Extra fees
-
అదనంగా ఫీజులు వసూలు చేస్తే రూ.2లక్షల జరిమానా: AFRC
-
‘మీసేవ’లో చేతివాటం!
సాక్షి, నిర్మల్(ఆదిలాబాద్) : మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన ఓ రైతు మ్యుటేషన్ కోసం జిల్లాకేంద్రంలోని ఓ మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేశాడు. అయితే మీసేవ నిర్వాహకుడు అతడికి రూ.145 రశీదు ఇచ్చి రూ.300 వసూలు చేశాడు. పదే పదే తిరిగే పరిస్థితి లేకపోవడంతో అడిగిన మొత్తం ఇచ్చి పని కానిచ్చుకున్నాడు ఆ రైతు. మీసేవలో పని కోసం వెళ్లే ప్రతీ ఒక్కరూ ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు. మీసేవలో ప్రభుత్వం నిర్దేశించిన చార్జీకి మించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే, ప్రభుత్వం ఇచ్చే కమీషన్ తక్కువగా ఉండడంతోనే కాస్త ఎక్కువగా వసూలు చేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పలురకాల సేవలను ప్రజలకు పారదర్శకంగా, సులభంగా, వేగంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుదారుల వద్ద నుంచి ప్రభుత్వం నిర్దేశించిన దానికి మించి అదనంగా ఫీజు వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఇదేంటని అడిగితే స్టేషనరీ, ఇతర ఖర్చుల నిమిత్తం సర్వీస్‌చార్జీ విధిస్తున్నామని చెబుతున్నారు. ఇదంతా బహిరంగంగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదీ ఇదీ అని కాకుండా ప్రతీ సర్టిఫికెట్‌కు అదనపు చార్జీ వసూలు చేస్తున్నారు. చార్జీలకు సంబంధించిన నిర్దేశిత చార్టు మీసేవలో కళ్లముందు ఉన్నా అవి అలంకారప్రాయంగానే మారాయనే విమర్శలున్నాయి. అదనంగా ఇస్తేనే పని... మీ సేవ కేంద్రాల ద్వారా 300కు పైగా వివిధ ప్ర భుత్వశాఖల సేవలు ప్రజలకు అందుతున్నాయి. ఇందులో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు భూము లు, వ్యవసాయానికి సంబంధించిన పత్రాల కోసం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. ప్రతీ ధ్రువీకరణపత్రం జారీకి ప్రభుత్వం సర్వీస్‌చార్జీ కింద కొంత మొత్తం ఫీజును నిర్దేశించింది. విద్యార్థులకు ఎక్కువగా నివాసం, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతా యి. ప్రభుత్వం వీటికి రూ.45 ఫీజు విధించింది. అయితే విద్యార్థుల అవసరాన్ని బట్టి నిర్వాహకులు ఇష్టారీతిన అదనపు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలువురు మీసేవ నిర్వాహకులు తహసీల్దార్ కార్యాలయాల్లో తమ వారి ద్వారా కూడా పనులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రైతులకు కావాల్సిన పహణీ, 1బీ వంటి వాటికి రూ.35 మాత్రమే వసూలు చేయాలి. కానీ అమాయక రైతుల పరిస్థితిని ఆసరా చేసుకుని నిర్వాహకులు వీటికి రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తనిఖీలు శూన్యం... మీసేవ కేంద్రాలపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అలాగే ఇటీవల ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మీ సేవ 2.0 యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించ డంలో అధికారులు విఫలమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 72మీసేవ కేంద్రాలున్నాయి. ప్రతీరోజు ఒక్కో కేంద్రానికి దాదాపు 50 వరకు దరఖాస్తులు వస్తాయి. ఈ కేంద్రాల తనిఖీల బాధ్యత సంబంధిత తహసీల్దార్లకు ఉం టుంది. కానీ ఆ శాఖ అధికారులు ఎన్నికలు, వివిధ పనుల్లో బిజీగా ఉండడంతో తనిఖీలు చేపట్టడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిన అదనంగా సర్వీస్‌చార్జీ వసూలు చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తే చర్యలు మీసేవ కేంద్రాల తనిఖీలు రెవెన్యూ అధికారుల పరిధిలో ఉంది. సంబంధిత తహసీల్దార్ తన పరిధిలోని మీసేవ కేంద్రాలను పర్యవేక్షిస్తారు. కేంద్రాల్లో అదనంగా వసూలు చేస్తే దరఖాస్తుదారులు 1100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అధికంగా ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు వస్తే సదరు మీసేవ కేంద్రంపై తగిన చర్యలు తీసుకుంటాం. – నదీం, జిల్లా ఈ– మేనేజర్, నిర్మల్ -
ఆరేళ్ల పిల్లాడికి కరాటే, యోగా ఫీజు..!
తిరుపూర్/తిరువనంతపురం : ఒకటో తరగతి విద్యార్థికి కరాటే, యోగ ఫీజు కింద 20 వేల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో ఆ పిల్లాడి తండ్రి షాక్ గురయ్యాడు. ఆరేళ్ల పిల్లాడికి యోగా, కరాటే ఎందుకని ప్రశ్నించడంతో స్కూలు యాజమాన్యం వారిని గేటు బయటే నిల్చోబెట్టింది. అయినా, ప్రభుత్వ సహకారంతో విద్యనభ్యసిస్తున్న తన కొడుక్కి ఫీజు ఎలా వసూలు చేస్తారని ఆ తండ్రి మంగళవారం ఉదయం నుంచి గేటు బయటే నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు.. ‘విద్యా హక్కు చట్టం - 2009’ (ఆర్టీఈ) ప్రకారం అన్ని ప్రైవేటు, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం 25 శాతం సీట్లు కేటాయించాలి. తిరుపూర్‌లోని కొంగు వెల్లలార్ ప్రైవేటు పాఠశాలలో గాంధీజీ అనే విద్యార్థి ఆర్టీఈ కోటాలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగానే తన కొడుకు గాంధీజీని స్కూల్లో దింపడానికి వచ్చిన పళనికుమార్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ‘ఎక్స్ట్రా కరిక్యులర్’ ఫీజుల కింద 20 వేల రూపాయలు చెల్లించాలని అతన్ని స్కూలు యాజమాన్యం డిమాండ్ చేసింది. ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న తన కొడుకుపై ఈ ఫీజుల భారమేంటో పళని కుమార్‌కు అర్థం కాలేదు. కరాటే, యోగా, లైబ్రరీ, తమిళ్, ఇంగ్లిష్ హ్యాండ్ రైటింగ్, టేబుల్ టెన్నిస్ అంటూ చాంతాడంతా ఫీజుల చిట్టాను పాఠశాల సిబ్బంది అతని చేతిలో పెట్టారు. గాంధీజీతో పాటు ఆర్టీఈ కోటాలో విద్యనభ్యసిస్తున్న మరో ఇద్దరు విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. పళనికుమార్ ఆందోళనకు ఆ విద్యార్థుల తండ్రి సెల్వం కూడా తోడయ్యారు. చేతిలో ప్లకార్డులతో వారంతా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న తిరుపూర్ తహసీల్దార్ స్పందించారు. స్కూలు యాజమాన్యంతో చర్చలు జరిపారు. ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లిస్తుందనీ, ఎక్స్ట్రా కరిక్యులర్ ఫీజు చెల్లింపు తప్పనిసరని తేల్చారు. అరవై రోజుల గడువుతో ఫీజు చెల్లించాలనే షరతుతో విద్యార్థులను తరగతులకు అనుమతించారు. అయితే, తహసీల్దార్ స్కూలు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనీ, అందుకే ఫీజు చెల్లించమంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎందరో ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న విద్యార్థులు ఎక్స్ట్రా ఫీజులతో సతమతమవుతున్నారనీ, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. -
రైలు మిస్సైందా?.. ఏ రైలైనా ఎక్కొచ్చు
అదనపు రుసుములు, రీఫండ్ లేవు న్యూఢిల్లీ: మెయిల్, ఎక్స్‌ప్రెస్ లాంటి సాధారణ రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏప్రిల్ 1 నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణించే అవకాశం పొందొచ్చు. రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పథకం ప్రకారం... నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికులకు అదే మార్గం గుండా వెళ్తున్న తరువాతి ప్రత్యామ్నాయ రైళ్లలో బెర్తులు ఇస్తారు. అయితే రెండింటి చార్జీల మధ్య తేడాలుంటే ప్రయాణికుడి నుంచి ఎలాంటి రుసుములు తీసుకోరు, రీఫండ్ చేయరు. ‘వికల్ప్’గా పిలిచే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే టికెట్ బుక్‌చేసుకునే సమయంలోనే ప్రయాణికుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ప్రత్యామ్నాయ రైలులో సీటు ఖరారైన తరువాత అతని మొబైల్‌కు సందేశం వస్తుంది. ప్రధాన మార్గాల్లో ప్రీమియం రైళ్లు రాజధాని, శతాబ్ది, దురంతో, సువిధ లాంటి వాటిలో ఖాళీగా మిగులుతున్న బెర్తులను నింపడమే లక్ష్యంగా ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఈ పథకం ప్రయాణికుల అనుకూల చర్య అని, నిరీక్షణ జాబితాలో ఉన్న వారికి సీటు ఖరారుచేయడంతో పాటు, అందుబాటులో ఉన్న బెర్తులను సద్వినియోగం చేసుకోవాలనే జంట లక్ష్యాలు దీంతో నెరవేరతాయని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పలు కారణాలతో టికెట్ల రద్దు వల్ల రైల్వే శాఖ ఏటా రీఫండ్ రూపంలో రూ.7500 కోట్లు కోల్పోతోంది. ఫ్లెక్సీ–ఫేర్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత ప్రీమియం రైళ్లలో కొన్ని బెర్తులు ఖాళీగా ఉంటున్నాయి. అదే సమయంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డిమాండ్ ఎక్కువ ఉండటంతో చాలా మందికి బెర్తులు దొరకడం లేదు. ఢిల్లీ–లక్నో, ఢిల్లీ–జమ్మూ, ఢిల్లీ–ముంబై లాంటి మార్గాల్లో నవంబర్ 1 నుంచి ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు. లంచ్‌కు రూ.50.. బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.30 న్యూఢిల్లీ: రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహార పదార్థాల ధరల పట్టికను రైల్వే శాఖ విడుదలచేసింది. ఆహారం, పానీయాలు వంటి వాటికి అధిక ధరలు వసూలుచేస్తున్నా నాసిరకం పదార్థాలు వడ్డిస్తున్నారని ప్రయాణికుల నంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేటరింగ్ సేవల ధరల కార్డును ప్రకటించింది. దీనిలో... అల్పాహారం–రూ.30, నాన్‌వెజ్ అల్పాహారం–రూ.35, లంచ్, డిన్నర్(వెజ్)–రూ.50, నాన్‌వెజ్ లంచ్, డిన్నర్–రూ.55,ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్(1లీ.)–రూ.15, కాఫీ,టీ– రూ.7గా నిర్ణయించారు. జాబితాలో పేర్కొన్న ధరల కన్నా అమ్మకందారులు అధికంగా అడిగితే తమకు ఫిర్యాదుచేయాలని ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించింది. మంగళవారం ఆహార పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం సహాయక బృందాలు, రైల్వే అధికారులతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం తరువాత ఆహార పదార్థాల ధరలను తెలియజేసే ఒక వీడియోను కూడా విడుదల చేశారు. -
ఆ పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి
సాక్షి, హైదరాబాద్: అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు ప్రై వేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు వన్‌టైం స్పెషల్ ఫీజు అంటూ రూ.లక్షలు వసూలు చేస్తున్నాయని, ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమంటూ హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తమకు కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కొన్ని స్కూళ్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎ.సంజీవ్‌కుమార్ స్పందిస్తూ, కొన్ని పాఠశాలలు అసాధారణ రీతిలో ఫీజులు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని తెలిపారు. తాము నిర్వహించిన విచారణలో ఈ విషయం తేలిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలకు నోటీసులు కూడా జారీ చేశామని ఆయన తెలిపారు. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో ఆ వివరాలను తమ ముందుంచాలని సంజీవ్‌కుమార్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. పాఠశాలల్లో ప్రవేశాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని సుదీర్ఘ కాలం పాటు వాయిదా వేయబోమన్న ధర్మాసనం, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.