లేటైనా బెర్తు ఖాయం
హైదరాబాద్ : వందల్లో వెయిటింగ్ లిస్టు, చివరి క్షణం వరకు బెర్తు దొరుకుతుందో లేదో తెలియదు, చార్ట్ సిద్ధం చేసేవరకు పడిగాపులు.. తీరా చార్ట్ సిద్ధమై, బెర్తు దొరక్క ప్రయాణం రద్దు చేసుకోవలసి వస్తే బాధనిపిస్తుంది. బుక్ చేసుకున్న రైల్లో కాకపోయినా సరే ఆ తరువాత వచ్చే ట్రైన్‌లోనైనా బెర్తు లభిస్తే చాలుననుకొనే వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే మరో అవకాశాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం ఢిల్లీ-జమ్ము, ఢిల్లీ-లక్నో మార్గాల్లో విజయవంతంగా అమలవుతున్న ‘వికల్ప్’ పథకాన్ని హైదరాబాద్ ప్రయాణికులకు అందుబాటులోకి తేనుం ది. దీంతో రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి కొంత వరకు ఊరట లభించనుం ది. ఇందుకోసం ప్రయాణికులు టిక్కెట్ బుక్ చేసుకొనే సమయంలోనే ‘ఆల్టర్నేట్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్ (ఏటీఏఎస్) ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీం తో తాము బుక్ చేసుకున్న ట్రైన్‌లో వెయిటింగ్ లిస్టు కారణంగా బెర్తు లభించకపోయినప్పటికీ తరువాత 12 గంటల్లో అదే మార్గంలో వెళ్లే రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉంటే వారికి కేటాయిస్తారు.
కోటా దుర్వినియోగానికి కళ్లెం...
అత్యవసర పరిస్థితుల్లో కేటాయించే ఎమర్జెన్సీ కోటా బెర్తులు తరచూ దుర్వినియోగం కావడంతో ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారం, పది రోజుల ముందే టిక్కెట్ బుక్ చేసుకున్నా బెర్తులు దక్కడం లేదు. సాధారణంగా ఎమర్జెన్సీ కోటా కింద స్లీపర్‌క్లాసు లో 30 నుంచి 40 బెర్తులు, థర్డ్ ఏసీలో 6, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలో 4 చొప్పున బెర్తులు కేటాయిస్తారు. ఎంపీ లు, మంత్రులు, వీఐపీల కోసం, అత్యవసర సమయా ల్లో ప్రయాణించాల్సిన రైల్వే అధికారులు, లొకోపెలైట్ల కోసం వీటిని కేటాయిస్తారు.
అయితే కొందరు వ్యక్తులు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పేరిట తప్పుడు పద్ధతుల్లో లేఖలు సంపాదించి ఎమర్జెన్సీ బెర్తులను కాజేయడం, మరి కొన్ని సందర్భాల్లో రైల్వే అధికారులు తమ వారి కోసం బెర్తులను కేటాయిం చడం వల్ల పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతున్నట్లు రైల్వేశాఖ గుర్తిం చింది. దీనిని అరికట్టి అర్హులైన ప్రయాణికులు ఈ కోటాను సద్వినియోగం చేసుకొనేందుకు వీలుగా ‘వికల్ప్’ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఢిల్లీ జమ్ము, ఢిల్లీ-లక్నో మార్గాల్లో ఈ పథకం విజ యవంతం కావడంతో దక్షిణమధ్య రైల్వేలోనూ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వికల్ప్ ఇలా....
ఈ పథకం అన్ని ఎక్స్‌ప్రెస్/మెయిల్ సర్వీసులకు వర్తిస్తుంది.
ప్రయాణికులు టిక్కెట్ బుక్ చేసుకొనే సమయంలోనే ‘ఆల్టర్నేట్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్ (ఏటీఏఎస్)ను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం అదనపు చార్జీలు ఉండవు. అలాగే టిక్కెట్ చార్జీల్లో తేడా ఉంటే ఈ మొత్తాన్ని తిరిగి ప్రయాణికుడి ఖాతాలో జమచేస్తారు.
ఏటీఏఎస్ ఆప్షన్ ఎంపిక చేసుకున్న ప్రయాణికులు తాము బుక్ చేసుకున్న ట్రైన్ చార్ట్ సిద్ధమైన తరువాత కూడా పీఎన్‌ఆర్ స్టేటస్‌ను తెలుసుకోవాలి.
ఈ పథకం కింద టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు అనూహ్యంగా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుం టే నిర్ధారిత టిక్కెట్‌గానే పరిగణించి టిక్కెట్ సొమ్ము చెల్లింపుల్లో కోత విధిస్తారు.
ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం : ఉమాశంకర్‌కుమార్, సీపీఆర్వో
ఈ పథకం వల్ల వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి మరో అవకాశం లభిస్తుంది. దక్షిణమధ్య రైల్వేలో దీని అమలు కోసం సమాలోచనలు జరుగుతున్నాయి. ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమలుకు కొంత సమయం పట్టవచ్చు.