తిరుపతి డివిజన్‌లోని అకారంపల్లె రెవెన్యూ దాఖలాల్లో గొల్లవానిగుంట పరిధిలో మాజీ సైనికుడికి 1993లో 72/12 సర్వే నంబర్‌లో మూడు సెంట్ల ఇంటి పట్టా ఇచ్చారు. టీడీపీ పాలనలో ఓ వ్యక్తి దొంగపట్టాలు సృష్టించి ఆ భూమిని కబ్జా చేశాడు. ఈ సమస్యపై బాధితులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందనలో అర్జీని జూలై 22న అందజేశారు. అయితే ఇప్పటివరకు వారి సమస్య సమస్యగానే ఉంది.
రెవెన్యూ సమస్యలను పరిశీలించి పరిష్కరించాలన్న సదుద్దేశంతో ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ నెల 24వ తేదీన జిల్లాకు విచ్చేశారు. ఈ నెల 25న తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆయన దృష్టికి జిల్లాలోని రెవెన్యూ శాఖలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ ఇస్తున్న ప్రత్యేక కథనం.
చిత్తూరు రూరల్ మండలంలోని బండపల్లె గ్రామానికి చెందిన రైతు రామయ్య తన భూమికి సరిహద్దులు కొలవాలని దరఖాస్తు చేసుకున్నాడు. చిత్తూరు తహసీల్దార్ కార్యాలయంలోని సర్వేయర్ ఆ రైతు భూమిని కొలవకుండా అలసత్వం చేస్తూనే వచ్చాడు. రైతు ఒత్తిడి తెచ్చేసరికి ప్రభుత్వ సర్వేయర్ అసిస్టెంట్‌గా పెట్టుకున్న ప్రైవేటు సర్వేయర్‌ను రైతు గ్రామానికి పంపి సరిహద్దులు కొలిపించారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజలకు సేవలు అందించాల్సిన రెవెన్యూ ఉద్యోగి బినామీ ఉద్యోగులతో కుమ్మకైఇలాంటి పనులు చేయ డంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : క్షేత్రస్థాయిలో ప్రజలకు రెవెన్యూ శాఖ ద్వారా అందే సేవలను పారదర్శకంగా అందించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదే పదే అధికారులకు సూచిస్తున్నారు. రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ సేవలు పొందాలంటే ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని, ఎవరైన లంచం అడిగితే నేరుగా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబర్‌ను ప్రారంభించారు.
సమస్యల పరిష్కారంపై అలసత్వం
ఈ నెల 23వ తేదీ వరకు జిల్లాలో జరిగిన స్పందన కార్యక్రమాలకు రెవెన్యూ సమస్యలపై 10,242 అర్జీలను ప్రజలు అందజేశారు. అందులో అధికారులు 35 శాతం వరకు మాత్రమే సమస్యలను పరిష్కరించారు. మిగిలిన 65 శా తం సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఉద్యోగుల విచారణ కేసులు పెండింగ్
జిల్లాలోని రెవెన్యూశాఖల్లో చిన్న చిన్న ఆరోపణలతో సస్పెండైన రెవెన్యూ ఉద్యోగుల విచారణ కేసులు సంవత్సరాల కొద్ది పెండింగ్‌లో ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 122 వరకు ఉద్యోగుల సస్పెండ్ కేసుల విచారణ పూర్తి కాని పరిస్థితి.
అస్తవ్యస్తంగా రికార్డులు
రెవెన్యూ శాఖలో భూమి రికార్డులను సరిగ్గా నిర్వహించలేకపోతుండడంతో భూ సమస్యలు రోజురోజుకు అధికమవుతున్నాయి. రికార్డులను డిజిటలైజేషన్ చేసినప్పటికీ సమగ్ర సమాచారం లేకపోవడంతో బోగస్ పట్టాలు పుట్టుకొస్తున్నాయి. జిల్లాలో పలు చోట్ల మృతి చెందిన పట్టాదారులు ఇప్పటికీ పట్టాదారులుగానే చెలామణి అవుతున్నారు. వెబ్‌ల్యాండ్, మ్యూటేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తే రైతులకు, పౌరులకు మేలు జరుగుతుందని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు.
ఆరోపణలు వచ్చినా.. చర్యలు శూన్యం
రెండు నెలల క్రితం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎ త్తున ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతులు, వీఆర్వో, వీఆర్‌ఏల బదిలీలను నిర్వహించారు. ఈ బదిలీలను కలెక్టరేట్ అధికారులు నిబంధనల ప్రకారం నిర్వహించకపోవడంతో పలు ఆరోపణలు వెలువెత్తాయి. వీఆర్వో, వీఆర్‌ఏ బదిలీల్లో కలెక్టరేట్ లోని ఓ అధికారి చేతివాటంతో ఇష్టానుసారం బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైనప్పటికీ ఉన్నతాధికారులు నోరుమెదపని పరిస్థితి. నిబంధనల ప్రకా రం బదిలీలు చేసి ఉంటే ఆ కొరత ఉండేది కాదు.
Comments
Please login to add a commentAdd a comment