దోమకొండ కోటను టూరిస్ట్‌ స్పాట్‌గా మార్చాలి..! | Telangana Domakonda Fort Should Be Converted Into A Tourist Spot, Know Special Attractions In This Place | Sakshi
Sakshi News home page

Domakonda Fort Attractions: దోమకొండ కోటను టూరిస్ట్‌ స్పాట్‌గా మార్చాలి..!

Published Fri, Oct 18 2024 11:59 AM | Last Updated on Fri, Oct 18 2024 12:52 PM

 Telangana Domakonda Fort should be converted into a tourist spot

చారిత్రక దోమకొండ కోటకు  దేశ విదేశాల్లో గుర్తింపు  
యునెస్కో అవార్డుతో మరింత పెరిగిన ఖ్యాతి 
కాకతీయ శిల్ప శైలి ఉట్టిపడేలా కోటలో అద్భుత కట్టడాల నిర్మాణం  
 పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికుల విజ్ఞప్తి  

దోమకొండ: చారిత్రక సంపదకు నిలయంగా ఉన్న దోమకొండ కోటకు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించింది. అద్భుత కాకతీయ శైలి శిల్ప నైపుణ్యం ఉట్టిపడే నిర్మాణాల కారణంగా ఈ గడీ పురాతన కట్టడాలు, వారసత్వ సంపద పరిరక్షణ విభాగంలో ఇటీవల ఐక్య రాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో అవార్డును అందుకుంది. ఆసియా పసిఫిక్‌ దేశాలకు యునెస్కో ప్రకటించిన అవార్డుల జాబితాలో హైదరాబాదులోని కుతుబ్‌ షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావికి అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడీకి అవార్డు ఆఫ్‌ మెరిట్‌ విభాగంలో గుర్తింపు లభించడంతో ఈ కోట, అందులోని శిల్ప సంపద మరోమారు దేశ విదేశాల్లో చర్చనీయాంశంగా మారాయి 

అపూర్వ శిల్పకళ.. 
గడీలోని శిల్పకళా సంపద, దాన్ని జాగ్రత్తగా నిర్వహించడమనే అంశాలలో యునెస్కో గుర్తింపుతో దోమకొండ కోట పేరు స్థానిక, జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. ఈ కోటను 400ఏళ్ల క్రితం 60 ఎకరాల విస్తీర్ణంలో పాకనాటి రెడ్డి రాజులైన కామినేని వంశస్థులు నిరి్మంచారు. సరైన నిర్వహణ లేని కారణంగా గడీ ప్రధాన ద్వారం, ఇతర భవనాలు, కొన్ని ఇళ్లు దెబ్బతినడంతో గడీ వారసులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి స్వర్గీయ ఉమాపతిరావు కుమారుడు కామినేని అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కోట మరమ్మతు పనులు జరిగాయి. గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన సినీహీరో చిరంజీవి కోట అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇకాకతీయ శిల్పకళా శైలిలో ఈ పురాతన కట్టడాలు ప్రసిద్ధి చెందాయి. కోటకు తూర్పు ద్వారం, పడమర ప్రధాన ద్వారాలను 200 ఫీట్లు ఎత్తులో నిరి్మంచారు. 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గడీకోట చుట్టూ 50 ఫీట్ల వెడల్పు, పది ఫీట్ల లోతుతో నిర్మించిన కందకం ఇప్పటికీ చూపరులను ఆకర్షిస్తుంది.  

కామినేని అనిల్‌ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు... 
దోమకొండ సంస్థానా«దీశుల పాలనలో నిరి్మంచిన వెంకటపతి భవన్‌లో శిల్పకళా నైపుణ్యం, రాజసం ఉట్టిపడతాయి. అలాగే వీరి పాలనలోనే మహాదేవుని ఆలయ పునర్మిర్మాణం జరిగింది. అప్పట్లో మహాదేవుని ఆలయానికి కాకతీయ రాణి రుద్రమదేవి వచ్చినట్లు శిలా ఫలకం వెల్లడిస్తుంది. దోమకొండ కోటను సంస్థాన వారసుడు కామినేని అనిల్‌ పునరుద్ధరించారు. అనిల్‌ కుమార్తై ఉపాసన, మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు, సినీహీరో రామ్‌చరణ్‌ వివాహ వేడుకలు దోమకొండ కోటలోనే జరిగిన విషయం తెలిసిందే.  

యునెస్కో గుర్తింపుతో.. 
కామినేని వంశస్థులుదోమకొండ సంస్థానాన్ని 400 ఏళ్లకు పైగా పరిపాలించారు. 1760లో మొదటి పాలకుడుగా రాజన్న చౌదరిగా చరిత్ర పేర్కొంటోంది. ఆనాటి నుంచి జమిందారీ వ్యవస్థ రద్దు వరకు కామినేని వంశస్థులు దోమకొండ కేంద్రంగా పరిపాలన కొనసాగించారని ఆధారాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాలోని పలు మండలాలు వీరి పాలనలో కొనసాగాయని శిలాశాసనాలు చెబుతున్నాయి. చివరగా స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ విలీనమైనప్పుడు ఈ కోట రాజా సోమేశ్వర్‌ రావు పాలనలో ఉందని చెబుతారు. వీరి కాలంలోనే భిక్కనూరు సిద్దరామేశ్వరం, తాడ్వాయి భీమేశ్వరం, కామారెడ్డి వేణుగోపాలస్వామి, రామారెడ్డి కాలభైరవ స్వామి, లింగంపేట మెట్ల బావి వంటి ప్రసిద్ధ కట్టడాలు నిరి్మంచినట్లు తెలుస్తోంది. వీరి వారసుల పేర్లతో నేటికి కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట జిల్లాలలో అనేక గ్రామాల పేర్లు ఉండటం విశేషం.  

రాజధాని నుంచి 100 కి.మీ దూరంలో.. 
ఈ కోట కామారెడ్డి జిల్లాలోని దోమకొండ జిల్లా కేంద్రానికి 20 కి.మీ దూరంలో...రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌కు కేవలం 100 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో కోటను పర్యాటక కేంద్రంగా మారిస్తే స్థానికులకు ఉపాధి లభించే అవకాశముంటుందని గతంలో గ్రామ ప్రజా ప్రతినిధులు కోట వారసులైన కామినేని అనిల్‌కుమార్‌ను కలిసి వివరించారు. దీంతో ఆయన గడీ కోసం ఓ ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి దీని ద్వారా గ్రామంలో పలు అభివృద్ది పనులు, స్వచ్చంద సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. కాగా కోటను పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే గ్రామానికి చెందిన యువతకు స్వయం ఉపాధి లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.  దోమకొండ కోటను టూరిస్ట్‌ స్పాట్‌గా మార్చాలి     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement