వంశీ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం
క్రిటికల్ కేసును రెఫర్ చేయకుండా నిర్లక్ష్యం
వైద్య పరీక్షల పేరుతో చికిత్స జాప్యం
ఆస్పత్రిని సీజ్ చేయాలంటూ నిరసన
అనంతపురం: వైద్యోనారాయణో హరిః అన్నారు పెద్దలు. వైద్యుడిని సాక్షాత్తు దేవుడితో పోల్చుకుని గౌరవిస్తారు ప్రజలు. అయితే డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నెల 15న అనంతపురంలోని శ్రీనివాస న్యూరో అండ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఇంటర్ విద్యార్థిని అంకిత మృతి చెందిన విషయం మరువకనే మరో ఘటన వెలుగు చూసింది. ప్రాణాలు పోస్తారనుకుని ఆస్పత్రికి తీసుకువస్తే ఉన్న ప్రాణాలు తీసేశారంటూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపించారు.
ఏం జరిగింది?
శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన యుగంధర్ (27) రక్త విరేచనాలతో బాధపడుతుంటే ఆదివారం సాయంత్రం అనంతపురంలోని అరవింద్‌నగర్‌లో ఉన్న వంశీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. అప్పటికే రోగి పరిస్థితి విషమంగా ఉంది. ఇలాంటి తరుణంలో క్రిటికల్ కేసును వెంటనే సర్వజనాస్పత్రికి రెఫర్ చేయాల్సి ఉన్నా... ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వివిధ రకాల వైద్య పరీక్షల పేరుతో కాలయాపన చేశారు. దీంతో పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు యుగంధర్ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణి. ఘటనతో బాధిత కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయారు. ఆస్పత్రిలోని అద్దాలు ధ్వంసం చేశారు.
వైద్యుల నిర్లక్ష్యమే ఉసురు తీసింది
విషమ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న యుగంధర్‌కు సకాలంలో వైద్యం అందించకుండా వైద్య పరీక్షల పేరుతో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం చేశారని, ఫలితంగా యుగంధర్ మృతికి కారణమయ్యారంటూ బాధిత కుటుంబసభ్యులు వంశీ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ ప్రతినిధులు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. వైద్యం తెలియని వారు సిండికేట్‌గా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వంశీ ఆస్పత్రి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన కారులకు నచ్చచెప్పి నిరసనలు విరమింపజేయించారు.
డీఎంహెచ్‌ఓ ఘెరావ్
యుగంధర్ మృతి సమాచారం అందుకున్న డీఎంహెచ్‌ఓ భ్రమరాంబదేవి వెంటనే స్పందించారు. తక్షణమే వంశీ ఆస్పత్రికి ఆమె చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజా సంఘాల నాయకులు, మృతుడి కుటుంబసభ్యులు ఆమెను ఘెరావ్ చేశారు. తమ కుటుంబసభ్యుడిని పొట్టనపెట్టుకున్న ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డబ్బు కోసం కక్కుర్తిపడి ప్రాణాలు తీసేశారంటూ బోరున విలపించారు.
షోకాజ్ నోటీసు జారీ
అనంతపురం మెడికల్: వంశీ ఆస్పత్రి నిర్వాహకులకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి షోకాజ్ నోటీసు జారీ చేశారు. యుగంధర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆమె నేరుగా ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు. రోగి మృతికి కారణాలపై ఆరా తీశారు. ప్రమాదకర కేసులను హయ్యర్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపకుండా జాప్యం చేయడం, ఇతర కారణాలు చూపుతూ ఆస్పత్రి నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఘటనపై లోతైన విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ వెంట డెమో ఉమాపతి, డిప్యూటీ డెమో గంగాధర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment