me seva
-
పాస్‌బుక్ కావాలంటే ‘రెవెన్యూ’ ఇచ్చుకోవాల్సిందే!
శ్రీకాళహస్తి మండలం చుక్కలనిడిగల్లుకు చెందిన గురవమ్మకు నలుగురు కుమారులు. వృద్ధురాలు కావడంతో తనపేరున ఉన్న ఎకరం పొలాన్ని కుమారులకు భాగపరిష్కారం చేయాలని భావించారు. పాసుపుస్తకాల కోసం ఇప్పటికే రెండు దఫాలు మీ–సేవలో ఆన్లైన్ చేశారు. సంబంధిత దరఖాస్తులను ఓ రెవెన్యూ ఉద్యోగికి ఇవ్వగా ఆయన వాటిని అప్రూవల్ చేయడానికి రూ.8 వేల వరకు డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేకపోవడంతో ఫైలు పెండింగ్‌లో పడింది. ఆ ఉద్యోగిని ఒత్తిడి చేయగా తన పైఅధికారితో మాట్లాడుకోమని ఉచిత సలహా ఇచ్చాడు. రెండు వారాల నుంచి తిరుగుతున్నా ఆయన కూడా కరుణించడంలేదు. అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో కష్టమని చిర్రుబుర్రులాడినట్లు బాధితురాలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లిదండ్రుల పేరున ఉన్న భూమిని భాగపరిష్కారం చేయడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదని కొందరు రెవెన్యూ అధికారులు చెప్పడం కొసమెరుపు. సాక్షి, చిత్తూరు : పట్టాదారు పాసుపుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులు ప్రతి మండలంలో వందలాది మంది ఉన్నారు. పట్టాదారు పాసుపుస్తకం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా సకాలంలో చేతికందడం లేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ప్రతి పట్టాదారు పుస్తకానికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పుకోవాల్సిన దుస్థితి. అంతపెద్ద మొత్తంలో నగదు ఇచ్చుకోలేని రైతులకు పక్కాగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా పట్టాదారు పుస్తకాలను పొందలేక అవస్థలు పడుతున్నారు. రెవెన్యూలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు మామూళ్లు ఇవ్వందే ఫైళ్లు కదలడం లేదు. వీఆర్ఓ నుంచి తహసీల్దారు వరకు ఆమోదం పొందాల్సి ఉన్నందున అవినీతి తారస్థాయికి చేరుకుంది. జిల్లాలో మొత్తం 6.48 లక్షల మంది రైతులు ఉండగా, రైతు కుటుంబాలు దాదాపు 3.80 లక్షల మేరకు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా భూ విస్తీర్ణంలో మొత్తం 5.40 లక్షల మేరకు సర్వే నంబర్లు ఉన్నాయి. వాటిలో సబ్ డివిజన్లు దాదాపు 7.20 లక్షల మేరకు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములకు సంబంధించి 4.30 లక్షల మేరకు రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారు. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 5.48 లక్షల మేరకు 1బీ ఖాతాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 40 శాతం మేరకు 1బీల్లో సర్వే నంబర్ల తప్పులు, విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ దస్తావేజులతో పనిలేకుండానే, కేవలం 1బీల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు స్వార్థపరులు, టీడీపీ నాయకులు వెబ్‌ల్యాండ్‌లో ఇష్టానుసారంగా సర్వే నంబర్లను నమోదు చేసుకున్నారు. అదేగాక 1బీ ఆధారంగా ఏకంగా ఆ భూములను విక్రయించేశారు. దీంతో వెబ్‌ల్యాండ్‌లోని భూముల వివరాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. చేయి తడపాల్సిందే.. వెబ్‌ల్యాండ్‌లో చోటుచేసుకున్న అవకతవకలను సరిదిద్దుకోవాలన్నా, పట్టాదారు పాసుపుస్తకాలు పొందాలన్నా రెవెన్యూ సిబ్బందికి లంచం ఇచ్చుకోవాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న తప్పులను సరిచేసుకోవాలంటే భూముల హక్కుదారులకు తిప్పలు తప్పడం లేదు. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న 40 రోజుల్లో రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే గడువు పూర్తయినా రెవెన్యూ సిబ్బంది, అధికా రులు పనులు చేయడం లేదు. దీనిపై రైతులు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అధికారులు, సిబ్బందిని కలిస్తే, ఒక్కో సర్వే నంబరుకు రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తేగాని పనులు చేయడానికి ససేమిరా అంటున్నారు. అదేగాక విలువైన భూములకు సంబంధించి సర్వే నంబరుకు ఒక్కింటికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తేనే సమస్యను పరిష్కరి స్తున్నారు. ఇక కొందరు రైతులు ఉమ్మడి కుటుంబం నుంచి భూములను భాగ పరి ష్కారం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నా పట్టాదారు పాసుపుస్తకం కోసం అవస్థలు తప్పడం లేదు. మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ సిబ్బందికి ఒక్కో పట్టాదారు పుస్తకానికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ముట్టజెప్పుకోవాల్సిందే. ఒకవేళ విలువైన భూములైతే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సమర్పించాల్సిందే. ఇంటి యజమాని మరణిస్తే, ఆయనకు సంబం ధించిన పట్టాదారు పాసుపుస్తకంలో సంబంధీకుల పేరుకు మార్పు చేయాలంటే ఒక్కో పుస్తకానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సమర్పించుకోవాల్సిందే. కోర్టులు ఆదేశించినా.. తగాదాలు ఉన్న భూములకు సంబంధించి కోర్టులు తీర్పులిచ్చినా పట్టాదారు పుస్తకాలు పొందలేక రైతులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న వెబ్‌ల్యాండ్‌లో అక్రమాల కారణంగా పలువురు రైతులు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. కొందరు స్వార్థపరులు తమకు భూములు లేకున్నా, ఇతరుల భూములను రెవెన్యూ సిబ్బంది సహకారంతో Ððð బ్ల్యాండ్లో నమోదు చేయించుకున్న దాఖలాలు కోకొల్లలు. దీంతో రిజిస్టర్ దస్తావేజులు ఉన్న భూ యజమానులు ప్రశ్నిస్తే ఆక్రమణదారులు ఏకంగా 1బీ మేరకు అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా కోర్టులను ఆశ్రయించారు. దీంతో అసలైన భూ యజమానులు ఆర్డీఓ, జేసీ కోర్టులను ఆశ్రయించి నకిలీ పట్టాదారు పుస్తకాలను రద్దుచేస్తూ తీర్పులను తెచ్చుకుంటున్నారు. ఈ తీర్పుల మేరకు రెవెన్యూ సిబ్బంది భూ యజమానులకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలన్నా ముడుపులు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. ఒక్కో పట్టాదారు పాసుపుస్తకానికి రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఇవ్వాల్సిందే. లేదంటే ఇచ్చిన తీర్పులపై కూడా పలు సాకులు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఏకంగా వారి ప్రత్యర్థులను రెవెన్యూ కోర్టులు ఇచ్చిన తీర్పుపై మరో ఉన్నత కోర్టును ఆశ్రయించేలా సలహాలు ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
‘మీసేవ’లో చేతివాటం!
సాక్షి, నిర్మల్(ఆదిలాబాద్) : మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన ఓ రైతు మ్యుటేషన్ కోసం జిల్లాకేంద్రంలోని ఓ మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేశాడు. అయితే మీసేవ నిర్వాహకుడు అతడికి రూ.145 రశీదు ఇచ్చి రూ.300 వసూలు చేశాడు. పదే పదే తిరిగే పరిస్థితి లేకపోవడంతో అడిగిన మొత్తం ఇచ్చి పని కానిచ్చుకున్నాడు ఆ రైతు. మీసేవలో పని కోసం వెళ్లే ప్రతీ ఒక్కరూ ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు. మీసేవలో ప్రభుత్వం నిర్దేశించిన చార్జీకి మించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే, ప్రభుత్వం ఇచ్చే కమీషన్ తక్కువగా ఉండడంతోనే కాస్త ఎక్కువగా వసూలు చేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పలురకాల సేవలను ప్రజలకు పారదర్శకంగా, సులభంగా, వేగంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుదారుల వద్ద నుంచి ప్రభుత్వం నిర్దేశించిన దానికి మించి అదనంగా ఫీజు వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఇదేంటని అడిగితే స్టేషనరీ, ఇతర ఖర్చుల నిమిత్తం సర్వీస్‌చార్జీ విధిస్తున్నామని చెబుతున్నారు. ఇదంతా బహిరంగంగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదీ ఇదీ అని కాకుండా ప్రతీ సర్టిఫికెట్‌కు అదనపు చార్జీ వసూలు చేస్తున్నారు. చార్జీలకు సంబంధించిన నిర్దేశిత చార్టు మీసేవలో కళ్లముందు ఉన్నా అవి అలంకారప్రాయంగానే మారాయనే విమర్శలున్నాయి. అదనంగా ఇస్తేనే పని... మీ సేవ కేంద్రాల ద్వారా 300కు పైగా వివిధ ప్ర భుత్వశాఖల సేవలు ప్రజలకు అందుతున్నాయి. ఇందులో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు భూము లు, వ్యవసాయానికి సంబంధించిన పత్రాల కోసం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. ప్రతీ ధ్రువీకరణపత్రం జారీకి ప్రభుత్వం సర్వీస్‌చార్జీ కింద కొంత మొత్తం ఫీజును నిర్దేశించింది. విద్యార్థులకు ఎక్కువగా నివాసం, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతా యి. ప్రభుత్వం వీటికి రూ.45 ఫీజు విధించింది. అయితే విద్యార్థుల అవసరాన్ని బట్టి నిర్వాహకులు ఇష్టారీతిన అదనపు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలువురు మీసేవ నిర్వాహకులు తహసీల్దార్ కార్యాలయాల్లో తమ వారి ద్వారా కూడా పనులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రైతులకు కావాల్సిన పహణీ, 1బీ వంటి వాటికి రూ.35 మాత్రమే వసూలు చేయాలి. కానీ అమాయక రైతుల పరిస్థితిని ఆసరా చేసుకుని నిర్వాహకులు వీటికి రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తనిఖీలు శూన్యం... మీసేవ కేంద్రాలపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అలాగే ఇటీవల ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మీ సేవ 2.0 యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించ డంలో అధికారులు విఫలమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 72మీసేవ కేంద్రాలున్నాయి. ప్రతీరోజు ఒక్కో కేంద్రానికి దాదాపు 50 వరకు దరఖాస్తులు వస్తాయి. ఈ కేంద్రాల తనిఖీల బాధ్యత సంబంధిత తహసీల్దార్లకు ఉం టుంది. కానీ ఆ శాఖ అధికారులు ఎన్నికలు, వివిధ పనుల్లో బిజీగా ఉండడంతో తనిఖీలు చేపట్టడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిన అదనంగా సర్వీస్‌చార్జీ వసూలు చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తే చర్యలు మీసేవ కేంద్రాల తనిఖీలు రెవెన్యూ అధికారుల పరిధిలో ఉంది. సంబంధిత తహసీల్దార్ తన పరిధిలోని మీసేవ కేంద్రాలను పర్యవేక్షిస్తారు. కేంద్రాల్లో అదనంగా వసూలు చేస్తే దరఖాస్తుదారులు 1100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అధికంగా ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు వస్తే సదరు మీసేవ కేంద్రంపై తగిన చర్యలు తీసుకుంటాం. – నదీం, జిల్లా ఈ– మేనేజర్, నిర్మల్ -
మీ సేవలు బుట్ట దాఖలు
ఒంగోలు టౌన్ : జిల్లాలోని మీ సేవ కేంద్రాలకు వచ్చే అర్జీల్లో అధిక శాతం బుట్టదాఖలవుతున్నాయి. ప్రజలు తమకు కావలసిన సర్టిఫికెట్లను మీ సేవ కేంద్రాల ద్వారా పొందాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న తరువాత రోజుల తరబడి వాటి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. మీ సేవ కేంద్రాల నుంచి సంబంధిత శాఖలకు ఆ అర్జీలు వెళ్లినప్పటికీ అక్కడి అధికారులు వాటిని పక్కన పెట్టడంతో మీ సేవ కేంద్రాల ఉద్దేశం నీరుగారిపోతోంది. ఈ–సేవ కేంద్రాలుగా కొనసాగుతున్న వాటిని మీ–సేవ కేంద్రాలుగా మారుస్తూ 2011లో ఉన్న అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పేరు మార్చినప్పటికీ తీరు మారలేదు. సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో సంబంధిత శాఖల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పైపెచ్చు ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్న సర్టిఫికెట్ల పరిష్కారం కంటే వాటిని రిజక్ట్(తిరస్కరణ) చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా గణాంకాలు ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని ఈ–సేవ కేంద్రాలు 2011 నవంబర్ 4వ తేదీ మీ సేవ కేంద్రాలుగా మారాయి. అయితే వాటి ద్వారా అందించే సేవల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించకపోగా, మరింత జాప్యం, తిరస్కరణ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 429 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. ఏపీ ఆన్లైన్ కింద 60 కేంద్రాలు, కార్వే సంస్థకు సంబంధించి 76 కేంద్రాలు, సీఎంఎస్‌కు సంబంధించి 293 కేంద్రాలు ఉన్నాయి. కార్వే సంస్థ మీ సేవ కేంద్రాలు అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలకు, సీఎంఎస్ సంస్థకు సంబం«ధించిన మీ సేవ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఏపీ ఆన్లైన్ ద్వారా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మీ సేవ కేంద్రాలకు వచ్చే అర్జీలను ఏ, బీ కేటగిరీలుగా విభజించి వాటిని సంబంధిత అధికారులకు వాటి నిర్వాహకులు పంపిస్తుంటారు. ఏ–కేటగిరీ అర్జీలను ఎలాంటి విచారణ లేకుండా అప్పటికప్పుడే అందించాల్సి ఉంటుంది. బీ–కేటగిరీ అర్జీలను సంబంధిత శాఖలు విచారణ జరిపిన అనంతరం నిర్ణీత గడువులోగా అర్జీదారులకు మీ సేవ కేంద్రాల ద్వారా అందించాలి. 2011 నవంబర్ 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏ, బీ కేటగిరీలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన అర్జీల్లో 4,42, 096 అర్జీలు తిరస్కరించారు. 2017 మార్చి 1 నుంచి 2018 మార్చి 1వ తేదీ వరకు ఒక్క సంవత్సర కాలంలోనే 89,542 అర్జీలను తిరస్కరణకు గురికావడం చూస్తుంటే మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంపట్ల సంబంధిత అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మీ సేవ మా పనికాదు: అనేక శాఖలకు సంబంధించిన సర్టిఫికెట్లను మీ సేవ కేంద్రాల ద్వారా పొందేలా ప్రభుత్వం నిబంధనలు విధించింది. రెవెన్యూ శాఖకు సంబంధించి 71 రకాల సేవలు, వ్యవసాయ శాఖకు సంబంధించి 36 రకాల సేవలు, ట్రాన్స్‌కోకు చెందిన 34 రకాల సేవలు పొందేలా మీ సేవ కేంద్రాలకు రూపకల్పన చేశారు. వీటితోపాటు అనేక శాఖలకు సంబంధించిన సేవలను కూడా మీ సేవ కేంద్రాల ద్వారా రుసుం చెల్లించి నిర్ణీత గడువులోగా పొందేలా సిటిజన్ ఛార్టర్ను ఏర్పాటు చేశారు. అయితే సిటిజన్ ఛార్టర్ ప్రకారం సర్టిíఫికెట్లు పొందినవారి సంఖ్య చాలా స్వల్పంగానే ఉంటుంది. అందుకు కారణం మీ సేవ కేంద్రాల నుంచి సంబంధిత శాఖలకు అర్జీలు వెళ్లిన వెంటనే అక్కడి అధికారులు వాటిని పక్కన పడేస్తున్నారు. అర్జీదారుల అత్యవసరాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన క్యాస్ట్, ఇన్‌కం తదితర అత్యవసర సర్టిఫికెట్లు పొందాలంటే మీకోసంలో దరఖాస్తు చేసుకున్న తరువాత, సంబంధిత వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి అక్కడ రాయ్ఙబేరాలు’ సాగిస్తుండటం బహిరంగ రహస్యమే. ఇక రైతులకు సంబంధించి భూ హక్కుల పత్రాలు పొందాలంటే రైతులు నేరుగా రెవెన్యూ అధికారులను కలిసి వారికి తృణమో ఫలమో సమర్పించుకుంటేగాని ఆ పత్రాలు రావన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. “మీ సేవ మా పని కాదు’ అన్నట్లుగా మీ సేవ కేంద్రాల పనితీరు ఉంది. నిర్లక్ష్యానికి నిదర్శనం: మీ సేవ కేంద్రాల ద్వారా వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా వాటిని సకాలంలో ఇవ్వకుండా తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వాటిని పొందలేకపోతున్నారు. జిల్లాలో 4792 అర్జీలు గడువు దాటినవి ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రతి సోమవారం మీ కోసం, మీ సేవ కేంద్రాలకు వచ్చిన అర్జీల గురించి సమీక్షించడం తప్పితే జాప్యానికి కారణం అవుతున్న శాఖల అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో నిర్లక్ష్యం పెరిగిపోతోంది. ఇప్పటికైనా కలెక్టర్ మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకుంటే ప్రజలకు సకాలంలో సేవలు అందుతాయి. లేకుంటే ప్రజలకు వ్యయ ప్రయాసలు తప్పవు. మీ సేవ అర్జీలు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు మీ సేవ కేంద్రాలకు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ సేవ కేంద్రాల్లో శాఖల వారీగా ఎన్ని అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయో వివరాలను సేకరించి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశాం. – ప్రభాకరరెడ్డి, ఇన్చార్జి జేసీ మూడు నెలల కిందట దరఖాస్తు చేసినా పరిష్కారం కాలేదు ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుతో రేషన్‌షాపునకు వెళ్లి నిత్యావసర వస్తువులు ఇవ్వాలని అడిగితే కార్డు ల్యాప్స్ అయిందని చెప్పారు. దీంతో తర్లుపాడులోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లగా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మూడు నెలల కిందట రేషన్‌కార్డు లోని లోపాలను సరిచేసి మళ్లీ నాకు ఉపయోగపడేలా ఇవ్వాలని మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా. ఇదే విషయాన్ని తహశీల్దార్ కార్యాలయంలో తెలిపాను. ఇంత వరకు నా అర్జీ పరిష్కారం కాలేదు. – జి.రంగారెడ్డి, నాయుడుపల్లె , తర్లుపాడు మండలం -
ఏపీలో నాలుగు రోజులుగా ‘ఆధార్’ బంద్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ సేవలు నిలిచిపోయాయి. మీ సేవా కేంద్రాలకు వెళ్లిన ప్రజలకు సర్వర్ కనెక్ట్ కావడం లేదన్న జవాబు మీ-సేవ కేంద్రాల నిర్వాహకులనుంచి వినవస్తోంది. దీంతో నాలుగు రోజులుగా ఆధార్‌కు సంబంధించి వివిధ సమస్యలపై ప్రజలు మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. సర్వర్ ఎప్పుడు కనెక్టు అవుతుంది.. తమ సమస్యల పరిష్కారం ఎప్పటికి అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా, తప్పుడు ఐడిలతో ఆధార్ అక్రమాలు జరుగుతుండడంతో యుఐడి అధికారులకు అందిన ఫిర్యాదులతో ఆధార్ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే కిందిస్థాయిలో ఈ సమాచారం లేకపోవడంతో గందరగోళం నెలకొంది. -
‘మీ సేవ’లో ఆధార్
జిల్లాలో ‘మీసేవ’ను ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాలుగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో ఆధార్ నమోదును ఎప్పుడైనా చేసుకునే అవకాశం లభించింది. జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో.. నల్లగొండలో 2, సూర్యాపేటలో 2, మిర్యాలగూడ, భువనగిరిలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 6 మీ సేవ కేంద్రాలు నడుస్తుండగా, కేవలం పట్టణ ప్రాంతాల్లోనే మరో 46 కేంద్రాలు ప్రైవేటు భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయి. అదే విధంగా ఏపీ ఆన్లైన్ కింద 190 మీ సేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అంటే జిల్లాలో మొత్తం 242 మీ సేవ కేంద్రాల ద్వారా ఇప్పటికే కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు రెవెన్యూ, ఇతరత్రా కొన్ని ప్రభుత్వ శాఖల కార్యకలాపాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల బ్యాంకు, పింఛన్, గ్యాస్ సబ్సిడీలతో పాటు ప్రభుత్వ పథకాలు ‘ఆధార్’తో అనుసంధానం చేశారు. కాగా ఆధార్ నమోదు తో పాటు స్మార్ట్‌కార్డు, అభయహస్తం వంటి కా ర్యక్రమాలు కూడా మీసేవలో పొందుపర్చి ప్రజ లకు సేవలందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఆధార్ నమోదుకు అవస్థలు జిల్లాలో ఆధార్ నమోదుకు ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఈ కేంద్రాల వద్ద రకరకాల సమస్యలతో ప్రజలు నానా అవస్థలు పడి చివరకు ఆధార్ కార్డు కూడా వద్దనే పరిస్థితికి చేరుకున్నారు. ఆధార్ నమోదుకు ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు ఇవ్వడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక కారణాలు, మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో ఇప్పటికీ ఆధార్ కార్డులు దిగనివారు చాలా మంది ఉన్నారు. జిల్లాలో 34లక్షల జనాభాకు గాను పలు విడతలుగా ఇప్పటి వరకు 29.43లక్షల పైచిలుకు జనాభాకు సంబంధించి ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ కల్లా 9,75000 వ్యక్తులకు సంబంధించిన ఆధార్ నమోదును చేపట్టగా, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2,17, 220 వ్యక్తుల నమోదు చేపట్టారు. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్ ద్వారా 17,00795 వ్యక్తుల నమోదు ప్రక్రియ చేపట్టారు. ఇదిలా ఉండగా తాజాగా జిల్లాలో ఏర్పాటు చేసి న 52 కేంద్రాల ద్వారా 50వేల వ్యక్తుల నమోదు తోడు కావడంతో గురువారం వరకు మొత్తంగా 29,43,015 నమోదు పూర్తయింది. మిగిలిన 4,56,085 వ్యక్తుల నమోదు చేపట్టాల్సి ఉంది. ఇక నుంచి ఇబ్బందులు కలగకుండా ఉండేం దుకు ప్రభుత్వం ‘మీసేవ’తో ఆధార్‌నమోదును అనుసంధానం చేయడానికి ఉపక్రమించింది. దీని కోసం మీ సేవ నిర్వాహకులకు ఆధార్ న మోదుకు అవసరమైన శిక్షణ, పరీక్షలు జరి పింది. అక్టోబర్ మొదటివారం నుంచి ఆధార్ నమోదును మీ సేవకు అనుసంధానం చేయవచ్చునని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఒకవేళ సాంకేతికపరమైన సమస్యలుఎదురైతే ప్రభుత్వ కేంద్రాల్లో తొలుత ఆ తర్వాత ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే కేంద్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. సబ్సిడీ పర్మిట్లు కూడా.. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పర్మిట్లను ‘మీసేవ’ ద్వారా ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. రానున్న రబీ సీజన్ నుంచి రైతులకు పర్మిట్లు మీ సేవ కేంద్రాల నుంచి ఇచ్చేందుకు అవసరమైన చర్యలను ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో కేవలం రెవెన్యూపరమైన పనులకే పరిమితం అనుకున్న ‘మీసేవ’ కేంద్రాలు ఇక వ్యవసాయ పర్మిట్లు, ఆధార్, స్మార్ట్‌కార్డు, అభయహస్తం తదితర ప్రభుత్వ కార్యకలాపాల నమోదుతో బిజీ బిజీగా మారనున్నాయి.