డెహ్రాడూన్: దేశంలో విద్యాహక్కు లాంటి చట్టాలు అమలవుతున్నా.. విద్యా ప్రమాణాలు మాత్రం పెరగడం లేదు. ఒకే టీచర్ తో నడుస్తున్న పాఠశాలలు దేశంలో ఒక లక్షకు పైగా ఉన్నట్లు సోమవారం పార్లమెంటు సమావేశాల్లో బయటపడింది. 1,05,630 ప్రభుత్వ ప్రాథమిక, సెకండరీ పాఠశాలలు ఈ దుస్థితిలో మగ్గుతున్నాయని తెలిసింది.
అత్యధికంగా మధ్యప్రదేశ్ లో 17,874 స్కూళ్లు, ఉత్తరప్రదేశ్ లో 17,602 పాఠశాలలు ఒక టీచర్ తో నడుస్తున్నాయి. ఈ పాఠశాలలో ఒక టీచరే అన్ని తరగతుల వారికి పాఠాలు చెబుతున్నారు. మానవ వనరుల శాఖ ఉపమంత్రి ఉపేంద్ర కుష్వాహ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ 13,575, ఆంధ్రప్రదేశ్ 9,540, జార్ఖండ్ 7,391లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 13 పాఠశాలలు ఒక టీచర్ తో నడుస్తుండగా.. బీహార్ లో 3,708 స్కూళ్లు ఒక టీచర్ తో నడుస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. ఢిల్లీ మినహాయించి కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ ద్వీపంలో 16, త్రిపురలో 45, దాద్రా అండ్ నగర్ హవేలీలో 49, మిజోరాంలో 73 ఉన్నాయి.
హిమాలయన్ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ లో 1,771, హిమాచల్ ప్రదేశ్ లో 1,119, జమ్మూ అండ్ కశ్మీర్ లో 1,430, పంజాబ్ లో 1,360 పాఠశాలలు ఒక టీచర్ తో నడుస్తున్నాయి. అయితే సింగిల్ టీచర్ తో నడుస్తున్న పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్ఫత్తి వివరాలు అందుబాటులో లేవు.
లక్షకు పైగా స్కూళ్లలో ఒకే టీచర్!
Published Tue, Aug 9 2016 8:52 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
Advertisement
Advertisement