భద్రత లేని బాల్యం | Achyutha Rao Article On Childhood Security In Sakshi | Sakshi

భద్రత లేని బాల్యం

Aug 16 2018 1:54 AM | Updated on Aug 16 2018 1:54 AM

Achyutha Rao Article On Childhood Security In Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బాల్యం బాగుంటేనే భవిష్యత్తులో పౌరులు బాగుంటారు. లేకుంటే ఆరోగ్యపరంగా, విద్యాప రంగా వెనుకబడిన పౌరులతో దేశం మొత్తం బల హీనంగా తయారౌతుందని అందరికీ తెలుసు కానీ ఈ బాల్యానికి భద్రత అనేది మాత్రం అందని ద్రాక్షలాగానే తయారైంది. ఈ బాధ్యత ఇక్కడ, అక్కడ అని కాకుండా తల్లి ఒడి నుంచి పాఠశాలల దాకా అవసరం కానీ మన చిన్నా రులకు తల్లి గర్భం నుండే భద్రత కరువౌతున్న వాదనకు రెండు తెలుగు రాష్ట్రాలలో బయటపడ్డ సరోగసీ రాకెట్, పిల్లల అక్రమ రవాణా కేసుల్లో ఈ రెండు రాష్ట్రాలు మొదటి, రెండు స్థానాల్లో నిలుస్తున్నాయని కేంద్ర నివేదికనే చెప్పింది.

అలాగే యాదాద్రి ఘటన, హైదరాబాద్‌లో పాఠశాలలు కూలి పిల్లలు మృతి చెందడం, వీధి కుక్కల బారిన పడటం, పాఠశాల బస్సు ప్రమా దాల్లో మృతి చెందటం, బాల కార్మిక వ్యవస్థ మొదలగు అవలక్షణాలు ఓ వైపైతే, మైనర్‌గా ఉండి గర్భం రావ డమో, నమ్మినవాడు మోసం చేయ డమో, కట్టుకున్న వాడు గెంటేయ డమో ఇత్యాది కారణాలతో తల్లులు పసిబిడ్డలను మురికి కాలువల్లో, ముళ్ల పొదల్లో వేస్తుండటం మరో అవలక్షణం. అనాథలందరినీ అక్కున చేర్చుకోవడానికి ‘ఊయల’ పథకం ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు..

తెలంగాణ రాష్ట్రంలో 455 అనాథ పిల్లల పునరావాస కేంద్రాలున్నాయనీ 15,500 మంది పిల్లలు తలదాచుకుంటున్నారని తెలియజెప్పిన అధికారులు అనధికారికంగా రెండు వేలకు పైగా ఉన్న అనాథాశ్రమాల విధి, విధానాలన్నీ పక్కన బెట్టి వాటి జాడే మాకు తెలియదని నిస్సిగ్గుగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమశాఖ కనీసం కాకి లెక్కలైనా ఇచ్చిందిగానీ, ఏపీ ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలు కూడా లేవు.

అనాథాశ్రమాల్లో పిల్లలతో బిచ్చం ఎత్తిం చడం, వ్యభిచార కలాపాలకు తరలించడం, కనీస వసతులు కల్పించకపోవడం యథేచ్ఛగా సాగు తుంటే ఆ ఆశ్రమ నిర్వాహకులకు అయినవారి అండదండలు ఉండటంతో పిల్లలకన్నా ఓటర్లు ముఖ్యమనే భావనతో పిల్లలందరినీ ప్రభు త్వాలు, అధికారులు గాలికి వదిలేశారు.

ఇక విద్యారంగంలో చూస్తే, సేవా రంగంలో ఉండాల్సిన విద్యారంగం వ్యాపార రంగంగా మారిపోతే చదువు చెప్పకపోయినా పర్వాలేదు చంపకుంటే చాలు అనే భావన తల్లిదండ్రుల్లో కలి గినా విద్యాశాఖలు కార్పొరేటు విద్యాసంస్థల దరువుకు నృత్యం చేస్తున్నాయేగానీ ప్రభుత్వ నిబంధనలు అమలులో పెట్టడం లేదు. రెండు పేరొందిన కార్పొరేట్‌ పాఠశాలల్లో విరివిగా ఆత్మ హత్యలు, హత్యలు జరుగుతుంటే అధికారులు రక్షణ– పరిరక్షణ చట్టాన్ని ఎందుకు అమలు పరచడం లేదు? ఆ చట్టం తెలియకున్నా ఆ చట్టాన్ని అమలుచేసి ఆ సంస్థలను మూసివేస్తే అమాత్యులవారు ఆగ్రహి స్తారనా? ఈ విషయంలో స్పష్టత లేదు. ఆ పాఠశాలలతో ఆంధ్ర రాష్ట్ర అధినేత కుమ్మక్కైనారని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు అంటుంటే ఆ నేత ఎందుకు నోరు మెదపడం లేదు. మౌనం అంగీకారంగా భావించాలా? లేక నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని సరిపెట్టుకుంటున్నారా? అన్నది ప్రజలకు తెలియాల్సి ఉంది.

మొత్తం ముఖ చిత్రం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు భద్రత కరువై, చదువు, పౌష్టికా హారం, కనీసం రక్షిత మంచినీరు సైతం లేకుండా ఎక్కడా, ఎప్పుడూ, ఎలాంటి భద్రత లేకుండా బిచ్చగాళ్లుగా, వ్యభిచార గృహాల్లో, బాల కార్మికు లుగా, మాఫియా ముఠా చేతుల్లో, ఎప్పుడు ఎలా మృత్యువు ముంచుకొస్తుందో తెలియక దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు లాగా అభద్రతలో బతు కీడుస్తుంటే ప్రభుత్వం, అధికారులు మాత్రం పిల్లల భద్రత ఏంటో? అన్నది తమకు తెలి యదన్నట్లు దీనమైన ముఖం వేసి కేవలం ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా– గతమెంతో ఘన కీర్తి కలవాడా’ అని గతాన్ని నెమరేసుకుంటూ రోజులు గడుపుతున్నారు.

అచ్యుతరావు
వ్యాసకర్త గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం (93910 24242)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement