అర్హులందరికీ 'ఆసరా'గా నిలుస్తాం | Qualified people elegeble to 'ASARA' | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ 'ఆసరా'గా నిలుస్తాం

Published Wed, Jan 14 2015 11:23 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

Qualified people elegeble to 'ASARA'

నిజామాబాద్: ఆసరా పింఛన్ల పంపిణీలో అధికారుల తీరుపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'పింఛినిప్పించండి సారూ..' అంటూ వేడుకున్న దరఖాస్తుదారులను అనునయించారు. 'అర్హులందరికీ వస్తుందమ్మా..' అంటూ కళ్ల నీళ్లు పెట్టుకున్న వృద్ధులను ఓదార్చారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన పింఛన్ల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని, అలా అడిగిన వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మంగళవారం కామారెడ్డి, డిచ్‌పల్లి, దోమకొండ మండలాల్లో పర్యటించారు. ఆసరా పింఛన్ల సర్వే, లబ్ధిదారుల ఎంపికల తీరుపై సమీక్షించారు. అధికారులు, సిబ్బంది చేసిన తప్పులు, లోపాలపై మండిపడ్డారు. దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను ఓపిక విని.. పరిష్కరిస్తానంటూ భరోసానిచ్చారు. తమ కాలనీలకు కలెక్టర్ రావడం.. భరోసా ఇవ్వడంతో స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు.

కామారెడ్డిలో
పట్టణంలో ఆసరా పింఛన్ల సర్వే, లబ్దిదారుల ఎంపికలో మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కంప్యూటర్ విభాగంలో ఎస్‌కేఎస్ సర్వే, ఆసరా పింఛన్ల రికార్డులను పరిశీలించారు. సరైన వివరాలు లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, ఆర్డీవో గడ్డం నగేశ్, తహశీల్దార్ గఫర్‌మియా, మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఐకేపీ పీడీ వెంకటేశం,మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఆసరా లబ్ధిదారున్ని ఎంపిక చేయడంతో ఐకేసీ సీఓ అర్చనను సస్పెండ్ చేయాలని పీడీని ఆదేశించారు. పేదలు ఎక్కువగా నివసించే బతుకమ్మ కుంటలో పర్యటించారు. ఆసరా పింఛన్ల గురించి వృద్దులు, వితంతువులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో  13 వేలమందికి  టెక్నికల్ సమస్యలతో పింఛన్లు అందించలేకపోయామన్నారు. ఫిబ్రవరి నుంచి అందరికీ ఫించన్లు అందిస్తామన్నారు. అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్టు తేలితే అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

దోమకొండలో
మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామాల వారీగా ఆన్‌లైన్లో పింఛన్ల పరిస్థితిని సమీక్షించారు. అంగన్‌వాడీలు, వీఆర్‌ఏలు, హోంగార్డులు అర్హులుగా ఉంటే వారికి పింఛన్లు అందించాలని సూచించారు. అరవైఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పింఛన్ వచ్చేలా చూడాలని ఎంపీడీఓ హిరణ్మయిని ఆదేశించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి గంగారాం, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ సుధాకర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

డిచ్‌పల్లి మండలంలో...
అమృతాపూర్ పంచాయతీ పరిధిలోని దేవనగర్ లెప్రసీ క్యాంపును కలెక్టర్ సందర్శించి, కాలనీవాసులతో మాట్లాడారు. తమకు పింఛన్లు మంజూరు కాలేదని ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన స్వయంగా క్యాంపును సందర్శించారు. లెప్రసీ రోగులతో మాట్లాడి కారణాలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం, ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహశీల్దార్ రవీంధర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement