children rights
-
బాల్యాన్ని బందీ కానీయొద్దు.. బాల్య వివాహాల చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
వికారాబాద్ అర్బన్: బాల్య వివాహాల నివారణ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జూలై మాసంలో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితంలో బాల్యం చాలా గొప్పదన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో జూలై 31లోపు అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పిల్లల సంక్షేమ కమిటీ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలన్నారు. పిల్లలకు మంచి జీవితాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కొంత కటువుగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఈ విషయంలో అధికారులకు ఏదైనా సమస్య ఎదురైతే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. తప్పిపోయిన పిల్లల విషయంలో చైల్డ్‌లైన్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జూలై 9న జరిగే సమావేశానికి గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివి పైచదువులకు వెళ్లని విద్యార్థినుల జాబితా సేకరించి తీసుకురావాలని డీఈఓను ఆదేశించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ చట్టం పరిధిలో పనిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా సంబంధిత సెక్రటరీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యాన్ని బందీ కానీయొద్దని.. బడీడు పిల్లలందరూ పాఠశాలలో ఉండేలా చూడాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అనంతరం దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ రూపొందించిన పలు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ లలితకుమారి, డీఆర్ఓ అశోక్‌కుమార్, డీఎంహెచ్ఓ పాల్వాన్ కుమార్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి బాలలు – రేపటి పౌరులేనా?
నేడు బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంద ర్భంగా మైకు పట్టిన ప్రతి ఒక్కరం బాలలే భావి భారత పౌరులం అని అంటారు. కానీ ఆ భావి భారత పౌరుల స్థితి గతులు చూస్తే మాత్రం తల్లి గర్భం నుండి బయటపడక ముందే వారు ఆడా, మొగా అనే వివక్షతో తల్లి గర్భంలోనే చిదిమేస్తున్నాం. ఇక ఈ అవాంతరాన్ని దాటుకొని భూమిపైకి వస్తే వారే కోరుకొని ఈ నేలపైకి వచ్చినట్లు పంచాంగ పండితులు ఈ ఘడియలో, ఆతిధిలో పుట్టారు వీరు వారికి అరిష్టం, అష్టదరిద్రం అని ఎలాంటి తల, తోకా లేని అశాస్త్రీయమైన శాస్త్రీయాన్ని ముందుకు తెచ్చి పూర్తి కుటుంబం ముక్కు పచ్చలారని ఆ చిన్నారులను ద్వేషించేలా చూస్తాం. ఇక పిల్లల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో రాసుకున్నాము కానీ ఏ ఒక్కటీ ఆచరణలో పెట్టక వారిని సరైన వైద్యానికీ, పౌష్టికాహారానికీ, గౌరవంగా బతికే పరిస్థితికీ దూరం చేస్తున్నాం కనీసం వారికి రక్షిత మంచినీరు అందించడం చేత గాక అనేక వ్యాధుల పాలు చేస్తున్నాం. నినాదాల్లో మాత్రం ‘‘బేటీ పడావ్ – బేటీ బచావ్’’ అని కారు కూతలు పెడుతున్నాముగాని చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మంచి నీరు గానీ, శౌచాలయాలుగానీ లేకపోవడంతో బడి మధ్యలో మానేసి బాల కార్మికులుగా, బాలికా వధువులుగా మారుతున్నవారి శాతం దేశంలో 18పైగానే వుందంటే మీకు నినాదమే తప్ప ఈ సమస్యను అధిగమించడానికి విధానం లేదన్నది తెలుస్తున్నది. పిల్లల మీద పెద్దలకు ఎంత ప్రేమ వున్నదంటే గత ఆరు సంవత్సరాల నుండి బాలల దినోత్సవం నాడు మన ప్రధాని మోడీజీ విదేశాలలోనే వుంటున్నారు గాని కనీసం బాలల దినోత్సవం నాడు దేశంలోని చిన్నారులను ఆశీర్వదించడానికి మనసు రావడం లేదంటే ఆనినాదంలో నిజాయితీ లేదని ఇట్టే తెలసిపోతున్నది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పిల్లల కోసం ఆలోచించి అక్షరాస్యత పెంపొందించడంతో పాటు బడా బాబుల పిల్లలతో సరితూగేలాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన మొదలు పెడతామంటే, పేదవారికి ఇంగ్లీషు ఎందుకు వారు బాలకార్మికులుగా బతకడమే సరి అనుకున్నారేమోగానీ కొందరు పెద్ద మనుషులు ఇంగ్లీషు బోధనకు అడ్డు చెబుతూ తెలుగు భాషపై ఎనలేని ప్రేమ ఒలక బోస్తున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీషు బడులు వద్దంటే వద్దని మొండి వాదనలు చేస్తూ, వారు పెంచి పోషించిన ప్రైవేటు, కార్పోరేటు విద్యా సంస్థలకు కాపలా కుక్కలుగా నిలచిన వీరు పేద పిల్లలకు ఇంగ్లీష్ వద్దంటే వద్దని ఎక్కడ పడితే అక్కడ వాదిస్తున్నారు. ఇక పద్దెనిమిది సంవత్సరాలకే ఆడ పిల్లలకు వివాహం వద్దని, పద్దెనిమిది సంవత్సరాలకు కనీసం గ్రాడ్యుయేషన్ కూడా చేయలేరని పెళ్ళి జరిగితే భర్తపై పరాన్నజీవిగా బతకాల్సి వస్తుందని, స్త్రీకి ఆర్థిక సాధికారత వుండాలని స్త్రీ పురుషుల సమానత్వం కోసం అమ్మాయిల కనీక వివాహ వయస్సు ఇరువై ఒక్క సంవత్సరాలుగా చేయాలని బాలల హక్కుల సంఘం అరిచి గీ పెడితే, స్త్రీ, పురుష సమానత్వం పేరున పురుషుల వయస్సును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గిస్తామని ఆలోచిస్తున్నారు. మన కేంద్ర పెద్దలు, ఇదే కనక జరిగితే పద్దెనిమిది సంవత్సరాలకే భార్యా భర్తలై, చదువుకు దూరమై సంపాదన లేక పిల్లల్ని మాత్రం కని బికారుల్లా రోడ్లపైన పడితే, వారందరికి సకుటుంబ అనాధ ఆశ్రమాలు కట్టించాల్సి రావడమే కాకుండా మాతా, శిశు మరణాలు పెరిగి, మానసిక శారీరక వికలాంగులైన పిల్లలు జన్మిస్తే ఇక రేపటి పౌరులు ఎలాంటి జవ సత్వాలు లేక మహాకవి గురజాడ చెప్పినట్లు ‘ఈసురోమని మనుషులుంటే – దేశమేగతి బాగుపడునోయ్’’ అన్నట్లు ఈ దేశం మరో ఇథోపియో కాకమానదు. కే్రంద ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసేటప్పుడు దేశంలోని పిల్లలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం నాలుగు ఓట్లు సంపాదిస్తే చాలు సీట్లో కూర్చోవచ్చన్న ఆలోచనలు చేసి పెళ్ళి చేసుకోండి,డబ్బులిస్తాం అంటే, పెళ్ళి చేసుకోండి కానీ చదివి బాగుపడి స్వంత కాళ్ళపై నిలబడకండి మేము వేసే బిచ్చాలతో దంపతులై విద్యలేక, ఆరోగ్యం లేక ప్రజలందరూ కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా తయారవమని సలçహా ఇవ్వడమేకాని మరోటికాదు. చిన్న పిల్లల, విద్యార్థుల అభివృద్ధి కోసం పథకాలు చేపట్టి అమలు చేస్తున్న వారిని అడ్డుకోవడం పక్కన బెట్టి, ఆరోగ్యకరమైన సలహాలు ఇచ్చి, ఇటు పాలక పక్షం, అటు ప్రతిపక్షంలో వున్న వారు నిజాయితీగా ఆలోచించి పిల్లల విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆట పాటలు వారి గౌరవం కోసం పాటు పడిన నాడే నేటి బాలలే రేపటి పౌరులు అని నిజాయితీగా అనే రోజు వస్తుంది. లేదంటే కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతాం. (నేడు బాలల దినోత్సవం) అచ్యుతరావు గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం 931024242 -
శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ : శిశు విక్రయాలు జరుపుతున్న ఓ ముఠాను బాలల హక్కుల సంఘం అధికారులు, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహాయంతో పట్టుకున్నారు. అనంతరం నిందితులను సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నట్లు బాలల హక్కుల సంఘం అధికారులకు తెలియడంతో, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఈ ముఠా వద్ద నుంచి రూ.80 వేల నగదు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. సరూర్ నగర్ లిమిట్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విచారణలో మరి కొందరు ముఠా సభ్యులు బయట పడే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలల హక్కులను పరిరక్షించుకుందాం
వైవీయూ: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఎస్. మురళీధర్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో బాలికలపై వివక్ష నేటికీ కొనసాగడం బాధాకరమన్నారు. బాలల హక్కులను పరిరక్షించడంలో చిత్తశుద్ధి, సమన్వయం ఎంతో కీలకమన్నారు. చిన్నారుల హక్కుల ఉల్లంఘనలను నిర్మూలించేందుకు బాలల హక్కుల పరిరక్షణకై నిరంతర ప్రజా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్టెప్ సీఈఓ మమత మాట్లాడుతూ తల్లిగా, చెల్లిగా, భార్యగా పలు రూపాల్లో సేవలందించే మహిళలపై వివక్ష వీడాలన్నారు. భ్రూణహత్యలను ఆదిలోనే అడ్డుకునే విధంగా అందరిలో చైతన్యం పెంపొందించాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. సుబ్బలక్షుమ్మ మాట్లాడుతూ దేశం ప్రగతి, సౌభాగ్యంలో స్త్రీ, పురుషులిద్దరూ రెండు చక్రాల వంటి వారన్నారు. ఏ ఒక్కరి సమతుల్యత దెబ్బతిన్నా ప్రగతి రథం ముందుకు నడవడం కష్టమన్నారు. అనంతరం ఆర్తీ ఫౌండేషన్ నిర్వాహకురాలు పి.వి. సంధ్య, ఐసీడీఎస్ అధికారి అరుణకుమారి, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక ప్రతినిధి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారులు వివిధ దేశనాయకుల వేషధారణలతో హాజరై అలరించారు. కళాశాల మహిళా సాధికారత విభాగం నిర్వాహకురాలు యుగళవాణి, రాజశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాలల హక్కుల్ని ఎలా పరిరక్షిస్తున్నారు?
* సోషియాలజీ విద్యార్థులను ప్రశ్నించిన విదేశీ ప్రతినిధులు * ఏఎన్‌యూను సందర్శించిన బృందం గుంటూరు (ఏఎన్‌యూ) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాన్ని శుక్రవారం ఆస్ట్రియా, జర్మనీ దేశాల సోషల్ వర్క్ విద్యార్థులు, సామాజిక కార్యకర్తల బృందం సందర్శించింది. విజయవాడలోని నవజీవన్ బాలభవన్ స్వచ్ఛంద సంస్థకు ఇంటెన్షిప్ కోసం వచ్చిన పై దేశాలకు చెందిన బెట్టీనా ఐచ్చింగర్, లూకాస్ హీగల్స్బర్గర్, రెబ్కా హంబర్గ్, మైఖేల్ స్టిచ్, క్రిస్టియన్ వెయిల్గునిలు సోషియాలజీ విద్యార్థులతో చర్చించేందుకు ఏఎన్‌యూకి వచ్చారు. భారతదేశంలోని సామాజిక అంశాలు, చట్టాల గురించి తెలుసుకున్నారు. బాలల హక్కులు, వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ వర్కర్ల పాత్రపై అధ్యాపకులు, విద్యార్థులతో చర్చించారు. కార్యక్రమంలో సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగ ఇన్చార్జి కో–ఆర్డినేటర్ డాక్టర్ సరస్వతిరాజు అయ్యర్, అధ్యాపకులు డాక్టర్ వి.వెంకటేశ్వర్లు, నవజీవన్ బాలభవన్ కో–ఆర్డినేటర్ భాను, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్ సందర్శన అనంతరం ఆస్ట్రియా, జర్మనీ దేశాల ప్రతినిధులు ఏఎన్‌యూలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్‌ను సందర్శించారు. ఇక్కడ చదువుతున్న వివిధ దేశాల విద్యార్థులను కలిసి వారి చదువులు, కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. స్టూడెంట్ సెల్ అడిషనల్ డైరెక్టర్ ఆచార్య ఆంజనేయులు ఏఎన్‌యూలో విదేశీ విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, విద్యాపరమైన చర్యలను బృందానికి వివరించారు. -
'40 ఏళ్లుగా గుడికెళ్లడం లేదు'
తాను దేవుళ్లను పూజించనని బాలబంధు, నోబెల్ శాంతి పురస్కార విజేత కైలాష్ సత్యార్థి తెలిపారు. పిల్లలు దేవుళ్లకు ప్రతిరూపాలని చెప్పారు. వారి స్వేచ్ఛా, బాల్యాన్ని కాపాడడమే తన భక్తి మార్గమని వెల్లడించారు. తాను గత 40 ఏళ్లుగా ఆలయాలకు లేదా మసీదులకు వెళ్లలేదని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బాలలే తన బలమని అన్నారు. ఇంజినీరింగ్ కెరీర్ ను వదులుకున్నప్పుడు తన తల్లి కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.... 'నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నేను ఉద్యోగాన్ని వదులుకున్నప్పుడు ఆమె చాలా బాధపడింది. ఏదో ఒక రోజు నన్ను చూసి గర్వపడతావని అప్పుడు మా అమ్మతో చెప్పా. వ్యక్తిగతంగా ఆడంబరాలు, అవార్డులు, పురస్కారాలు నాకు ఇష్టం ఉండవు. ఐక్యరాజ్యసమితి కంటే ముందుగా 1981లో బాలల హక్కుల కోసం గళం విప్పాను. 1989 నుంచి బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. ఈ విషయాలన్ని నోబెల్ కమిటీ పరిశీలించింది. నోబెల్ శాంతి పురస్కారంతో పాటు వచ్చే నగదు ఏవిధంగా ఖర్చు చేయాలనే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 400 మంది బాలలతో కూడిన బాల మహాపంచాయతీ నిర్ణయం మేరకు నిధులు ఖర్చుచేస్తాం. ప్రతిపైసా చిన్నారుల సంక్షేమం కోసం ఉపయోగపడాలన్నదే నా ఆకాంక్ష. మేము కొత్తగా చేపట్టిన 'పీస్ ఫర్ చిల్డ్రన్' కార్యక్రమంలో చేరాలని నాతో కలిసి నోబెల్ శాంతి పురస్కారం గెల్చుకున్న పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ ను ఆహ్వానించాను. భారత్, పాకిస్థాన్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా చిన్నారులు శాంతియుత వాతావరణంలోనే పెరగాలి. మాలాలా అంటే నాకెంతో గౌరవం. పాకిస్థాన్ లో బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక పోరాటాలకు నేను మద్దతుపలికే నాటికి ఆమె ఇంకా పుట్టనేలేదు. 1987లో పాకిస్థాన్ సైన్యం నన్ను లాహోర్ వెలుపల మట్టుబెట్టాలని చూసింది. ఇటుక తయారీ కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా పాకిస్థాన్ సైనికులు వచ్చి నా తలపై తుపాకులు ఎక్కుపెట్టారు. నేను చిరునవ్వు నవ్వాను. కొన్ని నిమిషాలు ఆగితే నా ప్రసంగం పూర్తవుతుంది తర్వాత నన్ను చంపండి అని సమాధానమిచ్చాను. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భావిస్తున్నాం. టీ అమ్మే స్థాయిని నుంచి దేశానికి ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగానని మోడీ చెబుతున్నారు. ఇక ఏ చిన్నారి బాలకార్మికుడిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ప్రతి కుర్రాడు దేశ ప్రధాని కాలేడు. కానీ ప్రతి పిల్లాడు స్కూల్ కు వెళ్లగలడు. మంచి విద్య పొందగలడు' అని కైలాష్ సత్యార్థి అన్నారు.