ఆర్‌టీఈ నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్లపై చర్యలు
- విద్యాశాఖను ఆదేశించిన సీఎం ఫడ్నవీస్
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజావిజ్ఞప్తులు తెలుసుకున్న సీఎం
సాక్షి, ముంబై: ‘రైట్ టు ఎడ్యుకేషన్’ (ఆర్‌టీఈ) నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరపని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ విద్యాశాఖను ఆదేశించారు. ఆర్‌టీఈ నియమాలను ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. ‘నేషనల్ టెక్నాలజీ డే’ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం రాష్ట్రంలో తొలిసారిగా ప్రజావిజ్ఞప్తులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ముంబై, నవీ ముంబై, మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలల్లోని ఫిర్యాదు దారులు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సీఎంకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదులను తెలియజేశారు.
మంత్రాలయలో కార్యక్రమం నిర్వహిస్తే.. ఫిర్యాదుదారులు మంత్రాలయ చేరుకోడానికి సమయంతోపాటు డబ్బు వృథా అవుతోందని, అందుకే వీడియోకాన్ఫొరెన్స్ నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు. పర్బణీ, కోల్హపూర్, సాతారా, భండారా, నాసిక్, జల్‌గావ్, పుణే, నాగపూర్ మొదలగు జిల్లాలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాయి. ఆయా జిల్లా అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడంతోపాటు ఫిర్యాదుల దారులకు తమ గోడు వినిపించే అవకాశాన్ని సీఎం కల్పించారు.