విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా కొన్ని సీట్లు కేటాయించాలన్న విషయం ఢిల్లీలో అతి తక్కువ మందికే తెలుసని అధ్యయనంలో బయటపడింది.
న్యూడిల్లీ: విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో విద్యను పెంచడానికి ఏర్పాటు చేసిన చట్టం. కానీ దీని గురించి తెలిసిన వారు ఎంతమంది అని తెలిస్తే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. బడుగు, బలహీన వర్గాల్లో విద్యను తప్పనిసరి చేసేందుకు ఈ చట్టంపై తల్లిదండ్రులకు అవగాహన ఉండటం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా విద్యాహక్కు చట్టం గురించి కేవలం నాలుగు శాతం మంది తల్లిదండ్రులకే తెలిసి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. విద్యాహక్కు చట్టం అమలుపై పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థ ఇండస్ యాక్షన్ వెల్లడించిన విషయాలివి.
ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకోసం కేటాయించిన సీట్లు ఢిల్లీలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో భర్తీ కావడం లేదని, తల్లిదండ్రుల్లో అవగాహన లోపమే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. సమాజంలోని బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ప్రైవేటు స్కూళ్లలోని ప్రతి తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధన ఉంది. అడ్మిషన్ల ప్రక్రియలలో అవినీతి జరుగుతోందని, పారదర్శకత అస్సలే ఉండటంలేదని, దరఖాస్తు ఫారాలు కూడా అందుబాటులో లేవని సంస్థ పేర్కొన్నది. దీనిపై ప్రభుత్వం అసలు దృష్టి సారించడం లేదని ఆవేదన చెందింది. ఢిల్లీలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 35 వేలకు పైగా సీట్లు ప్రతి ఏటా బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం ఇవ్వాలని ఢిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి శైలజా చంద్ర సూచించారు. ప్రభుత్వం నుంచి విద్యాశాఖకు మార్గదర్శకాలను కూడా అందజేశారు. వీటి అమలు సరిగ్గా ఉండాలంటే... పాఠశాలలకు రీయింబర్స్‌మెంట్ సమయానికి అందేలా చూడాలని ఆదేశాలిచ్చారు. కానీ ఆచరణ లేదు. పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి క్షేత్రస్థాయిలో సమాచారం వ్యాప్తి చేస్తేనే గానీ చట్టంపై అవగాహన, అమలు జరిగేలా లేదు.
ఆర్టీఈపై అవగాహనే లేదు
Published Sat, Apr 26 2014 10:35 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement