నేడు బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంద ర్భంగా మైకు పట్టిన ప్రతి ఒక్కరం బాలలే భావి భారత పౌరులం అని అంటారు. కానీ ఆ భావి భారత పౌరుల స్థితి గతులు చూస్తే మాత్రం తల్లి గర్భం నుండి బయటపడక ముందే వారు ఆడా, మొగా అనే వివక్షతో తల్లి గర్భంలోనే చిదిమేస్తున్నాం. ఇక ఈ అవాంతరాన్ని దాటుకొని భూమిపైకి వస్తే వారే కోరుకొని ఈ నేలపైకి వచ్చినట్లు పంచాంగ పండితులు ఈ ఘడియలో, ఆతిధిలో పుట్టారు వీరు వారికి అరిష్టం, అష్టదరిద్రం అని ఎలాంటి తల, తోకా లేని అశాస్త్రీయమైన శాస్త్రీయాన్ని ముందుకు తెచ్చి పూర్తి కుటుంబం ముక్కు పచ్చలారని ఆ చిన్నారులను ద్వేషించేలా చూస్తాం.
ఇక పిల్లల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో రాసుకున్నాము కానీ ఏ ఒక్కటీ ఆచరణలో పెట్టక వారిని సరైన వైద్యానికీ, పౌష్టికాహారానికీ, గౌరవంగా బతికే పరిస్థితికీ దూరం చేస్తున్నాం కనీసం వారికి రక్షిత మంచినీరు అందించడం చేత గాక అనేక వ్యాధుల పాలు చేస్తున్నాం. నినాదాల్లో మాత్రం ‘‘బేటీ పడావ్ – బేటీ బచావ్’’ అని కారు కూతలు పెడుతున్నాముగాని చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మంచి నీరు గానీ, శౌచాలయాలుగానీ లేకపోవడంతో బడి మధ్యలో మానేసి బాల కార్మికులుగా, బాలికా వధువులుగా మారుతున్నవారి శాతం దేశంలో 18పైగానే వుందంటే మీకు నినాదమే తప్ప ఈ సమస్యను అధిగమించడానికి విధానం లేదన్నది తెలుస్తున్నది. పిల్లల మీద పెద్దలకు ఎంత ప్రేమ వున్నదంటే గత ఆరు సంవత్సరాల నుండి బాలల దినోత్సవం నాడు మన ప్రధాని మోడీజీ విదేశాలలోనే వుంటున్నారు గాని కనీసం బాలల దినోత్సవం నాడు దేశంలోని చిన్నారులను ఆశీర్వదించడానికి మనసు రావడం లేదంటే ఆనినాదంలో నిజాయితీ లేదని ఇట్టే తెలసిపోతున్నది.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పిల్లల కోసం ఆలోచించి అక్షరాస్యత పెంపొందించడంతో పాటు బడా బాబుల పిల్లలతో సరితూగేలాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన మొదలు పెడతామంటే, పేదవారికి ఇంగ్లీషు ఎందుకు వారు బాలకార్మికులుగా బతకడమే సరి అనుకున్నారేమోగానీ కొందరు పెద్ద మనుషులు ఇంగ్లీషు బోధనకు అడ్డు చెబుతూ తెలుగు భాషపై ఎనలేని ప్రేమ ఒలక బోస్తున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీషు బడులు వద్దంటే వద్దని మొండి వాదనలు చేస్తూ, వారు పెంచి పోషించిన ప్రైవేటు, కార్పోరేటు విద్యా సంస్థలకు కాపలా కుక్కలుగా నిలచిన వీరు పేద పిల్లలకు ఇంగ్లీష్ వద్దంటే వద్దని ఎక్కడ పడితే అక్కడ వాదిస్తున్నారు.
ఇక పద్దెనిమిది సంవత్సరాలకే ఆడ పిల్లలకు వివాహం వద్దని, పద్దెనిమిది సంవత్సరాలకు కనీసం గ్రాడ్యుయేషన్ కూడా చేయలేరని పెళ్ళి జరిగితే భర్తపై పరాన్నజీవిగా బతకాల్సి వస్తుందని, స్త్రీకి ఆర్థిక సాధికారత వుండాలని స్త్రీ పురుషుల సమానత్వం కోసం అమ్మాయిల కనీక వివాహ వయస్సు ఇరువై ఒక్క సంవత్సరాలుగా చేయాలని బాలల హక్కుల సంఘం అరిచి గీ పెడితే, స్త్రీ, పురుష సమానత్వం పేరున పురుషుల వయస్సును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గిస్తామని ఆలోచిస్తున్నారు. మన కేంద్ర పెద్దలు, ఇదే కనక జరిగితే పద్దెనిమిది సంవత్సరాలకే భార్యా భర్తలై, చదువుకు దూరమై సంపాదన లేక పిల్లల్ని మాత్రం కని బికారుల్లా రోడ్లపైన పడితే, వారందరికి సకుటుంబ అనాధ ఆశ్రమాలు కట్టించాల్సి రావడమే కాకుండా మాతా, శిశు మరణాలు పెరిగి, మానసిక శారీరక వికలాంగులైన పిల్లలు జన్మిస్తే ఇక రేపటి పౌరులు ఎలాంటి జవ సత్వాలు లేక మహాకవి గురజాడ చెప్పినట్లు ‘ఈసురోమని మనుషులుంటే – దేశమేగతి బాగుపడునోయ్’’ అన్నట్లు ఈ దేశం మరో ఇథోపియో కాకమానదు. కే్రంద ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసేటప్పుడు దేశంలోని పిల్లలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం నాలుగు ఓట్లు సంపాదిస్తే చాలు సీట్లో కూర్చోవచ్చన్న ఆలోచనలు చేసి పెళ్ళి చేసుకోండి,డబ్బులిస్తాం అంటే, పెళ్ళి చేసుకోండి కానీ చదివి బాగుపడి స్వంత కాళ్ళపై నిలబడకండి మేము వేసే బిచ్చాలతో దంపతులై విద్యలేక, ఆరోగ్యం లేక ప్రజలందరూ కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా తయారవమని సలçహా ఇవ్వడమేకాని మరోటికాదు.
చిన్న పిల్లల, విద్యార్థుల అభివృద్ధి కోసం పథకాలు చేపట్టి అమలు చేస్తున్న వారిని అడ్డుకోవడం పక్కన బెట్టి, ఆరోగ్యకరమైన సలహాలు ఇచ్చి, ఇటు పాలక పక్షం, అటు ప్రతిపక్షంలో వున్న వారు నిజాయితీగా ఆలోచించి పిల్లల విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆట పాటలు వారి గౌరవం కోసం పాటు పడిన నాడే నేటి బాలలే రేపటి పౌరులు అని నిజాయితీగా అనే రోజు వస్తుంది. లేదంటే కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతాం. (నేడు బాలల దినోత్సవం)
అచ్యుతరావు
గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం
931024242
Comments
Please login to add a commentAdd a comment