పాస్‌బుక్‌ కావాలంటే ‘రెవెన్యూ’ ఇచ్చుకోవాల్సిందే! | Revenue Department Troubles Farmers In Chittoor By Not Giving To Pass Books | Sakshi
Sakshi News home page

పాస్‌బుక్‌ కావాలంటే ‘రెవెన్యూ’ ఇచ్చుకోవాల్సిందే!

Published Thu, Sep 12 2019 8:40 AM | Last Updated on Thu, Sep 12 2019 8:40 AM

Revenue Department Troubles Farmers In Chittoor By Not Giving To Pass Books  - Sakshi

శ్రీకాళహస్తి మండలం చుక్కలనిడిగల్లుకు చెందిన గురవమ్మకు నలుగురు కుమారులు. వృద్ధురాలు కావడంతో తనపేరున ఉన్న ఎకరం పొలాన్ని కుమారులకు భాగపరిష్కారం చేయాలని భావించారు. పాసుపుస్తకాల కోసం ఇప్పటికే రెండు దఫాలు మీ–సేవలో ఆన్‌లైన్‌ చేశారు. సంబంధిత దరఖాస్తులను ఓ రెవెన్యూ ఉద్యోగికి ఇవ్వగా ఆయన వాటిని అప్రూవల్‌ చేయడానికి రూ.8 వేల వరకు డిమాండ్‌ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేకపోవడంతో ఫైలు పెండింగ్‌లో పడింది. ఆ ఉద్యోగిని ఒత్తిడి చేయగా తన పైఅధికారితో మాట్లాడుకోమని ఉచిత సలహా ఇచ్చాడు. రెండు వారాల నుంచి తిరుగుతున్నా ఆయన కూడా కరుణించడంలేదు. అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో కష్టమని చిర్రుబుర్రులాడినట్లు బాధితురాలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లిదండ్రుల పేరున ఉన్న భూమిని భాగపరిష్కారం చేయడానికి రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని కొందరు రెవెన్యూ అధికారులు చెప్పడం కొసమెరుపు.

సాక్షి, చిత్తూరు :  పట్టాదారు పాసుపుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులు ప్రతి మండలంలో వందలాది మంది ఉన్నారు. పట్టాదారు పాసుపుస్తకం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా సకాలంలో చేతికందడం లేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ప్రతి పట్టాదారు పుస్తకానికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పుకోవాల్సిన దుస్థితి. అంతపెద్ద మొత్తంలో నగదు ఇచ్చుకోలేని రైతులకు పక్కాగా రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉన్నా పట్టాదారు పుస్తకాలను పొందలేక అవస్థలు పడుతున్నారు. రెవెన్యూలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు మామూళ్లు ఇవ్వందే ఫైళ్లు కదలడం లేదు. వీఆర్‌ఓ నుంచి తహసీల్దారు వరకు ఆమోదం పొందాల్సి ఉన్నందున అవినీతి తారస్థాయికి చేరుకుంది.  జిల్లాలో మొత్తం 6.48 లక్షల మంది రైతులు ఉండగా, రైతు కుటుంబాలు దాదాపు 3.80 లక్షల మేరకు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా భూ విస్తీర్ణంలో మొత్తం 5.40 లక్షల మేరకు సర్వే నంబర్లు ఉన్నాయి.

వాటిలో సబ్‌ డివిజన్లు దాదాపు 7.20 లక్షల మేరకు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములకు సంబంధించి 4.30 లక్షల మేరకు రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారు. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 5.48 లక్షల మేరకు 1బీ ఖాతాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 40 శాతం మేరకు 1బీల్లో సర్వే నంబర్ల తప్పులు, విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్‌ దస్తావేజులతో పనిలేకుండానే,  కేవలం 1బీల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు స్వార్థపరులు, టీడీపీ నాయకులు వెబ్‌ల్యాండ్‌లో ఇష్టానుసారంగా సర్వే నంబర్లను నమోదు చేసుకున్నారు. అదేగాక 1బీ ఆధారంగా ఏకంగా ఆ భూములను విక్రయించేశారు. దీంతో వెబ్‌ల్యాండ్‌లోని భూముల వివరాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

చేయి తడపాల్సిందే..
వెబ్‌ల్యాండ్‌లో చోటుచేసుకున్న అవకతవకలను సరిదిద్దుకోవాలన్నా, పట్టాదారు పాసుపుస్తకాలు పొందాలన్నా రెవెన్యూ సిబ్బందికి లంచం ఇచ్చుకోవాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న తప్పులను సరిచేసుకోవాలంటే భూముల హక్కుదారులకు తిప్పలు తప్పడం లేదు. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న 40 రోజుల్లో రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే గడువు పూర్తయినా రెవెన్యూ సిబ్బంది, అధికా రులు పనులు చేయడం లేదు. దీనిపై రైతులు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అధికారులు, సిబ్బందిని కలిస్తే, ఒక్కో సర్వే నంబరుకు రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తేగాని పనులు చేయడానికి ససేమిరా అంటున్నారు. అదేగాక విలువైన భూములకు సంబంధించి సర్వే నంబరుకు ఒక్కింటికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తేనే సమస్యను పరిష్కరి స్తున్నారు.

ఇక కొందరు రైతులు ఉమ్మడి కుటుంబం నుంచి భూములను  భాగ పరి ష్కారం చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా పట్టాదారు పాసుపుస్తకం కోసం అవస్థలు తప్పడం లేదు. మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ సిబ్బందికి ఒక్కో పట్టాదారు పుస్తకానికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ముట్టజెప్పుకోవాల్సిందే. ఒకవేళ విలువైన భూములైతే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సమర్పించాల్సిందే. ఇంటి యజమాని మరణిస్తే, ఆయనకు సంబం ధించిన పట్టాదారు పాసుపుస్తకంలో సంబంధీకుల పేరుకు మార్పు చేయాలంటే ఒక్కో పుస్తకానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సమర్పించుకోవాల్సిందే. 

కోర్టులు ఆదేశించినా..
తగాదాలు ఉన్న భూములకు సంబంధించి కోర్టులు తీర్పులిచ్చినా పట్టాదారు పుస్తకాలు పొందలేక రైతులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న వెబ్‌ల్యాండ్‌లో అక్రమాల కారణంగా పలువురు రైతులు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. కొందరు స్వార్థపరులు తమకు భూములు లేకున్నా, ఇతరుల భూములను రెవెన్యూ సిబ్బంది సహకారంతో Ððð బ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకున్న దాఖలాలు కోకొల్లలు. దీంతో రిజిస్టర్‌ దస్తావేజులు ఉన్న భూ యజమానులు ప్రశ్నిస్తే ఆక్రమణదారులు ఏకంగా 1బీ మేరకు అన్‌రిజిస్టర్‌ డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా కోర్టులను ఆశ్రయించారు.

దీంతో అసలైన భూ యజమానులు ఆర్డీఓ, జేసీ కోర్టులను ఆశ్రయించి నకిలీ పట్టాదారు పుస్తకాలను రద్దుచేస్తూ తీర్పులను తెచ్చుకుంటున్నారు. ఈ తీర్పుల మేరకు రెవెన్యూ సిబ్బంది భూ యజమానులకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలన్నా ముడుపులు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. ఒక్కో పట్టాదారు పాసుపుస్తకానికి రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఇవ్వాల్సిందే. లేదంటే ఇచ్చిన తీర్పులపై కూడా పలు సాకులు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఏకంగా వారి ప్రత్యర్థులను రెవెన్యూ కోర్టులు ఇచ్చిన తీర్పుపై మరో ఉన్నత కోర్టును ఆశ్రయించేలా సలహాలు ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement