రైలు మిస్సైందా?.. ఏ రైలైనా ఎక్కొచ్చు
అదనపు రుసుములు, రీఫండ్ లేవు
న్యూఢిల్లీ: మెయిల్, ఎక్స్‌ప్రెస్ లాంటి సాధారణ రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏప్రిల్ 1 నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణించే అవకాశం పొందొచ్చు. రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పథకం ప్రకారం... నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికులకు అదే మార్గం గుండా వెళ్తున్న తరువాతి ప్రత్యామ్నాయ రైళ్లలో బెర్తులు ఇస్తారు. అయితే రెండింటి చార్జీల మధ్య తేడాలుంటే ప్రయాణికుడి నుంచి ఎలాంటి రుసుములు తీసుకోరు, రీఫండ్ చేయరు. ‘వికల్ప్’గా పిలిచే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే టికెట్ బుక్‌చేసుకునే సమయంలోనే ప్రయాణికుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ప్రత్యామ్నాయ రైలులో సీటు ఖరారైన తరువాత అతని మొబైల్‌కు సందేశం వస్తుంది. ప్రధాన మార్గాల్లో ప్రీమియం రైళ్లు రాజధాని, శతాబ్ది, దురంతో, సువిధ లాంటి వాటిలో ఖాళీగా మిగులుతున్న బెర్తులను నింపడమే లక్ష్యంగా ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఈ పథకం ప్రయాణికుల అనుకూల చర్య అని, నిరీక్షణ జాబితాలో ఉన్న వారికి సీటు ఖరారుచేయడంతో పాటు, అందుబాటులో ఉన్న బెర్తులను సద్వినియోగం చేసుకోవాలనే జంట లక్ష్యాలు దీంతో నెరవేరతాయని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
పలు కారణాలతో టికెట్ల రద్దు వల్ల రైల్వే శాఖ ఏటా రీఫండ్ రూపంలో రూ.7500 కోట్లు కోల్పోతోంది. ఫ్లెక్సీ–ఫేర్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత ప్రీమియం రైళ్లలో కొన్ని బెర్తులు ఖాళీగా ఉంటున్నాయి. అదే సమయంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డిమాండ్ ఎక్కువ ఉండటంతో చాలా మందికి బెర్తులు దొరకడం లేదు. ఢిల్లీ–లక్నో, ఢిల్లీ–జమ్మూ, ఢిల్లీ–ముంబై లాంటి మార్గాల్లో నవంబర్ 1 నుంచి ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు.
లంచ్‌కు రూ.50.. బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.30
న్యూఢిల్లీ: రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహార పదార్థాల ధరల పట్టికను రైల్వే శాఖ విడుదలచేసింది. ఆహారం, పానీయాలు వంటి వాటికి అధిక ధరలు వసూలుచేస్తున్నా నాసిరకం పదార్థాలు వడ్డిస్తున్నారని ప్రయాణికుల నంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేటరింగ్ సేవల ధరల కార్డును ప్రకటించింది. దీనిలో... అల్పాహారం–రూ.30, నాన్‌వెజ్ అల్పాహారం–రూ.35, లంచ్, డిన్నర్(వెజ్)–రూ.50, నాన్‌వెజ్ లంచ్, డిన్నర్–రూ.55,ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్(1లీ.)–రూ.15, కాఫీ,టీ– రూ.7గా నిర్ణయించారు. జాబితాలో పేర్కొన్న ధరల కన్నా అమ్మకందారులు అధికంగా అడిగితే తమకు ఫిర్యాదుచేయాలని ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించింది. మంగళవారం ఆహార పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం సహాయక బృందాలు, రైల్వే అధికారులతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం తరువాత ఆహార పదార్థాల ధరలను తెలియజేసే ఒక వీడియోను కూడా విడుదల చేశారు.