dichpalli
-
నిజామాబాద్: ఒకే ఇంట్లో ఆరుగురు హత్య.. స్నేహితుడే కారణం!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. అయితే, వీరి హత్యకు ఆస్తి తగదాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలంలోని మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్‌కు మాక్లుర్‌లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపైన కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్‌పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆ ఇంటిని ప్రశాంత్ తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. దీంతో, ప్లాన్ ప్రకారం ప్రసాద్‌ను బయటకు తీసుకెళ్ళి నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్ళి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్ళాడు. ఆమెను కూడా హతమార్చి బాసర నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. అనంతరం.. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో, ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం. అయితే, మాక్లుర్‌కు చెందిన నిందితుడు ప్రశాంత్ వయసు 20 ఏళ్లు. మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడని.. మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య కాబడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా కూడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. కాగా, నమ్మిన స్నేహితుడే ఇలా వారిని హత్య చేయడంతో స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనలో నిందితులకు తగిన శిక్ష విధించాలని కోరుతున్నారు. మరోవైపు.. వీరి హత్యలకు సంబంధించి పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం. -
దెయ్యం పట్టిందని కొట్టిన తల్లి..బాలుడి మృతి
సాక్షి, డిచ్పల్లి(నిజామాబాద్) : అనారోగ్యంతో ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందనే మూఢ నమ్మకంతో కన్నతల్లి జుట్టు పట్టుకుని చెప్పుతో బాగా కొట్టడంతో మృతి చెందిన ఘటన డిచ్పల్లి మండలం ఘన్పూర్ శివారులో చోటుచేసుకుంది. వివరాలు.. నిజామాబాద్ నగరానికి చెందిన జ్యోతికి ఐదుగురు పిల్లలు. ఆమె ఊరూరు తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువులు, చిత్తు కాగితాలు ఏరుకుని వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో పిల్లలను పోషిస్తోంది. ఏడాదిగా పిల్లలను వెంటేసుకుని డిచ్పల్లి మండలం ఘన్పూర్ శివారులోని మహాలక్ష్మీ ఆలయం సమీపంలో నివసిస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి కొడుకు కడమంచి కిశోర్ (7) కు వాంతులు, విరోచనాలు అయ్యాయి. గురువారం ఉదయం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలుడికి వైద్యం చేయించిన జ్యోతి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చింది. రాత్రికి కల్లు తాగిన మత్తులో అనారోగ్యంతో పడి ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందని పేర్కొంటూ జుట్టు పట్టుకుని చెప్పుతో బాగా కొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఎస్సై సురేశ్‌కుమార్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది బాలుడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కిశోర్ అనారోగ్యంతో మృతి చెందాడా లేక తల్లి కొట్టిన దెబ్బలకు చనిపోయాడా అనే విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. ఇటీవలే ధర్మారం(బి) గ్రామంలో తల్లి చేతిలో కొడుకు మృతి చెందిన ఘటన మరువక ముందే మరో చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బాలుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి -
కర్కశం : కన్న కొడుకును ఉరేసి..
సాక్షి, నిజామాబాద్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే ఆ బాలుడి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. కంటిపాపలా చూసుకోవాల్సిన కన్నకుమారుడినే కడతేర్చి కర్కశంగా ప్రవర్తించింది. ఈ హృదయవిదారక సంఘటన ఆదివారం డిచ్పల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డిచ్పల్లి మండలం ధర్మారానికి చెందిన పద్మ అనే మహిళకు ఎనిమిది సంవత్సరాల బాబు రాజేష్(8) ఉన్నాడు. గత కొంతకాలంగా వారి కుటుంబంలో గొడవలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలతో కలత చెందిన పద్మ అన్నెం పున్నెం ఎరుగని కొడుకును ఉరివేసి చంపింది. ఈ ఘటన పలువురి మనసులను కలిచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
క్షతగాత్రుడిని తరలించిన ఎంపీ
డిచ్పల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి ఎంపీ కవిత మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం సాయం త్రం డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం(బి) గ్రామంలో కాకతీయ స్కూల్ బస్సు (నెంబరు ఏపీ 01 వీ 8683).. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న మహ్మద్ జిలానీ (ధర్మారం) స్కూల్ బస్సు టైర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామంలో గడ్డం ఆనంద్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యక్రమానికి ఎంపీ కవిత, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, అకుల లలిత, పార్టీ నాయకులతో కలిసి వెళుతున్నారు. రోడ్డు ప్రమాదం గమనించిన ఎంపీ కవిత తన వాహనం దిగి అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రతిభ హాస్పిటల్ వైద్యులకు సమాచారం అందించారు. సమీపంలోనే ఉన్న జిలానీ కుటుంబ సభ్యులు అక్కడి చేరుకుని రోధించగా, ఎంపీ కవిత వారిని ఓదార్చారు. అంబులెన్స్ రాగానే క్షతగాత్రుడితో పాటు కుటుంబ సభ్యులను ఆస్పత్రికి పంపించారు. మెరుగైన వైద్యం అందజేయాలని డాక్టర్లకు ఫోన్లో సూచించారు. -
ముదురుతున్న తె.యూ వివాదం
సాక్షి, తె.యూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో పాతిక రోజులుగా కొనసాగుతున్న అందోళనలు గురువారం విద్యార్థులు నిరవధిక దీక్షలు చేపట్టడంతో మరింత ముదిరాయి. యూనివర్సిటీలో బోధన తరగతులు కొనసాగక విద్యా సంవత్సరం వృథా అవుతోందని ఆరోపిస్తూ మూడు రోజులుగా అందోళనబాట పట్టిన విద్యార్థులు చివరికి ఆమరణ దీక్షలకు దిగారు. చిచ్చురేపిన జీవో నంబరు 11.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల(అకడమిక్ కన్సల్టెంట్లు)కు వేతనాలు పెంపు చేస్తూ జీవో నంబరు 11ను విడుదల చేసింది. అయితే తెయూ వీసీ ప్రొఫెసర్ పి.సాంబయ్య తొమ్మిది కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్లుగా ప్రకటించారు. ఆయా కోర్సుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు జీవో నంబరు 11 ప్రకారం పెరిగిన వేతనాలు చెల్లించబోమని స్పష్టం చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. వర్సిటీలో అన్ని కోర్సులు రెగ్యులర్ కోర్సులుగానే పరిగణించాలని, జీవో నంబరు 11ను కాంట్రాక్టు అధ్యాపకులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ 9 కోర్సుల కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మె బాట పట్టారు. 25 రోజులుగా క్యాంపస్ మెయిన్ గేటు వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని నిరవధిక రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. దీంతో 9 కోర్సుల్లో పాఠాలు బోధించేవారు లేక తరగతులు కొనసాగడం లేదు. పట్టించుకోని వీసీ, రిజిస్ట్రార్లు.. 25 రోజులుగా రిలేదీక్షలు చేస్తున్నా వీసీ ప్రొఫెసర్ పి.సాంబయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బలరాములు మొండివైఖరితో సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టు అధ్యాపకులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చర్చల పేరుతో పిలిచి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, 19 రోజులుగా వీసీ యూనివర్సిటీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రార్ సైతం తన చేతిలో ఏమీ లేదని వీసీ ఎలా చెబితే అలా చేస్తామని చేతులెత్తేశారు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా మూడు రోజులుగా విద్యార్థులు నేరుగా అందోళనబాట పట్టారు. వీసీ సాంబయ్య కన్పించడం లేదంటూ కరపత్రాలు ముద్రించి క్యాంపస్ ఆవరణలో అతికించారు. బోధన, బోధనేతర సిబ్బందిని క్యాంపస్‌లోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు. గురువారం సైతం బోధన, బోధనేతర సిబ్బందిని విధులకు హాజరు కాకుండా అడ్డుకున్న విద్యార్థులు అల్పాహారం సైతం గేటు వద్దకే తెప్పించుకుని తిన్నారు. ఆమరణ దీక్షలు.. వీసీ, రిజిస్ట్రార్ల నుంచి స్పందన లేకపోవడంతో గురువారం విద్యార్థులు విఘ్నేశ్, వినోద్, అఖిల్, నర్సింలు, శ్రీకాంత్, అశోక్, ప్రశాంత్ ఆమరణ దీక్షలు ప్రారంభించారు. దీక్షా శిబిరంలో విద్యార్థు లు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరగతులు జరగకపోవడంతో సిలబస్ పూర్తి కాలేదని, ఈ నెల 27నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. సిలబస్ పూర్తి కాకపోవడంతో పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. ఆమరణ దీక్షలకు మద్దతు తెలిపిన విద్యార్థి నాయకులు యెండల ప్రదీప్, క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా వీసీ, రిజిస్ట్రార్ లు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
పాఠాలు బోధిస్తూ కుప్పకూలిన ఉపాధ్యాయుడు
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్) : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ చారి (32) పాఠాలు బోధిస్తూనే గుండెపోటుతో మృతిచెందారు. కళాశాల వర్గాలు తెలిపిన వివరాలు ప్రకారం.. సుభాష్ చంద్రబోస్ చారి రోజులాగే బుధవారం విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా గుండె పోటుకు గురయ్యాడు. వెంటనే తోటి అధ్యాపకులు పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో డాక్టర్ ఆయనను పరిశీలించి ఇంజెక్షన్ ఇచ్చాడు. కొద్దిసేపటికి నొప్పి అధికం కాగా సుభాష్ చంద్రబోస్ మృతి చెందాడు. అయితే తోటి అధ్యాపకులు హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు సుభాష్ చంద్రబోస్ చారి వికారాబాద్ జిల్లా పరిగి గ్రామానికి చెందిన వారు. ఆయనకు భార్య, కూతురు, 8 నెలల బాబు ఉన్నారు. సుభాష్‌చంద్రబోస్ మృతి తెలియగానే ఆయన కుటుంబసభ్యులు, బంధువులు పరిగి నుంచి బయలుదేరి రాత్రికి నిజామాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. అధ్యాపకులు, విద్యార్థుల కంటతడి.. డిచ్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ జువాలజీ విభాగంలో సుభాష్ చంద్రబోస్ 2012 లో కాంట్రాక్టు అధ్యాపకుడిగా చేరాడు. నాణ్యమైన బోధన అందిస్తూ విద్యార్థులకు చేరువయ్యారు. ఆయన మృతిని చూసి తట్టుకోలేకపోయిన అధ్యాపకులు, విద్యార్థులు కంట తడి పెట్టారు. ఒత్తిడితోనే గుండెపోటు..? సొంత జిల్లాకు బదిలీ చేయాలని సుభాష్ చంద్రబోస్ ఉన్నతాధికారులకు పలు మార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భార్యాపిల్లలకు దూరంగా ఉండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతిచెందారని తోటి అధ్యాపకులు వాపోయారు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ప్రిన్సిపాల్ రామదాస్, అధ్యాపకులు కోరుతున్నారు. -
వృద్ధురాలిపై ఎలుగుబంటి దాడి
డిచ్పల్లి, నిజామాబాద్ : గ్రామంలో వచ్చిన ఎలుగుబంటి ఓ వృద్ధురాలిపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు కర్రలతో వెంటబడడంతో అడవిలోకి పరుగు తీసింది. ఈ ఘటన మండలంలోని ధర్మారం(బి)లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధురాలు కాసం లక్ష్మి ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి బయట గేటును తెరుస్తుండగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి. ఆమె భయంతో కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి కర్రలతో ఎలుగుబంటిని తరిమేశారు. మదన్‌పల్లి వైపు ఎలుగుబంటి పారిపోయిందని గ్రామస్తులు తెలిపారు. స్థానికులు కొద్దిగా ఆలస్యంగా వచ్చి ఉంటే లక్ష్మితో పాటు అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచి ఉండేదని సర్పంచ్ ఈదర కస్తూరి, ఉప సర్పంచ్ ఎడవెల్లి సోమనాథ్ లు తెలిపారు. యపడిన బాధితురాలిని 108 వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కిమ్స్‌లో చేర్పించారు. అటవీ ప్రాంతంలో తాగునీరు లేకపోవడంతో ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చి ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఎలుగుబంటి దాడితో ధర్మారం(బి), మదన్‌పల్లి, కేశాపూర్ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. -
పెళ్లికి వెళ్లి వస్తూ పరలోకానికి..
డిచ్పల్లి : శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం అనంతలోకాలకు చేరింది. మండల కేంద్రం శివారులోని 44వ జాతీ య రహదారిపై సోమవారం సాయం త్రం సుమారు 4 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనిలో కోటగిరికి చెందిన పోల విఠల్‌రావు, సుష్మ దంప తుల కుమారుడు పోల రాఘవేందర్ (38), కోడలు పోల దీప్తి(34), మనవ డు సాయితేజ(11), మనవరాలు స్నిగ్థ(5) అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి కోటగిరిలో సాయి ఆగ్రో ఇండస్ట్రీస్(రైస్‌మిల్) ఉంది. ఇందల్వాయి ఎస్ఐ రాజశేఖర్, మృతుల బంధువులు తెలిపి న వివరాలిలా ఉన్నాయి. విఠల్‌రావు కుటుంబంతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. విఠల్‌రావు దంపతులు అక్కడే ఉండి పోయారు. కాగా రాఘవేందర్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం కోటగిరికి బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు(టీఎస్ 10 ఈపీ 1299) డిచ్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ముందు టైరు పేలిపోయి ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని వెళ్లి రోడ్డుపై పల్టీ కొట్టింది. అదే సమయంలో ఆర్మూర్ వైపు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీ(ఎంహెచ్ 04 ఈఎల్ 5103) కిందకు దూసుకెళ్లింది. దీంతో లారీ, కారును కొద్ది దూ రం లాక్కెళ్లింది. కారులోని బెలూన్లు తె రుచుకున్నా లారీ కిందకు వెళ్లడంతో అం దులో ఉన్న నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎదురుగా ఉన్న పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బందితో పా టు రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు అక్కడికి చేరుకున్నారు. కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పారలు, ఇనుప రాడ్లతో కారు డోర్లు, పైభాగాన్ని పెకిలించి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద వా ర్త తెలియగానే రాఘవేందర్ తల్లిదండ్రు లు విఠల్‌రావు, సుష్మ హైదరాబాద్ నుంచి హుటాహుటిన నిజామాబాద్‌కు బయలుదేరారు. ఇందల్వాయి ఎస్ఐ రాజశేఖర్, డిచ్పల్లి ఏఎస్ఐ నారాయణ రహదారిపై వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్న రాఘవేందర్ స్నే హితుడు శ్రావణ్ ఘటనా స్థలం వద్ద ఆగాడు. మృతులను చూడగానే గుర్తించి వారి వివరాలను పోలీసులకు తెలిపా డు. నిజామాబాద్ ఏసీపీ ఎం.సుదర్శన్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోటగిరిలో విషాదఛాయలు కోటగిరి(బాన్సువాడ) : ఉన్న ఒక్కగానొక్క కుమారుడు, కోడలు, మనుమ డు, మనుమరాలు రోడ్డు ప్రమా దం లో మృతిచెందడంతో కోటగిరిలో వి శాదఛాయలు అలుముకున్నాయి. ప లువురు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతినిత్యం తన కళ్ళముందు ఆడు తూ పాడుతూ తిరిగే మనుమడు, మ నుమరాలు మృతిచెందడంతో ఆయన కు తీరని లోటు మిగిలింది. హైదరా బాద్ నుంచి నిజామాబాద్‌కు కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. కోటగిరికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పోల విఠల్సేట్కు ఏకైక కుమారుడు పోల రాఘవేందర్రావు. ఆదివారం హైదరాబాద్‌లో పెళ్లి జరిగింది. మరో గంటలో ఇంటికి చేరుకుంటారనే సమయంలో రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు వారి పిల్లలు మృతి చెందడంతో విషాదం నెలకొంది.ప్రమాద వివరాలపై ఆరా రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం రాత్రి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఏసీపీ సుదర్శన్‌ను అడిగి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అప్పటికే మృతదేహాలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో మంత్రి ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుడి తండ్రి విఠల్‌రావును మంత్రి పోచారం ఓదార్చారు. లారీ రాకుంటే ప్రమాదం తప్పేది.. రాఘవేందర్ ప్రయాణిస్తున్న కారు డిచ్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుటకు రాగానే కారు ముందు టైరు పేలి అదుపు తప్పింది. డివైడర్ పైకెక్కి పూల మొక్కలను దాటుకుని రోడ్డుపై పల్టీ కొట్టింది. కారులో ఉన్న బెలూన్లు వెంటనే తెరుచుకున్నాయి. అయితే దురదృష్టవశాత్తు అదే సమయంలో ఎదురుగా లారీ వేగంగా వస్తుంది. దీంతో లారీ కిందకు దూసుకెళ్లిన కారును లారీ రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కారు నుజ్జు కావడంతో నలుగురు మృతి చెందారు. ఆ సమయంలో ఎదురుగా లారీ రాకపోయింటే కారులోని నలుగురు బతికి ఉండేవారని అక్కడున్నవారు, పోలీసులు అభిప్రాయపడ్డారు. కంటతడి పెట్టిన మంత్రి పోచారం నిజామాబాద్ క్రైం: డిచ్పల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను చూసి రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టారు. ఉమ్మడి జిల్లాలో రోజంతా సమీక్షలు నిర్వహించాక నేరుగా పోస్టుమార్టం గదికి వెళ్లి విగతజీవులుగా పడి ఉన్నవారి మృతదేహాలను చూసి కంటతడి పెట్టారు. అందరితో సన్నిహితంగా మెలిగే రాఘవేందర్ ఆకస్మాత్తుగా మృతిచెందటం జీర్ణించుకోలేని విషయమని మృతుడి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధైర్య పడవద్దని, తాను ఉన్నానంటూ మృతుడి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. రాత్రి 8.30 గంటలకు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి కావటంతో 9 గంటలకు కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాగ మృతదేహాలను బంధువులు కోటగిరికి తరలించారు. కామారెడ్డికి వెళ్లి ఉంటే.. సోమవారం హైదరాబాద్ నుంచి కోటగిరికి భార్య దీప్తి, కుమారుడు తేజసాయి, కూతురు స్నిగ్ధతో కలిసి కారులో బయలుదేరారు. వీరి కారు కామారెడ్డికి చేరుకోక ముందే కామారెడ్డిలో రాఘవేందర్ స్నేహితుడు ఇక్కడ ఆగాలని కాస్త మాట్లాడుదామని చెప్పాడు. దానికి రాఘవేందర్ ఇప్పుడు సమయం లేదని, మరోసారి కామారెడ్డికి వస్తానని చెప్పి కామారెడ్డిలోకి కారు వెళ్లకుండా బైపాస్ గుండా వచ్చాడు. అక్కడే ఆగి ఉంటే ప్రమాదం జరిగి ఉండక పోవచ్చని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రేపు తేజసాయి పుట్టిన రోజు.. ప్రమాదంలో మృతిచెందిన రాఘవేందర్ కుమారుడు తేజసాయి పుట్టినరోజు బుధవారమే. దీంతో కొడుకు బర్త్‌డేను ఘనంగా చేసేందుకు హైదరాబాద్ నుంచి వివిధ వస్తువులు, దుస్తులు కొన్నారు. అంతలోనే తేజసాయికి నిండు నూరేళ్లు నిండిపోవటం బాధాకరం. -
బెటాలియన్ల అభివృద్ధికి కృషి
► ట్రాన్స్ఫర్స్ దరఖాస్తులను పరిశీలిస్తాం ► ఇంటర్ ఐవోసీ ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన బెటాలియన్స్ ఐజీ ► డిచ్పల్లి బెటాలియన్‌లో పలు ప్రారంభోత్సవాలు ► సిబ్బంది, కుటుంబసభ్యులతో దర్బార్ పరేడ్ డిచ్పల్లి: బెటాలియన్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని బెటాలియన్స్ ఐజీ అభిలాష బిష్త్ అన్నారు. సిబ్బంది ఇంటర్ ట్రాన్స్ఫర్స్ కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వారు కోరుకున్న చోటకి బదిలీ చేస్తామని హామీ ఇచ్చా రు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ ఆవరణలో 44వ జాతీయ రహదారి పక్కన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్, డీజీల్ బంక్)ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా వాహనంలో డీజిల్ పోసుకుని డబ్బులు చెల్లించారు. అనంతరం బెటాలియ ప్రధాన గేటు సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డిలు ప్రారంభిచారు. అలా గే ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన బెటాలియన్ పేరుగల బోర్డును, ట్రైనింగ్‌సెంటర్ సమీపంలో ఇటీవల నిర్మించిన రెండు ప్రీ–ఫ్యాబ్రికేటెడ్ బ్యారక్స్‌ను, 25 వాష్ రూమ్స్‌ను ప్రారంభించారు. బెటాలియన్‌లో సెట్విన్ ఆధ్వర్యంలో ఔత్సాహిక మహిళలు, యువతులకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఐజీ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నా రు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు, 4వ బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్ ఎంఎస్‌కుమార్, 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సాంబయ్య, అసిస్టెంట్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఏసీపీ ఆనంద్‌కుమార్, ఆర్ఐ కృష్ణ, ఐవోసీఎల్ తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ స్టేట్ ఆఫీస్ జనరల్ మేనేజర్ రమణరావు, వరంగల్ డివిజన్ ఎస్డీఆర్యం ప్రియభారత సాహూ, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. దర్బార్ పరేడ్ ... బెటాలియన్‌లోని ట్రైనింగ్‌సెంటర్, యూనిట్ హాస్పిటల్, వెల్ఫేర్ సెంటర్, ప్రధాన కార్యాలయాన్ని ఐజీ సందర్శించారు. అనంతరం బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో దర్బార్ పరేడ్ నిర్వహించారు. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. దర్బార్ పరేడ్‌కు ఇంతమంది బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో హాజరు కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో బెటాలియన్స్ పోలీసులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. -
డిచ్‌పల్లిలో లారీ బోల్తా: భారీగా ట్రాఫిక్ జాం
డిచ్పల్లి: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రడిని ఆస్పత్రికి తరలించి రోడ్డుకు అడ్డంగా పడిన లారీని క్రేన్ సాయంతో తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. -
కారు, లారీ ఢీ: ఒకరి మృతి
డిచ్పల్లి : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కారును ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కారులో ఉన్న వ్యక్తి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
డివైడర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు
డిచ్పల్లి : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామ సమీపంలో జాతీయరహదారి-44పై జరిగింది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం సేవలు అందిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డిచ్పల్లి వైద్య సిబ్బందిపై మంత్రి ఆగ్రహం
డిచ్పల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రికార్డులు తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సారి ఆస్పత్రికి వచ్చే సరికి సేవలు మెరుగుపరచకుంటే చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. తర్వాత డిచ్పల్లి, మండలంలోని తిరుమన్‌పల్లి గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అర్హులందరికీ 'ఆసరా'గా నిలుస్తాం
నిజామాబాద్: ఆసరా పింఛన్ల పంపిణీలో అధికారుల తీరుపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'పింఛినిప్పించండి సారూ..' అంటూ వేడుకున్న దరఖాస్తుదారులను అనునయించారు. 'అర్హులందరికీ వస్తుందమ్మా..' అంటూ కళ్ల నీళ్లు పెట్టుకున్న వృద్ధులను ఓదార్చారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన పింఛన్ల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని, అలా అడిగిన వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మంగళవారం కామారెడ్డి, డిచ్పల్లి, దోమకొండ మండలాల్లో పర్యటించారు. ఆసరా పింఛన్ల సర్వే, లబ్ధిదారుల ఎంపికల తీరుపై సమీక్షించారు. అధికారులు, సిబ్బంది చేసిన తప్పులు, లోపాలపై మండిపడ్డారు. దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను ఓపిక విని.. పరిష్కరిస్తానంటూ భరోసానిచ్చారు. తమ కాలనీలకు కలెక్టర్ రావడం.. భరోసా ఇవ్వడంతో స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. కామారెడ్డిలో పట్టణంలో ఆసరా పింఛన్ల సర్వే, లబ్దిదారుల ఎంపికలో మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కంప్యూటర్ విభాగంలో ఎస్కేఎస్ సర్వే, ఆసరా పింఛన్ల రికార్డులను పరిశీలించారు. సరైన వివరాలు లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, ఆర్డీవో గడ్డం నగేశ్, తహశీల్దార్ గఫర్‌మియా, మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఐకేపీ పీడీ వెంకటేశం,మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఆసరా లబ్ధిదారున్ని ఎంపిక చేయడంతో ఐకేసీ సీఓ అర్చనను సస్పెండ్ చేయాలని పీడీని ఆదేశించారు. పేదలు ఎక్కువగా నివసించే బతుకమ్మ కుంటలో పర్యటించారు. ఆసరా పింఛన్ల గురించి వృద్దులు, వితంతువులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 13 వేలమందికి టెక్నికల్ సమస్యలతో పింఛన్లు అందించలేకపోయామన్నారు. ఫిబ్రవరి నుంచి అందరికీ ఫించన్లు అందిస్తామన్నారు. అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్టు తేలితే అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దోమకొండలో మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామాల వారీగా ఆన్లైన్లో పింఛన్ల పరిస్థితిని సమీక్షించారు. అంగన్వాడీలు, వీఆర్ఏలు, హోంగార్డులు అర్హులుగా ఉంటే వారికి పింఛన్లు అందించాలని సూచించారు. అరవైఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పింఛన్ వచ్చేలా చూడాలని ఎంపీడీఓ హిరణ్మయిని ఆదేశించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి గంగారాం, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ సుధాకర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. డిచ్పల్లి మండలంలో... అమృతాపూర్ పంచాయతీ పరిధిలోని దేవనగర్ లెప్రసీ క్యాంపును కలెక్టర్ సందర్శించి, కాలనీవాసులతో మాట్లాడారు. తమకు పింఛన్లు మంజూరు కాలేదని ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన స్వయంగా క్యాంపును సందర్శించారు. లెప్రసీ రోగులతో మాట్లాడి కారణాలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. డీఆర్డీఏ పీడీ వెంకటేశం, ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహశీల్దార్ రవీంధర్ తదితరులు ఉన్నారు. -
‘కాంట్రాక్టు’ను రెగ్యులరైజ్ చేయొద్దు
తెయూ(డిచ్పల్లి): కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వర్సిటీ బాలుర వసతి గృహం వద్ద సోమవారం జేఏసీ నాయకులు తమ మెడలకు తాళ్లతో ఉరి బిగించుకుని వినూత్న నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాల పేరిట నిరుద్యోగ విద్యార్థులను మోసం చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనం, వెయిటేజీ ఇస్తే నిరుద్యోగ విద్యార్థులకు ఇబ్బం ది లేదని, కానీ వారిని రెగ్యులరైజ్ చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. హోంమం త్రి నాయిని నర్సింహారెడ్డి తన పదవికి రాజీనా మా చేసి విద్యార్థులను విమర్శిస్తే బాగుంటుందన్నారు. తెలంగాణవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు రాజ్‌కుమార్, చైర్మన్ సంతోశ్‌గౌడ్, బాలాజీ, సంతోశ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆధార్‌పై రైతుల్లో ఆందోళన
డిచ్పల్లి : టీఆర్ఎస్ సర్కార్ ప్రకటించిన పంట రుణమా ఫీ పథకం అమలుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. రు ణమాఫీ పథకం వర్తింప జేయడంలో ఆధార్ నెంబరు తప్పనిసరి అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయి తే ఈ విషయంలో కొందరు అధికారులు ఒకరకంగా, మరికొందరు అధికారులు మరోరకంగా చెబుతుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఆ ధార్ అనుసంధానంతో తమకు లాభం జరుగుతుం దా, లేక నష్టం జరుగుతుందా అనే విషయమై రైతులు మదనపడుతున్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళంగా మారింది. బ్యాంకుల్లో రైతుల బారులు.. పంట రుణాలు పొందిన రైతు కుటుంబంలో *లక్ష వర కు రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ కోసం రైతులు తప్పనిసరిగా ఆధార్ జిరా క్స్ పత్రాలను బ్యాంకులు, సహకార సంఘాల్లో అందజేయాలని అధికారులు సూచించారు. దీంతో రైతులు బ్యాంకులు, సింగిల్ విండోల వద్దకు బారులు తీరుతున్నారు. అయితే కొందరు రైతులు తమకు తాత, తం డ్రుల నుంచి సంక్రమించిన వ్యవసాయ భూముల్లో పంటలు సాగుచేస్తున్నారు. రుణాలు సైతం వారి పేర్లమీదే పొందారు. ఇప్పుడు రుణం పొందిన వారి ఆధా ర్ కార్డు సమర్పించాలని అధికారులు అడగటంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. గడువుపై స్పష్టత లేదు.. ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీ అర్హత పొందేందుకు రైతులు బ్యాంకు పాసు పుస్తకం, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ పత్రాలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్‌లను ఇవ్వాలని బ్యాంకర్లు కోరుతున్నా రు. ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయాధికారులు సైతం రైతులకు సమాచారం అందజేస్తున్నారు. అయితే అధా ర్ కార్డు జిరాక్స్‌లను ఎప్పటిలోగా అందజేయాలనే దానిపై గడువు స్పష్టంగా చెప్పడం లేదు. కానీ మండల స్థాయి అధికారులు తమ మండలాల్లో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి, ఈనెల 30లోగా రుణమాఫీ అర్హత గల రైతుల జాబితాను అందజేయాలని సూచి స్తున్నారు. బ్యాంక ర్లు ఇచ్చిన జాబితాను కలెక్టర్‌కు అందజేస్తామని మండల అధికారులు తెలుపుతున్నా రు. ఈనెల 28, 29 తేదిల్లో గ్రామసభలు నిర్వహిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఆధార్ పొందని రైతులు నమోదు కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు.నెలాఖరులోగా ఆధార్‌కార్డు సహా అన్ని పత్రాలు అందించకుంటే రుణమాఫీ వర్తించదేమోనన్న ఆందోళన వారిలో ఉంది. అధార్ కార్డులో పేరు తప్పుగా వచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామసభల్లో నిర్ధారిస్తాం.. రుణమాఫీకి ఆధార్‌కార్డు ఇవ్వని వారిని పరిగణలోకి తీ సుకుంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. రైతులను ఆధార్ జిరాక్స్‌లు తప్పనిసరిగా కావాలని అడగటం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీకి అర్హత గల రైతుల పేర్లను రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సరిపోల్చుకుని గ్రామసభల్లో నిర్ధారిస్తామని బ్యాంకర్లు అంటున్నారు. ఎవరెన్ని చెప్పినా రైతుల్లో ఆందోళన తొలగడం లేదు. -
సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో ఆందోళన
డిచ్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వే పై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయని, సర్వేను కేవలం ఒక రోజే నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వి.గంగాధర్‌గౌడ్ (వీజీగౌడ్) అన్నారు. బుధవారం డిచ్‌పల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సర్వేపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వేలాది మంది తెలంగాణ ప్రజలు బతుకు దెరువు కోసం వలస వెళ్లారని, వారంతా ఇప్పుడు రాష్ట్రానికి రావడానికి ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. సర్వే ఫార్మాట్లో 96 కాలమ్స్ ఉన్నాయని ఇవన్నీ పూర్తి చేయాలంటే కనీసం 45 నిమిషాలు పడుతుందన్నారు. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి వివరాలు సర్వేలో తీసుకోవద్దని సూచించడం సమంజసం కాదన్నారు. గల్ఫ్ బాధితుల అంశం చేర్చాలని కోరారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని సర్వేను వారం రోజుల పాటు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో సుమారు 600 గిరిజన తండాలు ఉన్నాయని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో డి చ్‌పల్లి మండలం ఇందల్వాయి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ మంజూరు కాగా దానిని జిల్లా కేంద్రానికి తరలించారని అన్నారు. జాతీయ రహదారిపై ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురువుతుంటారని వెంటనే ఇందల్వాయి వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో విండో చైర్మన్ పూర్యానాయక్, టీడీపీ మండల అధ్యక్షుడు నందుబాబు, నాయకులు పూర్యానాయక్, కుంట నర్సారెడ్డి, విఠల్ రాథోడ్, అబ్బులు తదితరులు పాల్గొన్నారు. -
19న ఇంటింటా వివరాల నమోదు
డిచ్పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని కుటుంబాలకు చెందిన పూర్తి చరిత్రను అధికారులు నమోదు చేయనున్నారు. ఇలాంటి సర్వే ఇంతవరకు దేశంలోని ఏ రాష్ట్రంలో జరిగిన దాఖలాలు లేవని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రం మొత్తంలో ఒకే రో జు ఈనెల 19న సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు సర్వేకు సంబంధించి సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఇతర జిల్లా స్థాయి అధికారులు మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల్లో న మూనా కుటుంబ సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయి లో సరే ్వ నిర్వహించినప్పుడు ఎలాంటి సమస్యలు వ స్తాయి, వాటిని ఎలా అధిగమించాలనే విషయమై న మూనా సర్వే చేశారు. సర్వే జరిగే రోజు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండి సర్వే సిబ్బందికి సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే పలుమార్లు కోరారు. ఆ రోజు ప్ర భుత్వం సెలవు దినం గా ప్రకటించింది. ఇంట్లో లేని వారి పేర్లు నమోదు చేయబోరని, చివరకు శుభకార్యాలను సైతం వాయిదా వేసుకోవాలని సీఎం సూచించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ రోజు ఇంటికి తాళం వేసి ఉండకుండా చూసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. విభాగం ఏ : గుర్తింపు వివరములు 1. జిల్లా పేరు: 2. మండలం పేరు: 3.గ్రామ పంచాయతీ పేరు/ మున్సిపాలిటీ పేరు: 4. రెవెన్యూ గ్రామం పేరు: 5.ఆవాసం పేరు/డివిజన్ పేరు/వార్డు పేరు: 6. నివశిస్తున్న ప్రదేశం/వాడ/కాలనీపేరు: 7. ఇంటి నెంబరు: 8. ఈ ఇంట్లో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య: విభాగం బి: కుటుంబ వివరములు: 1. కుటుంబ యజమాని పేరు: ఇంటి పేరు.. పూర్తి పేరు 2. తండ్రి/భర్త పేరు: 3. కుటుంబ సభ్యుల సంఖ్య: 4.మతం: హిందూ.. ముస్లిం.. క్రైస్తవ .. సిక్కు.. జైన.. బౌద్ధ.. ఇతరులు 5. సామాజిక వర్గం/కులం పేరు: ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. ఓసీ.. 6. గ్యాస్(ఎల్పీజీ )కనెక్షన్ ఉందా?: ఉంది.. లేదు.. 7. వినియోగదారుని సంఖ్య: 8. మొబైల్ ఫోన్ నెం.(ఆప్షనల్) 9. ఆదాయం పన్ను చెల్లించే కుటుంబమా?: అవును.. కాదు అనాథల వివరాలు (ఉన్నట్లయితే) 10. అనాథలు ఎక్కడ నివశిస్తున్నారు (సొంత ఇంట్లో.. బంధువుల ఇంట్లో.. బహిరంగ ప్రదేశాల్లో.. పాడుబడ్డ ఇంట్లో.. అనాథాశ్రమంలో) 11. అనాథాశ్రమంలో ఉంటే ఆశ్రమం పేరు: 12. ఆశ్రమం ఉన్న గ్రామం: 13. ఆశ్రమం ఉన్న మండలం: 14. అనాథ స్థితి (తల్లిదండ్రులు చనిపోయారు.. తల్లి/తండ్రి వదిలేశారు.. కొడుకులు/కూతుళ్లు వదిలేశారు) విభాగం సి: 1.క్రమ సంఖ్య 2. వ్యక్తిపేరు(కుటుంబ యజమానితో మొదలుకొని): 3. కుటుంబ యజమానికి సంబంధం: 4. లింగం(ఆడ.. మగ.. ఇతరులు): 5. పుట్టిన తేదీ.. తెలియనట్లయితే వయసు: 6. వైవాహిక స్థితి 7. పూర్తయిన విద్యార్హత 8. బ్యాంకు/పోస్టాఫీసు అకౌంటు ఉన్నదా ?.. లేదా? 9. పోస్టాఫీసు అకౌంట్ ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీస్ శాఖ పేరు: 10. ’’ ’’ అకౌంట్ నెంబరు: 11.బ్యాంకు అకౌంట్ ఉన్నట్లయితే బ్యాంకు పేరు: 12. ’’ ’’ బ్యాంకు బ్రాంచి పేరు: 13. ‘‘ ’’ బ్యాంకు అకౌంట్ నెంబరు: 14. ఉద్యోగం: ఉన్నది.. లేదు 15. ఉద్యోగం ఉన్నట్లయితే ఉద్యోగం రకం: 16. ప్రభుత్వ పెన్షన్‌దారు అయితే (1.కేంద్ర ప్రభుత్వ పెన్షన్ 2. రాష్ట్రప్రభుత్వ పెన్షన్ 3. ప్రభుత్వరంగ సంస్థల పెన్షన్ 17. ప్రధానమైన వృత్తి: 18. సామాజిక పింఛన్‌దారులైతే పింఛన్ రకం 19. ఎస్‌హెచ్‌జీ సంఘ సభ్యత్వం:1 ఉన్నది 2. లేదు 20. ఆధార్ కార్డు(యుఐడి) నెంబర్: విభాగం డి: వికలాంగుల వివరాలు 1.క్రమ సంఖ్య 2. వికలాంగుల పేరు: 3. ఎలాంటి వైకల్యం: 4. సదరం సర్టిఫికెట్ ఉందా: 1 ఉన్నది 2.లేదు 5. సదరం సర్టిఫికెట్ ఉన్నట్లయితే ఐడీ నెంబరు 6. వైకల్యశాతం సర్టిఫికెట్ విభాగం ఇ: దీర్ఘకాలిక వ్యాధులు 1. క్రమ సంఖ్య 2. దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తి పేరు: 3. వ్యాధి రకం విభాగం ఎఫ్: ఇంటి వివరములు 1. నివాస స్థితి: సొంతం.. కిరాయి.. తాత్కాలిక గూడు(ప్లాస్టిక్ కప్పు మొదలైనవి) 2. ఇంటి కప్పు రకం(1.గుడిసె 2. పెంకులు /రేకులు/బండలు 3. కాంక్రీట్ శ్లాబ్ 3. గదుల సంఖ్య (వంట గది కాకుండా) 4. కిరాయి.. తాత్కాలిక గూడుల్లో ఉంటున్న వారికి సంబంధించి ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉందా? 5. కిరాయి.. తాత్కాలిక గూడుల్లో ఉంటున్న వారికి సంబంధించి ఇంటి స్థలం ఉందా (1.అవును 2.కాదు) 6. మీరు ఎప్పుడైనా ప్రభుత్వ బలహీనవర్గాల గృహ నిర్మాణ కార్యక్రమంలో లబ్ధి పొందారా?(1.అవును 2.కాదు) 7. 8.9.10.11.12 క్రమసంఖ్యల్లో మరుగుదొడ్డి, విద్యుత్, మీటర్ ఉందా? తదితర వివరాలు భర్తీ చేయాలి. విభాగం జి .. హెచ్‌లలో వ్యవసాయం.. పశు సంపదలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విభాగం ఐ : కుటుంబ సొంత చరాస్తుల వివరములు: చరాస్తి రకం: 1. మోటార్ సైకిల్/స్కూటర్ 2. మూడుచక్రాల మోటార్ వాహనం/ఆటో 3. కారు/జీపు/జేసీబీ/నాలుగు చక్రాల మోటార్ వాహనం, ఇతర భారీ వాహనాలు 4. ట్రాక్టర్/ దున్నే యంత్రం/కోత కోసే యంత్రం/ ఇతర వ్యవసాయ యంత్రాలు 5. ఎయిర్ కండిషనర్ (పైవి ఉన్నది.. లేదు వివరాలు రాయాలి. ఉన్నట్లయితే వాహన రిజిస్ట్రేషన్ నెంబర్. ఒకే రకమైన వాహనాలు రెండు ఉన్నట్లయితే ఒకదాని రిజిస్ట్రేషన్ నెంబరు రాస్తే చాలు. తాత్కాలిక సంచార కుటుంబాలు/జాతుల వారికి సంబంధించిన వివరాలు: శాశ్వత నివాసం.. ఎంతకాలంగా ఉంటున్నారు తదితర వివరాలు: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వారి వివరాలు: ఏ రాష్ట్రం నుంచి వచ్చారు.. మాట్లాడే భాష.. వచ్చిన సంవత్సరం క్రమ సంఖ్యలో భర్తీ చేయాల్సిన వాటికి సంబంధించిన కోడ్ నెంబర్లు విడిగా ఇచ్చారు. వాటిని చూసి భర్తీ చేస్తారు. ధ్రువీకరణ.. పైన తెలిపినసమాచారం వాస్తవమని..యదార్థమని నేను ధ్రువీకరిస్తున్నాను. పై సమాచారం తప్పుగా తేలినచో ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధిని రద్దుపరచి ప్రభుత్వ పథకాలకు అనర్హుడు/అనర్హురాలిగా ప్రకటించగలరు. ఇట్టి విషయం దైవ సాక్షిగా/ఆత్మసాక్షిగా ధ్రువీకరిస్తున్నాను. కుటుంబ యజమాని/సభ్యుల యొక్క సంతకం లేదా ఎడమచేతి బొటనవేలి ముద్ర. ఎన్యూమరేటర్ సంతకం.. వివరాలు పర్యవే క్షక అధికారి సంతకం.. వివరాలు అవసరమైన సందర్భాల్లో కుటుంబ యజమాని/ సభ్యుల సంతకం తీసుకునేముందు ధ్రవీకరణ చదివి వినిపించాలి -
‘మోడల్’ టీచర్లను నియమించాలి
డిచ్పల్లి : జిల్లాలోని మోడల్ స్కూళ్లల్లో ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డిచ్పల్లి శివారులోని 44వ నెంబరు జాతీయ రహదారిపై డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లి దండ్రులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్యాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఆదరా బాదరగా ఏర్పాటు చేసిందని, కానీ వాటిలో మౌలిక వసతులు ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు లేక విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉపాధ్యాయులు లేక పిల్లలు ఉదయం పాఠశాలకు వచ్చి, ఒకటి రెండు తరగతులు పూర్తయిన తర్వాత ఖాళీగా కూర్చుని సాయంత్రం ఇళ్లకు వెళుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే మోడల్ స్కూళ్లు, కళాశాలల్లో ఉపాధ్యాయులను, లెక్చరర్లను నియమించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రహదారిపై ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై-2 శ్రీధర్‌గౌడ్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులను సముదాయించి రాస్తారోకో విరమింప జేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కార్తీక్, సతీశ్, శ్రీకాంత్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రవి, ఉపసర్పంచ్ గంగాధర్, మోహన్, సత్యప్రసాద్ పాల్గొన్నారు. -
తెయూ వీసీ మెడకు బిగుస్తున్న ఉచ్చు
తెయూ (డిచ్పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్ మెడకు నియామకాల ఉచ్చు బిగుసుకుంటోంది. వర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్‌టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీపై ఆరోపణలు రావడంతో గవర్నర్ నరసింహన్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఓ విచారణ కమిటీని నియమిం చారు. మూడు రోజుల క్రితం యూనివర్సిటీని సందర్శించిన జస్టి స్ సీవీ రాములు నియామకాలకు సంబంధించిన రికార్డులను పరి శీలించారు. వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిని ప్రశ్నించారు. కొన్ని రికార్డులను తన వెంట తీసుకువెళ్లినట్లు సమాచారం. అసలేం జరిగింది తెలంగాణ యూనివర్సిటీలో 103 బోధన, ఏడు బోధనేతర సిబ్బంది నియామకాలకు 2012 మే 25న మూడు నోటిఫికేషన్లు వెలువడ్డా యి. 2012 అక్టోబర్-నవంబర్ నెలలో హైదరాబాద్‌లో ఇంట ర్వ్యూలు నిర్వహించారు. అర్హతలు న్న వారికి కాకుండా, అర్హతలు లేనివారికి కాల్‌లెటర్లు పంపించార ని, ముఖ్యంగా రోస్టర్ పాయింట్ పాటించలేదని, పలువురు అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, రద్దు చేసిన కోర్సులకు కూడా అధ్యాపకులను నియమించారని ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిని పట్టించుకోకుండా వీసీ నియామకాలు చేపట్టారు. 54 మందికి 2013 ఫిబ్రవరి ఒకటిన నియామక పత్రాలు అందజేశారు. ఆ సమయంలో జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉం డడంతో అప్పటి కలెక్టర్ క్రిస్టినా ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియామకాలను నిలిపివేశారు. ఈ అన్ని విషయాలపై విద్యార్థి సంఘాలు, అకడ మిక్ కన్సల్టెంట్లు గవర్నర్ నరసింహన్‌కు, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డి ప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరు అకడమిక్ కన్సల్టెంట్లు కోర్టును ఆశ్రయించారు. ద్విసభ్య కమిటీ నియామకం ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు నియామకాలను నిలిపివేయాలని 2013 ఫిబ్రవరి 15న ఆదేశించిం ది. ఆరోపణలపై విచారణకు, ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొ ఫెసర్ ప్రసాద్‌రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భాస్కర్‌రావుతో కూడిన ద్విసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ వి చారణ జరిపి నియామకాలలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి 2013 ఏప్రిల్ 16న నివేదిక అందజేసింది. అదే సమయంలో హైకోర్టు సైతం ని యామక ప్రక్రియను నిలిపివేయాలని 2013 మార్చి 13న స్టే ఇచ్చింది. ఈ ఏడాది జనవరి మూడున హైకోర్టు స్టే ఎత్తివేసింది. స్టే తొలగింపు సమాచారం అందిన వెంటనే వీసీ ఈ విషయాన్ని ఉన్నత విద్యామండలి ప్రిన్సిపాల్ సెక్రటరీకి తెలిపారు. పాలకమండలి సమావేశంలో చర్చించి అనుమతి పొందాలని ఆయన సూచించారు. అయితే ఆయన ఆదేశాలను ప ట్టించుకోకుండా వీసీ, రిజిస్ట్రార్ హుటాహుటిన అదేరోజు అర్ధరాత్రి ని యామక పత్రాలు సిద్ధం చేశారు. 54 మంది అభ్యర్థులకు సమాచారం అందజేశారు. మరుసటి రోజున తెల్లవారుఝామున వీరిలో 48 మంది విధులలో చేరారు. ఇప్పటివరకు ఈ నియామకాలకు వర్సిటీ పాలక మండలి అనుమతి లభించలేదు. వీసీని పదవి నుంచి తప్పించే అవకాశం వీసీ నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో గవర్నర్ దీనిపై దష్టి సారించి మొత్తం వ్యవహారంపై ఆరా తీశారు. హైకోర్టు తీర్పుపై దష్టి సారించారు. అక్బర్‌అలీఖాన్ పదవీ కాలం మే 14తో ముగియనుంది. ఈ లోపు విచారణ ప్రక్రియను వేగవంతం చేసి తుది నివేదికను ఇవ్వాలని జస్టిస్ సీవీ రాములును ప్రభుత్వం కోరనుంది. ఇంత జరుగుతున్నా, తన పదవీ కా లం పూర్తయ్యేలోగా లైబ్రేరియన్లు, ఇతర బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
పోలీసుల అత్యుత్సాహం
డిచ్పల్లి, న్యూస్‌లైన్: డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద శుక్రవారం బందోబస్తు నిర్వహించిన పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని తేలిపోవడంతో కౌంటింగ్ ఎదురుగా జాతీయ రహదారిపై వేచి ఉన్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో నినాదాలు చేశారు. టపాకాయలు కాలు స్తూ నినాదాలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం ప్రధాన ద్వారం వైపు దూసుకురావడానికి యత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకుని నిలువరించారు. ఇదే సమయంలో కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ ఆగ్రహించిన పోలీసులు ఒక్కసారిగా లాఠీలకు పని చె ప్పారు. కార్యకర్తలను ఇష్టమొచ్చిన రీతిలో చితకబాదుతూ పరుగులెత్తించారు. డిచ్పల్లి మండలం మల్లాపూర్ గ్రామ సర్పంచ్ భర్త భూమయ్యను చుట్టుముట్టి రోడ్డుపై పడవేసి చితకబాదారు. జై తెలంగాణ అంటూ సంబరాలు జరుపుకుంటే దాడులు చేస్తారా అని టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నడిపల్లి వైపు నుంచి విజయోత్సాహంతో నినాదాలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్దకు వస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై సైతం పోలీసులు లాఠీ చార్జి చేశారు. పోలీసుల దాడితో టీఆర్ఎస్ కార్యకర్తలు బారికేడ్ల కింద నుంచి దూరి దూరంగా పరుగులెత్తారు. జర్నలిస్టుపై దాడి.. టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలను చిత్రీకరిస్తున్న వీడి యో జర్నలిస్టుపై పోలీసులు దాడి చేశారు. తాను జర్నలిస్టునని చెప్పినా విన్పించుకోకుండా కెమెరాను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్టులందరూ కౌంటింగ్ కేంద్రం ఎదుట ఎండలో బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఎస్పీ డౌన్‌డౌన్.. పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. చివరకు జర్నలిస్టు సం ఘాల నాయకులు కొందరిని కౌంటింగ్ కేంద్రంలోకి పిలిపించుకున్న ఎస్పీ వారిని సముదాయించడంతో జర్నలిస్టులు తమ నిరసన విరమించారు. అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు అత్యుత్సాహంతో అడు గడుగునా జర్నలిస్టులను, రాజకీయ నాయకు లు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రశాంతంగా ఉన్న వాతావరణం పోలీసుల తీరుతో ఉద్రిక్తంగా మారిం దని జర్నలిస్టులు ఆరోపించారు. తాము ఇప్పటికి పలు ఎన్నికలను చూసామని, ఇలా ఎన్నడూ జరగలేదని జర్నలిస్టు నాయకులు అసహనం వ్యక్తం చేశారు. -
కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : డిచ్పల్లి సీఎంసీ కళాశాల భవనంలో శుక్రవారం నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు వె య్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి తెలిపారు. గురువారం సీఎంసీ ఆవరణలో పోలీసు సిబ్బందితో ఆయ న మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా నాలుగంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాల కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.దీంతో ఎన్నికల సిబ్బంది, సుమారు వెయ్యి మంది కౌంటింగ్ సిబ్బందితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి అనుచరులు భారీ సంఖ్యలో కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కౌంటింగ్ ఉద యం 8 గంటలకు ప్రారంభమ వుతుందని, అయితే బందోబస్తు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బం ది ఉదయం 4.30 గంటలకే చేరుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రానికి బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలతో పాటు, ఆర్మూర్, బాల్కొండ నియోజవకర్గాలకు సంబంధించిన వాహనాలు వస్తాయన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది, మీడియా వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించామని, బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నడిపల్లి నుంచి సీఎంసీ కళాశాలకు వచ్చే రోడ్డుపై ట్రాఫిక్ జాం కాకుండా చూడాల న్నారు. ఎవరికి కేటాయించిన స్థలంలో వారే వాహనా లు నిలుపేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూ పాలన్నారు. ఒక్కో అధికారికి పదిమంది సహాయంగా ఉంటారన్నారు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లు సీఎంసీ కళాశాల భవనం వెనుక వైపు ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా లోనికి వెళ్లాలని సూచించారు. పాసులు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రంలోని అనుమతించ రాదన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోనికి పంపించాలన్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తుల్లో కౌంటింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఒక్కో అంతస్తులో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ హాల్‌తో పాటు వరండా, భవనం చుట్టూ, చెకింగ్ పాయింట్ వద్ద బందోబస్తు ఉంటుందన్నారు. పార్టీల నాయకులు, కార్యకర్తలు రద్దీగా ఒకచోట చేరకుండా చూడాలన్నారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 64మంది ఎస్సైలు, 400 మంది కానిస్టేబుళ్లు, నాలుగు స్పెషల్‌పార్టీలు, 240 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు. బందోబస్తు విధులను సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ప్రమోద్‌రెడ్డి, డీఎస్పీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్షణ క్షణం.. ఉత్కంఠ భరితం
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని బర్ధిపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ ఇన్స్టిట్యూట్లో మంగళవా రం నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 14 మండలాల(డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, నిజామాబాద్, నవీపేట, నంది పేట, మాక్లూర్, ఆర్మూర్, వేల్పూర్, బాల్కొం డ, కమ్మర్పల్లి , మోర్తాడ్,భీమ్‌గల్)కు సంబంధించిన ‘పరిషత్’ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 5గంట లకు ముగిసింది. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లను వేరు చేసి బండిల్స్ కట్టి వేరు వేరు బాక్సుల్లో పెట్టారు. జడ్పీటీసీ ఓట్ల బండిల్స్‌ను డ్రమ్ములో వేశారు. ఓట్ల లెక్కింపు కోసం ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ కోసం 11 టేబుళ్లు, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కోసం 11 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ముందుగా బండిల్స్‌గా కట్టిన ఓట్లను పార్టీ గుర్తుల వారీగా కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తూ బాక్సుల్లో ఉంచారు. అనంతరం పార్టీల వారీగా ఓట్లను లెక్కించి పోలైన ఓట్లలో అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విజేతలుగా ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కూలిన టెంటు.. తప్పిన ప్రమాదం.. ఉదయం కౌంటింగ్ కేంద్రం ఆవరణలో ఎన్నికల సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బందికి అల్పాహారం ఏర్పాటు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు కొందరు ఉదయం 8.30 గంటల సమయంలో టెంటు కింద కూర్చుని అల్పాహారం చేస్తుండగా ఒక్కసారిగా వీచిన గాలులకు టెంటు కుప్పకూలింది. దీంతో టెంటు కింద ఇరుక్కున్న పోలీసులు టెంటును పెకైత్తుకుని బయటకు వచ్చారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు కౌంటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు డాక్టర్ టీకే శ్రీదేవి సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ తరుణ్‌జోషిలు కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి కౌంటింగ్ తీరును పరిశీలించారు. అలాగే డీపీవో సురేశ్‌బాబు, జడ్పీ సీఈవో రాజారాంతో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఐకేపీ పీడీ వెంకటేశం కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి కౌంటింగ్ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించి, ఎన్నికల అధికారులకు సూచనలు ఇచ్చారు. టెన్షన్.. టెన్షన్.. కౌంటింగ్ ప్రారంభమైన నుంచి అభ్యర్థులు టెన్షన్లో మునిగిపోయారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నకొద్ది ఆధిక్యం పెరిగిన అభ్యర్థులు, వారి తరపు ఏజెంట్లు ఆనందంలో మునిగిపోగా, ఓట్లు తక్కువగా వచ్చిన అభ్యర్థులు, ఏజెంట్లు నిరాశలో మునిగిపోయారు. ఓట్ల లెక్కింపు ముగింపు దశకు చే రుకునే సరికి ప్రత్యర్థి చేతిలో ఓటమి తప్పదని తేలిన అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
తెయూలో నియామకాలపై విచారణ..?
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీలో చే పట్టిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీ అక్బర్‌అలీఖాన్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలపై హైకోర్టు రిటైర్ట్ జడ్జి శ్రీరాములు నేతృత్వంలో కమిటీని నియమించినట్లు సమాచారం. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యాశాఖను ఆదేశించినట్లు తెలిసింది. పాలకమండలి ఆమో దం లేకుండానే ఏకపక్షంగా అర్ధరాత్రి నియామకాలు జరపడంపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాశాఖ నుంచి స్పష్టత తీసుకోకుండానే తెయూ వీసీ అక్బర్రాత్రికి రాత్రే చేపట్టిన నియామక ప్రక్రియ వి వాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. జరిగింది ఇదీ... డిచ్పల్లి మండల కేంద్రం శివారులో ఉన ్న తెలంగాణ యూనివర్సిటీలో 103 బోధన, 7 బోధనేతర సిబ్బంది నియామకాలకు 2012, మే 25న నోటిఫికేషన్ వెలువడింది. 2012 అక్టోబర్- నవంబర్ నెలలో హైదరాబాద్‌లోని వ్యవసాయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలను స్థానికంగా నిర్వహించకుండా హైదరాబాద్‌లో నిర్వహించడంపై వీసీపై అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియామకాల్లో అర్హతలు లేనివారికి కాల్‌లెటర్లు పంపించారని, రోస్టర్ పాయింట్లు పాటించలేదని, పలువురు అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా వీసీ మొండిగా నియామకాలను చేపట్టారు. ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన 54 మందికి 2013, ఫిబ్రవరి 1న నియామక పత్రాలు అందజేశారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విషయమై అప్పటి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియామకాలను నిలిపివేశారు. వీటన్నింటిపై విద్యార్థిసంఘాలు, అకడ మిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం నియామకాలను నిలిపివేస్తూ, ఆరోపణలపై ద్విసభ్య విచారణ కమిటీని నియమించింది. ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రసాద్‌రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భాస్కర్‌రావును కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ ద్విసభ్య కమిటీ విచారణ జరిపి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందజేసినట్లు సమాచారం. అదే సమయంలో కోర్టు సైతం నియామక ప్రక్రియను నిలిపివేయాలని 2013, మార్చి13న స్టే ఇచ్చింది. దీంతో ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఈ సమాచారం సాయంత్రం వర్సిటీ అధికారులకు అందింది. స్టే తొలగింపు సమాచారం అందిన వెంటనే వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలు హుటాహుటిన అదేరోజు అర్ధరాత్రి వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకుని నియామక పత్రాలను సిద్ధం చేశారు. 54 మంది అభ్యర్థులకు సమాచారం అందజేసి వర్సిటీకి పిలిపించుకున్నారు. వీరిలో 48 మంది విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఈ నియామకాలకు వర్సిటీ పాలక మండలి అనుమతి లభించలేదు. దీంతో విధుల్లో చేరిన బోధన సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో రెండు నెలల పాటు జాప్యం చేశారు. ఇప్పటికీ కొత్తగా విధుల్లో చేరిన అధ్యాపకులు ఇంకా అభద్రతా భావంతోనే పనిచేస్తున్నారు. -
డిచ్‌పల్లిలో ప్రభుత్వ స్థలం కబ్జా
డిచ్పల్లి, న్యూస్‌లైన్: ఒకప్పుడు బతుకుదెరువు పేరు చెప్పి ప్రభుత్వ స్థలాల్లో చిన్నచిన్న కోకాలు, రేకుల షెడ్లు వేసుకున్న వారే ఇప్పుడు ఆ స్థలాలను కబ్జా చేస్తున్నారు.ఏళ్ల నుంచి ఇక్కడ మేమే ఉంటున్నాం, కాబట్టి ఈ స్థలం మాదే అంటూ దబాయిస్తున్నారు. స్థానిక అధికారులను ప్రలోభపెట్టి ఇంటి నెంబరు పొందడంతో పాటు ఆ స్థలాలను తమ పేరిట మార్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా వాటిలో పక్కా నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఇత రులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు, స్థానిక సిబ్బంది ఇదంతా తమకేమి పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. తమకెందుకులే అనుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఏ మారుమూల ప్రాంతంలోనో జరగడం లేదు. సాక్షాత్తు జిల్లా కేంద్రానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలోని డిచ్పల్లి మం డలకేంద్రంలో ఈ కబ్జా పర్వం కొనసాగుతోంది. ఇదీ సంగతి.... పీడబ్ల్యూడీకి డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదుట అర ఎకరం స్థలం ఉండేది. అనంతరం ఆ స్థలం ఆర్‌అండ్‌బీకి మారింది. ఈ స్థలంలో ఒక బస్ షెల్టర్, నాలా, దర్గాతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ భవనం ఉండేది. బతుకు దెరువు పేరిట కొందరు ఈ స్థలం లో చిన్నచిన్న కోకాలు, హోటళ్లు ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలం తర్వాత తమ కోకాలు, హోటళ్లకు ఇంటి నెంబర్లు పొందారు. అప్పుడు భూముల విలువ చాలా తక్కువ ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం రైల్వేస్టేషన్ ఎదుట గజం ధర రూ.25,000 నుంచి రూ.30,000 వేలు పలుకుతోంది. దీంతో ఆర్ఐ క్వార్టర్ స్థలంలో ఉన్న కోకా లు, హోటళ్లు నడుపుకుంటున్న వారిలో ఒకరు ఆ స్థలం తమదేనంటూ పక్కా ఇంటి నిర్మాణాలు చేపట్టారు. మరొకరు రూ.26 లక్షలకు స్థలాన్ని ఇతరులకు అమ్మివేసినట్లు తెలిసింది. ప్రభుత్వ స్థలంలో ఇలా కబ్జాలు చేస్తూ పక్కా నిర్మాణాలు చేపట్టినా, ఇతరులకు అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్అండ్బీ అధికారులకు నడిపల్లి గ్రామపెద్దలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కొందరు వార్డు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.