‘తోక’ కట్
‘తోక’ కట్
Published Thu, Nov 24 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
సాక్షి, రంగారెడ్డి జిల్లా:ప్రైవేటు స్కూళ్ల కట్టడికి విద్యాశాఖ నడుం బిగిస్తోంది. తమ స్కూళ్ల పేర్ల చివర రకరకాల పేర్ల తోకలు తగిలించి.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ఈ విద్యాసంస్థల దందాకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తోంది. ఈ దిశగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక ప్రైవేటు పాఠశాలలు హైదరాబాద్, పూర్వ రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. అదేస్థాయిలో నిబంధనల అతిక్రమణ జరుగుతున్నదీ ఇక్కడే కావడం గమనార్హం. మూడో వంతు స్కూళ్లు విద్యా హక్కు చట్టాని (ఆర్‌టీఈ)కి లోబడి నడుచుకోవడం లేదని పలుమార్లు వెల్లడైంది. స్కూళ్ల పేర్ల నుంచి మొదలుకుని.. ఫీజుల వసూళ్ల వరకు ప్రైవేటు స్కూళ్లు పాల్పడుతున్న దందాకు చరమగీతం పాడటానికి విద్యాశాఖ సమాయత్తమవుతోంది.
ఫీజుల పెంపునకే తోకలు..
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో 4,587 ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. ఇందులో 1,530 స్కూళ్లు తమ పేర్ల విషయంలోనూ నిబంధనలు పాటించడం లేదని అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఇటువంటి స్కూళ్ల జాబితాను అధికారులు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఫీజు దోపిడీ.. స్కూల్ పేరును బట్టే మొదలవుతోంది. ఐఐటీ, కాన్సెప్ట్, ఒలింపియాడ్, టెక్నో, ఈ-టెక్నో, ఇంటర్నేషనల్, టాలెంట్, గ్రామర్, డీజీ, క్రియేటివ్.. ఇటువంటి ఆకర్షణీయ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇవి ఆకట్టుకునే యత్నం చేస్తున్నారుు. ఈ పేర్లతో నర్సరీ నుంచే రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లు.. ఈ రెండు జిల్లాల్లో లెక్కలేనన్ని ఉన్నాయి. ఎల్‌కేజీ, యూకేజీలకే రూ.4 లక్షల ఫీజు వసూలు చేస్తున్న స్కూళ్లు ఉన్నాయి. ఇవికాక రవాణా, యూనిఫాం, పుస్తకాలు, నోట్ బుక్స్, షూ, సాక్స్‌లు.. ఈ ఖర్చులు అదనం. చివరకు ఇవన్నీ చెల్లించేందుకు తల్లిదంద్రుల ఆదాయం కూడా చాలడం లేదు.
జీఓ ఉన్నా.. సున్నా
స్కూళ్ల పేర్ల విషయంలో అప్పటి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోంది. పేర్లలో ఎటువంటి ఆకర్షణీయ తోకలు ఉండకూడదంటూ... 2009లో జీఓ ఎంఎస్ నం:91ను తీసుకొచ్చారు. స్కూళ్ల పేర్లు సాదాసీదాగా ఉండాలని ఈ జీఓ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల వరకు తమ పేర్లలో ఉన్న తోకలను యాజమాన్యాలు తొలగించేశాయి. ఆ తర్వాత 2011 నుంచి తిరిగి ‘ఆకర్షణీయ’ పర్వం మొదలైంది. పేర్లకు తగ్గట్లుగా ఫీజులను నిర్ణయించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు యాజమాన్యాలు లాగుతూనే ఉన్నాయి. ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు.. పోరాడుతూ వచ్చాయి. చివరకు కోర్టు మెట్లూ ఎక్కారు. అయినా ప్రభుత్వాలు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరించాయి.
సాధ్యపడేనా..?
2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు ప్రైవేటు స్కూళ్లు కసరత్తు మొదలు పెట్టాయి. ఇప్పటికే కొన్ని స్కూళ్లలో ప్రవేశాలు కూడా జరిగాయని సమాచారం. మరోపక్క వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా స్కూళ్ల పేర్లలో ఆకర్షణీయ తోకలను కత్తిరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తోకలు ఉన్న పాఠశాలల జాబితా సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తొలుత ఆకర్షణీయ పేర్లను కట్టడి చేయడం వల్ల కొంత మేరకు ఫీజులు అదుపులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఫీజుల నియంత్రణపై దృష్టి సారించవచ్చని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Advertisement
Advertisement