ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న హిజ్రాలు
అనంతపురం: నగరంలోని ఆసీఫ్ అనే వ్యక్తి నుంచి తమకు ప్రాణహాని ఉందని, వెంటనే చర్యలు తీసుకుని అతని బారి నుంచి తమను కాపాడాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట పలువురు హిజ్రాలు సోమవారం ఆందోళన చేపట్టారు. రోజూ తనకు డబ్బు ఇవ్వాలని, లేదంటే భౌతికదాడులు తెగబడుతున్నాడని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆసీఫ్ ఫోన్‌పే, గూగుల్ పే అకౌంట్లకు తాము పంపిన డబ్బు వివరాలను మీడియాకు చూపించారు. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌కు వెళితే ఓ సీఐ దుర్భాషలాడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఆందోళన చేస్తున్న హిజ్రాలను అనంతపుర డీఎస్పీ వీర రాఘవరెడ్డి పిలిపించుకుని మాట్లాడారు.
ఉపాధి కల్పించే దిశగా చర్యలు
హిజ్రాలకు సమాజంలో గౌరవం దక్కేలా ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని అనంతపురం డీఎస్పీ వీరరాఘవ రెడ్డి భరోసానిచ్చారు. కలెక్టర్, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి వారికి ఉపాధి కల్పించేలా చొరవ తీసుకుంటామన్నారు. సోమవారం హిజ్రాలతో చర్చించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలోని బద్రీ, ఆసీఫ్ గ్రూపుల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. గతంలో ఆసీఫ్ గ్రూపు మీద ఫిర్యాదు వస్తే నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్ పంపినట్లుగా గుర్తు చేశారు. ఈ క్రమంలో రోజు విడిచి రోజు గ్రూపుల వారీ భిక్షాటనకు అనుమతించాలని కోరడంతో నిరాకరించినట్లు పేర్కొన్నారు.
నగరంలోని రెవెన్యూ కాలనీ, బస్టాండ్ పరిసరాల వద్ద హిజ్రాల సంచారాన్ని కట్టడి చేస్తామన్నారు. భిక్షాటన, వ్యభిచారం చేయడానికి అనుమతి కావాలని కోరితే ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. భిక్షాటనలో స్వచ్ఛందంగా ఎవరైనా డబ్బులిస్తే తీసుకోవాలని, బలవంతం చేసినట్లుగా తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వీరి దౌర్జన్యాలకు భయపడి డబ్బు ఎవరూ ఇవ్వకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment