‘మీసేవ’లో చేతివాటం!   | Collecting Extra fees From Formers In Mee Seva In Adilabad | Sakshi
Sakshi News home page

‘మీసేవ’లో చేతివాటం!  

Published Sat, Jul 6 2019 12:18 PM | Last Updated on Sat, Jul 6 2019 12:19 PM

Collecting Extra fees From Formers In Mee Seva In Adilabad - Sakshi

సాక్షి, నిర్మల్‌(ఆదిలాబాద్‌) : మామడ మండలంలోని పొన్కల్‌ గ్రామానికి చెందిన ఓ రైతు మ్యుటేషన్‌ కోసం జిల్లాకేంద్రంలోని ఓ మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేశాడు. అయితే మీసేవ నిర్వాహకుడు అతడికి రూ.145 రశీదు ఇచ్చి రూ.300 వసూలు చేశాడు. పదే పదే తిరిగే పరిస్థితి లేకపోవడంతో అడిగిన మొత్తం ఇచ్చి పని కానిచ్చుకున్నాడు ఆ రైతు. మీసేవలో పని కోసం వెళ్లే ప్రతీ ఒక్కరూ ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు. మీసేవలో ప్రభుత్వం నిర్దేశించిన చార్జీకి మించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే, ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ తక్కువగా ఉండడంతోనే కాస్త ఎక్కువగా వసూలు చేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పలురకాల సేవలను ప్రజలకు పారదర్శకంగా, సులభంగా, వేగంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

అయితే వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుదారుల వద్ద నుంచి ప్రభుత్వం నిర్దేశించిన దానికి మించి అదనంగా ఫీజు వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఇదేంటని అడిగితే స్టేషనరీ, ఇతర ఖర్చుల నిమిత్తం సర్వీస్‌చార్జీ విధిస్తున్నామని చెబుతున్నారు. ఇదంతా బహిరంగంగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదీ ఇదీ అని కాకుండా ప్రతీ సర్టిఫికెట్‌కు అదనపు చార్జీ వసూలు చేస్తున్నారు. చార్జీలకు సంబంధించిన నిర్దేశిత చార్టు మీసేవలో కళ్లముందు ఉన్నా అవి అలంకారప్రాయంగానే మారాయనే విమర్శలున్నాయి.   

అదనంగా ఇస్తేనే పని... 
మీ సేవ కేంద్రాల ద్వారా 300కు పైగా వివిధ ప్ర భుత్వశాఖల సేవలు ప్రజలకు అందుతున్నాయి. ఇందులో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు భూము లు, వ్యవసాయానికి సంబంధించిన పత్రాల కోసం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. ప్రతీ ధ్రువీకరణపత్రం జారీకి ప్రభుత్వం సర్వీస్‌చార్జీ కింద కొంత మొత్తం ఫీజును నిర్దేశించింది. విద్యార్థులకు ఎక్కువగా నివాసం, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతా యి. ప్రభుత్వం వీటికి రూ.45 ఫీజు విధించింది. అయితే విద్యార్థుల అవసరాన్ని బట్టి నిర్వాహకులు ఇష్టారీతిన అదనపు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలువురు మీసేవ నిర్వాహకులు తహసీల్దార్‌ కార్యాలయాల్లో తమ వారి ద్వారా కూడా పనులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రైతులకు కావాల్సిన పహణీ, 1బీ వంటి వాటికి రూ.35 మాత్రమే వసూలు చేయాలి. కానీ అమాయక రైతుల పరిస్థితిని ఆసరా చేసుకుని నిర్వాహకులు వీటికి రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.  

తనిఖీలు శూన్యం... 
మీసేవ కేంద్రాలపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అలాగే ఇటీవల ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మీ సేవ 2.0 యాప్‌పై  ప్రజలకు అవగాహన కల్పించ డంలో అధికారులు విఫలమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 72మీసేవ కేంద్రాలున్నాయి. ప్రతీరోజు ఒక్కో కేంద్రానికి దాదాపు 50 వరకు దరఖాస్తులు వస్తాయి. ఈ కేంద్రాల తనిఖీల బాధ్యత సంబంధిత తహసీల్దార్లకు ఉం టుంది. కానీ ఆ శాఖ అధికారులు ఎన్నికలు, వివిధ పనుల్లో బిజీగా ఉండడంతో తనిఖీలు చేపట్టడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిన అదనంగా సర్వీస్‌చార్జీ  వసూలు చేస్తున్నారు. 

అదనంగా వసూలు చేస్తే చర్యలు 
మీసేవ కేంద్రాల తనిఖీలు రెవెన్యూ అధికారుల పరిధిలో ఉంది. సంబంధిత తహసీల్దార్‌ తన పరిధిలోని మీసేవ కేంద్రాలను పర్యవేక్షిస్తారు. కేంద్రాల్లో అదనంగా వసూలు చేస్తే దరఖాస్తుదారులు 1100 నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అధికంగా ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు వస్తే సదరు మీసేవ కేంద్రంపై తగిన చర్యలు తీసుకుంటాం.   
– నదీం, జిల్లా ఈ– మేనేజర్, నిర్మల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement