అనంతపురం ఎడ్యుకేషన్: చిట్టీల పేరుతో రూ. కోట్లకు కుచ్చుటోపీ పెట్టి కటకటాల పాలైన అనంతపురంలోని రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల తెలుగు టీచరు కాకర్ల దివాకర్‌నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. దాదాపు మూడు నెలల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన దివాకర్‌నాయుడు ఇటీవల కోర్టులో లొంగిపోవడంతో జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ప్రస్తుతం ఆయన రెడ్డిపల్లి సబ్‌జైలులో ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్ విద్యాశాఖకు అందింది. ఈ క్రమంలో మూడు రోజుల కిందట షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపునకు అతికించారు. సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ అధికారి బి.వరలక్ష్మీ జారీ చేశారు. ఆర్‌ఎంహెచ్‌ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు. దివాకర్‌నాయుడు ఇంటివద్ద ఈ ఉత్తర్వులను అతికించనున్నారు.
స్కూల్ వద్దకు తిరుగుతున్న బాధితులు
దివాకర్‌నాయుడు అరెస్ట్ విషయం చాలామంది బాధితులకు తెలీదు. ఆయన ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడనుకుంటున్నారు. రిమాండ్‌లో ఉన్నాడంటూ ఇటీవల ‘సాక్షి’లో కథనం వెలువడటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో బాధితులు దివాకర్‌నాయుడు పని చేస్తున్న పాఠశాలకు, డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇంటివద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వచ్చినట్లు బాధితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment