశాలలు తెరిచే ముందుగా విద్యా పక్షోత్సవాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై నిర్దిష్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమైంది. పేదలపై ఫీజుల భారం... సమాజంలో బడుగు, బలహీన వర్గాల కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించడం ద్వారా ఆయా వర్గాలను ఉద్ధరించవచ్చనే ఉద్దేశంతో తెచ్చిన నిర్బంధ విద్యాహక్కు చట్టం ఉద్దేశం నెరవేరలేదు. పేద, అల్పాదాయ వర్గాల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. చట్టం నిర్దేశించిన విధంగా జరిగితే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వడం ద్వారా పేద ప్రజలకు ఆర్థికంగా వెసులు బాటు కల్పించినట్లయ్యేది. ఈ విధంగా 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేసిన పాఠశాలలకు ఆ మేరకు ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని చట్టంలో పొందుపర్చారు. మరోవైపు చట్టంలో పొందుపర్చిన విధంగా ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవన నిర్మాణాలు చేపట్టి, పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా, చట్టం అమలుకు నిధులు విడుదల చేసిన పరిస్థితులు లేదు. అసాధారణమైన అంశాలను చట్టంలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చట్టాన్ని అమలుపర్చే దిశగా విఫలం చెందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో విద్యాశాఖాధికారులు చేసేది లేక మిన్నకుండిపోతున్నారు. ఫలితంగా చట్టం చట్టుబండగా మారి ప్రభుత్వాల చిత్తశుద్ధిని వెక్కిరిస్తోంది. ఆదేశాలు వస్తే అమలు చేస్తాం... ప్రైవేటు పాఠశాలల్లో 25 సీట్లను అల్పాదాయ వర్గాల పిల్లలతో భర్తీ చేసే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే అమలు పరుస్తాం. గుర్తింపు లేని పాఠశాలలపై గతంలో దాడులు చేసి నోటీసులు ఇవ్వడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేశాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఏటా పటిష్టమైన చర్యలు చేపడుతున్నాం. -డి.ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తే సిద్ధమే విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రకారం పేద కుటుంబాల పిల్లలకు 25 సీట్లను ఇచ్చేందుకు పాఠశాలల యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఓవైపు ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లించాల్సిన నిధులను చెల్లించడంలోనే విఫలమవుతున్న ప్రభుత్వం ఇక స్కూలు పిల్లల ఫీజులు చెల్లిస్తుందనే నమ్మకం లేదు. ఇదే విషయమై జాతీయ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్య సంఘం సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేసులో తీర్పు వెలువడాల్సి ఉంది. -ఎన్.చక్రనాగ్, జిల్లా కార్యదర్శి,ఏపీ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ -
ఆర్టీఈపై అవగాహనే లేదు
విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా కొన్ని సీట్లు కేటాయించాలన్న విషయం ఢిల్లీలో అతి తక్కువ మందికే తెలుసని అధ్యయనంలో బయటపడింది. న్యూడిల్లీ: విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో విద్యను పెంచడానికి ఏర్పాటు చేసిన చట్టం. కానీ దీని గురించి తెలిసిన వారు ఎంతమంది అని తెలిస్తే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. బడుగు, బలహీన వర్గాల్లో విద్యను తప్పనిసరి చేసేందుకు ఈ చట్టంపై తల్లిదండ్రులకు అవగాహన ఉండటం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా విద్యాహక్కు చట్టం గురించి కేవలం నాలుగు శాతం మంది తల్లిదండ్రులకే తెలిసి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. విద్యాహక్కు చట్టం అమలుపై పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థ ఇండస్ యాక్షన్ వెల్లడించిన విషయాలివి. ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకోసం కేటాయించిన సీట్లు ఢిల్లీలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో భర్తీ కావడం లేదని, తల్లిదండ్రుల్లో అవగాహన లోపమే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. సమాజంలోని బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ప్రైవేటు స్కూళ్లలోని ప్రతి తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధన ఉంది. అడ్మిషన్ల ప్రక్రియలలో అవినీతి జరుగుతోందని, పారదర్శకత అస్సలే ఉండటంలేదని, దరఖాస్తు ఫారాలు కూడా అందుబాటులో లేవని సంస్థ పేర్కొన్నది. దీనిపై ప్రభుత్వం అసలు దృష్టి సారించడం లేదని ఆవేదన చెందింది. ఢిల్లీలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 35 వేలకు పైగా సీట్లు ప్రతి ఏటా బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం ఇవ్వాలని ఢిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి శైలజా చంద్ర సూచించారు. ప్రభుత్వం నుంచి విద్యాశాఖకు మార్గదర్శకాలను కూడా అందజేశారు. వీటి అమలు సరిగ్గా ఉండాలంటే... పాఠశాలలకు రీయింబర్స్మెంట్ సమయానికి అందేలా చూడాలని ఆదేశాలిచ్చారు. కానీ ఆచరణ లేదు. పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి క్షేత్రస్థాయిలో సమాచారం వ్యాప్తి చేస్తేనే గానీ చట్టంపై అవగాహన, అమలు జరిగేలా లేదు.