vikalp
-
రైలు మిస్సైందా?.. ఏ రైలైనా ఎక్కొచ్చు
అదనపు రుసుములు, రీఫండ్ లేవు న్యూఢిల్లీ: మెయిల్, ఎక్స్‌ప్రెస్ లాంటి సాధారణ రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏప్రిల్ 1 నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణించే అవకాశం పొందొచ్చు. రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పథకం ప్రకారం... నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికులకు అదే మార్గం గుండా వెళ్తున్న తరువాతి ప్రత్యామ్నాయ రైళ్లలో బెర్తులు ఇస్తారు. అయితే రెండింటి చార్జీల మధ్య తేడాలుంటే ప్రయాణికుడి నుంచి ఎలాంటి రుసుములు తీసుకోరు, రీఫండ్ చేయరు. ‘వికల్ప్’గా పిలిచే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే టికెట్ బుక్‌చేసుకునే సమయంలోనే ప్రయాణికుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ప్రత్యామ్నాయ రైలులో సీటు ఖరారైన తరువాత అతని మొబైల్‌కు సందేశం వస్తుంది. ప్రధాన మార్గాల్లో ప్రీమియం రైళ్లు రాజధాని, శతాబ్ది, దురంతో, సువిధ లాంటి వాటిలో ఖాళీగా మిగులుతున్న బెర్తులను నింపడమే లక్ష్యంగా ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఈ పథకం ప్రయాణికుల అనుకూల చర్య అని, నిరీక్షణ జాబితాలో ఉన్న వారికి సీటు ఖరారుచేయడంతో పాటు, అందుబాటులో ఉన్న బెర్తులను సద్వినియోగం చేసుకోవాలనే జంట లక్ష్యాలు దీంతో నెరవేరతాయని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పలు కారణాలతో టికెట్ల రద్దు వల్ల రైల్వే శాఖ ఏటా రీఫండ్ రూపంలో రూ.7500 కోట్లు కోల్పోతోంది. ఫ్లెక్సీ–ఫేర్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత ప్రీమియం రైళ్లలో కొన్ని బెర్తులు ఖాళీగా ఉంటున్నాయి. అదే సమయంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డిమాండ్ ఎక్కువ ఉండటంతో చాలా మందికి బెర్తులు దొరకడం లేదు. ఢిల్లీ–లక్నో, ఢిల్లీ–జమ్మూ, ఢిల్లీ–ముంబై లాంటి మార్గాల్లో నవంబర్ 1 నుంచి ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు. లంచ్‌కు రూ.50.. బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.30 న్యూఢిల్లీ: రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహార పదార్థాల ధరల పట్టికను రైల్వే శాఖ విడుదలచేసింది. ఆహారం, పానీయాలు వంటి వాటికి అధిక ధరలు వసూలుచేస్తున్నా నాసిరకం పదార్థాలు వడ్డిస్తున్నారని ప్రయాణికుల నంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేటరింగ్ సేవల ధరల కార్డును ప్రకటించింది. దీనిలో... అల్పాహారం–రూ.30, నాన్‌వెజ్ అల్పాహారం–రూ.35, లంచ్, డిన్నర్(వెజ్)–రూ.50, నాన్‌వెజ్ లంచ్, డిన్నర్–రూ.55,ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్(1లీ.)–రూ.15, కాఫీ,టీ– రూ.7గా నిర్ణయించారు. జాబితాలో పేర్కొన్న ధరల కన్నా అమ్మకందారులు అధికంగా అడిగితే తమకు ఫిర్యాదుచేయాలని ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించింది. మంగళవారం ఆహార పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం సహాయక బృందాలు, రైల్వే అధికారులతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం తరువాత ఆహార పదార్థాల ధరలను తెలియజేసే ఒక వీడియోను కూడా విడుదల చేశారు. -
లేటైనా బెర్తు ఖాయం
హైదరాబాద్ : వందల్లో వెయిటింగ్ లిస్టు, చివరి క్షణం వరకు బెర్తు దొరుకుతుందో లేదో తెలియదు, చార్ట్ సిద్ధం చేసేవరకు పడిగాపులు.. తీరా చార్ట్ సిద్ధమై, బెర్తు దొరక్క ప్రయాణం రద్దు చేసుకోవలసి వస్తే బాధనిపిస్తుంది. బుక్ చేసుకున్న రైల్లో కాకపోయినా సరే ఆ తరువాత వచ్చే ట్రైన్‌లోనైనా బెర్తు లభిస్తే చాలుననుకొనే వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే మరో అవకాశాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఢిల్లీ-జమ్ము, ఢిల్లీ-లక్నో మార్గాల్లో విజయవంతంగా అమలవుతున్న ‘వికల్ప్’ పథకాన్ని హైదరాబాద్ ప్రయాణికులకు అందుబాటులోకి తేనుం ది. దీంతో రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి కొంత వరకు ఊరట లభించనుం ది. ఇందుకోసం ప్రయాణికులు టిక్కెట్ బుక్ చేసుకొనే సమయంలోనే ‘ఆల్టర్నేట్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్ (ఏటీఏఎస్) ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీం తో తాము బుక్ చేసుకున్న ట్రైన్లో వెయిటింగ్ లిస్టు కారణంగా బెర్తు లభించకపోయినప్పటికీ తరువాత 12 గంటల్లో అదే మార్గంలో వెళ్లే రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉంటే వారికి కేటాయిస్తారు. కోటా దుర్వినియోగానికి కళ్లెం... అత్యవసర పరిస్థితుల్లో కేటాయించే ఎమర్జెన్సీ కోటా బెర్తులు తరచూ దుర్వినియోగం కావడంతో ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారం, పది రోజుల ముందే టిక్కెట్ బుక్ చేసుకున్నా బెర్తులు దక్కడం లేదు. సాధారణంగా ఎమర్జెన్సీ కోటా కింద స్లీపర్‌క్లాసు లో 30 నుంచి 40 బెర్తులు, థర్డ్ ఏసీలో 6, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలో 4 చొప్పున బెర్తులు కేటాయిస్తారు. ఎంపీ లు, మంత్రులు, వీఐపీల కోసం, అత్యవసర సమయా ల్లో ప్రయాణించాల్సిన రైల్వే అధికారులు, లొకోపెలైట్ల కోసం వీటిని కేటాయిస్తారు. అయితే కొందరు వ్యక్తులు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పేరిట తప్పుడు పద్ధతుల్లో లేఖలు సంపాదించి ఎమర్జెన్సీ బెర్తులను కాజేయడం, మరి కొన్ని సందర్భాల్లో రైల్వే అధికారులు తమ వారి కోసం బెర్తులను కేటాయిం చడం వల్ల పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతున్నట్లు రైల్వేశాఖ గుర్తిం చింది. దీనిని అరికట్టి అర్హులైన ప్రయాణికులు ఈ కోటాను సద్వినియోగం చేసుకొనేందుకు వీలుగా ‘వికల్ప్’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ జమ్ము, ఢిల్లీ-లక్నో మార్గాల్లో ఈ పథకం విజ యవంతం కావడంతో దక్షిణమధ్య రైల్వేలోనూ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వికల్ప్ ఇలా.... ఈ పథకం అన్ని ఎక్స్‌ప్రెస్/మెయిల్ సర్వీసులకు వర్తిస్తుంది. ప్రయాణికులు టిక్కెట్ బుక్ చేసుకొనే సమయంలోనే ‘ఆల్టర్నేట్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్ (ఏటీఏఎస్)ను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం అదనపు చార్జీలు ఉండవు. అలాగే టిక్కెట్ చార్జీల్లో తేడా ఉంటే ఈ మొత్తాన్ని తిరిగి ప్రయాణికుడి ఖాతాలో జమచేస్తారు. ఏటీఏఎస్ ఆప్షన్ ఎంపిక చేసుకున్న ప్రయాణికులు తాము బుక్ చేసుకున్న ట్రైన్ చార్ట్ సిద్ధమైన తరువాత కూడా పీఎన్ఆర్ స్టేటస్‌ను తెలుసుకోవాలి. ఈ పథకం కింద టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు అనూహ్యంగా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుం టే నిర్ధారిత టిక్కెట్‌గానే పరిగణించి టిక్కెట్ సొమ్ము చెల్లింపుల్లో కోత విధిస్తారు. ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం : ఉమాశంకర్‌కుమార్, సీపీఆర్వో ఈ పథకం వల్ల వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి మరో అవకాశం లభిస్తుంది. దక్షిణమధ్య రైల్వేలో దీని అమలు కోసం సమాలోచనలు జరుగుతున్నాయి. ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమలుకు కొంత సమయం పట్టవచ్చు.